(ఒక విస్మృత యోధుడి అమరగాథ)
చత్తీస్‌గఢ్ మొట్టమొదటి అమరవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆదివాసీల హక్కుల నేత వీర్ నారాయణ్ సింగ్ 1857 సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేత ఉరి తీయబడిన మహోన్నత వ్యక్తి. చాలా కాలంపాటు ఆయన్నొక దోపిడీ దొంగగా, నేరస్తుడిగా ప్రచారం చేశారు. ఎక్కడో బెంగాల్ లో పుట్టి చత్తీస్‌గఢ్ ప్రజలకి ఆరాధ్యుడై వారి కోసం ప్రాణాలొదిలిన కామ్రేడ్ శంకర్ గుహ నియోగి వీర్ నారాయణ్ సింగ్ వివరాల కోసంఆ విప్లవకారుడి మూలా ల్ని అన్వేషిస్తూ చేసిన ప్రయా ణం, ప్రజల నుండి సేకరించిన వివరాలతో 50 సంవత్సరాల క్రితం హిందీలో ప్రచురించిన చిన్న పుస్తకం ఇది!
పదేళ్ళ క్రితం నేను షహీద్ హాస్పిటల్‌కి వెళ్ళిన ప్పుడే తీసుకుని వచ్చాను. ఇప్పటికి కాని తీరలేదు. మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు ఎం. పి. టి. ఆచార్య చరిత్రలో అత్యంత అనామకంగా మిగిలిపోయిన అద్వితీయమైన వ్యక్తి. ప్రథమ ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు. దక్షిణాదిలోనే కాదు, యావత్ భారతదేశం లోనే ఆచార్య జీవితానికి సాటొచ్చే వ్యక్తులు అరుదు. ఆయన రచనలు తెలుగు చేయాలని ఎంతో కాలం నుండి ఏరి పెట్టు కున్నాను. దక్షిణాది విప్లవకారుల్ని విస్మరిస్తూ చులకన చేసే స్వభావం ఉత్తరాదికి ఉంది. ఎమ్మెన్ రాయ్ వంటి మేధావి కూడా ఆచార్య విషయంలో అక్రమంగానే వ్యవహ రించాడు !
అలాంటి ఆచార్య స్మృతిలో ఏనాటి నుండో నేను అనుకుం టున్న ప్రజాపక్ష చరిత్రకారుడు, అసాధారణ బుద్ధిజీవి దార్శ నికతకి చిహ్నంగా ‘కొశాంబి స్టడీ సర్కిల్’ తరపున తీసు కొచ్చిన ప్రచురణ ఇది. ఈ దేశ సామాజిక వ్యవస్థకి పోరాటం తో పాటూ నిర్మాణం కూడా అంతే అవసరమని గొంతెత్తి నినదించిన నియోగి మార్గం విశిష్టమైనదని అభిప్రాయం. చేయవలసినంత అధ్యయనం, జరగవలసినంత పరిశోధన ఆయన మీదా, ఆయన తాత్వికత మీదా జరగలేదనే భావనే నన్నీ పనికి ప్రేరేపించిన కారణాలు. ఎందుకనేది స్పష్టం;
“నియోగి ఒక నిరంతర జ్వాల,
నిజానికి అతడెప్పటికీ ఆరిపోడు.”
శంకర్ గుహ నియోగి 80 వ జయంతి సందర్భంగా వీర్ నారాయణ్ సింగ్ వీరత్వాన్ని, ఆచార్య అనితరసాధ్యమైన కృషినీ, డి.డి. కొశాంబి స్పూర్తి తో నలుగురు మహనీయుల స్మరణ ఈ 24 పుటల చిరు పొత్తం. చివర్లో శంకర్ గుహ నియోగి గురించి సామాజిక మాధ్యమాల్లో నేను రాసిన రెండు అనుబంధ వ్యాసాలు ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న మిత్రుల కోసం సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. అవకాశం ఉన్నవారు మా ప్రయత్నాలకు ఆర్థిక మద్దతుగా సహకరిస్తే సంతోషం. విమర్శ లకు ఆహ్వానం !)
– గౌరవ్