Monday, November 25, 2024

ఎన్నికల ఆటలో గెల‌వాల్సింది పార్టీలు కాదు, ప్రజలు

గంగా-జమునా తహజీబ్ ను కాపాడాలి

జిహెచ్ఎంసి లో ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల ఆట మొదలైంది. ఈ ఆటలో పార్టీల కంటే ప్రజలే గెలవాలి. ప్రతిసారీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక వంక  ఓటర్ల జాబితా రిజర్వేషన్ల రొటేషన్  విషయంలో రాష్ట్ర  హైకోర్టులో పిటిషన్లు పడి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ అయిన సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీనివల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయతకు గండిపడింది. సవరించిన అంతిమ ఓటరు జాబితా ప్రచురితం కాకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదరాబాదరాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 2016 జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ 99 స్థానాలు గెలుచుకోగా, టిఆర్ఎస్ తర్వాత దానితో స్నేహపూర్వక పోటీ చేసి మత రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం పార్టీ 44 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ బిజెపి సహా రెండు చోట్ల అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

సీట్లు పెంచుకోవ‌డ‌మే ధ్యేయంగా టీఆర్ఎస్‌

ఒక వంక  టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో  వందకు ఒకటి తక్కువ గెలిచి  దాన్ని వందకు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే గెలిచిన అధికార పార్టీ కార్పొరేటర్ల  పని తీరు చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందరూ అలాంటి వారు కాకున్నా నూటికి 90 శాతం మంది కార్పొరేటర్లు అవినీతి తో పాటు భూమి కబ్జాలు, సెటిల్మెంట్లు చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవంక  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గo ఉప ఎన్నికలలో గెలిచిన బిజెపి పార్టీ ఇక గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగుర వేస్తామని బీరాలు పలుకుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి మహాభారతంలో కర్ణుని చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని ఉన్నాయి. బిజెపి గెలవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి.

విభ‌జ‌న రాజ‌కీయాల‌కు తెర‌లేపిన బీజేపీ

దుబ్బాక గెలుపుతో ప్రజల పట్ల వినయ విధేయతలు చూపడానికి బదులు విభజన రాజకీయాలకు బిజెపి మరోసారి తెరలేపింది. ఇప్పటికే బిజెపి పార్టీ లో పోటాపోటీ టికెట్ల రాజకీయం నడుస్తున్నది. చివరికి తమ సొంత పార్టీ ఆఫీసుల మీద దాడి చేసుకునే స్థితికి ఆ పార్టీ చేరింది. అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో బిజెపి కూడా కాంగ్రెసు పార్టీని మించిపోతోంది. 2016 జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుంటే వారు ఈ మాటలు మాట్లాడరు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒకటి, కాంగ్రెస్ పార్టీకి రెండు, బిజెపికి నాలుగు కార్పోరేటర్ సీట్లు వచ్చాయి. “వన్, టు, ఫోర్” పార్టీలుగా గా ఉన్నవారు గత ఐదు సంవత్సరాలలో నిర్మాణాత్మకమైన  ప్రతిపక్ష పాత్ర నిర్వహించ లేదు. సరికదా నిజమైన ప్రజా సమస్యలు లేవనెత్తడంలో విఫలమయ్యారు. మరో రకంగా చెప్పాలంటే అసలు ప్రతిపక్షమే లేకుండాపోయింది. ఎంతసేపు అధికార ప్రతిపక్ష పార్టీ లు తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ప్రయత్నించారు.

ద‌క్షిణ‌-ఉత్త‌ర భార‌తాల వార‌థి హైద‌ర‌బాద్‌

హైదరాబాద్ నగరం అంటేనే “గంగా-జమున తెహజీబ్” గా చెప్పుకోవచ్చు. ద‌క్షిణ భారత దేశానికి ఉత్తర భారత దేశానికి ఒక వారధిగా హైదరాబాద్ నగరం విలసిల్లింది. దేశంలో ఎక్కడివారైనా హైదరాబాద్ నగరంలో భాషా సమస్య లేకుండా నివసించ గలుగుతున్నారు.  హైదరాబాద్ నగర ప్రజల వాడుక భాషను ఎక సెక్కం, ఎగతాళి చేసిన వారికి తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతో  బుద్ధి చెప్పారు. అలాంటి నగరంలో ఈ ఎన్నికల సందర్భంగా మత విభజన రాజకీయాలకు ప్రయత్నించే పార్టీలను ప్రజలు తమ చైతన్యంతో తిప్పి కొడతారు. ఒక నాటి కులీ కుతుబ్ షా, అసఫ్ జాహీల పాలన మొదలుకొని ఇప్పటివరకు భాగ్యనగరం మత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆధునిక భారతంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పాలనలో మత రాజకీయాల మత కల్లోలాల మరక భాగ్య నగర ప్రజలు తమ చైతన్యంతో చెరిపేశారు.

మ‌త క‌ల్లోలాను అణచి వేసిన ఎన్టీఆర్‌

1983లో  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా  తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన  ఆనాటి ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు హయాంలో మతకల్లోలాలు కఠినంగా అణచి వేశారు. నాటి నుండి నేటి నవ తెలంగాణ వరకు పరిస్థితులను బేరీజు వేసుకుంటే మతతీవ్రవాద రాజకీయాలకు  అతీతంగా అనేకసార్లు తమ ఓటు ద్వారా నగర ప్రజలు తీర్పు ఇస్తూ వస్తున్నారు. అందుకు ఈ ఎన్నికల లో విభజన రాజకీయాలు మాని సామరస్య రాజకీయాలకు ఇది పునాది కావాలి. అభివృద్ధి పునాదిగా ఎన్నికల ప్రచారం సాగాలి. ప్రజల మేనిఫెస్టో అమలు చేయాలి. అందుకు నగర ప్రజల ముందు ఉన్న సమస్యలను అన్ని పార్టీల దృష్టికి తేవడానికి ప్రయత్నిస్తాను.

వ‌ర‌ద‌ల్లో పార్టీల బుర‌ద రాజ‌కీయాలు

ఇటీవల నగరంలో వరదలు సంభవించాయి. 1908 తర్వాత అంత పెద్ద వర్షం పడడం ఇదే మొదలు. అప్పుడు ఒక్కరోజులోనే 42 సెంటీమీటర్ల వర్షం పడితే ప్రస్తుతం 32 సెంటీమీటర్ల కు పైగా భాగ్యనగరంలో వర్షం పడి నగరాన్ని అతలాకుతలం చేసింది. ఇది ప్రకృతి శాపం మాత్రమేకాదు. పాలకుల పాపం కూడా  అని చెప్పవచ్చు. ఈ కష్టకాలంలో వరద కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేశాయి. వరద బాధితులకు నష్టపరిహారం పేరుమీద  ప్రజల సొమ్మును  నగదుగా పంచి  అధికార పార్టీ  అధికార దుర్వినియోగం చేసింది. వరదలకు కొంప గోడు కూలిపోయి ఒకరు ఏడుస్తుంటే మరో రకంగా కొందరు చోటామోటా రాజకీయ నాయకులు దీన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు. పేద ప్రజలకు నగదుగా ఇచ్చిన డబ్బుల్లో  సగానికి సగం మింగేస్తారు. ఈ నగదు డబ్బుల పందేరం ఒక రకంగా అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికలకు ముందస్తు  లంచమే అని చెప్పవచ్చు. ఇప్పటికీ వరద బాధితులు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరి తమకు నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. ఇంకా కొన్ని కాలనీలు వరదల వల్ల వచ్చిన బురదలో మునిగి ఉండగానే ఇప్పుడే ఎన్నికలకు ఏమి తొందర వచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నగర ప్రజల మేనిఫెస్టో

(1) వరదలకి శాశ్వత పరిష్కారం చూపించాలి. డ్రైనేజీ వ్యవస్థ సరిదిద్దడం. వరద నీరు వెంటవెంటనే నగరం బయటకు పోవడానికి వీలుగా ఇప్పటిదాకా అక్రమార్కులు ఆక్రమించుకున్న కాలువలు పునరుద్ధరించాలి. ముఖ్యంగా పాత నగరం కాటేదాన్ ప్రాంతంలో ఉన్న “ఫిరంగి నాలా” పునరుద్ధరణ జరగాలి. ఇక పెద్ద వారు పలుకుబడి కలిగిన వారు చేసిన అక్రమ నిర్మాణాల ను నిర్దాక్షిణ్యంగా కూల్చి చేయాలి.

(2)భాగ్యనగరంలో సుమారు 12 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా ప్రభుత్వమే లెక్క తేల్చింది. వాటిని వెంటనే కూల్చి వేయాలి. మూసి పరివాహక ప్రాంతంలో ఆరేడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మూసీ నది ప్రవహించే ఏర్పాటు చేయాలి.

(3) దేశంలో అతిపెద్ద జనావాసం కలిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత పై ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ స్పందించాలి. కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధీనంలో ఉన్న కంటోన్మెంట్ రోడ్లను మూసి వేయ కుండా శాశ్వత పరిష్కారం చూపాలి. దానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించినట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను హైదరాబాద్ నగరానికి దూరంగా తరలించాలి.

(4)హైదరాబాద్ నుండి ఉత్తర తెలంగాణా కు వెళ్లే రాజీవ్ రహదారి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి మొదలుకొని తూముకుంట అవుటర్ రింగ్ రోడ్డు వరకు ,రోడ్డు విస్తరణ తో పాటు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం కంటోన్మెంట్ స్థలం కేటాయించాలి.అలాగే ప్యారడైస్ నుండి బోయినపల్లి సుచిత్ర మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ రహదారులను నిర్మాణానికి కంటోన్మెంట్ భూములను ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి.

(5)రాయదుర్గం, ఎల్బీనగర్ ల నుండి ప్రస్తుత మెట్రో రైలు  శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండవ దశలో విస్తరించాలి. ఎయిర్ పోర్టు నుండి మధ్య నగరానికి రావడానికి అరగంట కంటే ఎక్కువ సమయం పట్టకుండా చూడాలి.

(6) నగరం మధ్య నుండి వెళ్లే జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం విస్తరించడంతో పాటు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాలి.

మూసీనది సుందరీకరణ

అలాగే మూసి నది సుందరీకరణ, నగరంలో పదిహేను వేలకు పైగా  ఉన్న పేదల వాడలను బాగుచేయడం, మౌలిక సౌకర్యాలను కల్పించడం లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించాలి. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ఆర్భాటంగా  స్మార్ట్ సిటీ గా ప్రకటించడమే తప్ప ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. ఇకనైనా హైదరాబాద్ నగరానికి శాశ్వత ప్రాతిపదికన అవసరమైన పనులు చేయడానికి  కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి సహకరించాలి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న ఇలాంటి పనులు చేసి హైదరాబాదు నగర ప్రజల మనసులను గెలవాలి. కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిధులు ఇస్తున్నామని అబద్ధాలు చెబుతూ కూర్చుంటే ఓట్లు రాలవు. హైదరాబాద్ నగరాన్ని నివాసయోగ్యమైన నగరంగా మార్చడానికి అవసరమైన పనులు చేయకుండా కేవలం ప్రజల మధ్య విభజన రేఖలు గీసి మత రాజకీయాలు చేసి రేపటి జీహెచ్ఎంసీ ఎన్నిక లో గెలుస్తాం అనుకున్న పార్టీలకు విజ్ఞత కలిగిన నగర ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles