Tuesday, December 3, 2024

కెలికి… ‘కెమిస్ట్రీ’ని బయటకు తీశారుగా!

జాన్ సన్ చోరగుడి

న్నికల షెడ్యూలు వెలువడ్డాక, ప్రజా కోర్టులో రాజకీయ పార్టీలు ప్రత్యర్దులుగా ఒకరికొకరు  తలపడతారు. తాము ఏ ‘ఎజెండా’తో  ప్రజలలోకి వెళ్ళాలి? అందుకు తమ సంసిద్డత ఎలా ఉండాలి? అనేది ఆ దశలో ఎక్కడైనా పార్టీల ప్రాధాన్యతగా ఉంటుంది. కానీ చిత్రంగా ఎపిలో ముందుగా- ‘రిఫరీలను’ మార్చాలి, ప్రత్యర్ధి ఆడే కోర్టు సైజ్ తగ్గించాలి, వంటి షరతులతో టిడిపి-బిజెపి-జనసేన ‘కూటమి’ ఆటకు సిద్దం అవుతున్న వైనం, మనం నిశితంగా గమనించాల్సి ఉంది. ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’ అధికారులపై ఎన్నికల సంఘం ముందు వారు చేస్తున్న పిర్యాదులు చూశాక, ఇప్పటివరకు వెలుగులోకి రాని ఒక విలువైన అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇది దారి తీసింది.  

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రతిపక్షాల పిర్యాదు మేరకు ముగ్గురు కలక్టర్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజిని ఎన్నికల సంఘం ఏప్రెల్ రెండున బదిలీ చేసింది. ఇది జరిగాక, ఏప్రెల్ ఐదున 22 మంది ఐపీస్ అధికారులను బదిలీ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎన్నికల సంఘం ఏ మేరకు పట్టించుకుంటుందో తెలియదు. వీరు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని పిర్యాదు చేస్తున్న ‘కూటమి’ అనుమానం.

కెమిస్ట్రీ నిజమేనా?

అయితే, దక్షణాది రాష్ట్రాల్లో ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’అధికారులకు ఉండే ‘గ్లామర్’ ఎక్కువ. ఇక్కడ దిగువ ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలు అ సర్వీసుల్లో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఇప్పుడు ఆమె ఈ అధికారుల  విషయంలో చేసిన పిర్యాదు ‘డిమాండ్’ సంగతి ఎలా ఉన్నప్పటికీ, పాత పార్టీల అనుమానం  ఈ స్థాయిలో ఉండేట్టుగా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో- ఐఏస్, ఐపీస్, అధికారులకు ‘కెమిస్ట్రీ’ కుదరడం నిజమేనా? అది నిజం కనుక అయితే, గడచిన నాలుగున్నర  ఏళ్ళలోనే ఇంతగా వీరి మధ్య సామరస్యం ఎలా కుదిరింది అనే సందేహం మనకు కలుగుతుంది.

ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు వాస్తవానికి ఎన్నికల షెడ్యుల్ వెలువడిన తర్వాత, వీరు ఎన్నికల కమీషన్ నియంత్రణలో పనిచేయవలసి ఉంటుంది. ఒక అధికారి తన సర్వీస్ లో ఐదేళ్ళ చొప్పున కనీసం ఆరు సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయవలసి ఉంటుంది. వీరిలో సీనియర్లు ఎక్కువమంది ఈ సీజన్లో అస్సలు తమ స్వంత రాష్ట్రాల్లో ఉండరు. వారు ఇతర రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళవలసి ఉంటుంది. వారి సర్వీస్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో గరిష్ట స్థాయిలో వినియోగించుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ళను బట్టి వీరికి జారీ చేసే మార్గదర్శకాలు కూడా మారుతున్నాయి.  

హాస్యాస్పదం

ఇదేమీ తెలియకుండా వారికి రాగద్వేషాలు ఆపాదించి అనుమానంతో చూస్తూ వారి బదిలీలు కోసం డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా ఈ సర్వీస్ లో ఉండే అధికారుల ‘మొరేల్’ దెబ్బతినే విధంగా నియంత్రణ చర్యలు ఉండవు. ఎన్నికలప్పుడు ఎంతో తీవ్రమైన ఆరోపణలతో పిర్యాదులు వస్తే తప్ప, కమీషన్ జోక్యం ఉండదు. అటువంటిది కేవలం అనుమానం అంటూ ఏకంగా 22 మందిని వారు అధికార వైసీపికి అనుకూలురు అని ‘కూటమి’ నాయకులు అధికారుల జాబితా ప్రకటించడం మంచి సంప్రదాయం కాదు. ఒకవేళ రేపు కూటమి అధికారంలోకి వచ్చినా అది పనిచేయించు కోవలసింది ఇదే అధికారులతో.

అటువంటిది చివరికి ఈ ‘డిమాండ్’ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక జిల్లా కలక్టర్ ది కులాంతర వివాహం ఆమె బ్రాహ్మిన్ భర్తది సిఎం కులం కనుక, ఆమెను అక్కణ్ణించి బదిలీ చేయాలి అని డిమాండ్ చేయడం వరకు వెళ్ళింది అంటే ‘కులం’ ప్రాతిపదికగా పరిస్థితిని ఈ నాయకులు ఎక్కడికి దిగజార్చారో అర్ధం అవుతుంది.

ఎలా కుదిరింది?

పైన అనుకున్నట్టుగా విశేషం ఏమంటే, కేవలం నాలుగున్నర  ఏళ్ళలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని ‘బ్యురోక్రసి’తో ఇంతగా సామరస్యం ఎలా కుదిరింది? అనేది ఇప్పుడు ఎవరికైనా కలిగే సహజమైన సందేహం. మళ్ళీ ఇప్పుడీ చర్చ అటువైపుకు మళ్ళీ అది జగన్ కు ప్రయోజనం కనుక అయితే, అందుకు కారణం ఎవరు? అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. దీన్నే స్వయంకృతం అంటారు.  

జగన్ గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేకుండా నేరుగా సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి. అది తానే పెట్టిన ప్రాంతీయ పార్టీ, యువకుడు కనుక క్రియాశీల రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అంటే అది రాజ్యంగ పదవి. అది సరే, మరి సిఎం కుర్చీ కూర్చునే వ్యక్తి తన  స్థాయిలో తాను తీసుకునే ‘లైన్’ ఎలా ఉండాలి? తన పార్టీ ప్రభుత్వం ప్రాధాన్యతలు ‘బ్యురోక్రసీ’కి ముందుగా చెప్పి, అందుకు తాను అనుకుంటున్న కాల పరిమితి కూడా ముందుగానే చెప్పి అ తర్వాత సిఎం దాన్ని- ‘మోనిటర్’ చేయాలి.

మ్యానిఫెస్టోలోనే…

అయితే. జగన్ ఎంచుకున్న ప్రాధాన్యతలు ఏమిటి, అవి ఎక్కడివి? ‘యుఎన్.డి.పి.’ నిర్దేశించిన- ‘సస్టేయిన్బుల్ డెవలప్మెంట్ గోల్స్’ లోని 17 అంశాలు నుంచి ఆయన తనవైన మూడు నాలుగు ప్రాధాన్యతలు ఎంచుకుని, మొదటి ‘టర్మ్’ వాటి మీద దృష్టి పెట్టారు. మొదట్లోనే- దారిద్ర్యనిర్మూలన, విద్య, వైద్యం ‘నవరత్నాల’లో చోటుచేసుకున్నాయి. జగన్ ఎన్నికలకు వెళ్ళే ముందే ‘మ్యానిఫెస్టో’ లోనే అవి ఉన్నాయి అంటే, ఏ ఐఏస్, ఐపీస్, అధికారులు మాత్రం అటువంటి ప్రభుత్వం పట్ల ‘అలెర్ట్’ కాకుండా ఎలా ఉంటారు? 

‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా ముఖ్యమంత్రి ఇటువంటి ‘లైన్’ తీసుకున్నప్పుడు, ఏ ఐఏస్, ఐపీస్  అధికారికి ప్రభుత్వం వాటిని అమలు చేసే విషయంలో అభ్యంతరాలు ఉండే అవకాశం లేదు. పైగా పనిచేసే ఉత్సాహం కనుక ఉంటే, వారు అడిగి మరి ఈ శాఖల్లో చేరొచ్చు. ఎపిలో అదే జరిగింది.

ఎందుకంటే, కేంద్రప్రభుత్వం స్థాయిలో రాష్ట్రాల పనితీరును ప్రతి మూడు నెలలకు సమీక్షించే- ‘నీతి ఆయోగ్’ రాష్ట్రాలకు ‘సర్క్యులేట్’ చేసే ప్రాధాన్యతలు ఏవంటే, అవి పైన మనం అనుకున్న- ‘యుఎన్డిపి’ నిర్దేశించిన- ‘సస్టేయిన్బుల్ డెవలప్మెంట్ గోల్స్’ లోని 17 అంశాలు. వాటిలో ఒక్కొక్కదానికి అనుబంధంగా ఉండే ఇతర అంశాలు.

ట్యూన్అయ్యారు

అలా ఈ సిఎం తన అధికారులతో- ‘ఇవి నా ‘టర్మ్’లో నా ప్రాధాన్యతలు’ అని చెప్పి, వారికీ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టకపోవడంతో తక్కువ ‘టైం’లోనే వారు ఈ ప్రభుత్వంతో ‘ట్యూన్’ అయ్యారు. దాంతో ప్రభుత్వం మారాక మారిన పరిస్థితులతో గతంలో ఇక్కణ్ణించి బయట సర్వీస్ లకు వెళ్ళినవారు కూడా మళ్ళీ వెనక్కి తిరిగివచ్చారు. పనిలో లక్ష్యాల సాధనలో వేగం కోరటం ఒక్కటే జగన్ ప్రభుత్వంలో అధికారులపై ఉన్న ఒత్తిడి.

రిటైరైన తర్వాత కూడా ఒక డిజిపి, నలుగురు సిఎస్ లు ఈ ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు అంటే, ఏమిటి అర్ధం? ఇక్కడ పనిచేసే వాతావరణం లేకుంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? అటువంటప్పుడు వారి విలువైన అనుభవం అంతిమంగా ఉపయోగపడేది ఈ రాష్ట్రానికి ఈ ప్రజల ప్రయోజనానికే కదా.

విహంగ వీక్షణంగా…

సందర్భం వచ్చింది కనుక, ఒక విహంగ వీక్షణంగా కొందరు అధికారుల ‘ప్రొఫైల్’ చూద్దాం. గిరిధర్ అర్మానే 2014-15 మధ్య అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తూ ఇక్కడ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. కొంతమంది ‘ట్రై’ చేసుకుని మరీ వచ్చే పోస్టు అది. అదే కాలంలో అజయ్ సహానీ కూడా అదే పోస్టు నుంచి కేంద్రానికి వెళ్ళిపోయారు. మరొకరు టిటిడికి వెళ్ళారు. గిరిధర్ అర్మానే భారత ప్రభుత్వం రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసి, రిటైర్ అయ్యాక అదే పోస్ట్ లో కొనసాగుతున్నారు.

ఎపిలో సీఎస్ గా తన టర్న్ వచ్చినప్పుడు గిరిధర్ తాడేపల్లి వస్తే, సిఎం ఆయన్ని  సన్మానించారు. ఖమ్మం కలక్టర్ గా పనిచేసిన ఈ ఐఏస్ అధికారి మణిపూర్ అల్లర్లు సమయంలో విషయానికి ఉన్న సున్నితత్వం దృష్ట్యా, డిల్లీ నుంచి మంత్రులు ఎవరూ కాకుండా గిరిధర్ భారత ప్రభుత్వం తరపున బర్మా వెళ్లి అ దేశాధినేతలతో మాట్లాడి సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణడానికి కృషిచేసారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో దారిద్ర్య నిర్మూలన కోసం పనిచేస్తున్న- ‘సెర్ప్’ పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్న బి. రాజశేఖర్ తొలుత ఈ ప్రభుత్వంలో విద్యశాఖ కార్యదర్శిగా ఇప్పటి ఆ శాఖ ప్రగతికి పునాదులు వేసిన అధికారి. దాన్ని ఇప్పుడు మరొక పని రాక్షసుడుగా పేరుపడ్డ ప్రవీణ్ ప్రకాష్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ హోదాలో చూస్తున్నారు. ఈ శాఖ కమీషనర్ సురేష్ కుమార్ కూడా ఇక్కడ నుంచి బయట వెళ్లి మళ్ళీ తిరిగివచ్చిన అధికారి.

అనితర సాధ్యంగా

ఈ ప్రభుత్వం మరొక ప్రాధాన్యత అంశంగా దృష్టి పెట్టిన వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం.టి. కృష్ణబాబు పనిచేస్తున్నారు. డా. వై.ఎస్. సిఎంగా ఉన్నప్పుడు, వైఎస్ వీరిని కలక్టర్ గా కడప తీసుకెళ్ళారు. వీరు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేస్తుండగా 2016-17 మధ్య అప్పటి సిఎం పిలిచి సిఆర్దిఎ కమీషనర్ గా పనిచేయమని అడిగితె, సున్నితంగా తిరస్కరించి వెనక్కి  వెళ్లారు. ‘కరోనా’ విపత్తు సమయంలో రవాణా శాఖ కార్యదర్శిగా ఉంటూ, ‘కమాండ్ కంట్రోల్ రూమ్’ బాధ్యతలు అనితర సాధ్యంగా నిర్వహించారు.

నటరాజ్ గుల్జార్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ గా పనిచేసారు. ఆర్ధిక వ్యవహారాలు వీరి ఆసక్తి అంశం. వాటిపై ప్రతిరోజూ కొన్ని విశేషాలు కూడా ఆయన తన ‘బ్లాగ్’ లో రాస్తారు. చాలా మందిలా వీరు ఎపికి వెనక్కి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ, మరికొన్ని ముఖ్యమైన పోస్టుల బాధ్యతలు అదనంగా చూస్తున్నారు.

సందర్భం వచ్చింది కనుక, పదేళ్ళ క్రితం ఏర్పడ్డ రాష్ట్రంలో ‘కరోనా’ కాలంలో కూడా ప్రభుత్వం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది అంటే, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఎవరు? వారికున్న ‘ఇంటిగ్రిటి’ ఎటువంటిది? అనే స్పృహ ముందుగా మనకు ఉండాలి. ఈ వ్యాసం ముగిస్తున్నప్పుడు, బిబిసి: “దక్షణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి?’ శీర్షికతో వ్యాసం వెలువరించింది. అందులో మనది నాలుగవ స్థానం, అని తేల్చింది. పదేళ్ళ రాష్ట్రం అన్నీ అమిరిన తెలంగాణ కంటే మిన్నగా ఉండడం ఎలా సాధ్యమయింది? తెలంగాణది మనకంటే వెనుక ఐదవ స్థానం.  

చివరిగా రాజకీయ నాయకుల మాట కాదనని అధికారులు కొందరు ఉంటె, ఉండొచ్చు. కానీ వారి వల్ల రాజకీయ నాయకులకు కూడా మంచి జరగదు. సరే, వారికెటూ మంచి పేరు ఉండదు. ఉంటె కొన్నిసార్లు ‘కేసులు’ కూడా ఉండొచ్చు.     

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత    

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles