• దేశాభివృద్ధిలో మైనింగ్ రంగానికి కీలక పాత్ర
• సింగరేణి అధికారులు, కార్మికుల తోడ్పాటు మరువలేనన్న మాజీ సీఎండి శర్మ
ఉస్మానియా మైనింగ్ కళాశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వెబ్ సదస్సులో గవర్నర్ సలహాదారు, సింగరేణి మాజీ సీఎండీ ఎ.పి.వి.ఎన్.శర్మ కీలక ఉపన్యాసం చేశారు. సింగరేణి అధికారులు, కార్మికులు అందించిన అసాధారణ సహకారం వల్లే అప్పట్లో నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన సింగరేణి సంస్‌ును లాభాల బాటలో నిలపగలిగామని రాష్ట్ర గవర్నర్ తమిళసై సలహాదారు, సింగరేణి సంస్థ మాజీ సీఎండీ ఎ.పి.వి.ఎన్.శర్మ చెప్పారు. తను సింగరేణి సీఎండీగా కొనసాగిన సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరి సేవలను ఎప్పటికీ మరువబోనని భావోద్వేగానికి గురయ్యారు. సింగరేణి సంస్థ ను అగ్రపథాన నిలపడంలో మైనింగ్ ఇంజినీర్లు అయిన ఎస్.కె.విగ్, గోపాల్‌రావు తదితరులు మంచి సహకారం అందించారని కొనియాడారు. తను వివిధ హోదాల్లో పలు సంస్థల్లో సేవలు అందించినప్పటికీ, సింగరేణిలో మాత్రం అధికారులు, కార్మికుల నుంచి లభించిన అసాధారణ సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మైనింగ్ ఇంజినీరింగ్ వజ్రోత్సవాల సందర్భంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పూర్వ మైనింగ్ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆన్‌లైన్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఎ.పి.వి.ఎన్.శర్మ ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశ అభివృద్ధిలో, నిరుద్యోగులకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మైనింగ్ రంగానిది కీలక పాత్ర అని ఎ.పి.వి.ఎన్.శర్మ అన్నారు. మన దేశంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను దేశ అవసరాలకు వినియోగించుకునేలా చూడటంలో మైనింగ్ ఇంజినీర్ల పాత్ర ముఖ్యమైనదన్నారు. తమ మేథో సంపత్తితో దేశానికి సేవ చేసే అవకాశం వారికి ఉందని కొనియాడారు. మైనింగ్ విద్యకు ఆదరణ పెరగడంలో, గ్రామీణ విద్యార్థులకు చేరువగా మైనింగ్ విద్యను తీసుకెళ్‌ిడంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పూర్వ మైనింగ్ విద్యార్థుల కృషి ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం దేశ, పరిశ్రమల అవసరాలకు పనికొచ్చే విద్యావిధానం, అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పూర్వ విద్యార్థులు మరింత కృషి చేయాలని సూచించారు.
సాంకేతిక సదస్సులు, వర్కషాప్ నిర్వహణ ద్వారా విద్యార్థులకు మైనింగ్ అనుభవాలను, మెలకువలను నేర్పిస్తుండటం హర్షనీయమన్నారు. పూర్వ విద్యార్థుల చొరవతో ఉస్మానియాలో 2018లో మైనింగ్ కోర్సు తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు. కేఎస్ఎం కళాశాలలో గ్యాస్ టెస్టింగ్ ప్రయోగశాల, సమావేశ మందిర నిర్మాణంలో పూర్వ విద్యార్థులు చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ప్రముఖ ఖనిజ వనరుల సంస్థల్లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేసిన వారు కీలక స్థానాల్లో ఉన్నారని చెప్పారు.
ఈ సందర్భంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ మైనింగ్ పూర్వ విద్యార్థుల సంఘం సావనీర్‌ను ఎ.పి.వి.ఎన్ శర్మ విడుదల చేశారు. ఉస్మానియాలో మైనింగ్ ఇంజినీరింగ్ చేసిన వజ్రోత్సవ బ్యాచ్ సభ్యుల సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మైనింగ్ సమస్యలకు పరిష్కారాన్ని చూపేలా మైనింగ్ విద్య ఉండేలా చూసే బాధ్యత పూర్వ విద్యార్థులు తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో మైనింగ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ పట్నాయక్, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.కుమార్, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రమణ, సివిల్, మైనింగ్ హెచ్‌వోడీ డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ తదిరులు ప్రసంగించారు
సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సందేశం
మైనింగ్ రంగంలో అనేక నూతన సంస్కరణలు వస్తున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఇంజినీర్లు తమ మేథా సంపత్తితో సరైన విధానాలను, నాణ్యమైన విద్యావిధానాన్ని తీసుకురావడంలో సలహాలను సూచనలను ఇవ్వాలి అని సింగరేణి సీఎండీ శ్రీధర్ పూర్వ విద్యార్థులు రూపొందించిన సావనీర్‌లో సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో మైనింగ్ కీలక పాత్ర పోషించింది అని ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తన సందేశంలో చెప్పారు.
జులైలో కొత్తగూడెం, హైదరాబాద్‌లలో సదస్సు
పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.వెంకటరామయ్య మాట్లాడుతూ.. మైనింగ్ విద్యార్థులకు ఎప్పుడూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. జులైలో హైదరాబాద్, కొత్తగూడెంలో అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ సదస్సుకు పరిమితం అయినట్లు వెల్లడించారు.
1960 బ్యాచ్ కు చెందిన టి.గోపాల్ రావ్, ఎం.డి.ఫసియుద్దిన్, వి.ఎస్.రావ్, అశోక్ వర్ధన్, శ్యాంకుండే, షాంకుందే. భా ర్గవ లు ఈ సదస్సులో పాలు పంచుకున్నారు. ఈదే బ్యాచ్ కు చెందిన 11 మంది దివంగతులైన మైనింగ్ ఇంజనీర్లకు నివాళులు ఆర్పించారు. ఈ సదస్సులో సింగరేణి సంస్థ మైనింగ్ ఆడ్ వైసర్ శ్రీ డి.ఎన్.ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షుడు, సింగరేణి విశ్రాంత డైరెక్టర్ బి.రమేశ్ కుమార్, సింగరేణి విశ్రాంత సీజీఎం కె.జె.అమర్‌నాథ్, అసోసియేషన్ సభ్యులు,సింగరేణి విశ్రాంత జీఎంలు డబ్ల్యు.విజయ్‌బాబు, హెచ్.వీరస్వామి, సింగరేణి జీఎంలు కె.రవిశంకర్, పి.సత్తయ్య, లక్ష్మినారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ బోధకులు డాక్టర్ హరీశ్ గుప్తా తదితరులు పాలుపంచుకున్నారు.