Friday, January 3, 2025

మళ్ళీ ప్రకాశంలోకి ’ప్రకాశిక’

  • గురజాడ వర్థంతి సందర్భంగా ప్రకాశిక తిరిగి ప్రారంభం
  • అమెరికా గురజాడ ఫౌండేషన్ పూనిక
  • గురజాడ వారసుల సహకారం

నవంబర్ 30వ తేదీ మహాకవి గురజాడ అప్పారావు 105 వ వర్ధంతి. 1915లో 53 ఏళ్ళ నడిప్రాయంలో భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. సమాజం కోసం, సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కోసం తను జీవించిన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకున్న ధన్యకవి. రససిద్ధుడైన కవీశ్వరుడికి మరణం ఎందుకుంటుంది? ప్రజల నాలుకలపై ఎప్పుడూ జీవించివుండే ‘సుకవి’ గురజాడ. అహరహం సాంఘిక పరివర్తనకు, ప్రగతి గతికి శ్రమించాడు. అందరికీ అర్ధమయ్యే జీవభాషలో రచనలు చేశాడు. ఇందులో విస్మయం కలిగించేది, ఇప్పటి వరకూ పెద్దగా ఎవ్వరికీ తెలియని వారి కృషి ఒకటుంది. అదేంటంటే, గురజాడ కొంతకాలం పత్రిక కూడా నడిపాడు. దానిపేరు “ప్రకాశిక”.

కొంతకాలం ప్రకాశించిన పత్రిక

మనకు అందుతున్న సమాచారం మేరకు 1886లో ఈ పత్రికను స్థాపించాడు. ముద్రణ రూపంలో కాకుండా, రాతప్రతులుగా దీన్ని తీసుకువచ్చాడు. పేరుకు తగ్గట్టుగా కొంతకాలం అది ప్రకాశించింది. తర్వాత కనుమరుగై పోయింది. గురజాడ సాహిత్య, జీవిత విశేషాలలోనూ ఈ పత్రిక గురించి పెద్దగా ప్రస్తావనలోకి రాలేదు. ఇది పక్ష పత్రిక. ఈ పత్రిక గురించి 1911లో ఒక స్నేహితుడికి గురజాడ ఉత్తరం రాశారు. 25 ఏళ్ళ క్రితం ప్రకాశిక అనే పత్రిక స్థాపించినట్లుగా ఆ ఉదంతాన్ని అందులో స్పృశించారు. డాక్టర్  కామిశెట్టి సత్యనారాయణ గురజాడపై రాసిన పరిశోధనా గ్రంథం ద్వారా “ప్రకాశిక” విషయం వెలుగులోకి వచ్చింది.

పత్రిక ప్రతులు ఎత్తుకుపోయిన దొంగలు

అప్పారావుగారింట్లో  పెద్ద దొంగతనం జరిగింది. వచ్చిన దొంగలు బోలెడు సాహిత్య సంపదను కూడా పట్టుకుపోయారు. అందులో, ఈ పత్రిక రాతప్రతులు కూడా ఉన్నాయి. ఇన్నేళ్లకు, ఇన్నాళ్లకు  గురజాడ కుటుంబ సభ్యులు మళ్ళీ ఈ పత్రికను బయటకు తెస్తున్నారు. గురజాడ వర్ధంతి సందర్బంగా నవంబర్ 30వ తేదీ 2020నుండి “ప్రకాశిక” అందుబాటులోకి వస్తోంది. గురజాడ ఫౌండేషన్ (అమెరికా)వారు ఈ బాధ్యతలు చేపట్టారు. గురజాడ అప్పారావు మనుమరాలు అరుణ, డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గురజాడ మనుమడు రవీంద్రుడు తగు సమాచారం, సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాలంలో త్రైమాసిక పత్రికగా వెలువడనుంది.

కరోనా అనంతరం ముద్రణారూపంలో…

సమీప భవిష్యత్తులో కరోనా హడావిడి తగ్గిన తర్వాత ముద్రణా రూపంలోనూ తెచ్చే ఆలోచనలో ఈ పత్రిక యాజమాన్యం ఉంది. గురజాడ రచనలు, ఆయన చెప్పిన రసగుళికల్లాంటి మాటలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఈ కాలంలో లబ్ధప్రతిష్ఠులైన సారస్వతమూర్తులు,  జర్నలిస్టులు వ్యాసాలు అందిస్తున్నారు. మమత, సమత, మానవతకు ప్రకాశిక పత్రిక వేదికవుతుంది. ఈ మూడింటినీ చాటి చెప్పే అక్షరాలకు ఇది భూమిక అవుతుంది. నూతన ఆవిష్కరణలు, ఆధునిక ఆలోచనలు, ప్రాపంచిక దృక్పథం, దార్శనికత, దేశభక్తి, విశాల దృక్పథం, అభ్యుదయ భావాలు, సమాజ శ్రేయస్సు, సాంప్రదాయ నిరతి చుట్టూ ఈ పత్రిక తిరుగనుంది. గురజాడ ఆలోచనలన్నీ ఇవే. ఈ పత్రిక కూడా వాటికే అంకితమైతే, సామాజిక హితానికి సాహిత్యం ఊతమవుతుంది.

gurajada foundation quarterly magazine prakasika launch on november 30

పాత సమస్యలకు కొత్తవి తోడైనాయి

నేడు, భాష మారుతోంది. కవితల, రచనల వేషాలు మారుతున్నాయి. అప్పారావు ఎప్పుడో 1886లో, 134ఏళ్ళ క్రితం ఈ పత్రిక తెచ్చారు. ఆనాటి సమస్యలను, సమాజాన్ని అప్పటి పత్రికలో గుదిగుచ్చి చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపుగా అవే సమస్యలు ఉన్నాయి. వాటికి తోడు కొత్త సమస్యలు కూడా వచ్చి చేరాయి. అప్పటి రచయితలు, పాఠకుల తీరు వేరు, ఇప్పటి రూపం వేరు. ఏది చెప్పినా, వాడుకభాషలోనే చెప్పమని ఆయన ఉద్దేశ్యం. అది ఎట్లాగూ సాగుతుంది. ఇప్పటి పత్రికలు వాడుకభాషలోనే సంగతులన్నీ చెబుతున్నాయి. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కాస్త కవిత్వం తొంగి చూస్తున్నా, ఎక్కువ శాతం అందరికీ అర్ధమయ్యే భాషలోనే నేటి పత్రికలు వస్తున్నాయి.

అందుబాటులో ఆధునిక సాంకేతికత

అక్షరాస్యత బాగా పెరిగింది. ఆధునిక సాంకేతికత మరింతగా అందుబాటులోకి వచ్చింది. మనుషుల దృక్పథాలు, రుచులు, అభిరుచుల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మీడియా, సోషల్ మీడియా విస్తృత రూపం దాల్చింది. సాహిత్యానికి కూడా ప్రత్యేకంగా కొన్ని పత్రికలు అక్కడక్కడా ఉన్నాయి. శాటిలైట్, యుట్యూబ్ చానెల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇన్నిటి మధ్య “ప్రకాశిక” వికసించాలి.విస్తృతంగా విశ్వరూపం ఎత్తాలి. అరచేతిలో సాంకేతికత ఉన్న నేపథ్యంలో, ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పత్రికను చదువుకోవచ్చు. చేరవెయ్యవచ్చు. వ్యాసాలు తెప్పించుకోవచ్చు. ఇది నేటి ప్రకాశికకు దొరికిన  వెసులుబాటు. అప్పుడు రాత ప్రతిగా వస్తే, ఇప్పుడు అంతర్జాలంలో వస్తోంది. ఇక్కడా గురజాడ వారసత్వ విలక్షణత్వం కొనసాగుతోంది.

సాహిత్యవేత్తలు పత్రికలు నడపడం కొత్తకాదు

కందుకూరి వీరేశిలింగం ‘వివేకవర్దిని’ వంటి పత్రికలు నడిపాడు. కాళ్ళకూరి నారాయణరావు ‘మనోరంజని’ అనే పత్రికను స్థాపించాడు. ఆ కాలంలో కవులు, సాహిత్యవేత్తలు ఎందరో పత్రికలు నడిపారు. ఇది కొత్త విషయం కాదు. సారస్వతవేత్తలు  పత్రికలు నడిపే పరిస్థితులు నేటికాలంలో లేవు. ఎక్కడో చెదురుమొదురుగా ఉంటే ఉండవచ్చు. ఇటువంటి వాతావరణంలో, గురజాడ వర్ధంతినాడు గురజాడ ఎప్పుడో స్థాపించిన పత్రికను పునఃప్రకాశం చెయ్యాలనే ఆలోచన వచ్చిన వారి కుటుంబ సభ్యులకు , ఈ యజ్ఞానికి సహకరిస్తున్న అందరికీ అభినందనలు, అభివందనలు తెలుపుదాం. ప్రకాశిక ప్రకాశమానం, సామాజిక వికాసమానం అవ్వాలని అభిలషిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles