- గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు
- విజయం కోసం బీజేపీ వ్యూహ రచన
- గ్రేటర్ పీఠం మాదేనంటూ అధికార, విపక్షాల ధీమా
గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చాప కింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్రమంతటా జనం జేజేలు పలికారు. 2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లలో విజయం సాధించి మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ మరోమారు బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి అప్రతిహత విజయాలతో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. అయితే ఇటీవల దుబ్బాకలో ఎదురైన ఓటమినుంచి తేరుకోలేకపోతోంది. ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ విజయాలను సొంతం చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎదురే లేదనుకున్న టీఆర్ఎస్ కు పలు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మోడీ ఛరిష్మాతో దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడంతో టీఆర్ఎస్ కు ఎదురు గాలివీయడం మొదలు పెట్టింది.
Also Read: గ్రేటర్ పోరు: జిహెచ్ఎంసి ఎన్నికల్లో 90 మంది అభ్యర్ధులతో టీడీపీ తొలి జాబితా విడుదల
హైదరాబాద్ లో బలహీన పడిన టీఆర్ఎస్
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ బలహీనపడింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఎంఐఎం ఒక చోట విజయం సాధించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరిథిలో ఉన్న ఐదు లోక్ సభ స్థానాల్లో చేవెళ్ల, మెదక్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. 47 డివిజన్లు ఉన్న మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 40 డివిజన్లు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు. 43 డివిజన్లు ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం పాగా వేసింది. దీనికి తోడు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్య విజయం సాధించి అధికార పార్టీకి గట్టి సవాలే విసిరింది.
ఓటమితో పాఠాలు
దుబ్బాక ఓటమి తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. అందుకోసం భారీగా తాయిలాలను కూడా ప్రకటిస్తోంది. 2020-21 సంవత్సరానికిగాను జీహెచ్ఎంసీ పరిథిలో 15 వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చేఏడాది చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపు ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పలు కాలనీలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల బాధితులకు 10 వేల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
Also Read: గ్రేటర్ లో పాగా కోసం టీఆర్ఎస్, బీజేపీ కుస్తీ
కలిసిరాని వరదలు
మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న సమయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని మద్యం షాపులకు అనుమతినిచ్చిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు హైదరాబాద్ దుస్థితిని చెప్పకనే చెప్పాయి. ఇళ్లు నీట మునిగి వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితులు వరద నీటిలోనే కాలం గడిపారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇదికూడా తూతూ మంత్రంగానే ముగిసిందని బాధితులు వాపోతున్నారు. ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పట్టిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నిర్వహణా లోపం వల్లే ఇటీవల వచ్చిన వరదల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని టీఆర్ఎస్ ను ఏకిపారేస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఇటీవల వచ్చిన వరదల్లో నగరంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో 100 పైగా డివిజన్లలో ఒంటరిగా గెలిచి గ్రేటర్ పీఠం కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
మేయర్ పీఠంపై టీఆర్ఎస్ ధీమా
ఎక్స్అఫీషియో ఓట్ల ను చూసుకుని టీఆర్ఎస్ విజయంపై ధీమాగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించి మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.