హైదరాబాద్,ఫిబ్రవరి,1: సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రాసిన ‘మూడు దారులు’ పుస్తక పరిచయసభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ముచ్చటగా జరిగింది. సుప్రీంకోర్టు మాజీన్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూనే, వై.ఎస్.రాజశేఖరరెడ్డితో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. పాదయాత్ర ప్రభావం రాజశేఖరరెడ్డిపై ఎంతగా పడిందో గుర్తుచేసుకున్నారు. జనంలోకి వెళ్ళి, వారితో మమేకమై ప్రభావశీలమైన నాయకులుగా ఎన్టీఆర్ – రాజశేఖరరెడ్డి రాజకీయాలపై,ప్రజలపై ఎంతటి బలమైన ముద్రవేశారో బలంగా వివరించారు. ఈ పుస్తకంలో ప్రధానపాత్రలుగా నిలిచిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సంగతులను తెలియజేయడంలో రచయిత దేవులపల్లి అమర్ చాటుకున్న రాజీపడని వైఖరిని ఆయన ప్రముఖంగా ప్రశంసించారు. సమకాలీన రాజకీయాలలో ప్రబలుతున్న డబ్బు ప్రభావం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 2050నాటికి ప్రపంచంలో జరుగబోయే పరిణామాలను సోదాహరణంగా తెలిపారు. అమర్ తో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సీనియర్ జర్నలిస్ట్, పండితుడు కల్లూరి భాస్కరం విపులంగా, విస్తారంగా
పుస్తకపరిచయం చేశారు. పుస్తకం గురించి, అందులోని పాత్రల గురించి, రచయిత గురించి మాట్లాడుతూనే తను చూసినవి, చదివినవి, అనుభవించినవి
సమన్వయం చేస్తూ సమగ్రమైన శైలిలో ప్రసంగించిన తీరు పలువురిని ఆకట్టుకుంది, ఎందరినో అలోచింపచేసింది. ఎన్టీఆర్ కు సంబంధించిన వైస్రాయి హోటల్ సంఘటన చదువుతున్నప్పుడు యువకుని వలె తన రక్తం మరిగిందని, ఒక సినిమా తీయాల్సినంత సరుకు ఈ రచనలో వుందని అన్నారు. సత్యనిష్ఠ, నిర్భీతితో ఈ రచన సాగిందని రచయిత అమర్ ను అభినందించారు. అప్పటి మీడియా వైఖరిని గుర్తుచేశారు. మీడియా ప్రభావం, మారుతున్న వైఖరి, వ్యవహారశైలిపై పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. తెలుగు మీడియా గురించి మాట్లాడాలంటే 1983 ముందు – ఆ తర్వాతగా విభజించుకొని చూడాలని కల్లూరి వ్యాఖ్యానించారు.
ఉత్తరాదివారికి దక్షిణాది రాజకీయాలు, ప్రజానాయకుల ప్రభావం తెలియజేయడం ముఖ్యఉద్దేశ్యంగా ‘మూడు దారులు’ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో కూడా ‘ద డక్కన్ పవర్ ప్లే’ పేరుతో తీసుకొచ్చామని రచయిత దేవులపల్లి అమర్ తెలిపారు. పుస్తకంలో పొందుపరిచిన అంశాలు, పాత్రల తీరు, రచన కోసం పెట్టుకున్న నియమాలను వివరించారు.
పాత్రికేయ గురువు డాక్టర్ గోవిందరాజు చక్రధర్ సభాధ్యక్షత వహించిన ఈ సభకు సీనియర్ పాత్రికేయులు బుద్ధవరపు రామకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. జర్నలిస్టులు, మేధావులు, సాహిత్యవేత్తలు, జర్నలిస్ట్ సంఘాల నేతలతో సభాప్రాంగణం నిండిపోయింది. ఈ పుస్తకం ఇటీవలే విజయవాడలో ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.