జాన్ సన్ చోరగుడి
ఆయన ఆ మాట అనకపోయినా… అది మన కంట పడకపోయినా ఈ వ్యాసం రాసే అవసరం ఉండకపోను. కానీ రెండూ జరిగాయి. ఏపీలో 2024 సంక్రాంతి నాటికే పత్రికల్లో వెల్లువెత్తుతున్న సార్వత్రిక ఎన్నికల వార్తల మధ్య అయన ఇచ్చిన పిలుపు, దాని చుట్టూ అనేక అంశాలు ఇమిడి ఉండడం. దాంతో, వీటి గురించి మాట్లాడ్డానికి ఇది సరైన సమయమని కూడా అనిపించడంతో చివరికి ఈ వ్యాసం రాయవలసి వచ్చింది.
‘Cong. will bag 130 seats in AP elections, says Chinta Mohan’ శీర్షికతో ‘ది హిందు’ ఆంగ్ల దినపత్రికలో జనవరి 14న వచ్చిన వార్త అది. అందులో- “కాపు కులం నుంచి ముఖ్యమంత్రి కావడానికి 2024 ఎన్నికలు కీలకమని, కనుక సినీ నటుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేయాలి” అని చింతా మోహన్ కోరారు. సందర్భం వచ్చింది కదా అని, ఆయన సీతారాం ఏచూరి కాకినాడ నుంచి, సిపిఐ నారాయణ నగరి నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని సూచించారు.
Also read: ‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?
చెప్పలేనివి…
ఈ మాజీ కేంద్ర సహాయ మంత్రి తిరుపతి పార్లమెంట్ (ఎస్సీ) నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈయన గతంలో కూడా ఇటువంటి ‘కాపు’ పిలుపును ఇచ్చారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ సిడబ్ల్యుసి కి ప్రత్యేక ఆహ్వానితుడు హోదాలో 2021 అక్టోబర్ 22న కాకినాడ నుంచి ఆ పని చేశారు. మరొక సారి ఏలూరు నుంచి కూడా ఆయన అదే పనిచేసారు.
ఈ ప్రకటన చేయడం కోసం అయన తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి అందుకు పనిమాలా గోదావరి జిల్లాలు ఎంచుకోవడం, అదికూడా ఎన్నికలు ముందు- కాబోయే కాంగ్రెస్ కాపు సీఎం ఇక్కడ ఎవరు? అనేది కూడా ఆయనే చెప్పడం, నిర్లక్ష్యం చేయాల్సిన అంశంలాగా కనిపించడం లేదు. ఇందుకు- పైకి చెప్పలేని కారణాలు ఏవో ఆయనకు ఉండి ఉండాలి.
ప్రకటనలు
మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ ప్రసిడెంట్ అయ్యాక, ఎపి నుంచి ఎస్సీ కాంగ్రెస్ నాయకుల్లో జె.డి. శీలం, కె. రాజు సీడబ్యుసీ సభ్యులు అయ్యారు. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి బాగులేని దృష్ట్యా కావొచ్చు, వారిద్దరూ ఇప్పటికైతే ఢిల్లీకే పరిమితమై ఉన్నారు. చింతా మోహన్ వంటి వారు ఇక్కడ ఉంటూ ‘కాపు’ సీఎం కావాలి అంటూ ప్రకటనలు ఇస్తున్నారు.
నిజానికి ఢిల్లీలో వున్న వారిద్దరి కంటే పార్టీలో చింతా మోహన్ సీనియర్, ‘ఫుల్ టైం పొలిటీషియన్’ కూడా. వాళ్లిద్దరూ మాజీ ఐఏఎస్ లు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ‘ఫుల్ టైం’ పని లేనప్పుడు ఒక ఎస్సీ ఎంపీగా చింతా మోహన్ రాష్ట్రంలో దళితుల సమస్యల మీద మరింత విస్తృతంగా పనిచేయవచ్చు.
Also read: ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…
లేదూ, ఇంకా- ‘దళిత్ పాలిటిక్స్’ ఏమిటి? అనుకుంటే, రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే కనుక, తెలంగాణాలో అధికారంలో ఉన్నదీ కాంగ్రెస్సే కనుక ఎటువంటి సదుద్దేశ్యంతో తమ పార్టీ ఆ రోజున అటువంటి నిర్ణయం తీసుకుంది, చెబుతూ తమ పార్టీకి ఇక్కడ సానుకూలత తెచ్చే ప్రయత్నం ఆయన మొదలు పెట్టవచ్చు.
తొందర పెట్టింది ఏమిటి?
లేదూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు అయిన చోట ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలనా సమస్యలు ఏమైనా ఉంటే, వాటి మీద పనిచేయవచ్చు. ఇవేవీ కాదని, గడచిన మూడేళ్ళుగా మోహన్- ‘కాపు సీఎం’ పనిమీద ఉన్నారు. చివరికి కొత్త సంవత్సరం మొదట్లో ఆయన తమ సీఎం క్యాండిడేట్ ఎవరో కూడా వెల్లడించారు! ఆయన్ని ఈ విషయంలో ఇలా తొందర పెట్టింది- కొత్త పిసిసి ప్రసిడెంట్ రాక వార్త కూడా అయితే కావొచ్చు!
Also read: ఈ ప్రభుత్వం ఆ పని పూర్తిచేసింది!
చింతా మోహన్ తనకు రాజీవ్ గాంధీ, కాన్షీ రామ్ లతో అనుబంధం ఉండేదని చెబుతారు. వాళ్ళు ఇప్పుడు లేరు కనుక, అది మనకు తెలియదు. నిజమే కావచ్చు కూడా. అయితే, కాన్షీ రామ్ 1993 నాటికే ఆంధ్రప్రదేశ్ లో బీఎస్పీ రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు,1994 ఎన్నికల తర్వాత ఇక్కడ- ‘దళిత సీఎం’ వస్తాడా? అన్నంతగా వాతావరణం వేడెక్కింది. కానీ చిత్రం ముప్పై ఏళ్ల తర్వాత చింతా మోహన్- ‘కాపు సీఎం’ అంటున్నారు.
కలనేత
“ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ కులాలు ఇక్కడ సీ.ఎం.లు గా ఉన్నారు కనుక, ఇకముందు ‘కాపు’ ముఖ్యమంత్రి కావాలి” అనే మాట నేరుగానే చింతా మోహన్ అంటున్నారు. చేగొండి హరిరామ జోగయ్య చేస్తున్న వాదననే ఈ ఎస్సీ మాజీ ఎంపీ చేయడం, అదే జోగయ్య ప్రాంతమైన పాలకొల్లు-నర్సాపురానికి చెందిన చిరంజీవిని తన- ‘సీఎం క్యాండేట్’ అంటూ చింతా మోహన్ ప్రతిపాదించడం, ఇందులో కలనేతగా కలిసి ఉన్న అంశాలు.
అయితే, కాంగ్రెస్ నుంచి ఈ మాట చింతా మోహన్ తప్ప ఇతరులు ఎవ్వరూ అనడం లేదు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన పల్లం రాజు వంటి సీనియర్లు కూడా ‘కులం’ ప్రాతిపదికగా ‘సీఎం’ అనే మాట అనడం లేదు. మరి ఒక్క ‘చింతా’కే ఏమిటి ఈ చింత? అనే సందేహానికి మనకు సమాధానం దొరకదు.
సాకల్యంగా తెలుసు
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకుల రాజకీయ వైఖరి ఇలా ఉండగా, విభజనకు ముందు నుంచి తెగని మాల-మాదిగల వర్గీకరణ పంచాయతీని గత నవంబర్ లో మంద కృష్ణ మాదిగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందు పెట్టాడు. ఇందిరా గాంధీ జమానాలో అయినా, ఇరవై ఏళ్ల తర్వాత ఆమె పేరు చెప్పి ఓటర్లను కలిసిన ‘వైఎస్’ కయినా, తెలుగునాట ఆ పార్టీకి శాశ్విత ‘ఓటు బ్యాంకు’ షెడ్యూలు కులాలు.
అటువంటప్పుడు, మరో మూడు నెలల్లో- తెలంగాణాలో పార్లమెంట్, ఏపీలో అసెంబ్లీ-పార్లమెంట్ రెండింటికీ ఎన్నికలు జరుగుతుంటే, అధికారంలోకి రావాలి అనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ కృష్ణ మాదిగ సమస్యను నరేంద్ర మోడీకి వదిలిపెడుతుందా? లేక తానే దాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటుందా? అనేది చూడాలి.
Also read: ‘నంది’తో… కళారంగంలో విభజన ప్రతిఫలనాలు మొదలు
ఎందుకంటే, సోనియా – రాహుల్ గాంధీలకు ఎస్సీ వర్గీకరణ వంటి అంశం గురించి కానీ, అది ఎక్కడ ఎలా ఆగింది? వంటి వివరాలు తెలియకపోవచ్చు. అయితే, ప్రస్తుత ఎఐసిసి ప్రసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేకి సమస్య స్వభావం సాకల్యంగా తెలుసు.
సులభం కావొచ్చు
మాజీ ఎస్సీ ఎంపి చింతా మోహన్ సామాజిక అవగాహన ఇలా ఉంటే, రెండవ తెలుగు రాష్ట్రంలో కూడా క్రియాశీలం కావాలని అనుకొంటున్న కాంగ్రెస్, వైఎస్ షర్మిలను పిలిచి మరీ పిసిసి ప్రసిడెంట్ చేసింది. చిత్రం, అదే వారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 400 కోట్ల వ్యయంతో దేశంలోనే పెద్దదైన అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నది.
జగన్ తొలి ‘టర్మ్’ పూర్తి అవుతున్నప్పుడు, బెజవాడలో బందరు రోడ్డు మీద స్వరాజ్య మైదానంలో జరిగిన ఈ నిర్మాణం, అదే రోడ్డు మీద బెంజి కంపెనీ వద్ద జరుగుతున్న మరొక ప్రతిష్టాత్మక భవన వినిర్మాణం లేదా కూల్చివేతను; ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒకే సమయంలో రెండింటినీ కలిపి చూడవలసి వస్తున్నది. అయితే, ఇప్పటికి ఐదేళ్ల క్రితం కరకట్ట మీది ‘ప్రజా వేదిక’ కూల్చివేతను గుర్తుచేసుకుంటే, జరుగుతున్నది అర్ధం చేసుకోవడం మరికొంత సులభం కావొచ్చు.
Also read: ఏదో తేడా ఉన్నట్టుగా అనిపించడం లేదూ…?!