• విజయం కోసం బీజేపీ కసరత్తు
• మహిళా అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు
బీజేపీ అగ్రనేతలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి యావద్దేశం దృష్టిని ఆకర్షించారు. డిసెంబరు 8, 14 తేదీలలో జరగబోయే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు బీజీపీ కసరత్తు చేస్తోంది. సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ , కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ లకు తీవ్ర పోటీ నివ్వనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఆరు మున్సిపల్ స్థానాలలో కనీసం రెండింటిని చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో 612 మంది మైనారిటీలను పోటీకి దింపింది. 112 మంది ముస్లింలకు అవకాశం ఇచ్చింది. 500 మంది క్రిస్టియన్ల ను ఎన్నికల బరిలో నిలిపింది.
విజయం కోసం బీజేపీ ప్రణాళికలు:
కేరళలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మున్సిపల్ ఎనికల్లో కనీసం రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ట్రివేండ్రం, త్రిస్సూర్ లలో విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కడ్ లో 13 శాతం ఓట్లను పొందిన బీజేపీ గత ఎన్నికల్లో ఒక్క మున్పిపాలిటీలో అధికారం చేజిక్కించుకుంది. ఈ సారి కనీసం మూడు మున్సిపాలిటీలలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. మరో రెండు మూడు జిల్లాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు అవకాశాలు మెరుగుపరుచుకుంటామని పార్టీ కేరళ అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 140 స్థానాలుగల కేరళ అసెంబ్లీలో 2016 ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో విజయం సాధించింది.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లకు చెక్ పెట్టే యోచనలో బీజేపీ :
రాష్ట్రంలో క్రైస్తవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేరళ జనాభాలో క్రైస్తవులు 17 % ఉన్నారు. ఈ ఎన్నికల్లో లవ్ జీహాద్ కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కేరళలో లవ్ జీహాద్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు రాష్ట్ర శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి జార్జి కురియన్ అన్నారు. కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలలో బీజేపీ ఎక్కువమంది క్రైస్తవులను ఎన్నికల బరిలో దించుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాలలో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర శాఖ తెలిపింది.
మహిళా అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు :
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందున 10 వేల మంది మహిళా అభ్యర్థులను బీజేపీ ఎన్నికల బరిలో నిలపనుంది. ఇప్పటి వరకు కేరళలో రెండు కూటములే అధికారం చెలాయిస్తున్నాయి. క్రైస్తవ, ముస్లిం ఓటు బ్యాంకులే కేంద్రంగా రాజకీయాలు పనిచేస్తున్నాయి. ఈ రెండు కూటముల ఆధిపత్యానికి గండికొట్టాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. పార్టీని పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు నిర్మించాలని భావిస్తోంది. మలప్పురంలో 40 శాతం పైగా ముస్లింల జనాభా ఉన్న నేపథ్యంలో అక్కడ ముస్లిం అభ్యర్థిని బరిలో దింపారు. క్రైస్తవులు ఎక్కువగా నివసించే గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని అక్కడ ఎటువంటి సమస్యలు లేవని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. త్రిపుల్ తలాక్ రద్దుతో కేరళలోని ముస్లిం మహిళలలో మోడీకి మరింత క్రేజ్ ను సంపాదించిపెట్టిందని సురేంద్రన్ అన్నారు.
ప్రచారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్ :
స్థానికి సంస్థల ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను రంగంలోకి దించనుంది. క్రైస్తవ, ముస్లిం వర్గాలకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములను అధికారాన్ని దూరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలో మొదటి స్థానంలో వామపక్షాలు, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న బీజేపీ మొదటి స్థానానికి ఎగబాకేందుకు ప్రయత్నిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు క్రైస్తవ, ముస్లిం ఓట్లపై కన్నేసిన బీజేపీ ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు గాలం వేయనున్నారు.