డా. ఆరవల్లి జగన్నాథస్వామి
ఆ పేరు విన్నా, తలచినా తెలుగు శ్రోతల మనసు పులకరిస్తుంది. పద్యం పరవశిస్తుంది. జానపదాల నుంచి జావళీల దాకా, ఆకతాయి పాటల నుంచి అష్టపదుల దాకా, లలిత సంగీతం నుంచి శాస్త్రీయ సంగీతం వరకు ఆయన `కంఠ`శాలలో కొలువుతీరాయి. కోట్లాది మనసులకు మధుర రాగసుధలు పంచిన గానలోలుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. ఆ గాన వైభవం గురించి చెప్పుకోవడం చర్వితచర్వణమే అవుతుంది. అయినా చెప్పుకోకుండా ఉండలేం. అదే ఆ గాత్రం విశిష్టత. ఎన్నో భాషల్లో ఎందరో సుప్రసిద్ధ కళాకారులు ఉన్నా ఆయనదో ప్రత్యేకత. ఆయన కంఠస్వరంతో పాటు ఆయన వ్యక్తిత్వమూ మధురమే. వాటిని స్థూలంగా స్మరించుకుంటే……
వినయ సంపన్నత
ఎంతటి విద్యావంతుడు, విద్వాసుండైన వినయశీలి కాకపోతే రాణించడని ఆర్యోక్తి. విద్య వినయాన్ని ఇస్తుందన్న మాట ఘంటసాల వారి విషయంలో అక్షరసత్యం. ధిషణహంకారానికి బహుదూరం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే తత్వం. చదువుకునే రోజల్లో ఆదరించి ఆకలి తీర్చిన వారెవ్వరిని మరువలేదు. ఉదాహరణకు, విజయ నగరంలో చదువుల రోజుల్లో ఆదుకున్న కళాకారిణి సరిదె లక్ష్మీనరసమ్మ (కళావర్ రింగ్) కాలం చేసిన కొన్నేళ్లకు ఆ ఊరు వెళ్లిన ఘంటసాల ఆ ఇంటిని సందర్శించి నమస్కరించి, భోరుమంటూ గుమ్మం మీద కూలబడి పోయారట. భక్తి విశ్వాలంటే అవి అన్నారు ఒక సందర్భంలో రావి కొండలరావు.`లవకుశ‘లో వాల్మీకి పాత్రధారి నాగయ్య గారికి పాడవలసి వచ్చినప్పుడు వణికిపోయారట. వారి సంగీత దర్శకత్వంలో`గుంపులో గోవింద`లా గొంతు కలిపిన నేనేమిటి?ఆయనకు గాత్రమివ్వడం ఏమిటి?ఎంతటి అపచారం?‘అని మధనపడి చివరికి నాగయ్య గారి అనునయం, ప్రోత్సాహం మేరకు పాడక తప్పలేదు. `ఎలా పాడాలో నాగయ్య దగ్గర నేర్చుకున్నాను` అని వినయంగా చెప్పేవారు ఘంటసాల. తన పైతరం వారిని గౌరవించడమే కాదు…తరువాతి తరంవారిలోని ప్రతిభను ప్రోత్సహించిన సుమనస్కులు. అందుకు ఎన్నో ఉదాహణలు, ఉదంతాలు చెబుతారు.
తప్పని అపవాదులు
`నేనే ఒక్కడినే సినీ నేపథ్య రంగాన్ని ఏలాలి`అని ఎన్నడూ అనుకోలేదు. మీరే పాటలన్నీ పాడాలన్న నిర్మాతలతో `అన్నీ నేనే పాడితే బాగుండదు బాబూ!` అని నచ్చచెప్పి, నాయకుడికి తాను పాడినా దర్శకనిర్మాతలకు నచ్చచెప్పి మిగిలిన పాత్రలకు ఇతరులతో పాడించిన సందర్భాలు ఎన్నెన్నో. అలాకాకుండా స్వార్థానికి పోతే ఆయన ఖాతాలోనూ మరికొన్ని వేల పాటలు చేరేవే. ఇతర సంగీత దర్శకుల సినిమాల సంగతి ఎలా ఉన్నా తన సంగీత దర్శకత్వంలో మాత్రం ఇతరులతో పాడించారు. తోటి గాయకులను కాదని తానే అన్నీ పాడేస్తారనే అపవాదు ఆయన తర్వాతి తరవారం వారూ ఎదుర్కొన్నారు. తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతినబూనారని చెబుతారు. నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఆయనలో చెప్పలేని ఆవేదన, భయం చోటు చేసుకు న్నాయని ఆయన శిష్యుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు ఒక సందర్భంలో చెప్పారు. `ఈ సినిమా పరిశ్రమలో ఇకపై మనుగడ కష్టం అని, నాటకాలైనా వేసుకొని బతకాలని చాలా వూళ్లలో నాటకాలు వేయడం ప్రారంభించారు. నేనూ వెంటవెళ్లేవాడిని` అని రాఘవుల చెప్పినట్లు నటుడు రావి కొండలరావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
పూలబాట కాదు
గాయకుడిగా ఘంటసాల జీవితం పూలబాట కాదు. సంగీత విద్యార్జన కాలం నుంచి నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకునేంత వరకు కష్టాలు – కన్నీళ్లు,ఈసడింపులు, అవమానాలు. అయినా ధైర్యం కోల్పోలేదు. అనుకున్నది సాధించా లనే తపన. పోయినచోటనే వెదకాలన్నట్లు కాదన్న వారి నోటితోనే ఔననిపించు కోవాలనే పట్టుదల. `ఏదీ తనంత తానై నీ దరికి రాదు/శోధించి సాధించాలి అదియే ధీరం గుణం` అని అనంతర కాలంలో పాడుకున్నపంక్తులను ఆచరణలో చూపారు.
ఎదిగిన కొద్దీ….
తానేమిటో, తన గాత్రధర్మం ఏమిటో ఎరిగిన వారు. వృత్తిపరంగా నేల విడిచి సాము చేయలేదు. తాను నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతమే అయినా, చలనచిత్ర నేపథ్య గాయకుడిగా (లలితసంగీతం) స్థిరపడ్డారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహా ప్రముఖ విద్వాంసుల సంగీతాన్ని ఆస్వాదించడమే తప్ప వాటి జోలికి పోలేదు. ఆయనతో త్యాగరాజు కీర్తనలు పాడించాలని చాలామంది విఫలయత్నం చేశారట. ఆయన పాడలేక కాదు. `కీర్తనలు పాడేందుకు నెల, రెండు నెలల పాటు సాధన చేయాలి. గొంతు ఆ సంగీతానికి అలవాటు పడితే లలితసంగీతం పాడడం కష్టం. దాని వల్ల తనకు అర్థికంగా కలిగే నష్టం కంటే నిర్మాతలకు కలిగే నష్టం ఎక్కువ‘ అనేవారని చెప్పారు శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారు.
ద్వారం వారి చలువ
ఇంతటి అపురూప, అపూర్వ గాత్రం తెలుగువారికి దక్కడం వెనుక ఆయన గురువు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సలహా ప్రధానమైంది. వయోలిన్ నేర్చుకోవాలనుకున్న ఘంటసాల వారి కంఠస్వరం విన్న ద్వారం వారు గాత్ర విద్యాభ్యాసం వైపు మళ్లించారు. లేకపోతే ఆయన వయోలిన్ కళాకారుడుగా పేరు పొందేవారేమో….!
`పాడినంత కాలమే జీవించాలి. జీవించినంతకాలం పాడాలి`అనే కోరికను నిజం చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా పద్మశ్రీకే పరిమితయ్యారు. ప్రజా హృదయాల్లో ఏ గాయకుడి దక్కనంత అపూర్వ గౌరవం. జయంతి, వర్ధంతి ఉత్సవాలు.వాగ్గేయకారుల్లో త్యాగయ్య, అన్నమయ్య తర్వాత ఆ స్థాయిలో ఆరాధ నోత్సవాలు అందుకుంటున్న లలితసంగీత చక్రవర్తి. ఆయన సంగీతం రసహృద యుల సమష్టి సంపద.ఇంటింటికి `ఓ ఘంటసాల` సృష్టికర్త. గాయకుల పేర్ల ముందు `అపర, అభినవ…లాంటి విశేషణాలకు మూలం.`ఘంటసాల వారు ఉత్తర భారతదేశంలో పుట్టక పోవడం అక్కడి శ్రోతల దురదృష్టం. నాలాంటి గాయకుల అదృష్టం`అని ప్రఖ్యాత గాయకుడు రఫీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య చాలు `కంఠ` ఔన్నత్యానికి.
(డిసెంబర్ 4 ఘంటసాల జయంతి)