వోలేటి దివాకర్
రాజమహేంద్రవరంలో గత ఐదేళ్లుగా బ్లేడ్ బ్యాచ్ అరాచకాలకు కారణం ఎవరు? భరత్ అయితే ఒకటి నొక్కండి…లేకపోతే రెండు నొక్కండి అంటూ గత రెండురోజులుగా ఐవిఆర్‌ఎస్ సర్వే జరుగుతోంది. ఈసర్వే ఎవరు..ఎందుకు చేయిస్తున్నారన్నది ప్రజలకు అంతుబట్టడం లేదు. కొద్ది రోజుల క్రితం గంజాయి కేసులో నగరానికి చెందిన ఒక యాంకర్, మరో యువకుడు హైదరాబాద్ లో పట్టుబడ్డారు. అంతకు ముందు మరో వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో టిడిపి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైసిపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్ మధ్య గంజాయి బ్యాచ్ నీ అనుచరులంటే..నీ అనుచరులంటూ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా టిడిపి అనుకూల పత్రికలో బ్లేడ్ బ్యాచ్‌పై పోలీసుల పనితీరును విమర్శిస్తూ ఒక కథనం వచ్చింది.
గంజాయి, మద్యం సేవించిన యువకులు బ్లేడ్లతో చీరేస్తామంటూ నిర్జన ప్రదేశాల్లో…రాత్రి వేళల్లో ఒంటరి వ్యక్తులను బెదిరించి, నగదు, విలువైన వస్తువులు అపహరించిన పలు కేసులు రాజమహేంద్రవరం, రూరల్ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. వీరి ఆగడాలకు ప్రజలు భీతిల్లిపోతున్నారన్నది వాస్తవం. ఈఎన్నికల్లో బ్లేడ్ బ్యాచ్ సమస్య కూడా ప్రధాన అంశంగా మారింది. ఈనేపథ్యంలో నగరంలో ఐవిఆర్ఎస్ సర్వే చేయించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సర్వే గురించి రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. దీంతో వైఎస్సార్‌సిపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్ గానీ, ఆయన ప్రత్యర్థి టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు గానీ ఈ సర్వే చేయిస్తుండవచ్చని భావిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్‌తో సంబంధం లేదని ఈ సర్వే ద్వారా నిరూపించుకునేందుకు ఒక నాయకుడు, ఆ నాయకుడే బ్లేడ్ బ్యాచ్ లీడరని ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రత్యర్థి నాయకుడు ఈ సర్వేలు చేయిస్తూ ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ సర్వేలో భరత్ పేరును మాత్రమే పేర్కొనడం ద్వారా ఆయనను ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ఆదిరెడ్డి వర్గీయులే ఈ సర్వే చేయిస్తున్నారన్న వాదనను కూడా వినిపిస్తోంది.
భరత్, ఆదిరెడ్డి వాసులకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. బ్లేడ్ బ్యాచ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మరో యువనేత పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు కూడా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముగ్గురి నాయకుల దూకుడు వ్యవహారశైలీ, వారి అనుచరుల తీరు వివాదాస్పదమేనని రాజమహేంద్రవరం వాసులు చెబుతున్నారు. యువకులైన ఈబ్లేడ్ బ్యాచ్‌లకు పరోక్షంగా రాజకీయ నేతలే అండాదండాగా నిలుస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సర్వే చేయిస్తున్న వారు ఆ వివరాలను బహిర్గతం చేసి, తమ చిత్తశుద్ధని చాటుకోవాలని, తద్వరా బ్లేడ్ బ్యాచ్ ల బెడదను నివారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో పోలీసులు పిడి యాక్టు కింద అరెస్టులు చేసి, బ్లేడ్ బ్యాచ్ పై ఉక్కుపాదం మోపారు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టడంతో పాటు, దీనివెనుక ఉన్న రాజకీయ నాయకుల ప్రమేయాన్ని కూడా బయటపెడితే అలాంటి అసాంఘిక శక్తులకు అండగా నిలిచేందుకు రాజకీయనేతలు కూడా వెనుకాడతారని ప్రజలు కోరుతున్నారు.