డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక
దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా ఘోరంగా జరుగుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు, హత్యలు మితిమీరి పోయాయి. మార్పు ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం, అసూయ, అజ్ఞానం, అవిద్య, అవివేకం మెండుగా ఉన్న వారు అధికారంలో ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం దొరకదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా, అనేక కారణాలతో తప్పించుకుంటున్నారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేశారు. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ చేసిన వారికి క్షమాభిక్ష ప్రకటించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెసిలర్ల పై లైంగిక వేధింపులకు గురిచేసిన వారిని అందలమెక్కించిన ఘనత మనది. 34 మంది కొరియన్లను లైంగికంగా వాడుకున్న బాలేష్ ధన్కర్ ఓవర్సీస్ బీజేపీ అధ్యక్షుడు. మహిళలు స్కర్టులు వేయడంతో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక పెద్దాయన అంటారు. సభ్యసమాజం గౌరవించేలా మహిళల వస్త్రధారణ ఉండాలని ఒకాయన అంటాడు. స్త్రీల పవిత్రతకు శీలాన్ని ముడిపెడుతూ సమాజం ఇచ్చిన ప్రాముఖ్యమే ఇటువంటి దాడులకు, భావజాలానికి కారణం. సాహిత్యంలో, సినిమాల్లో కూడా మహిళల పవిత్రతకు శీలంతో ముడిపెట్టారు. స్త్రీని అణచివేయాలంటే వారి లైంగికత, శరీర భాగాలపై దాడి చేయడమే వారికి సులభంగా దొరికే ఆయుధం. మహిళను ఒక లైంగిక వస్తువుగా, రంగు, అందంతో పోల్చి చూస్తారు. మహిళ అంటే అందం, పురుషుడు అంటే డబ్బు, అధికారానికి ప్రతిబింబంగా చూసినంత వరకు ఈ ధోరణి మారదు. కానీ ఈ ధోరణి మారాలి. ఒకవైపు స్త్రీ దేవత అనే సంస్కృతికి పరిరక్షకులం అని చెప్పుకుంటూ, మరో వైపు స్త్రీని అవమానించడం విరుద్ధ విలువలను ప్రతిబింబిస్తుంది. ఏడాది వయసున్న చిన్నారి నుంచి ముసలి అవ్వ కూడా అత్యాచారం నుంచి తప్పించుకోలేని పరిస్థితి. సినిమాలల్లో సీరియళ్లలో పెడధోరణలు ఎక్కువైపోయాయి. బూతు కంటెంట్ ఉన్న సినిమాలు కాసుల వర్షం కురిపించడం ఎలా ఉన్నా సమాజంపై ప్రభావం చూపుతున్నాయి.
Also read: విలువలు గాలికి వదిలి మత రాజకీయాలు ప్రోది చేస్తున్నారు
కుర్చీలు మడత పెడతారట
మన భాష మన వ్యవహారం చూస్తే కేవలం అనుకరణ తప్ప సంస్కారానికి విలువలకు ఎప్పుడో మడత పెట్టాము. చట్ట సభలు వ్యవస్థల్ని దిశా నిర్దేశనం చేస్తాయి, ప్రజా ప్రతినిధులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు నీలి చిత్రాలు తిలకించడం, గౌరవ ఎంపీ వివస్త్రుడై సంభాషిస్తున్న విషయాన్ని పదే పదే చూపించడం. కుర్చీలు మడతపెట్టమని ఒక పెద్దాయన మాట్లాడడం, నాల్గవ పెళ్లానిగా రా అని పిలవడం చూస్తుంటే విలువలు నశించిపోతున్నాయి. కారణమేదైనా మనిషి వావి వరసలు పరచిపోతున్నాడు. తప్పెవరిది అని ఒకర్ని ఒకరు నిందించుకోవడం కాకుండా, వ్యవస్థ మొత్తంగా ఆలోచించాలి. మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలను కనీసం ఖండించని నాయకులను ఏమనాలి ? చట్ట సభల్లోకి వెళ్తున్న వారి ఆలోచనలు మారాలి. ఒక మహిళ చెప్పే అభిప్రాయాన్ని ఖండించేందుకు ఆమె లైంగికత, లైంగిక సంబంధాలను చర్చలోకి తెస్తున్నారు. ఈ ధోరణి ఎప్పటి నుంచి మొదలయింది? దీని వల్ల మహిళలపై, వారి కుటుంబాలపై కలిగే మానసిక ప్రభావం ఎలా ఉంటుంది? ఒక మహిళ మాట్లాడే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టి, ఆమె కుటుంబ నేపథ్యం, లైంగికత, ఆఖరుకు మరణించిన కుటుంబ సభ్యుల గురించి కూడా ట్రోల్స్ ద్వారా అవమానపరిచి, బెదిరించి గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. గత నాలుగేళ్లుగా మరింత పెరిగింది. స్త్రీల పక్షాన మాట్లాడే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీకు కుటుంబాలు లేవు, సంసార స్త్రీలు కారు. కుటుంబాలు కూల్చుతారు. విలువలు లేవు అని అంటూ దూషిస్తున్నారు. ట్రోలర్స్ దృష్టిలో విలువలంటే దూషించడం, అవమానించడమా? టెక్ ఫాగ్ అనే యాప్ ద్వారా అధికారంలో ఉన్న పార్టీ కొంతమంది ప్రముఖులు, మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని ఇటీవల వైర్ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా పాలక పక్షానికి అనుకూలంగా లేని మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోందని, దీని ద్వారా వారిని అవమానపరిచి, వేధించడమే లక్ష్యమని వైర్ కథనం చెబుతోంది. ఈ దాడులను చాలా వరకు ధ్రువీకరణ కాని అకౌంట్ల ద్వారా చేస్తున్నట్లు తేల్చింది. ఇలా లక్ష్యం చేసుకోవాలనుకునే వ్యక్తుల మతం, లింగం, లైంగిక ఆసక్తులు, భాష, వయసు, రాజకీయ అనుబంధం. కొన్ని సార్లు ఆ వ్యక్తుల చర్మం రంగు, ఆఖరుకు వారి రొమ్ము పరిమాణాన్ని కూడా వారి డేటాబేస్ లో పొందుపరిచి అవసరమైనప్పుడు అన్ని విధాలా వేధింపులకు పాల్పడుతూ ఉంటారు. దాంతో, కొన్ని వేల అకౌంట్ల నుంచి వేధింపులకు గురయ్యేలా చేస్తారు.
Also read: అన్యాయమైన మార్గాలనివారణ బిల్లు నిలువరిస్తుందా?
చరిత్ర వక్రీకరణ
దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ నెహ్రూల పైనే, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పైన పుంఖాను పుంఖాలుగా చరిత్రను వక్రీకరించి వక్రభాష్యం చెబుతున్న వీడియోలు అనేకం. ఇలాంటి వీడియోలను పని పాట లేని ఇంకిత జ్ఞానం లేని సన్యాసులు ప్రతి రోజు పంపుతుంటారు. జనవరి 2021 నుంచి మే వరకు వైర్ నిర్వహించిన పరిశోధనలో మహిళా జర్నలిస్టులు చేసిన ట్వీట్లకు 4.6 మిలియన్ సమాధానాలు రాగా, అందులో 18% అంటే 8 లక్షలకు పైగా సమాధానాలు టెక్ ఫాగ్ నిర్వహిస్తున్న అకౌంట్ల నుంచి వస్తున్నట్లు తేలింది. అందులో 67% సమాధానాలు అవమానకరంగా, వేధింపులతో కూడుకుని ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ధోరణి, సమాజం సాధించిన అభ్యుదయాన్ని నాలుగు దశాబ్దాల వెనక్కి లాక్కుని వెళ్లినట్లు అనిపిస్తోంది. టెక్నాలజీ సాయంతో 30 ట్వీట్లను ఒక రోజులో లక్ష ట్వీట్లుగా మార్చే కొన్ని శక్తులు అభ్యుదయ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది కచ్చితంగా అధికారిక శక్తుల సహాయంతో జరుగుతున్న పని. నిజానికి సమాజం మారలేదు. ఇది కొన్ని వర్గాలు, టెక్నాలజీ ద్వారా వారి నమ్మకాలను సమాజంలో నాటేందుకు చేస్తున్న ప్రయత్నం. వేధింపులకు పాల్పడే వారి భాషకు, ఆలోచనలకు మూలం ఎక్కడ, ఏ ధర్మం మనిషిని, మహిళను అవమానపర్చమని చెబుతోంది. వేధింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న నాడే వీటిని అరికట్టడం సాధ్యం అవుతుంది. వేధింపులతో కూడిన పోస్టులు, ట్వీట్ల పై చర్య తీసుకునే విధంగా ఐటీ చట్టాలు కూడా రూపొందించాలి.
Also read: వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఎన్నో!