కె.బి. శంకర్
నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాజపా మొన్నటి దుబ్బాక విజయం పేరుతో పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. అంతకు మించి నిజాయితీగా, స్వతంత్రంగా ప్రజలకు వాగ్దానాలు చేయలేకపోతున్నారు. పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పాత బస్తిలో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలలో గెలిస్తే ఏమి చేయగలరో ప్రజలకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సంజయ్ బండిని సజావుగా విజయ పథం వైపు తీసుకుపోగల స్థానిక నాయకులు అంతగా లేరు అన్నది వాస్తవం. ఇటీవల కొన్ని లోక్ సభ స్థానాలు, మొన్న దుబ్బాక లో శాసనసభ స్థానం గెలుపు వీరికి సమకూరిన అదనపు బలం. ప్రజాకర్షణ గల నాయకులు దుబ్బాక ఎంఎల్ ఏ రఘునందన్ లాంటి వాగ్దాన వీరుల కొరత భాజపా లో ఉంది. మోదీ, అమిత్ షా నాయకుల పేర్లతో స్థానిక ఎన్నికలలో నెగ్గుకు రాగలగటం కష్టం. ఢిల్లీ వైపు చూస్తూ ఇస్తున్న వాగ్దానలను ప్రజలు నమ్మడం కష్టం. అయితే ఇప్పుడు తెరాస కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, భాజపా అనేంత వరకూ పరిస్థితిని తీసుకొని రావడం భాజపా విజయం అనే చెప్పాలి.
ఇక తెరాస కూ ఈ ఎన్నికలలో విజయం నల్లేరు మీద బండి కాదు. ఇటీవల వచ్చిన వరదలు వాటి తాలూకు చేదు అనుభవాలు ప్రజల మస్తిష్కం లో మెదులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కొంత సహాయం అందించింది. పూర్తిగా అందించలేకపోవతానికి కారణం భాజపా నిర్వాకమే అని చెప్తూ ఈ వరదలు ప్రజలను ఇబ్బంది పెట్టటానికి కారణం గత ప్రభుత్వాల పరిపాలనే అని, ముఖ్యంగా కాంగ్రెస్ ని విమర్శించింది. కానీ వరద సహాయం పూర్తిగా అందించక మునుపే ఎన్నికల తేదీలు ప్రకటించింది ఎవరు? బండి సంజయ్ కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్. తప్పు ఎవరిది? ప్రజలు అమాయకులు కాదు.
ఎన్నికలలో గెలిస్తే లక్ష కోట్ల నిధిని నగర పాలక సంస్థ కి అందిస్తాం అని ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. “ఇలాంటి వాగ్దానాలు మీరూ ఇవ్వగలరా?” అని ప్రతిపక్షాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి ప్రజల్లో అంతాగా బలం ఇప్పటికీ రాలేదు. వారు పుంజుకోవటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పటమూ కష్టమే. నాయకులు అందరూ ఐక్యమత్యంతో నడుస్తున్న ధాఖలాలు ఉండవు. ఇద్దరు ముగ్గురు నాయకుల గొంతులే వినపడుతూ ఉంటాయి. వీళ్లూ ఢిల్లీ ని చూస్తూ మాట్లాడాల్సిందే.
మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ను గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఐఎంతో తెరస పొత్తూ కొత్తదేమి కాదు. పొత్తూ గిత్తూ జాన్తా నై అని ప్రచారసారథి కేటీఆర్ అంటే నమ్మడానికి జనం వెర్రివాళ్ళు కాదు. ఎంఐఎంకి కి క్రితం సారి లాగానే 30 నుంచి 40 స్థానాలు రావచ్చు. అయినప్పటికీ వారు స్వయంప్రభతో మేయరు స్థానం పొందగలిగే అవకాశాలు లేవు.
స్థానిక ఎన్నికలు మిగతా ఎన్నికలకంటే భిన్నవైనవి. కుల, మత, వర్గ, పలుకుబడి లాంటి అనేక కోణాలు విజయానికి కారణాలు అవుతుంటాయి.
ఇప్పుడు భాగ్యనగర వాసులకు మరో సారి వరదలు పొంగి పొర్లుతున్నాయి. అవి వివిధ పార్టీల వాగ్దాన వరదలు. ఈసారి స్థానిక ఎన్నికల్లో విజయం ఎవరికీ నల్లేరు మీద నడక కాదు.
ఈ నెలాఖరి వరకు భాగ్య నగరం లో ఎన్నికల కోలాహలం సందడిగానే ఉంటుంది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగలాని ఇపుడు మనమందరం కోరుకోవాలి.