“ఆధునిక భారతదేశం, నాగరిక సమాజం మనుస్మృతి ఆధారంగానో, ఖురాన్ ఆధారంగానో నిర్మించ బడలేదు. భారతీయ సమాజ పురోగతి పౌరులందరి సమానత్వం మీద ఆధారపడి ఉంటుందనే విషయం హిందువులు, ముస్లిములు ఇరువురు అర్ధం చేసుకోవడం అవసరం” (పేజి – 7)
“నేను ప్రార్ధనలు, ఉపవాసాలు చేయను. మొహమ్మద్ వలనే తప్పా దేవుడి ద్వారా ఖురాన్ రూపుదాల్చిందని నేననుకోను. అంతిమ దినాల్ని, ఆఖరి తీర్పుల్ని నమ్మను. ఐనప్పటికీ నేను ముస్లింనే…అవిశ్వాసి అయ్యుండి కూడా నెహ్రూ ఏవిధంగా హిందువో అదే తర్కం ప్రకారం నేను కూడా ముస్లింనే.” (పేజి – 8)
“ప్రతి ఒక్కరికి వారి మతాన్ని ఎంచుకునే హక్కు ఉందనేది నా నమ్మకం. ఆ విధమైన ప్రజాస్వామిక స్వేచ్ఛ మా ఇంట్లో ఉంది. కాబట్టి, మేము సుఖశాంతులతో జీవిస్తున్నాం. కావా లంటే, ఈ విధానాన్ని మీరు మీ ఇంట్లో కూడా పాటించవచ్చు.” (పేజి – 9)
“వారిది మతతత్వ విధానమనే విషయం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికార ప్రతినిధులే చెబుతున్నారు. ఆ సంస్థలోని అనేకమంది నాయకుల ప్రసంగాలు, రచనల ద్వారా ఆ విషయం మీరు తెల్సుకోవచ్చు. అంతే కాదు, వాళ్ళ రాజకీయ విన్యాసాలని చూస్తే కూడా అది అర్ధమవుతుంది.” (పేజి 10)
“ఏ మతమూ కూడా సమానత్వాన్ని, ప్రజా స్వామ్యాన్ని చెప్పవు. ఇస్లాం కూడా దీనికి అతీతం కాదు. ఆధ్యాత్మికత ఆధారంగా మతాలు సమాజాన్ని నిర్మించడానికి చూస్తాయి. అవి మధ్యయుగాల నాటి భావాలు. ప్రజాస్వామ్య భావన, సమానతా సాధన, సౌహార్ద్రం ఆధునిక దృక్పథాలు. మతం అనేది సమాజం లో సాంస్కృతిక వికాసానికి పనికిరాదనే విషయం మనమంతా అర్ధం చేసుకోవాలి. (పేజి 11)
** ** ** **
హమీద్ దల్వాయ్, ఈ దేశంలో విస్మరించబడిన గొప్ప ఆలోచనాపరుడు. సంఘ సంస్కర్త. స్వాతంత్ర్య సమర యోధుడు. పౌరహక్కుల ఉద్యమకారుడు. హేతువాద నేత. భారతీయ లౌకికవాద సంఘ స్థాపకుడు. విలువలున్న పాత్రికేయుడు. దేశంలోనే ప్రముఖ ఫెమినిస్టు. అన్నిటి కంటే ముఖ్యంగా మహాత్మా ఫూలే ప్రభావంతో ‘ముస్లిం సత్యశోధక్ మండలి’ వ్తవస్థాపకుడు!
మహాత్మాగాంధీ, లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా మొదలగువారి కృషితో స్పూర్తిని పొంది, సోషలిస్ట్ సెక్యులర్ భావజాలంతో చివరిదాకా నిబద్దతగా పనిచేసి చిన్న వయసులోనే మరణించిన మానవతావాది హమీద్దల్వాయ్. ఉమ్మడి పౌరచట్టం కోసం ఉద్యమించిన తొలి వ్యక్తుల్లో హమీద్ ఒకరు. త్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన తొలి యోధుడు !
అలాంటి హమీద్ దల్వాయ్‌తో వివిధ ప్రాంతాల కు చెందిన పలు పత్రికా విలేఖరులు 50 ఏళ్ళ క్రితం జరిపిన అరుదైన ఇంటర్వ్యూ The Wire ప్రచురించింది. అంతర్జాలంలో ఉన్న ఇంటర్వ్యూ తెలుగు అనువాదమే చిన్న పొత్తం. భౌతికవాద తాత్విక సౌధంగా వెలుగొందుతున్న ఐదువేల ఏళ్ళ నాటి చార్వాక లోకాయతాల భావజాల వారసత్వ నిలయం ‘చార్వాకా శ్రమం’ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరగనున్న కార్యక్రమంలో ‘చార్వాక’ స్మృతిలో ఇది ఆవిష్కరణ కానుంది !
పాతికమంది జర్నలిస్టులు ఇబ్బంది పడేలా ప్రశ్నలు అడుగుతున్నా సూటిగా తడబాటు లేకుండా హమీద్ జవాబు చెప్పిన తీరు చదివి తీరాలి. “ఈ దేశంలో తీసుకో బడే రాజకీయ విధానపర ఏ నిర్ణయం కూడా లక్షలాది ప్రజల సాంఘికార్ధిక స్థితిగతులు సంక్షేమ ఆధారంగా ఉండాలే కానీ, ఏదోక మతమూ, ఆ మతస్తుల మనోభావాలు ఆధారంగా కాదు. ” ( పేజి – 6) అంటాడు హమీద్ !
ఈదేశ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భావన పట్ల ఒక బుద్ధిజీవికి ఉండాల్సిన తాత్వికతకి ఇంతకంటే తార్కాణం ఉండదు. కాలక్షేపం కోసం కాకుండా, ఆసక్తి, సీరియస్‌నెస్ ఉన్న మిత్రుల కోసం సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. సౌలభ్యం ఉన్నవారు మా ప్రయత్నాలకు ముందుకొచ్చి స్వచ్ఛందంగా మద్దతునిస్తే సంతోషం. విమర్శలకు ఆహ్వానం !
– గౌరవ్