ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవి, విమర్శకుడు, రచయిత. తెలంగాణ ఉద్యమాన్ని కోస్తా ప్రాంతం నుండి సమర్ధించి కవిత్వం వెలువరించిన నిష్పక్షపాత వ్యక్తిత్వం ఆయనది. “ఖబడ్దార్ హే నిజాం పాదుషా …. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు” అని గర్జించిన సాహసి. ఆయన జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతో గత 74 సంత్సరాలుగా సాహితీ సేవ చేసాడు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాత్ర
సోమసుందర్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో కాళ్ళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు 18 నవంబరు 1924 న అష్టమ సంతానంగా జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943లో పెద్దాపురం ఎమ్. ఆర్. కళాశాలలో చేరి, ఉన్నత విద్యనభ్యసించాడు. సోమసుందర్ క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని, 1942 లో విద్యార్థులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేశానని చెప్పేవారు.
మొదటి కవిత ఇంక్విలాబ్ జిందాబాద్
1944లో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) లో చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహిస్తూ తన మొట్టమొదటి అభ్యుదయ కవిత “ఇంక్విలాబ్ జిందాబాద్”ను ప్రకటించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి వంటి కవులు సాగిస్తున్న పోరాటానికి ఉత్తేజితుడై తెలంగాణా పోరాటానికి మద్దతుగా అనేక కవితలు వెలువరించాడు. యువతను ఉద్యమించమని పిలుపునిస్తూ ‘వజ్రాయుధం’ అనే కవితను వ్రాశాడు. ఆ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితలన్నింటినీ ఒక సంకలనంగా ’వజ్రాయుధం‘ పేరుతో విడుదల చేశారు.
కమ్యూనిస్టు భావజాలం
సోమసుందర్ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా 1954 వరకూ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించాడు. రాజకీయాలు, సాహిత్య వ్యాసంగం ఏకకాలంలో నిర్వహించటం సాధ్యం కాదని భావించి రాజకీయాలకు స్వస్తి పలికాడు. సోమసుందర్ నాలుగో ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, ఛందస్సు ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.1943 వరకూ కూడా భావకవిత్వం ఈయనకు తారసపడలేదు. తరువాత తనదైన వచనా శైలిని అలవరచుకున్నాడు. సోమసుందర్ కవిత్వంలో కమ్యూనిష్టు భావజాలం అంతర్లీనంగా జాలువారుతుంది. ఆయన కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపథ్యం.
సమాజ సంకుల సమర కోణం
‘వజ్రాయుధం’ నుండి ‘ఆమ్రపర్ణి’ వరకూ సుమారు ఆరున్నర దశాబ్దాల పాటు సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఈ కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు. ఆయన కవిత్వం రాయటం ఒక పూవు వికసించటం లాగా, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా ప్రకృతి సహజమైన పనిగా పెట్టుకున్నారా అనిపిస్తుంది.
కళాకేళితో సాహిత్య వ్యాసంగం
సోమసుందర్ 1969-73 ల మధ్య కాకినాడ కు మకాం మార్చి “కళాకేళి” అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఈ ప్రక్రియలో ఈయన కొంత ఆర్థికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఆరున్నర దశాబ్దాల సాహితీయాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధవంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా వన్నె కెక్కాడు.
సోమసుందర్ ఓలేటి శశాంకతో పాటు రామకృష్ణ, మల్లిక్, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి ఎందరో కవులను ప్రోత్సహించాడు. మహాకవి శ్రీశ్రీ వీరి కవిత్వానికి దాసుడనని చెప్పుకున్నాడు. అప్పటి సమాజం అత్యంత నీచంగా చూసే దివాన్ దాసీ కులంవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం
ఆయన 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి, రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2008 సంవత్సరానికి ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం పొందాడు. 1986లో అ.ర.సం. గుంటూరుశాఖ ప్రదానం చేసిన కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు. ఆవంత్స సోమసుందర్ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి.1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవుతుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1956 లో నీలం సంజీవరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధాన్నిఎత్తివేసింది. ఇది ఇప్పటికి అయిదు ముద్రణలు పొందింది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వారు దీనిని పాఠ్యపుస్తకంగా స్వీకరించారు. జీవితాంతం ప్రతిఏటా ఒకటో రెండో పుస్తకాలు రాస్తూనే ఉన్నాడు. సోమసుందర్ వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్
ఆయనకు అనేక మంది రాజకీయ నాయకులతో, అధికార పీఠాల్లో ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. సోమసుందర్ తన సమకాలీనులలో ఎవరికైనా అవార్డు వస్తే, వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో వ్రాసి ఆ అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం ఆయన కల్మష రహిత వ్యక్తిత్వానికి నిదర్శనం. సోమసుందర్ లిటరరీ ట్రస్టును ఏర్పరచి ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని అందజేస్తూ వస్తున్నారు. 2006 లో ట్రస్టు ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. అందులో రాష్ట్రం నలుమూలల నుంచీ అనేక మంది కవయిత్రులు పాల్గొన్నారు. 12 ఆగస్టు 2016 న కాకినాడలో మరణించారు.
(నవంబర్ 18 సోమసుందర్ జయంతి)