Saturday, November 23, 2024

ప్రజాస్వామ్యం పరిహాసం !

  • నిర్బంధ ఓటింగే పరిష్కారమా?
  • రాజకీయ ఎన్నికల సంస్కరణలు రావాలి
  • ఓటర్ల నిర్లిప్తత దేనికి దారి తీస్తుంది?

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సుమారు 140 కోట్ల జనాభాలో ప్రస్తుతం 98 కోట్లమంది ఓటరు మహాశయులకు నిలయం మనది. రేపటి 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని కలుపుకొని కొత్త ఓటర్ లిస్టు ప్రచురిస్తే సరిగ్గా వంద కోట్ల ఓటర్లకు చేరుకునే అవకాశం ఉంది. అందుకే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా పేరొందింది.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రగతి వైపు సాగాలి!

మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. మన ప్రతినిధులుగా పంచాయతీ సభ్యులు మొదలుకొని  పార్లమెంట్ మెంబర్ దాకా ఎన్నుకుంటున్నాము. కానీ ఇందులో ఎంత శాతం ప్రజాస్వామ్యం ఇమిడి ఉంది. ఎంత శాతం ప్రజలు ఓటు వేస్తున్నారని ఆలోచిస్తే మన ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యి  సామెత లాగనే మిగిలిపోతుంది. డిసెంబర్ 1న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో ఘనమైన హైదరాబాద్ నగర ఓటర్లు ఓటు వేయడం లో ప్రదర్శించిన నిరాసక్తత, నిర్లిప్తత  మరొకసారి ఈ చర్చకు దారితీసింది. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లు పట్టణ ఓటర్ల కంటే నగర ఓటర్లు ప్రజాస్వామ్యం పట్ల అపనమ్మకంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలను వెల్లడించడానికి ఓటు ఒక అద్భుతమైన అవకాశమనీ వారు తెలుసుకోలేకపోతున్నారు. మన ఓటు తో అధికారం లోకి వస్తున్న పార్టీలు ప్రభుత్వాలు మనం చెల్లించే పన్నుల డబ్బులతో పాలిస్తాయని అర్థం చేసుకుంటే ఓటు పట్ల నిర్లిప్తత ఉండదు. కానీ రాజుగారి భోషాణం లో అందరిని పాలు పోయమంటే నేనొక్కడినే పాలు పోయకపోతే పోతే ఏమవుతుంది నీళ్లు పోస్తే పోలా అన్న చందాన చాలామంది విద్యావంతులు చదువుకున్నవారు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఇది పెద్ద విఘాతం, మరొక పెద్ద విషాదం.

ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యం

“వాతావరణాన్ని గురించి అందరూ మాట్లాడుతారు కానీ దాన్ని బాగు చేయడానికి అవసరమైన నివారణ చర్యలు ఎవరు తీసుకోరు”అనే సామెత లాగే ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య భావన గురించి   ఓటు హక్కు గురించి, గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చేవారే ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరు గెలిస్తే మనకి ఏమిటి? ఎవరు ఓడితే మనకు ఏమిటి? అని ప్రజాస్వామ్యం పట్ల నిర్లిప్తతతో ఉంటున్నారు. తాము ఓటు వేయకపోయినా గెలిచినవారు అధికారంలోకి వస్తారని, వారి ఏలుబడిలో తాము తప్పనిసరిగా మగ్గవలసి వస్తుందనే చేదు నిజాన్ని వారు గమనించడం లేదు. అందుకే ప్రజాస్వామ్యంలో మేధావుల మౌనం వల్ల నష్టం వారికి ఒక్కరికే కాదు దుర్మార్గ పరిపాలనలో అందరు ప్రజలు మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న నిజాన్ని ఓటు వేయని వారు తెలుసుకున్న రోజు ప్రజాస్వామ్యం అర్థవంతమ వుతుంది.

పిల్లి మెడకు గంట కట్టేదెవరు?

కానీ పిల్లి మెడకు గంట కట్టేదెవరు అన్న చందాన చదువుకున్న వారే ఓటు వేయడం లేదు. దాంతో పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. జవాబుదారితనం లోపిస్తుంది. ప్రజలకు ఉచిత తాయిలాలు ఇచ్చి ఓటర్లను పోలింగ్ బూతుల కు తరలిస్తే సరిపోతుందన్న భావం పార్టీలలో పెరుగుతుంది. ప్రశ్నించే వారు అడిగేవారు లేకపోతే ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్న భావన ప్రభుత్వాలకు కలుగుతుంది. ప్రజాస్వామ్యం బదులు “ఆటోక్రసి” పెరుగుతుంది. అంతిమంగా ఇది ప్రజాస్వామ్య “హననానికి” ఆ తర్వాత ప్రజాస్వామ్య “మరణానికి” దారి తీస్తుంది.*

సమస్య వర్ణన కాదు పరిష్కారాలు ఆలోచించాలి

ఓటర్ల నిర్లిప్తత అనే ఏనుగంత సమస్య మన కళ్ళముందు కనపడుతుంది. ఈ సమస్య వర్ణన కంటే పరిష్కారాల వైపు ఆలోచిద్దాం!

 (1) ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే మొదట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలి. 

(2) ఓటర్ లిస్టులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి.

(3) ఓకే ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉండే విధానాన్ని సవరించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వీటిని ఏరి వేయాలి.

(4) నూతన సాంకేతిక ఆవిష్కరణల తో కూడిన ఆన్లైన్ ఓటింగ్ ప్రవేశపెట్టాలి.

(5) ఓటింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలి.

(6) రాజకీయ, ఎన్నికల సంస్కరణలు జరపాలి.

(7) పార్టీలు కుటుంబ ప్రైవేటు ఆస్తులుగా మారిపోయాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి.

(8) అభ్యర్థుల ఎంపిక మరింత ప్రజాస్వామ్యయుతంగా జరగాలి.

(9) ప్రస్తుతమున్న ఫస్ట్ past the post ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చాలి.

(10) దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని తీసుకురావాలి.

 (11) గెలుపు గుర్రాల కు బదులు పార్టీలకు పడిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయించాలి (అదే దామాషా పద్ధతి).

(12) పంచాయతీ, మున్సిపాలిటీ, మండల,జిల్లా పరిషత్ అధ్యక్షులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కూడా ప్రత్యక్ష ఎన్నిక జరపాలి.

 (13) రాష్ట్రాల అసెంబ్లీ దేశ పార్లమెంట్ ను శాశ్వత సభలు గా ప్రకటించాలి.

నిర్బంధ ఓటింగ్ కు సమయం ఆసన్నమైంది.

ప్రపంచంలో ఇప్పటికే 20 దేశాలలో ఉన్న “నిర్బంధ ఓటింగ్” విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ ప్రయోగం అమలు మన వద్ద ఎంత వరకు అమలు జరుగుతుందో ప్రయోగాత్మకంగా పరిశీలించాలి.

ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ప్రత్యేకించి హత్య చేయలేరు, కానీ ప్రజాస్వామ్యం పట్ల ప్రజల ఉదాసీనత, నిర్లక్ష్య భావం, నిర్లిప్తత వల్ల  ప్రజాస్వామ్యం మెల్లమెల్లగా కనుమరుగైపోతుందన్న అమెరికన్ తత్వవేత్త విశ్లేషణ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles