- వరద సాయం ఆపటంపై కేసీఆర్ కు సంజయ్ సవాల్
- బీజేపీ పేరు చెబితే కేసీఆర్ కు భయమన్న సంజయ్
- గ్రేటర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న బండి
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులతో పార్టీ ఆఫీసులు కళ కళ లాడుతున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓ వైపు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రచారంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది.
తాయిలాలతో ఓటరుకు వల
గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలను ప్రకటిస్తున్నాయి. వరద ముంపు బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల సాయం అందిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి 25 వేలు ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. నష్టపోయిన కార్లు, బైక్ లు ఇప్పిస్తామన్నారు. తాను వరద సాయం ఆపానని ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. వరద సాయం ఆపలేదని తాను అమ్మవారిపై ప్రమాణం చేస్తానన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే తన పేరుతో లేటర్ రాయించారన్నారు.
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
వరద సాయం ఆపటంలో బీజేపీ పాత్ర ఉందని బండి సంజయ్ ఫిర్యాదు మేరకే ఎన్నికల కమిషన్ వరద సహాయం ఆపిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. వరద సహాయం నిలుపుదలపై తాను ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదని సంజయ్ స్పష్టం చేశారు. ఫేక్ లెటర్ సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. దుబ్బాక విజయం తరువాత కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ అన్నారు.
మోడీ పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కుల అహంకారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్యలు దారుణమని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ అంత దుర్మార్గపు సీఎం ఎక్కడా లేరని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు వైన్లు, బార్లే మిగులుతాయన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని నిలదీశారు. ఎవరి ఓట్ల కోసం దేశాన్ని కించపరుస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఎంఐఎంకి అప్పగించాలనుకుంటున్నారా? అని కేసీఆర్ నిలదీశారు.