Wednesday, November 27, 2024

అవును! గదబ సాగు రైతులే   గెలిచారు

ఒక ఏడాది అవిశ్రాంతప్రయత్నంతో ఆ భూమిలో గదబ ఆదివాసీలే సాగు అనుభవంలో వున్నారని, ఆ భూమిలో వారు పెంచిన జీడి మామిడి తోటలు, మెట్టు వ్యవసాయాలు వున్నాయని, అదే భూమిలో వారికే చెందిన  ఇళ్ళు, గుడి, చర్చి వున్నాయనీ నిర్దారిస్తూ అధికారులు ఇచ్చిన నివేదిక, పటం ( map) తేది: 09-01-2024న ఆదివాసీల చేతికి  అందింది. వారు 5 దశాబ్దాలుగా ఆ భూమిలో సాగు అనుభవంలో వున్నారు. 2022 మార్చి నుండి చేస్తువస్తున్న పోరాటాల ఫలితంగా మాత్రమె అది లభించింది.  ఇప్పుడు ఊహించండి మన వ్యవస్తల పని తీరు ఎలా వుందో.

మీరు వినబోతున్న, చవవబోతున్న ఈ కధ, అనకాపల్లి  ( ఆ నాటికి విశాఖపట్టణం) జిల్లా, పాతమల్లం పేట గ్రామoలోని సర్వే నెంబర్ 850-1 కి చెందిన  40 ఎకరాల మెట్టు భూమిని ఐదు ( 5)  దశాబ్దాలుగా సాగు చేస్తున్న 37 కుటుంబాల కధ. వారు ఈ దేశపు మూలవాసులు, ఆదివాసీలు. ప్రభుత్వం ఆదిమ  తెగ  ( PVTG)గా  గుర్తించిన “గదబ” ఆదివాసీలు వారు.

వెనక్కి వెడితే…

2022 మార్చి 11 వ తేది రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకూ, 5 గంటలు, గొలుగొండ పోలీస్ స్టేషన్ లో గదబపాలెం ఆదివాసీ సాగు రైతులను, స్త్రీలు, బాలలు, వృద్ధులతో సహా అప్పటి SI నిర్బంధించాడు. ఆయన చెపుతున్నది ఒకటే మాట , “మీకు భూమిపై ఎలాంటి హక్కులు లేవు. ఏ రికార్డు లేదు.  అమెరికా  NRIలకు అన్ని హక్కులు వున్నాయి. వాళ్ళు నర్సీపట్టణoలోని ఫలాన ఆసామికి (బ్రోకర్)కు ఆ భూమిని అమ్మేశారు. ఆ బ్రోకర్  మహాశయుడు ( నికలాయ్  గోగోల్  మృతు జీవులు నవల లోని   ‘ చిచికొవ్’, గురజాడ కన్యాశుల్కం నాటకంలోని ‘గిరీశం’ అంతటి) దొడ్డ మనిషి. ఎంతోకొంత నగదు ఇస్తాడు భూమి వదిలేసి పొండి !” ఇది సదరు SI గారి  ‘కౌన్సిలింగ్’. గ్రామ పరిపాలన అధికారి (VRO)  నుండి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్  (RDO) వరకూ ఇంచుమించుగా ఇదే పాట.

ఆ నాటికి  విశాఖపట్టణం జిల్లాలో  కొయ్యూరు మండలం ( నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా) – నేటి అనకాపల్లి జిల్లా వున్న గొలుగొండ రెండు పక్కపక్క మండలాలు. గదబపాలెం గ్రామం కొయ్యూరు మండలంలోను,  వారు సాగు చేస్తున్న భూమి రోడ్డుకు ఆవలి వైపున పాతమల్లం పేట, గొలుగొండ మండలంలో వున్నాయి.

40 ఎకరాల భూమిలో ఆదివాసీలు పెంచిన జీడి మామిడి తోటలున్నాయి. కొంత భూమిలో మెట్టు ( dry) వ్యవసాయం, ఒక ఎకరా భూమిలో గుడి, చర్చి,  ఇల్లు వున్నాయి. ఇవన్ని ఆదివాసీల స్థిరమైన సాగు ( Settled cultivation)  అనుభవానికి సాక్ష్యాలు.

ఈ ప్రాంతం 1921-24 మధ్య అల్లూరి సీతరామరాజు ఉద్యమ ప్రభావంలో,  1982-1995 మధ్య పీపుల్స్ వార్ ప్రభావ ప్రాతoగా  వుంది. ఈ రెండిటికి మధ్య కమ్యూనిస్ట్ పార్టి  (CPI) మేక సూరిబాబు నాయకత్వ ప్రభావ ప్రాంతంగా కూడా వుంది (26-11-1987న ఆయనను పీపుల్స్ వార్ చంపివేసింది. వార్ దృష్టిలో ఆయన ఒక ‘రివిజనిస్టు, విప్లవద్రోహి’ కాని స్తానిక ఆదివాసీలకు ఒక ఆపద్బాంధవుడు). 1995 తరువాత పీపుల్స్ వార్ కూడా ఖాళి చేసి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయింది. ఆదివాసీలకు ఏ దిక్కు లేకుండా పోయింది. గిరిజనేతర భూమాఫియాకు ఆడింది ఆట పాడింది పాట.

ఉరుము లేకుండా పిడుగు

2022 మార్చి మొదటి వారం నుండి నర్సీపట్టణం నుండి కొందరు కార్లలో రావడం భూములు చూడటం, తాము భూమిని కోనేశామని ఆదివాసీలను బెదిరించడం మొదలయ్యింది. అదే గ్రామంలో కొందరిని వారు ఏజెంట్స్ గా పెట్టుకున్నారు. మార్చి 11ను భూ బ్రోకర్లకు ఏజెంట్ గా మారిన అప్పటి గొలుగొండ  SI ఆదివాసీలను నిర్బందించాడు.

ఇక్కడే పాఠక మహాశయులకు ఒకటి రెండు న్యాయపరమైన విషయాలు చెప్పక తప్పదు. అప్పుడు మాత్రమే ఆదివాసీలకు జరిగిన అన్యాయం ఏమిటో, రెవిన్యూ శాఖ చేసిన దుర్మార్గం ఏమిటో తెలిసోస్తుంది.

ఒక వ్యవసాయక సంవత్సరాన్ని రెవిన్యూ పరిభాషలో  “ఫసలి” అంటారు. అది జులై 1 న మొదలై జూన్ 31కి ముగుస్తుంది. ఇప్పుడు 2023 జులై 1 న మొదలై 2024 జూన్ 31కి ముగియనున్నది 1433వ  ఫసలి. ఒక ఫసలిలో ఏ భూమిని ఎవరు సాగు చేశారో అడంగల్ / పహణిలో నమోదు చేయాలి. దీనినే సాగుబడి నమోదు అంటారు. ఇది రెవిన్యూ శాఖ విధి నిర్వహణలో ఒక ముఖ్యమైన పని.

12 సంవత్సరాలుగా , నిరాటంకంగా సాగు అనుభవంలో వుంటే భూమి మీద పట్టా ( టైటిల్) హక్కును సివిల్ కోర్టులో  క్లయిం చేయడానికి అనుభవదారుకు ఒక అవకాశం వుంది. గదబపాలెం ఆదివాసీలు 12 కాదు, 12 + 12 ఇరవై నాలుగు. 24+24 నలబై ఎనిమిది సంవత్సరాలకు పైగా సాగు అనుభవంలో వున్నారు. కాని వారి సాగు అనుభవాన్ని రెవిన్యూ అధికారులు సాగుబడిలో  నమోదు చేయలేదు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేయడమే తప్ప ఆదివాసీలకు సాగుబడి రాయించుకోవాలని తెలీదు. అటు కమ్యూనిస్టు పార్టి (CPI) గాని ఇటు పీపుల్స్ వార్ (PWG) గాని ఆదివాసీలకు ఈ విద్యలు నేర్పలేదు. ముందు, అసలు వారికి తెలుసా అన్నది నా అనుమానం.

పై విషయాలను ఇప్పుడు కలిపి చూడండి. 50 ఏళ్ల వరుసగా ( రెవిన్యూ శాఖ తన పనితాను చేసి)ఆదివాసీల సాగు నమోదై వుంటే వారు ఎవరికీ భయపడవలసిన పని లేదు. మీకు రికార్డు లేదు అని SI బెదిరిస్తే ఇదిగో మేము సాగు చేస్తున్నాం అని చూపడానికి  వారి చేతిలో రికార్డు వుండేది. అంటే, వారు భుమికి  సాగులో వున్నది నిజం. కాని ఆ నిజం రికార్డులో లేదు. మన కోర్టులు, వ్యవస్థలు చూసేది రికార్డునే గాని  వాస్తవాలు కాదు. మనిషి ఎదురుగా వుంటే  చాలదు. బతికి వున్నట్లు ద్రువపత్రo కావాలి.

17-03-2022 తేది ప్రాముఖ్యత

మొత్తo కధలో ఈ తేది చాల కీలకం. ఈ తేదికి కొద్ది రోజులు ముందు ఈ ఆదివాసీ ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. వారు చెప్పిన సంగతులు ఇలా వున్నాయి.

A.           వక్కలంక సుధాకర్ అనే ఆయన అమెరికాలో స్తిరపడిన భారతీయ NRI. మార్చి 3న నర్సీపట్టణంకు చెందిన భూమి బ్రోకర్స్ తో కలసి, మందిమార్బలంతో గదబపాలెం వచ్చాడు. ఈ భూమి తమ బంధువులదని, వారు అతనికి  జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ( GPA- General power of Attorney – తమ తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి ఇచ్చిన అనుమతి పత్రం)  ఇచ్చారని, దాని ప్రకారం అతను  నర్సీపట్టణంకు చెందిన ఒక బ్రోకర్ కు క్రియ పురోణి (Sale agreement) రాసి ఇచ్చేశాననీ అన్నాడు.

B.           క్రియపురోణి రాయిoచుకున్నావాడు, ఇప్పుడు రంగంలో కి వచ్చాడు.  ఆదివాసీలకు ఎలాంటి రికార్డు లేదని, ఇప్పుడు రికార్డు తనకే వుంది గనుక తాను ఇచ్చే  నగదు తీసుకొని భూమి వదిలేయాలని బెదిరిస్తున్నాడు.

గదబపాలెం ఆదివాసీలు ప్రతిపనికి నర్సీపట్టణంకు రావాలి. తాను  చెప్పినట్లు వినకపోతే “పరిణామాలు తీవ్రంగా వుంటాయి” అని హెచ్చరికలు పంపిస్తున్నాడు. ఇవి  ఆదివాసీలు మాకు  చెప్పిన సంగతులు.

ఇప్పుడు ఈ భూమి బ్రోకర్, రెవిన్యూ అధికారు ఏం చేస్తారు ? వక్కలంక సుధాకర్ లేండ్ బ్రోకర్ కి రాసింది ఒక పురోణ ( sale agreement) మాత్రమె. అమ్మకపు రిజిస్ట్రేషన్ జరగాలంటే  ముందు యజమానుల పేర్లు  పట్టాదార్లుగా  పాతమల్లం పేట గ్రామ భూమి రికార్డులో నమోదు కావాలి. అలా జరగాలoటే రికార్డు ఆఫ్ రైట్స్ ( ROR) నియమాల ద్వారానే అది సాధ్యం అవుతుంది. 

భూమి సాగు అనుభంలో ఆదివాసీలు వుండగా GPA రాసిన వారు లేదా వక్కలంక సుధాకర్  పేరున రికార్డు మార్చకూడదు. కాని రెవిన్యూ అధికారు బ్రోకర్లకు సహకరిస్తే అదిపెద్ద కష్టం ఏమికాదు. ఎలా అంటే, ఆదివాసీలు సాగులో వున్నరనే విషయం బయటకు రానియ్యకుండ చూసి ఆపని చేసేయవచ్చు. 

తేది: 17-03-2022న ఆదివాసీలకు ఒక వినతిపత్రం ఇచ్చి తాశీల్దార్ వద్దకు పంపాను. దాని సారాంశం ఏమిటంటే,

A.           పాతమల్లం పేట సర్వే నెంబర్ 850లో తాము సాగులో వున్నామని తెలియజేయడం

B.           ROR రికార్డులో ఎలాంటి మార్పు చేయాలన్నా ముందుగా ( సహజ న్యాయ సూత్రాలు మరియు ROR నియమాలు ప్రకారం)  తమకు నోటీసు ఇవ్వాలని తెలియజేయడం.

వారికి మేము ఆదివాసీలకు  చెప్పింది ఏమిటంటే, తాశీల్దార్ కు మీరు ధఖాస్తూ ఇచ్చినప్పుడు అది ఇచ్చినట్లుగా రసీదు తీసుకోవాలని, రసీదు ఇచ్చేంత వరకు కార్యాలయం వదల వద్దని చెప్పాము.

సాధారణంగా ఏo జరుగుతుందoటే,  పేదవాళ్ళు పిటిషన్ ఇచ్చినప్పుడు దానికి ఎలాంటి రసీదు అధికారులు  ఇవ్వరు. వినతిపత్రం ఇచ్చినట్లు బాధితుల వద్ద  ఎలాంటి సాక్ష్యం లేకుండా చేయడమే వారి ఉద్దేశం. గదబపాలెం ఆదివాసీలు మొదటి పరీక్షలో నెగ్గారు. వారు 17-01-2022న  రసీదు పొందారు. అంటే, ఆ రోజునాడు తాశీల్దార్ కు  ఆదివాసీల వాదన అందింది. అందుకే మొత్తం కధలో ఈ తేది చాల ముఖ్యం. ఇది ముందర కాళ్ళకు బంధం వేయుడం లాంటిది.

ఎవరిీ NRIలు ఏమా కధ?

కధలో ముందుకు వెళ్ళే ముందు అసలు ఈ NRI లు ఎవరు ? ఎలా వచ్చారో చూద్దాం. దుగ్గిరాల సీత రామమూర్తి, సత్యవతి భార్య భార్తలట. వారిది పశ్చిమ గోదావరి జిల్లా. 1974-75 మద్య వీరు కొందరు వ్యక్తుల నుండి రిజస్టర్ క్రియచీటీల ద్వారా పాతమల్లం పేట గ్రామంలో 75 ఎకరాల వరకు భూమిని  కొనుగోలు చేశారు. నేటి తరం  ఆదివాసీలకు వారెవరో  తెలియదు. ఇంకా మిగిలి వున్న వృద్దులు గుర్తుపట్టారు. సాగులో ఆదివాసీలు వున్న విషం చూసుకోకుండా తక్కువ ధరకు  భూమి వస్తుందని కొనేశారు. సాగులోకి రాలేకపోయారు. వారు వారి  పిల్లలు అమెరికా వెళ్లిపోయి అక్కడ స్థిరబడి  అమెరికన్ పౌరసత్వం తీసుకున్నారు. మార్చి 3న తనకు GPA వుందని వచ్చిన వక్కలంక సుధాకర్ మరెవరో కాదు దుగ్గిరాల సీతారామమూర్తి, సత్యవతిల అల్లుడు. GPA లో నలుగురు సంతకాలు వున్నాయి. దాని ప్రకారం వారి వయస్సులు 61 నుండి 74 మధ్యలో వున్నాయి. అంటే  అమెరికాలో తమ సంతానానికి తాతలు, మామ్మలు అయ్యారన్న మాట. GPA  పై సంతకాలు చేసిన నలుగురిలో ఒకరు మహిళ  ( సీతా రాంమూర్తి కొడుకు భార్య) ఆమె వైద్యురాలు. నా అమెరికన్ మిత్రుల సహకారంతో ఆమె ఫేస్ బుక్ ( Facebook) పేజి చూశాము. అందులో తన గుణగణాలలో మొదటిది “ఎంపతి” ( empathy – దయాళువు) అని రాసుకున్నారు. ఆమె సంతకం పెట్టిన  GPA వలన ఆదివాసీల కలుగుతున బాధల గూర్చి చెపుతూ, కనికరం చూపమని “ మెసేజ్” పెట్టాం. ఆమెకు  తన పేషెంట్స్ పైనే గాని ఈ నోరులేని భారతీయ ఆదివాసీలపై ఎలాంటి “ఎంపతి” ( empathy) లేదని అర్ధం అయ్యింది.ఈ NRIలు అక్కడ డాలర్లు సంపాదిస్తున్నా  ఇక్కడి రూపాయిల మీద మమకారం పోలేదు.

GPA (GPA- General power of Attorney)

వక్కలంక సుధాకర్ తనకు వుందని చెపుతున్న GPAని సంపాదించి పరిశీలన చేశాం. దీనినలో  4 గురి సంతకాలు వున్నాయి.  తేది: 2-10-2019న వక్కలంక సుధాకర్ కు రాసినట్లుగా వుంది. Zenaida Santiago Notary public – State of New York అనే అమెరికన్ నోటరి సంతకం కూడా వుంది.  ఈ సుధాకర్ తో సహా అందరికి అమెరికన్ పాస్ పోర్టులు వున్నాయoటే వీరందరూ అమెరికన్ పౌరసత్వం తీసుకున్నరని అర్ధం.

I for farmers: (https://www.i4farmers.org)

అమెరికాలో ఉద్యగాలు చేస్తున్న కొందరు యువకులు మన దేశంలో  ఆత్మహత్యలు చేసుకున్న రైతులను  తమకు చేతనైన విధంగా ఆదుకోవడానికి, సేంద్రియ్య వ్యవసాయాన్ని ప్రోత్స హించడానికి I for farmers అనే ఒక గ్రూప్ గా ఏర్పడి  పని చేస్తున్నారు. దాని వ్యవస్థాపక సభ్యుడు సురేష్ ఈడిగను సంప్రదించాం. GPAలో సంతకం వున్న ఒకరిని సురేష్ వెతికి పట్టుకున్నారు. ఆయనను కలుసుకోవడానికి సురేష్ 250 కిలో మీటర్లు (ఒకవైపు) ప్రయాణం చేశాారు. ఆదివాసీల  పరిస్తితులను విరించారు. కాని ఆయన పెద్దగా ఆశక్తి చూపలేదు. అంటే ఆదివాసీల గోడు వినడానికి సిద్ధంగా లేరని అర్ధం.

GPA పై సంతకాలు పెట్టిన వారు చాల కాలం కిందటే అమెరికా వెళ్లిపోయి,  అక్కడే  స్థిరపడి అమెరికా పౌరులుగా మారిపోయారు. అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, పాతమల్లం పేట గ్రామం, సర్వే నెంబర్ 850-1లో వారి తల్లిదండ్రుల పేరున  కొనుగోలు చేసినట్లు వున్న పత్రాలు వారి వద్ద వున్నాయి. ఆనాటి నుండి నేటి వరకూ  ఆ భూమికి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క రూపాయి శిస్తు చెల్లించలేదు.  అసలు ఆ భూమి రూపు రేఖలు కూడా వారికి  తెలీదు. వారి వద్ద ఆ పాత పత్రాలు మాత్రేమే వున్నాయి. డాలర్ vs రూపాయి మారకం రేటు ప్రకారం చూసినా, భుమి అమ్మితే వచ్చే ఆదాయంపై  అమెరికన్ ప్రభుత్వానికి కట్ట వలసిన్ పన్ను ( tax) లెక్కల ప్రకారం చూసినా,  ఏ విధంగా చూసినా  ఈ భూమి అమ్మడం వలన వచ్చే ఆదాయం వారికి పెద్దగ  లెక్కలోది కాదు. కాని 37 ఆదివాసీ కుటుంబాలకు మాత్రం  అది “లైఫ్ లైన్”. అయినా ఆ డబ్బు వదులుకోవడానికి ఈ NRIలు సిద్దంగా లేరని అర్ధం అవుతుంది.

క్రియ పురుణి ( Sale agreement) లో ఏమి రాసారు?

వక్కలంక సుధాకర్ ( NRI – GPA హోల్డర్)కు,  నర్సీపట్టణంకు లేండ్ బ్రోకర్ కు మధ్య రాసుకున్న క్రియ పురోణి ( Sale agreement) కూడా పట్టుకున్నాం ( Thanks to RTI). అందులో 37 ఎకరాల  భూమికి గాను,  2 కోట్ల 70 లక్షలు ఖరీదుకు  ఒప్పందం కుదుర్చుకొని, ఎడ్వాన్స్ గా  15 లక్షలు AXIS BANK  చెక్కు ద్వారాను,  75 లక్షలు నగదు రూపంలో ఇచ్చి నట్లు / తీసుకున్నట్లు రాసుకున్నారు. నిజానికి NRIలు ఈ ఆదాయాన్ని అమెరికన్ టెక్స్ ( tax) అధికారులకు చెప్పారో లేదో మనకు తెలియదు. భూమికి హద్దులు రాశారు గాని అవన్నీ తప్పు.

సుధాకరే సాగుదారు

ఈ పురోణి ( Sale agreement)లో ఒక తమాషా వుంది. అమెరికాకు చెందిన GPA హోల్దరే భూమి సాగు చేస్తూ అనుభవంలో వున్నాడట (  భారత దేశంలో  తాను  చేస్తున్న వ్యవసాయం వలన వస్తున్న ఆదాయానికి ఆయన అమెరికాలో పన్ను ( tax) చెల్లిస్తున్నడా? ) అలా సాగులో వున్న సుధాకర్ Sale agreement సమయంలోనే,  అనగా అగ్రిమెంట్ రాసిన తేది: 13-08-2021న తన స్వాధీనంలో వున్న భూమిని లేండ్ బ్రోకర్ కు అప్పగించేశాడట. అది సంగతి. ఇలా రాయడం చట్ట విరుద్దం. అది 2015లో సవరించిన SC, ST అత్యాచాల నిరోధక చట్టo ప్రకారం నేరం కూడా.

అధికారుల నివేదికలు

తాశీల్దార్ ( MRO) – RDOకు, RDO – కలెక్టర్ కు, తాశీల్దార్ –  అసిస్టెంట్ డైరెక్టర్  (AD) ఆఫ్ సర్వేకి, మండల సర్వేయర్ ( MS)- అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేకి రాసిన నివేదికలు చూస్తే   ( వీటిని సమాచారం హక్కు చట్టం ద్వారా సాధించాం) మనకు కుట్రకోణం అర్ధమవుతుంది. చట్టబద్దమైన పాలన అందిచవలనసిన అధికార వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో తెలుస్తుంది. ముందుగా GPA విచారణ చేయాలి. కాని అధికారులు పూర్తిగా వారి కొమ్ముకాశారు.

అసలు భూమి ఎక్కడ వున్నది సుధాకర్ కి, ఆ  బ్రోకర్ కి తెలీదు. అది తెలుసుకోవాలంటే సర్వే జరపాలి. సర్వే జరపాలoటే, AP సర్వే & సరిహద్దుల చట్టం, 1924 అనుసరించి సరిహద్దు రైతులకు నోటీసులు ఇవ్వాలి. అసలు భూమి ఎక్కడ వుoదో తెలియని వారికీ  హద్దు రైతులెవరో  ఎలా తెలుస్తారు? అంతేకాదు సాగులో వున్న భూమికి కొలతలు వేస్తె ఆదివాసీలు అభ్యంతరం చెపుతారు? మరి! ఎలా ??.

తాశీల్దార్, RDOలు ఒక పధకం  వేసారు. అక్కడ “ లా & ఆర్డర్” ( law and Order) సమస్య వుందని కనుక సర్వే చేయాలంటే పోలీసుల సహాయం కావాలని తాశీల్దార్ 29-03-2022న RDOకు, RDO- కలెక్టర్ కు నివేదికలు పంపారు. వక్కలంక సుధాకర్ మరియు లేండ్ బ్రోకర్ల ముఠా,  రాజకీయ సిఫార్సులతో కలెక్టర్ని కూడా  కలిసినట్లు వున్నారు.

తేది: 10-06-2022న మండల సర్వేయర్ తో ఒక రిపోర్ట్ రాయించారు. అందులో 8 మంది రైతులు 23 ఎకరాల భూమి వక్కలంక సుధాకరుదేనని చెప్పారని సర్వేయర్ నివేదికలో  రాశాడు. కాని ఆ 8 మంది  పేర్లు రాయలేదు.

గ్రామ పరిపాలన అధికారి (VRO), రెవిన్యూ ఇన్స్ ఫెక్టర్ ( RI), మండల సర్వేయర్ ( MS), తాశీల్దార్ ( MRO), రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ( RDO) ఇందులో ఏ ఒక్కరు ఆదివాసీలే సాగులో వున్నారని తమ రిపోర్టులలో  చెప్పలేదు. తాశీల్దార్ అయితే ఆదివాసీలు తనకు 17-03-2022న వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

తన రిపోర్టుకు అనుబంధంగా మండల సర్వేయర్ ఒక దొంగ పటం ( map) కూడా తయారు చేశాడు. ఈ అధికారులoదరూ  NRIలు, లేండ్ బ్రోకర్స్ పెట్టిన “గడ్డి” తిన్నారు.

కమీషనర్ కు ఫిర్యాదు

మండల సర్వేయర్ ఇచ్చిన దొంగ సర్వే రిపోర్టు పై విచారణ జరపని కోరుతూ ఆదివాసీలు కమీషనర్, సరే & భూమి రికార్డుల అధికారికి 18-08-2022న  ఫిర్యాదు చేసారు. ఎలాంటి విచారణ జగలేదు. నేటికి ఆయన అదే మండలంలో చక్రం తిప్పుతున్నాడు.

రెవిన్యూ సెక్రటరికి & CCLAకి ఫిర్యాదు

వాస్తవాలను మరుగుపర్చి RDOకి తప్పుడు రిపోర్టు ఇచ్చిన తాశీల్దార్ పై విచారణ జరపాలిని కోరుతూ తేది: 10-10-2022న రెవిన్యూ సెక్రటరికి, భూమి శిస్తు కమీషనర్ (CCLA)కి  ఆదివాసీలు  ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కు చెప్పారు. ఎలాంటి విచారణ జగలేదు. ఆ అధికారి మరో మండలంకు బదిలిపై వెళ్లి  రెండు చేతులా సంపాదిస్తున్నాడు. జిల్లాలోని ఒక శక్తి వంతమైన అధికార పార్టి MLAకి కావలసిన వాడు. సదరు MLA గారు తన పరిధిలోని మండలానికి కలెక్టర్ తో చెప్పి తాశీల్దార్ గా వేయించుకున్నాడు.

DIG కి ఫిర్యాదు

విశాఖపట్నం రేంజ్ DIG ( Deputy Inspector General of Police)కి ఆదివాసీలు గొలుగొండ SIపై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ వివాదంలో తల దూర్చి రాత్రి 7 నుండి 12 వరకు మహిళలను, పిల్లలను, వృద్దులను నిర్బంధంలో వుంచడం చాల సీరియస్ నేరం. అయినా విచారణ లేదు, చర్యలు లేవు. సదరు SI గారు రూరల్ నుండి పట్టాణానికి అధికారిగా బదిలీపై వెళ్ళాడు.

ST కమీషన్ పర్యటన

గదబపాలెం ఆదివాసీలు నిరుత్సాహపడ లేదు, అదైర్యపడలేదు. పోరాట తెగువ  ఆదివాసీల జీవ లక్షణం.  2022 అక్టోబర్ 10 నుండి గ్రామంలోనే నిరసన దీక్షకు కూర్చున్నారు. 14న ST కమీషనర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. తాశీల్దార్, మండల సర్వేయర్ల నివేదికలను రద్దు చేయాలని, SI తో సహా అధికారులపై  చర్యలు తీసుకోవాలని, ఎంజాయిమెంట్ సర్వే జరిపి  సాగు అనుభవాన్ని నమోదు చేయాలని ఆదివాసీలు ST కమీషన్ ను కోరారు. అయినా ఏమి జరగలేదు.

జగనన్నకు చెప్పుకుందాం

“జగనన్నకు చెప్పుకుందాం !”  అనే పేరుతొ పెడుతున్న కార్యక్రమానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు తేది 22-09-2023న గోలుగోండ మండల కేంద్రానికి  రాగా అక్కడికి వెళ్లి ఒక వినతిపత్రం ఇవ్వగా అది  ANPL 20230922928 గా రిజిస్టర్ అయ్యింది.

ఆఖరిగా

తేది 22-09-2023 నుండి అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్, మండల రెవిన్యు ఆఫీస్ కు “ ఫాలో అప్” చేయగా చేయగా .. 09-01-2024న, 37 ఆదివాసీ కుటుంబాల సాగులో 40.94 ఎకరాలు భూమి  వుందని, అదే భూమిలో కొన్ని  ఇల్లు, గుడి, చర్చి కూడా వున్నాయని తెలియజేస్తూ డివిజినల్ సర్వే అధికారి (DIOS), మండల సర్వే అధికారి (MS) సంతకాలతో వున్న నివేదిక మరియు పటం ( map) వారి చేతికి అందాయి.

50 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ సాగు అనుభవంలో,  మొదటిసరి 2024 జనవరిలో  ఆదివసీలే సాగులో వున్నరని  చెప్పే ఒక రిపోర్టు / కాగితం బయటకు వచ్చింది.

తాజాకలం

ఈ కధను ఏంతో ఓపికతో చదివిన   పాఠకునికి  ఒక సందెహం రావచ్చును. చిరకి ఏమి సాధించారు? అని.  ఏమి సాధించామంటే  ఆదివాసీలు సాగులో వున్నారని చెపుతున్న ఒక పత్రాన్ని/ కాగితాన్ని  సాధించాం. దాని వల్ల ఉపయోగం ఏమిటి? అంటే, ఇప్పటి వరకు తాము సాగు అనుభవంలో వున్నామని ఆదివాసీలు నోటి మాటగా చెపుతూ వున్నారు. ఇక నిప్పుడు ఒక కాగితం చూపించగలరు. అది వారికీ కొండoత  దైర్యాన్ని ఇస్తుంది. ఏమి లేనప్పుడే కలబడి, నిలబడి పోరాడిన ఆదివాసీల చేతికి ఒక ఆయుధం దొరికింది.

రెండో కొసమెరుపు

1.            ఆ GPA తప్పు, చెల్లదు. ఎందుకంటే అందులో దుగ్గిరాల సీతారామమూర్తి మరో కుమారడు ఆ GPA మీద సంతకం పెట్టలేదు. ఆయన కాకినాడలోని తన న్యాయవాది ద్వారా తాశీల్దార్ కు, కలెక్టర్ కు నోటిసు పంపాడు. అంటే ఏమిటన్న మాట, GPA చెల్లుబాటును సహితం రెవిన్యూ అధికారులు విచారణ చేయలేదు.  ఆ నోటీసు నఖలును సమాచార హక్కు చట్టం కింది తీసుకున్నాం. ఆ కుటుంబంతో సంప్రదింపులు జరపడంలో i for farmers సురేష్ సహకరించారు.

2.            తనకు GPA వుందని, తానె సాగులో వున్నాని  చెప్పుకున్న వక్కలంక సుధాకర్, భూమి బ్రోకర్ల పై ఆదివాసీలు గొలుగొండ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ ఫిర్యాదు ఇచ్చారు. వక్కలంకకు  ఉప్పు అందింది. అంతే,  మరి వెనక్కి తిరిగి చూడకుండా అమెరికా పోయాడు.  అక్కడికి వెళ్లి                      “ పరమపదించాడు”. ఇక్కడ గదబపాలెం ఆదివాసీలు చర్చిలో అతగాడి  ఆత్మకు శాంతి కలగాలని యేహావాను ప్రార్ధించారు.

గదబపాలెం ఆదివాసీల భూమి సమస్యపై తీసిన లఘు చిత్ర

గదబల భూములపై NRI గెద్దలు : తేది 30-07-2022

    

   గదబల భూములపై NRI గెద్దలు : తేది 02-08-2022 

ఆ భూమికి సాగులో వున్నది ఆదివాసీలే : 07-09-2022

PS అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

1 COMMENT

  1. (గదబపాలెం ఆదివాసీల భూమి హక్కుల సాధన పై , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ గాను, భారత ప్రభుత్వం ఇంధన కార్యదర్శిగా పని చేసిన విశ్రాంతి సీనియర్ IAS అధికారి శ్రీ EAS శర్మ మరియు వారి శ్రీమతి రాణి శర్మ గార్ల స్పందన)
    అజయ్,

    అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత మల్లమ్మ పేట శివారులో, గదబలు దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూములను, విదేశాలలో నివసిస్తున్న భూ రాబందులు స్థానిక రెవెన్యూ, సర్వే అధికారులతో కుమ్మక్కయి, గ్రామ రికార్డులు తారుమారు చేసి, ఎలా ఆక్రమించారో , మీ సహాయంతో, నిస్సహాయులైన గదబలు ఎలా ఏళ్ల తరబడి ఉద్యమం చేసి, అదే అధికారుల చేత వారు 2022 లో గదబలకు వ్యతిరేకంగా పంపించిన రిపోర్టులు తప్పని ఒప్పించారో, మీరు పంపించిన వీడియో ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తున్నది. మీరు గదబలతో చేసిన ఉద్యమం గురించి ఆదివాసీ గ్రామాల్లో విస్తృతంగా తెలియాలి. మీ అందరికీ నా హృదయపూర్వక మైన అభినందనలు.

    నా ఉద్దేశంలో , మీ వీడియో వల్ల తెలుస్తున్నదేమంటే, పెద్ద జీతాలు తీసుకుంటూ, ఆదివాసీ ప్రజల హక్కులను, ముఖ్యంగా PVTG తెగకు చెందిన ఆదివాసీల హక్కులను, పరిరక్షించ వలసిన ఉన్నత అధికారులు, వారి బాధ్యతులు నిర్వర్తించకపోవడమే కాకుండా, ధనికులైన భూ కబ్జాదారులకు అనుకూలంగా, చట్టవ్యతిరేకంగా, ప్రవర్తించడం. లేకపోతే, గదబ ఆదివాసీలు ఏళ్ల తరబడి ఉద్యమం చేస్తే కాని, రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి, వారి సాగు హక్కు ను గుర్తించరా?. అటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి.

    అనకాపల్లి, ASR జిల్లా, మిగిలిన జిల్లాల్లో, వందలాది గ్రామాలలో, పెద్ద ఎత్తున భూ కబ్జాదారులు, ఆదివాసీల భూములను అక్రమంగా గ్రామ రికార్డులను తారుమారు చేసి, ఆ భూములు తమవే అని నమ్మిస్తున్నారు. ఈ వీడియో చూసి అయినా, ఉన్నత అధికారులు మేలుకుని, ఆదివాసీల సమక్షంలో, వారు సాగుచేస్తున్న భూములను సమగ్రంగా సర్వే చేయించి, వారి హక్కులను పరిరక్షిస్తారని ఆశిస్తున్నాను.

    రాజ్యాంగం మనకిచ్చినది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అటువంటి ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వాధికారులు, ప్రజల గడప వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలి కాని, ప్రజలు తమ వద్దకు వచ్చి, పదేపదే అర్ధించమనడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచినట్లు అవుతుంది. వారి బాధ్యతలను, ఇప్పటికైనా చిత్తశుద్ధితో, నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను

    ఈ అ స శర్మ
    16-1-2024

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles