Friday, January 3, 2025

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ కీలక నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

  • ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదన్న సీఎస్
  • గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రబలుతునదని సీఎస్ ఆందోళన
  • ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమన్న నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వానికి మధ్య అంతరం నానాటికీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చిలో వాయిదాపడిన   ఎన్నికల నిర్వహణకే సర్కారు ససేమిరా అంటుండగా తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో  ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నామని నిమ్మగడ్డ తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రతిరోజు నమోదయ్యే కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఎస్ఈసీ స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిందని ఈ సందర్భంగా రమేష్ కుమార్ గుర్తుచేశారు.   ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఉపఎన్నికలు జరిగిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఎసీఈసీ సూచించారు. ఎన్నికలపై ప్రభుత్వం రాజకీయపార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.

నిమ్మగడ్డకు సీఎస్ లేఖ

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటనకు బదులుగా ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖలో స్పష్టం చేశారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే కరోనా గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్ అన్నారు. ఇప్పటికే పరిపాలనా సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా కట్టడికి కృషిచేస్తున్నారని, ఈ పరిస్థితులలో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా మరింత ప్రబలే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధత లేకుండా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని నీలం సాహ్ని లేఖలో తెలిపారు.

సీఎస్ లేఖపై ఎస్ఈసీ ఘాటు స్పందన

సీఎస్ లేఖపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరచడం చట్ట విరుద్ధమని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles