• విజయోత్సవ ర్యాలీలపై 48 గంటలపాటు నిషేధం
• మద్యం షాపులు బంద్
• మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్ లు తప్పనిసరి
• కౌంటింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లకు అనుమతి నిరాకరణ
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రేటర్ పరిథిలోని 30 సర్కిళ్లలో 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు 30 కౌంటింగ్ కేంద్రాలలో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానుంది.
కొవిడ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చేవారు విధిగా పీపీఈ కిట్ లు ధరించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లను అనుమతించమని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
తొలుత పోస్టల్ బాలెట్ల లెక్కింపు చేపడతామని తర్వాత రెగ్యులర్ బాలెట్ పత్రాల లెక్కింపు చేపడతామని ఎస్ఈసీ వెల్లడించింది. పోలింగ్ కేంద్రంలో పరిశీలకుడి అనుమతితోనే తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. కౌంటింగ్ సమయంలో ఇతర సమస్యలు తలెత్తితే రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. రీ కౌంటింగ్ కావాలనుకుంటే ఫలితాలు వెల్లడించకముందే ఆర్వోకు తెలియజేయాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ పద్దతిలో ఫలితాన్ని ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
also read: ఉద్రిక్తతల నడుమ జీహెచ్ఎంసీ పోలింగ్
మద్యం షాపులు బంద్
కౌంటింగ్ జరనున్నందున మద్యంషాపులను మూసివేయనున్నారు. ఇతర ప్రాంతాలనుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు.
also read: జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్
కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు
జీహెచ్ఎంసీలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. 48 గంటల పాటు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించినట్లు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భదత్రా ఏర్పాట్లు చేశామని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిథిలో ఎవరినీ అనుమతించమని అంజన్ కుమార్ స్పష్టం చేశారు.