Saturday, November 23, 2024

కాపుల ఆవేదన…కమ్మవారి ఆందోళన!

వోలేటి దివాకర్‌

తెలుగుదేశం-జనసేన పొత్తు కారణంగా సీట్లు కోల్పోయి కమ్మవారు ఆందోళన చెందుతుండగా…కమ్మ వారి స్థానాల్లో సీట్లు ఖరారు కాక కాపులు ఆవేదన చెందుతున్నారు. అంటే ఇరుపార్టీల పొత్తుతో  రాష్ట్రంలోని ఈరెండు ప్రధాన వర్గాలు సంతృప్తిగా లేవన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సిపిని ఓడించాలంటే కాపు ఓట్ల, పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్  కోసం జనసేనతో పొత్తు అవసరమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే, ఈవిషయాన్ని ఆయన సామాజిక వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అధికారానికి అలవాటుపడిన వారు త్యాగాలకు సిద్ధంగా లేరు. బిజెపితో కూడా టిడిపి-జనసేన కూటమి పొత్తు కుదిరితే టిడిపి మరిన్ని సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టిడిపిలోని కమ్మ సామాజికవర్గ  నేతలు, కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని పాటిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు కాపుల ఓట్లు కూడా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. పరస్పరం పొత్తు ధర్మానికి తూట్లు పొడుచుకుంటే చంద్రబాబునాయుడు, పపన్‌ కల్యాణ్‌ల అంతిమ లక్ష్యం దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికార పార్టీకి కావాల్సింది కూడా అదే.

Also read: చైన్ లాగి  1097 మంది జైలు పాలయ్యారు!

గోరంట్ల ఆమాట ఎందుకు చెప్పలేకపోతున్నారు?

రాష్ట్రంలో జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అవసరమైతే రాజమహేంద్రవరం రూరల్‌ సీటును జనసేనకు త్యాగం చేస్తానని సిట్టింగ్‌ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పటికీ రూరల్‌ కేటాయింపు సీటు అధిష్టానం ఇష్టమే అంటున్నారు.  సాక్షాత్తు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించినా… రాజానగరం సీటుపై ఇంకా ఖరారు కాలేదని స్థానిక టిడిపి ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? ఈ రెండు సీట్లలో కాపు సామాజిక వర్గీయులే పోటీలో ఉండటం గమనార్హం. జనసేనతో పొత్తు పేరుతో  కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి సీట్లను కాపులు తన్నుకుపోతున్నారన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కమ్మ వారు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. పొత్తు పొత్తే..అధికారం మాదే అన్నట్లుంది వారి వైఖరి.

Also read: రానున్న ఎన్నికలపై ఉండవల్లి జోస్యం!

 టీడీపీ పత్రిక పితలాటకం

రాజానగరంలో జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ అప్పుడే ప్రచారం కూడా చేసుకుంటుండగా…మరోవైపు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ కూడా రూరల్‌ సీటు నాదే అని బహిరంగంగా, స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నారు. అంతర్గతంగా అందిన సంకేతాల మేరకు సీటు ఖరారైనట్లు భావిస్తున్న ఆయన రాజమహేంద్రవరం, రూరల్‌లోని ప్రముఖులు, కులపెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు. అయినా గోరంట్ల రూరల్‌ సీటుపై పట్టువీడటం లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో రూరల్‌ సీటును గోరంట్లకే ఖరారు చేసినట్లు వార్తలు రావడంతో జనసేన వర్గీయుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై కందుల దుర్గేష్‌ స్పందిస్తూ, రూరల్‌ సీటు తనదేనని ఘంటాపథంగా చెప్పారు. టిడిపి పత్రికలో వచ్చిన వార్తలను పట్టించుకోవద్దని జనసైనికులకు సూచిస్తున్నారు. సీటు విషయంలో కందుల దుర్గేష్ ఎంతవరకు విజయం సాధిస్తారన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. దుర్గేష్ కే సీటు దక్కకపోతే టిడిపి-జనసేన పొత్తు అంతర్గతంగా చిత్తయినట్టే.

Also read: కిక్కిరిసిన విలేఖర్ల సమావేశంలో…..

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles