Saturday, November 23, 2024

పాక్ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి

  • చరిత్ర సృష్టిస్తున్న సవీరా పర్కాశ్
  • పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి

అవును. మనం వింటున్నది నిజమే. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో, తొట్టతొలిగా, హిందూ అభ్యర్థి, అందునా మహిళా అభ్యర్థి పోటీకి దిగుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఒక హిందూ మహిళ పోటీ చేయడం ఇదే తొలిసారి.ఆమె పేరు డాక్టర్ సవీరా పర్కాశ్. ప్రకాష్ అయ్యివుంటుంది. ఆ పాకిస్తాన్ వాళ్లకు నోరు తిరగక పర్కాశ్ అంటున్నారు. ఈ ఫిబ్రవరిలో జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్సియల్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఖైబర్ పణ్తుంఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి సవీరా పర్కాశ్ రంగంలోకి దిగుతున్నారు. పీకే -25 స్థానానికి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలకమైన సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో, బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి ) తరపున సవీరా పోటీకి దిగుతున్నారు. ఈ జిల్లా నుంచి పోటీచేస్తున్న తొలి మహిళ కూడా ఈవిడే కావడం విశేషం. సవీరాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. ఖైబర్ పణ్తుంఖ్వా లోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి ఇటీవలే

2022 లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్నారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ కూడా డాక్టర్. ఇటీవలే పదవీ విరమణ చేశారు. బిలావల్ భుట్టో జర్ధారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో ఆయన సభ్యుడుగా వున్నారు. తండ్రి బాటలో ఈమె కూడా రాజకీయాల్లోకి కాలుమోపారు. ప్రస్తుతం, ఈమె బునేర్ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

3వేల మంది మహిళా అభ్యర్థులలో ఒకే ఒక హిందూ

వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్నఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తున్నారు. అందులో 3000మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరందరిలో ఏకైక హిందూ అభ్యర్థిని సవీరా. ఈమె పోటీచేస్తున్న బునేర్ ప్రాంతంలో ఎక్కువమంది ముస్లింలే. ముస్లిం రాజ్యం, ముస్లిం ప్రాబల్యం వున్న చోట హిందూ యువతి పోటీకి నిలబడడం చాలా ఆశ్చర్యకరంగా, ఆసక్తిదాయకంగా వుంది. ఇప్పటికే ఈమెకు పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.  హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులు ఎక్కువమంది సవీరా వైపు నిలుస్తున్నారు. ఎవరీ సవీరా? అని ప్రపంచమంతా గూగుల్ బాట పట్టింది. సవీరా తండ్రి ఓం పర్కాశ్ 35 ఏళ్ళ నుంచి అదే పార్టీని నమ్ముకొని వున్నారు. డాక్టర్ గా మంచిపేరు తెచ్చుకున్నారు. ఎన్నికలబరిలో దిగిన ఈ యువతి ఉన్నత లక్ష్యాలతో రాజకీయరంగంలోకి అడుగుపెట్టారు. సామాజిక సంక్షేమం, మహిళాభ్యున్నతి, రక్షిత వ్యవస్థ, హక్కుల సాధన మొదలైన లక్ష్యాల సాధన దిశగా నడుస్తానని ఆమె అంటున్నారు. పాకిస్తాన్ లో ఇప్పటికీ మహిళలు అభివృద్ధికి ఆమడదూరంలో వున్నారు.  అణగారిన వర్గంగానే మిగులుతున్నారు. వీరికి గొంతుగా నిలుస్తానని అంటున్నారు. మొన్న 23 వ తేదీ ఆమె నామినేషన్ వేశారు. గెలుపు పట్ల చాలా ధీమాగా వున్నారు.

స్వాతంత్ర్యం కోసం అర్రులు చాస్తున్న పాకిస్తాన్ మహిళలు

పాకిస్తాన్ లో ఇప్పటికే పేదరికం విలయతాండవం చేస్తోంది. ప్రాధమిక అవసరాలు సైతం తీరడం లేదు. విద్య, వైద్యం మృగతృష్ణగా మారిపోయాయి. పితృస్వామ్యం, మూస రాజకీయాలకు విసిగిపోయిన పాకిస్తాన్ మహిళలు తమ స్వాభిమానం కోసం, సర్వ స్వతంత్రత కోసం అర్రులు జాస్తున్నారు. పాకిస్తాన్ లో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో వున్నాయి. ఆలీఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్ రీక్ ఈ ఇన్సాఫ్,  పూర్వ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, పూర్వ విదేశాంగ మంత్రి బిలవాల్ భుట్టో జర్దారీ అధినాయకత్వంలోని

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికార పీఠంపై కూర్చోడానికి కసరత్తులు చేస్తున్నాయి, కత్తులు నూరుతున్నాయి. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 169 స్థానాలను కైవసం చేసుకోవాలి.ప్రస్తుతం పి.టీ.ఐ -149, పి.ఎం.ఎల్ -82, పి.పి.పి -54స్థానాల బలంతో వున్నాయి. సవీరా ప్రాతినిధ్యం వహిస్తున్న పి.పి.పి మూడో స్థానంలో వుంది. సీట్లతో ఓటింగ్ శాతంలోనూ మూడు పార్టీలు ఇదే వరుసలో ఉన్నాయి. ఇప్పటికి దాకా పాలించిన పార్టీలతో విసిగెత్తిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? చూడాలి.

చీకటిలో చిరుదివ్వె సవీరా

దేశాన్ని ఘోరమైన పేదరికంలోకి నెట్టి, ప్రజలను బలిచేస్తున్న ఏలికలకు ఓటుతో బుద్ధి చెబుతారా? అన్నది ప్రశ్న. పాకిస్తాన్ లో రెండవ అతి పెద్ద మతం హిందూ. ఒకప్పుడు చాలా ప్రభావశీలంగా ఉండేది. దేశం విచ్చిన్నం కావడం, అనేక చారిత్రక పరిణామాల్లో, హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హిందువుల జనాభా కేవలం 2.14 శాతం మాత్రమే వుంది. 44 లక్షల జనాభా మాత్రమే ఉన్నారు. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ మాటల బట్టి దేశంలో 80 లక్షల మంది జనాభా, 4 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అంకెల్లో తక్కువగా చూపిస్తున్నారు. చరిత్రలోతుల్లోకి వెళ్తే ఆశ్చర్యకరమైన అంశాలు ఎన్నో బయటపడతాయి. ఇస్లాం రాజ్యం, ఒకప్పటి అఖండ భారతంలో ఒకటైన పాకిస్తాన్ లో ఈ మాత్రం హిందూ జనాభా జీవించి ఉండడం కాస్త సంతోషకరం. చీకటిలో చిరుదివ్వెలా సవీరా హిందువుల ప్రతినిధిగా రాజకీయ క్షేత్రంలో ఉండడం చిరు ఆశాకిరణం. సవీరా గెలుపు పట్ల, రేపటి పట్ల ఆశాభావంతో ఉందాం. సవీరా ఒకవేళ గెలిస్తే, అప్రమత్తంగా ఉండడం అవసరం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles