Tuesday, December 3, 2024

త్యాగాల లక్ష్యం ఆశయాల శోధనే!

రెండు ప్రత్యామ్నాయ విద్యాసౌధాలు

భారతీయ తొలి ముస్లిం అధ్యాపకురాలు, సంఘసంస్కర్త ఫాతిమాషేక్ జయంతి రోజున ఒకేరోజు  ప్రత్యామ్నాయ విద్య కోసం కృషి చేస్తున్న రెండు స్కూళ్ళకు వెళ్ళాను. రెండూ చత్తీస్‌గఢ్ రాయపూర్‌ లోనివే. ఒకటి బౌద్ధ ధర్మ సిద్ధాంతం, డా. బి. ఆర్. అంబేద్కర్ భావజాల ప్రభావంతో కొనసాగుతున్న తథాగత ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడ కల్సుకున్న మహరాష్ట్రకి చెందిన మిత్తానంద (మిత్రానంద/మైత్రేయా నంద) అనే యువ బౌద్ధ భిక్షువుతో అర్ధవంతమైన సంభాషణ. రెండు ఎప్పటి నుంచో అనుకుంటున్న,  అమరుడు చత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా యోధుడు శంకర్‌గుహ నియోగి భావజాల ప్రభావంతో 28 ఏళ్ళుగా కొనసాగుతున్న ‘షహీద్ స్కూల్’!

బౌద్ధభిక్కు మిత్తానంద్ తో గౌరవ్

బీద బస్తీపిల్లల కోసం కేవల చదువులు కాక మార్పు కోసం, మానవీయ వికాసం కోసం స్థాపించిన స్కూల్. అందులో గతంలో చదూకున్న విద్యార్ధులే స్వచ్చంద కార్య కర్తలుగా కొనసాగుతున్న వైనం. లాల్‌హరా నియోగి నినాదం. మార్క్స్ గాంధీ అంబే ద్కర్‌ల మేలు కలయిక నియోగి అంటారు. పర్యావరణ పరిరక్షణను, కార్మికవ్యవస్థ విముక్తినీ సమాంతరంగా ఆశించిన విలువైన ఉద్యమ తాత్వికుడు నియోగి. అంతటి చైతన్యాన్ని తట్టుకునే చేవలేకనే బడా కార్పోరేట్ కంపెనీలు ఆ మహావ్యక్తిని భౌతికంగా హత్యచేసి తృప్తి పొందాయి. ఆకాశంపైకి తూటాలు పేల్చి నింగిని నేలమట్టం చేసామనుకునే పిచ్చివాళ్ళు, ఈ పెట్టుబడి కార్పోరేట్లు!

శ్రీఅంబేడ్కర్ సాంస్కృతిక్ భవన్

అలాంటి స్వాప్నికుడి సజీవ స్పూర్తితో రూపొందిన హాస్పిటల్ ఢిల్లీరాజ్‌హరా లో కార్మికులే నిర్మించుకుంటే, రాయపూర్‌లో స్కూలు, లైబ్రరీ నిర్మించుకున్నారు. పాత పెంకుటిళ్ళలో కొనసాగుతున్న ఆ షహీద్ పాఠశాల, గ్రంథాలయం చూసి తీరాలి. ఎరుపు ఆకుపచ్చ రంగుల యూనిఫాంలతో చిన్న కొట్టుగదుల్లో సుమారు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యామ్నాయ విద్యా విధానం కోసం ప్రతీ విద్యావేత్త, సామాజిక కార్యకర్త తెల్సుకోవాలి. అమరుల ఆశయాల కోసం నిలబడ తామనే ఉదయం ప్రార్ధన గీతం ప్రతీరోజూ శంకర్ గుహ నియోగి స్మృతిలో విద్యార్థులు చదువుతారని విని ఆశ్చర్య పోయాను!

స్కూలు ప్రాంగణంలో విద్యార్థులు

పాఠాలు, బోధనా ప్రక్రియలో సైతం వినూత్న విధానాలను అనుసరిచడం మాత్రమే కాదు, బాల్యం నుంచే అక్కడ పిల్లలకి విత్తులువేయడం నుండి నాట్లు వేయటం వరకూ వ్యవసాయ, ప్రకృతి జీవన విధానానికి సంబంధించిన అవగాహన కూడా కలిగిస్తున్నారు. పిల్లలు బస్తీ ప్రజల కోసం “బస్తీ న్యూస్” అనే పత్రిక కూడా నడుపుతున్నారు. సావిత్రీ బాయి ఫూలే ముఖచిత్రంతో అక్కడ బోర్డు మీద అంటించిన పత్రిక చూసాను. అడిగిందే తడవుగా క్లాసులో పిల్లలంతా, ముఖ్యంగా బాలికలు సావిత్రిబాయి జీవితం గురించి స్పందించిన తీరుకి నా నోట మాట రాలేదు. ఈ నెలలో వాళ్ళు సావిత్రీబాయి ఫూలే నాటిక కూడా వేయబోతు న్నామనీ తప్పకుండా రమ్మనమని ఆహ్వానించారు!

త్యాగమూర్తుల ప్రార్థన

అది కాదు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం. ఝర్నా అనే చురుకైన అమ్మాయి తో పాటూ  అక్కడ పనిచేసే నలుగురు యువ వాలంటీర్లు  గతంలో వరద ముంపు సమయంలో రాసిన యధార్థ కథలు ‘బస్తీలో వరద’ (బస్తీమే బాడ్) అనే పుస్తకం ప్రచురించగా, స్కూల్లోని మూడు, నాల్గవ తరగతి పిల్లలు “కార్మికుల జీవితాల్లో ఏవేం బాధలుంటాయ్?” అనే శీర్షికతో ఇరవై పుటల్లో ప్రతీ పేజీలో కార్మికుల కష్టాల గురించిన చిన్న వ్యాఖ్యకు అందమైన చిత్రాల్ని జోడిస్తూ ప్రచురించిన అద్భుతమైన పుస్తకం. నాకు తెలిసీ స్పష్టమైన శ్రామిక దృక్పథంతో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రచురించిన దేశంలోనే తొలి పుస్తకం ఇదేనేమో. చిన్నగా తెలుగు చేయాలని ఉంది కానీ ఎంతవరకు అవుతుందో చూడాలి!

చాకుల్లాంటి విద్యార్థులు

 ఇవన్నీ ఒకెత్తయితే చరోదా ఊర్లోని స్టేషన్ దగ్గర రోడ్డుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి రాజ్యాంగ పీఠిక బోర్డు పెట్టి “సంవిధాన్ చౌక్” అనే పేరు పెట్టడం చూడగానే నిజంగా సంతోషం అనిపించింది. భావోద్రేకాలు రెచ్చగొట్టడం కోసం ఎక్కడికక్కడ అవకాశ వాదంతో సొంత ప్రయోజనాల కోసం భక్తిని ఉద్రేకంగా మారుస్తున్న మూకలు ఒకవైపు పేట్రేగిపోతున్న క్రమంలో, రాజ్యాంగబద్ధమైన లౌకిక మానవీయ స్పృహ కోసం తపిస్తున్న వారి కృషి కచ్చితంగా  నిరాశావాద వాతావరణంలో నిస్సందే హంగా నాలాంటివారికి ఎంతోకొంత బలాన్నీ, ఉత్సాహాన్ని కలిగించే విషయమే కదా!

బస్తీ మే బాగ్ (బస్తీలో వరదలు), బడిపిల్లల రచనలు

(పోరాటాన్ని మాత్రమే ప్రతిపాదించే సైద్ధాంతిక విప్లవోద్యమానికి నిబద్ధతగల నిర్మాణాన్ని కూడా ప్రసాదించిన ఆచరణ శీలి నియోగి. షహీద్ స్కూల్ ఆయన కలలకి ప్రతిరూపం. ఇంకా హుయాన్‌ త్సాంగ్ సందర్శించిన ఒకనాటి కోసల రాజ్యం సిర్పూర్నుండి బలోదా వరకూ హడావుడిగానే ఐనా ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ మొత్తానికి వేరే పని మీద వెళ్ళి  తీరిక చేసుకుని చూసొచ్చిన సంగతులను తర్వాత  రాస్తాను కానీ ప్రస్తుతం ప్రత్యామ్నాయ/మానవీయ వికాస విద్య కోసం ఉద్దేశించిన ప్రయత్నాల కోసమిలా సంక్షిప్తం గా ప్రస్తావిస్తూ ఆయా విషయాలతో ఈ చిన్న రైటప్!)

-గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles