- పునరావాస కేంద్రాలవుతున్న ధర్మకర్తల మండలులు
దేవాలయ ఆస్తుల పరిరక్షణ, సంప్రదాయాల ఆచరణ, సక్రమ నిర్వహణకు సహకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసే ధర్మకర్తల మండలిలో ధర్మకర్తలుగా ఉండే వారికోసం గతంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఇది ఆచరణకు నోచుకోక, అధికార పార్టీ నాయకులకు సదరు మండలులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి. గతంలో తెలంగాణలోని కోటి రూపాయలు, ఆ పైన వార్షికాదాయం కలిగిన ప్రముఖ దేవాలయాలకు ధర్మకర్తల మండళ్ళ ( ట్రస్టు బోర్డు) ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో ముఖ్యమైన దేవాలయాలు
తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ఉత్తర్వుల ద్వారా సంబంధిత కార్యదర్శి ద్వారా జారీ చేయబడిన నోటిఫికేషన్లో భద్రాచలం సీతా రామచంద్ర స్వామి, మేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి , యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి, బాసర జ్ఞాన సరస్వతి, కీసరగుట్ట క్షీరరామలింగేశ్వరస్వామి, ఉజ్జయిని మహంకాళి, సమ్మక్క సారలమ్మ, కొమురవెల్లి మల్లికార్జున, కురవి వీరభద్రస్వామితో పాటు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవసానం తదితరాలు ప్రముఖమైనవి. దేవాదాయ చట్టం 30/87, సవరించిన చట్టం 33/2007 ప్రకారం ఛారిటేబుల్, హిందూ మత సంస్థల మరియు దేవాదాయ శాఖ సంబంధిత 1987 చట్టం 15వ సెకన్, సబ్ సెక్షన్ (1) క్రింద ప్రకటిత అనువంశిక ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకై ఆసక్తి గల వ్యక్తి నుండి ఫారం-2 ద్వారా నోటిఫికేషన్ జారీ తేదీ నుండి 20 రోజుల లోగా సంబంధిత దేవస్థానాలకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్/ ఉపకమిషనర్/ సహాయక కమిషనర్ కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ కమ్రంలో వివిధ దేవసానాలకు ధర్మకర్తలుగా ఉండగోరే వారు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది.
దరఖాస్తుల కోసం ప్రభుత్వ ఆహ్వానం
ఇక ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయశాఖ క్రింది స్థాయి తక్కువ ఆదాయం కలిగి ఉన్న రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న దేవాలయాలకు ఆలయాలకు పాలక మండళ్ల నియామకాలకు ప్రభుత్వం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానం పలికింది. హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, వరంగల్ జోన్ పరిధిలో ఉన్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో దేవాలయాలకు పాలక మండళ్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. దేవాదాయ, ధర్మా దాయశాఖకు సంబంధించి ఎక్కడికక్కడ స్థానిక దేవాలయ మేనేజర్లు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నెల 24లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 నుండి 25 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు వర్తించేలా నోటిఫికేషన్ జారీ చేశారు.
తక్కువ ఆదారం వచ్చే దేవాలయాలలో ఐదుగురేసి ధర్మకర్తలు
రూ.2 లక్షలలోపు ఆదాయం వచ్చే వాటిలో పాలక మండలికి ఐదు గురు సభ్యులను, రూ.25 లక్షల ఆదాయం వచ్చే దేవస్థానాలకు ఏడుగురు సభ్యులను నియమిస్తారు. దరఖాస్తుదారులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మద్యం అలవాటున్న వారు, దేవాదాయశాఖ ఉద్యోగుల బంధువులు ఈ పదవికి అనర్హులని, వారికి సంబంధించిన పూర్తి వివరాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్ స్పెక్టర్, పోలీస్ ఇంటెలిజెన్స్ సహకారంతో కేసుల వివరాలను సేకరిస్తారని, క్రిమినల్, సివిల్ పేటీ కేసుల వివరాలను సైతం సేకరిస్తారని, వాటి ఆధారంగా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మండలి ధర్మకర్తగా ఎంపిక చేసే అవకాశం ఉంటుం దని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ధర్మకర్తగా ఉండగోరే అభ్యర్థులకు గతంలో నిబంధనలను కఠినతరం చేసింది. కోటి రూపాయల పైన ఆదాయం ఉన్న దేవస్థానాలలో ధర్మకర్తకు గ్రాడ్యుయేషన్ అర్హతగా, అంతకు తక్కువ ఆదాయం కల వాటి ధర్మకర్తకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత గా ప్రకటించింది. దైవ సేవ, దేవస్థాన అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, సౌకర్యాల కల్పనే లక్ష్యంగా బాధ్యత వహించాల్సి ఉటుంది.
ధర్మకర్తల విధివిధానాలు
అటువంటి ధర్మకర్తలుగా దరఖాస్తు దారులు 32 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, 250నుండి 500 పదాలు దేవస్థానం అభివృద్ధిలో తనవంతు పాత్ర గురించి వ్యాసం రాయాలని నిర్దేశించింది. 7 పేజీలతో కూడిన ఫారం-2 ను న్యాయవాది/ గజిటెడ్ ఆఫీసర్ ఆటెస్టేషన్లో సమర్పించాలని, లిక్కరు, డ్రగ్స్ అలవాటు ఉందా? కుష్టు వ్యాధి గ్రస్తులా? మీరు గాని, మీ వంశీకులు గాని, దేవస్థానానికి ఆభరణాలు , వస్రాలు, పుష్పాలంకరణ చేసి ఉన్నారా ? దేవస్థానానికి శ్రమదానం చేశారా ? పరిశుభ్రతపై ఏదైనా ఆలయానికి సహకరించారా? భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ చేశారా? లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దరఖాస్తుదారులు పాటించాల్సిన ఆంశాలలో ప్రతి రోజు ఉదయం స్నానం చేయాలని, ఆలయానికి వెళ్ళే ముందు ధోవతి, పై వస్త్రం ధరించాలని, సాధారణ జీవితం గడపాలని, ఆలయాల ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకోక, కేవలం పరిశీలన జరపాలని ప్రత్యేక సౌకర్యాలు, గౌరవాన్ని ఆశించ కూడదని, ముఖ్య సందర్శకులకు కూడా దైవ సమర్పిత పూలమాలతో గౌరవించరాదని, దేవాలయాల ఆవరణలో పాదరక్షలు ధరించకూడదని, ఆగమ శాస్త్రనిబంధనలు పాటించాలని, దేవస్థాన నిర్వహణకు వలసిన సమయం కేటాయించాలని పేర్కొంది.
అమలు కాని నిబంధనలు
ఇలా ధర్మకర్తకు ఉండాల్సిన నిబంధనలు రూపొందించ బడినా, అవి అమలుకు జరగడం లేదు. నియమిత మండళ్ళలో సదరు నిబంధలకు పాటించిన దాఖలాలే లేవు. ప్రకటిత నిబంధనలు ఆశావాహులకు మింగుడు పడని అంశం కాగా, నిబంధనలు కాదని, రాజకీయ పలుకు బడులకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.