Thursday, January 2, 2025

విజయానికి తొలి మెట్టు కాంగ్రెస్!

వోలేటి దివాకర్

ప్రతిష్ఠాత్మకమైన రాజమహేంద్రవరం పార్లమెంటు బరిలో త్రిముఖ పోరు నెలకొంది. బిజెపి, టిడిపి-జనసేన కూటమి అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ బరిలో నిలిచారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి విశాఖపట్నం నుంచి గెలుపొంది, యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిష్ఠ మసకబారడంతో బిజెపిలో చేరారు. ఆర్థికంగా, సామాజికంగా బలవంతురాలు. కూటమి ఓట్లు సక్రమంగా బదలాయింపు జరిగితే ఆమెకు కలిసి వస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ వారసత్వం అదనపు బలం.  అయితే పురందేశ్వరి స్థానికేతరురాలన్న అభిప్రాయం ఉంది. ఆమె 2019లో  రాజంపేట, 2014లో బాపట్ల,  2009 ఎన్నికల్లో విశాఖ, 2004లో బాపట్ల నుంచి పోటీ చేయడం గమనార్హం.  బిజెపి మతతత్వ పార్టీగా ముద్రపడిన నేపథ్యంలో మైనార్టీ, క్రైస్తవుల ఓట్లు ఆమె ఎంతవరకు సాధిస్తారన్నది ప్రశ్నార్థకం. టిక్కెట్టు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం ఆమెకు ఎంతవరకు సహకరిస్తుందన్నది కూడా చర్చనీయాశంగా మారింది.

ఇక మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. అమలాపురానికి చెందిన గిడుగుకు జిల్లాలో విస్తృత పరిచయాలు ఉన్నాయి.

ఈఎన్నికల్లో సాంప్రదాయక కాంగ్రెస్‌ ఓటర్లతో పాటు వైఎస్‌ వ్యక్తిగత అభిమానులు,  బ్రాహ్మణ ఓటర్లు, అధికార బిజెపి వ్యతిరేక ఓటర్లు, మైనార్టీలు కలిసికట్టుగా గిడుగుకు వేస్తే ఆయన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్‌ గ్రాఫ్‌ కాస్త పెరిగిందని కూడా చెబుతున్నారు. పురందేశ్వరి స్థానికేతరురాలన్న అంశం కూడా ఆయనకు కలిసి వస్తుంది. కానీ రాష్ట్ర విభజన తరువాత 2014, 2019 ఎన్నికల సరళిని గమనిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ గెలిచే సత్తాను సాధించలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అధికార వైసిపి అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరంలో పేరొందిన వైద్యులు. బిసి సామాజికవర్గానికి చెందిన ఆయన ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో పాటు, తొలిసారి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అధికార పార్టీ అండ, స్థానికుడు, బిసి సామాజిక వర్గం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ప్రత్యర్థి పురందేశ్వరి స్థానికేతరురాలు కావడం మరో ప్రయోజనం. మైనార్టీ, ఎస్సీ, బిసి ఓట్లు గంపగుత్తగా సాధిస్తే ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వగలుగుతారు. కానీ అనుభవ లేమి, బలమైన కూటమి అభ్యర్థి, షర్మిల ప్రభావంతో వైసిపి ఓట్లలో చీలిక వంటి అంశాలు నష్టదాయకంగా పరిణమించవచ్చు. అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పార్టీ చీల్చే ఓట్లపైనే ప్రత్యర్థి పార్టీల విజయం ఆధారపడి ఉంటుందన్నది కాదలేని వాస్తవం.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles