Sunday, December 22, 2024

ఛాయ్ చమక్కులే చూడరా భాయ్

నూర్ బాషా రహంతుల్లా

ఐక్యరాజ్యసమితి డిసెంబర్‌ 15 ను అంతర్జాతీయ చాయ్‌ దినం (టీడే) గా ప్రకటించింది. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం టీ కార్మికుల వేతనాలు, సమస్యలను వెలుగులోకి తేవాలన్నది లక్ష్యం. తేయాకు రంగంలో సుమారు 20 లక్షల మంది స్త్రీ పురుష శ్రామికులు ఉన్నారు. కాఫీ టీ లు త్రాగకుండానే 60 యేళ్లకు రిటైర్ అయ్యాను.అప్పట్లో పదే పదే టీ తాగే తోటి ఉద్యోగులు చెప్పినా ఎందుకో నిర్లక్ష్యం చేశాను.అప్పటి రాజమండ్రి సబ్ కలక్టర్ చల్లా వినయమోహన్ టీ ప్రియుడు.అన్నము తగ్గించుకుంటాను గానీ టీ వదలను అనేవాడు.సరైన మిత్రుడు అడక్కుండానే టీ ఆఫర్ చెయ్యాలి అనేవాడు.తన ఓపిక రహస్యం టీ అనేవాడు.తనకు సుగరు,బీపీ,గుండెజబ్బులు లేకపోటానికి టీ నే కాపాడింది అంటాడు. టీలో ఉన్నది బెల్లము,పాలే కదా అనే ఉద్దేశ్యంతో రిటైర్ అయ్యాక నేనుకూడా మితంగా టీ త్రాగటం మొదలుపెట్టాను. టీ బాగానే హాయిగా ఉంది. లాక్ డౌన్ రోజుల్లో వందల కిలోమీటర్లు కాలి నడకన పోతున్న వలసకూలీలకు కొందరు సహృదయులు టీ నీళ్లను దానం చేసి పుణ్యం సంపాదించుకొన్నారు. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలోనే చైనారాజులు టీ తాగారట. 18వ శతాబ్దంలో క్యాంప్‌ బెల్‌ చైనా నుంచి ఈ తేయాకును మనదేశానికి తెచ్చారు. 1980 లో అమెరికాలో టీ బ్యాగులు వచ్చాయి. టీలో ఉండే టీమ్‌ అనే రసాయనం 2- 3 గంటల పాటు మెదడులోని రక్తకణాలను ఉత్తేజ పరుస్తుంది. టీ ప్రియులందరికీ తలనొప్పి నుంచి ఉపశమనం. హైదరాబాద్‌లో మాత్రం ఇరానీ చాయ్‌ . లవంగాలు, నల్లమిరియాలు, సోంపు గింజలు, దాల్చిన చెక్క కలిసి ఉండే మసాలా ఛాయ్‌ తాగినా క్యాలరీలు ఖర్చవుతాయట. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ లు రావొచ్చు. ఖర్చు తక్కువ ఆతిద్యం టీ వల్లనే సాధ్యం. టీని కలపడం ఓ కళ. టీ రుచి టీ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది.కొందరు మరిగే నీళ్లలో టీపొడి వేసి కలుపుతారు. హోటళ్లలో తయారు చేసే టీలో లమ్సా అనే టీ ఆకును కలపుతారు. డికాషిన్‌ ఎంత బాగా కలిపితే అంతబాగా రుచి వస్తుంది. టీని గ్లాస్‌లో పోసేటప్పుడు ఎత్తు నుంచి పోస్తే గాలితో కలిసి టీకి మంచి రుచి వస్తుందట.

మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పానీయం టీ.ఆతరువాతే కాఫీ,కొబ్బరినీళ్లు,కూల్ డ్రింక్స్.తేయాకుల ఉత్పత్తిలో చైనామొదటిది.ఇండియా రెండవది.ఈ రెండుదేశాల్లోనే సగం టీ ఉత్పత్తి అవుతుంది.మితంగా తీసుకుంటే దీనిలో ఉండే ఆల్కలాయిడ్ కెఫీన్ గుండెకు మంచిదే.అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. గ్రీన్ టీ తో జ్నాపకాలు పదిలమని అంటారు.కొంతమంది మధుమేహులు ఉపశమనం కోసం బ్లాక్ టీ ,డికాక్షన్ లే త్రాగుతారు. మ‌సాలా టీ, ద‌నియా టీ, గ్రీన్ యాపిల్ టీ, మాంగో టీ. క‌శ్మీరీ కవ్వా టీ,బంతి,చేమంతి,మందార,మల్లె లాంటిఅనేక పూల కాషాయాలు కలిపిన టీ కూడా అమ్ముతున్నారు. పురుగుమందులు భారీగా కొట్టినందువల్ల ,కల్తీలవల్ల అనేక కంపెనీల తేనీరు కాలకూట విషంగా మారుతోందని గ్రీన్ పీస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్నప్పుడు అసోం టీ లు అమ్మేవాడిని అని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం కెరీర్ కూడా ఛాయ్ కొట్టు నుంచే మొదలయ్యింది.దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో మట్టికప్పుల్లో ఖులాడ్, లిట్టీ చొఖా టీని అమ్ముతున్నారు.ఛత్తీస్ ఘడ్ లో పిల్లి దేవి అనే మహిళ 35 ఏళ్లుగా భోజనం మానేసి టీ మాత్రమే తాగి బ్రతుకుతుందట.రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా టీని నేనే తయారుచేసుకుంటాను.టీని నా అంత రుచిగా ఎవరూ చేయలేరు అని ఆనందించేవారు.స్వాతంత్ర దినోత్సవం నాడు ఆళ్లగడ్డ లో నాగరాజు అందరికీ రూపాయికే టీ అమ్ముతాడు.లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకూ టీనో ,కాఫీనో తాగుతూనే ఉంటాం! నీళ్లు ఎక్కువ తాగితే ఒంట్లోంచి మలినాలు బయటకుపోతాయనీ, చర్మం నిగనిగలాడుతుంటుందనీ, మలబద్ధకం దరిజేరదనీ కొందరు చెబుతుంటారు.పత్రికల్లో కాఫీ భేష్‌ అని కాఫీతో చాలా ప్రమాదమనీ,టీ తాగితే క్యాన్సర్‌ దూరం అంటూనే టీతో మతిమరుపు తథ్యమనీ పరస్పర విరుద్ధమైన వార్తలు వస్తాయి.దేన్ని నమ్మాలి?మన ఒంట్లో దాదాపు 60% నీరే ఉంటుంది. పది రోజులు నీళ్లు తాగకుండా ఉంటే చనిపోతాము.రోజుకు కనీసం 2 లీటర్లు తాగాలి.ఒంట్లో నీటి శాతం తగ్గకూడదు.నీరు తగ్గిపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. నీరు ఎక్కువగా తాగితే కఫం,జిగురు పల్చగా మారి కొన్ని క్యాన్సర్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. కూల్ డ్రింకుల్లో తీపి రుచి కోసం కలుపుతున్న కృత్రిమ చక్కెర, ఫాస్ఫోరిక్‌ ఆమ్లాల వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా, ఆకలికి కీలకమైన హార్మోన్లు దెబ్బతింటున్నాయి. రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రేట్లు దండిగా ఉండే బీట్‌రూట్‌,నారింజ లాంటి పండ్ల రసాలు కూడా మితంగాతీసుకుంటేనే మేలు.పాలలో నీరు, క్యాల్షియం, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, చక్కెరలు,కొవ్వు, కొలెస్ట్రాల్‌ వంటివన్నీ ఉంటాయి. పులియబెట్టడం వల్ల పాలలోని లాక్టోజ్‌ తగ్గుతుంది.అందుకే పాలకంటే పెరుగు, మజ్జిగ మేలు అంటారు. నిస్సత్తువ ఆవరించినప్పుడు ఓ కప్పు కాఫీనో టీనో పడితే, టీ కాఫీలలోని కెఫీన్‌ వలన ఉత్సాహం వెల్లువెత్తుతుంది. కానీ మన శరీరం దీనికి అలవాటు పడిపోతుంద. దీంతో మాటిమాటికీ కాఫీ తాగాలనిపిస్తుంది. చాయ్‌ గింజల నుంచి వచ్చే కాఫీ లాంటిది కాదు.టీ తేయాకుల నుంచి వస్తుంది. తేయాకులో క్యాన్సర్‌ నివారణకు తోడ్పడే ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వూబకాయులు, అధికబరువు గలవారిలో స్వల్పంగా బరువు తగ్గటానికీ తేయాకు దోహదం చేస్తున్నట్టు బయటపడింది. తేయాకులో దంతాలు పాడుచేసే ఫ్లోరైడ్‌ కూడా ఉంటుంది.రోజూ పదుల సంఖ్యలో టీలు తాగుతుంటే చిగుళ్ళు దంతాలకు నష్టమే. గ్రీన్‌టీ నోట్లోని బ్యాక్టీరియాను చంపుతుంది.బ్లాక్‌టీ యాంటీబ్యాక్టీరియా ఎంజైమ్‌లను ప్రేరేపించి పిప్పిపళ్లతో పోరాడుతుంది.

3వేల రకాల టీలు ఉన్నాయి. వంద గ్రాముల టీలో 17 క్యాలరీల శక్తి ఉంటుంది. టీ లో మిథైల్‌గ్జాంథైన్స్‌ థియోఫిలిన్, కెఫిన్‌ లాంటి రసాయనాలు ఉంటాయి. అయితే కాఫీలో కెఫిన్‌ ఎక్కువ. కాఫీ తాగితే కెఫీన్ మనల్ని ఎక్కువగా ఉత్తేజపరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేస్తుంది. వైట్‌ టీ చర్మానికి, కేశాలకు నిగారింపునిస్తుందని బరువు,చుండ్రు, ఎగ్జిమా, మొటిమలను తగ్గిస్తుందని , బ్లాక్‌ టీ రక్తప్రవాహాన్ని మెరుగు పరిచి గుండెజబ్బు లు, పక్షవాతాన్ని అరికడుతుందని నమ్ముతారు. వైట్‌ టీ చాలా లేతగా ఉండే టీ–ఆకులతో కాస్తారు. వైట్ టీలో ఫ్లోరిన్, మ్యాంగనీస్, ఆర్సెనిక్, నికెల్, సెలీనియమ్, అయోడిన్, అల్యూమినియమ్, పొటాషియమ్‌ లాంటి 28 రకాల ఖనిజలవణాలు ఉన్నాయి. చాక్లెట్‌ టీ లోని డార్క్‌ చాక్లెట్స్‌, పాలీఫినాల్స్‌ వల్ల మన నరాలు ఉత్తేజితమౌతాయి. బ్లాక్‌ టీ అంటే పాలు కలపకుండా కేవలం డికాక్షన్‌ మాత్రమే. ఊలాంగ్‌ టీ అంటే గ్రీన్, బ్లాక్‌ టీల సమ్మేళనం. ఊలాంగ్‌ టీలో యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్, విటమిన్‌ – సి, ఈ, కె లతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ ,క్యాల్షియమ్, మ్యాంగనీస్, కాపర్, సెలీనియమ్, పొటాషియమ్‌ లాంటి ఖనిజలవణాలు ఎక్కువ.టీ లోని థియనైన్‌ అమైనో యాసిడ్‌ మెదడులోని అల్ఫా తరంగాలను ప్రేరేపించి రిలాక్సేషన్‌ ఫీల్‌ అయ్యేలా చేస్తుంది. సాధారణ టీలో 15 – 60 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది.బ్లాక్‌ టీలో 25 – 60 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది.గ్రీన్‌ టీలో 20 – 30 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది.కాఫీలో మాత్రం 60 – 150 ఎంజీ కెఫీన్‌ ఉంటుంది.అందుకే కాఫీ కంటే టీ నయం.

తాపీధర్మారావు గారి కోరికమేరకు పోకూరి కాశీపతి గారు ఆశువుగా కాఫీపై ఈ దండకం చెప్పారు:

“శ్రీమన్మహాదేవి లోకసంచారిణీ,ప్రాణసంరక్షిణీ,జగన్మోహినీ,ప్రాణసంరక్షిణీ, ధాత్రినెవ్వారలున్,వేకువన్ లేచియున్,నిత్యకృత్యంబులన్ తీర్చియున్, అంబ కాఫీ జగన్మోహినీ,తొల్లి శ్రీకృష్ణుడాస్వర్గమున్‌ జేరి పూతంబ పారిజాతంబున్‌ తెచ్చియున్‌ ,నాతికిన్‌ ప్రీతిగానిచ్చుకాలంబు నందు ఆ సుమంబునందునం గల్గు బీజంబు ఉర్వీస్థలిన్‌ రాలియున్‌ లోక బేధంబుజే కాఫి భూజంబుగా పుట్టియున్‌ కొమ్మలన్‌ రెమ్మలన్‌ బూవులన్‌ తావులన్‌ జక్కనౌపిందెలన్‌ జిక్కినౌ కాయలన్‌ చొక్కమౌ బండ్ల భాసిల్ల దద్బీజజాలంబు ఐర్లండు నింగ్లండు హాలెండు పోలెండు రష్యా జపాన్‌ జర్మనీ గ్రీకు దేశంబులన్‌ నాటి పెన్‌ మాకులై ఇండియాన్‌ తోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్‌ మదించోడిన్‌ బాపురే తీపిలో నీరమున్‌ క్షీరమున్‌ చక్కెరన్‌ మించుటన్‌ గాదె నీ బీజ చూర్ణంబు ఆ మూటిలో జేర్చి సేవించుటన్‌ నీదు బీజంబునన్‌ బెంచులో మాడ్చి చూర్ణంబు గావించినన్‌ తీపి పోదాయె నీ మాధురీ శక్తి నీ యింపు నీ సొంపు నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్‌ ధనాకర్షిణీ ప్రాణసంరక్షిణీ ధాత్రినెవ్వారలేన్‌ వేకువన్‌ లేచియున్‌ నిత్యకృత్యంబులన్‌ దీర్చి మున్ముందుగా నిన్ని పానంబు గావింపకున్నన్‌ ద్విజుల్‌ వేదమంత్రంబులున్‌ పల్కగాలేరు ప్రాంచత్కవుల్‌ పద్యంబుల్‌ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు శిల్పులు శౌరి దాసుల్‌ గళంబునెత్తియున్‌ బాడి నృత్యంబులన్‌ చేయగా లేరు శిల్పుల్‌ మనస్ఫూర్తిగా సుత్తి చేపట్టగా లేరు వైశ్యోత్తముల్‌ కొట్ల తాళంబులన్‌ తీయగాలేరు డ్రైవర్లు స్టీరింగులన్‌ పట్టగా లేరు టీచర్లు పాఠంబులన్‌ చెప్పగాలేరు డాక్టర్లునింజక్షనుల్‌ జేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు ఏ స్వల్పమౌ తీర్పులన్‌ జెప్పగాలేరు దిట్టంబుగా బ్రాలసుల్‌ కూట సాక్ష్యంబులన్‌ చెప్పగాలేరు వారంగనల్‌ కోడెగాండ్రన్‌ వెసన్‌ కేళిలో నోలలాడింపగాలేరు ముప్పూటలన్‌ నిన్నొగిన్‌ గ్రోలకున్నన్‌ శిరోభారమైనాల్క ఎండున్‌-మనంబెంతో చాంచల్యమున్‌ నిత్యమున్‌ వేకువన్‌ దర్శనంబిచ్చి నిన్‌ బాగుగా త్రాగు సౌభాగ్యమున్‌ గూర్చి రక్షింపవే సారెకున్‌ గొల్చెదన్‌ విశ్వకర్మాస్వయంబంధునన్‌ సత్కవీంద్రుడనన్‌ చెల్లు పోకూరి కాశీపతి స్వాంతరాజీవసంవాసినీ నీకికన్‌ మంగళంబౌ మహాకాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః ”

ఈ దండకానికి ధీటుగా టీ గురించి మృగరాజు సినిమాలో చంద్రబోస్ రాసిన చాయ్ చమక్కులే చూడరా భాయ్ పాటను చిరంజీవి పాడారు.

“ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్

ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్,/ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్

ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్/ ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్

ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ /ఈ ఛాయ్ గలాసుకీ జై జై ||ఛాయ్||

డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు/ డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ

లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు,/ విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ”

తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ,/ ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేరి

అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ,/ తనుటీ తాగడంలో ఘునాపాటి

టీ వల్ల లాభాలు శతకోటి,/ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ||ఛాయ్||

అల్లం టీ అంటే అదిపెంచును ఆరోగ్యం/ మసాలా టీ అంటే అది దించునురా మైకం

లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం/ ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం

కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో/ ఎక్కడైనా దొరికేది ఏంటీ – టీ టీ

సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో /తప్పకుండా తాగేది ఏంటీ – టీ అన్నా

టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు/ టీ కొడితేనే బతుకుతారు అందరూ ||ఛాయ్||

కరోనా వల్ల ప్రపంచంలో 15.2 లక్షలమంది ఇండియాలో 1.39 లక్షలమంది చనిపోయారు.హోటళ్ళకు వెళ్ళి బజారులో దొరికే టీలు ఎక్కువ మంది తాగటం లేదు.కరోనా భయంతో టిఫిన్లు కూడా పార్సిళ్ళు కట్టించుకెళుతున్నారు.టీలు కాఫీలు ఇంటిదగ్గరే కాయించుకొని త్రాగుతున్నారు.

నూర్‌బాషా ర‌హంతుల్లా
నూర్‌బాషా ర‌హంతుల్లా

విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

international tea day on december 15

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles