Thursday, November 21, 2024

కశ్మీర్ లో కలకలం

  • మండుతున్న మంచు ఆరేదెన్నడు?
  • మోదీ సర్కార్ ఇస్తున్న సందేశం ఏమిటి?

ఇటీవలే, 370 ఆర్టికల్ రద్దుపై సుప్రీం కోర్టు విస్పష్టమైన తీర్పు యిచ్చింది. బిజెపి ప్రభుత్వానికి ఇది గొప్ప శక్తిని యిచ్చింది. మిగిలిన రాష్ట్రాల వలె జమ్మూకశ్మీర్ లోనూ ఎన్నికలు నిర్వహించి, గెలిచి, తన సత్తా ఏమిటో చూపించుకోవాలనే బలమైన ఆలోచనలలో బిజెపి వుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను (పి.ఒ.కె) కూడా ఏదో ఒక రోజు తిరిగి సాధిస్తామనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. అభివృద్ధి చూపి, శాంతిని నాటి, ప్రజాస్వామ్యాన్ని సుస్థిర పరచి, ఎన్నో ఏళ్ళ తమ ఆశయాలను సాధించగలమనే సందేశాన్ని దేశ ప్రజలకు, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతవాసులకు బలంగా అందించాలనే ఆలోచనలో ఆ పార్టీ అగ్రనాయకులు వున్నారు. సాధ్యాసాధ్యాలు, భవిష్య పరిణామాలు ఎలా ఉండనున్నా, నేటి కాలానికి తన సత్తా చూపాలనే కసి ఆ నాయకులలో ఉన్నట్లు కనిపిస్తోంది. మంచిదే. ఎన్నో ఏళ్ళ నుంచి అగ్నిగుండంలా, రావణ కాష్టంలా వున్న నేలపై తొలకరి జల్లులు కురిస్తే, కశ్మీర్ మాత కన్నీరు ఆగితే, పుడమి పులకిస్తే అంతకంటే ఇంకేం కావాలి? నరేంద్ర మోదీ ఏలుబడిలోని బిజెపి ప్రభుత్వంలో వరుసగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అత్యంత బలమైన రాజకీయశక్తిగా బిజెపి అవతరించింది. తిరుగులేని నాయకుడుగా నరేంద్రమోదీ వెలిగిపోతున్నారు. అన్నీ కలిసి వస్తే, 2024 లోనూ గెలిచి, హ్యాట్రిక్ సాధించి, చరిత్ర సృష్టించాలని మోదీ చూస్తున్నారు. ఏ పార్టీయైనా, ఏ అగ్రనేతైనా కోరుకొనేది అదే. అది అత్యంత సహజమైన అంశం.

Also read: కరోనా ఆచూకీ, ఆందోళన వద్దు!

ఘోరకలిని నిరోధించలేకపోతే ఫలితం శూన్యం

అయోధ్య రామ మందిరం స్థాపన మొదలైనవి మోదీ సాధించిన విజయాలలో గొప్పవి. 370 ఆర్టికల్ రద్దు అంశం కూడా అదే జాబితాలోకి చేరుతుంది. కాకపోతే, జరుగుతున్న ఘోరకలిని ఆపలేకపోతే ఫలితం శూన్యం. అభివృద్ధి కంటే ముందు జరగాల్సింది శాంతి స్థాపన. గతంలో కంటే ఉగ్రవాదుల దాడులు, భీభత్సం తగ్గుముఖం పట్టవచ్చు గాక! అది పూర్తిగా ముగియ లేదు. కశ్మీర్ పండితులు తిరిగి వారి మాతృభూమికి వచ్చే పరిస్థితులు అక్కడ నెలకొనలేదు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు స్వేచ్ఛగా తిరగగలిగే వాతావరణం ఇంకా ఏర్పడలేదు. పోలీసులు, సైనికులే కాక, సామాన్యులు కూడా ఉగ్రవాద మూక చేసే దుశ్చర్యలకు బలి అవుతున్నారు. కశ్మీర్ పండితులు, హిందువులే కాదు, దళితులు, జైనులు, సిక్కులు కూడా ఉగ్రవాదానికి మూల్యం చెల్లిస్తూనే వున్నారు. సరిహద్దులు నివురుగప్పిన నిప్పులా వున్నాయి. జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న తాజా ఉగ్రవాద కాల్పులు భయాన్ని కలిగిస్తున్నాయి. రేపటి రోజుల పట్ల ఇంకా భయాన్ని పెంచుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఒక విశ్రాంత పోలీసు అధికారి దారుణంగా మరణించారు. కాల్పుల దమనకాండ శృతి మించి సాగింది. అసువులు బాసిన వ్యక్తి పేరు మహ్మద్ షఫీ మీర్. రిటైర్డ్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ ). పైగా ముస్లిం మతస్థుడు. ఉదయం పూట స్థానిక మసీదులో నమాజ్ చేసుకుంటూ వుంటున్న సమయంలో, కొందరు ఉగ్రవాదులు అతిదారుణంగా కాల్చి అయన ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారు.

Also read: ఉత్సాహం కలిగించని ఉద్యోగపర్వం

ఉగ్రవాదుల దాడులు

గత నెలలో శ్రీనగర్ కు చెందిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పై విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నారు. పూంచ్ సెక్టార్ లో దాదాపు 25 నుంచి 30మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు నక్కివున్నట్లు భారత సైన్యం అంచనా వేసింది. మొన్న శుక్రవారం రాత్రి పలువురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు విఫల ప్రయత్నం చేశారు. కౌంటర్ ఆపరేషన్ లో ఒక ఉగ్రవాది మరణించాడని చెబుతున్నారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఉగ్రవాదుల దాడులు అనేకసార్లు జరిగాయి. ఎంతో ప్రాణనష్టం జరిగింది.ఒక పక్కన పాకిస్తాన్ ఉగ్రవాదులు- ఇంకో పక్క  చైనా సైనిక ముష్కరులు కశ్మీర్ లోయలో, సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూనే వున్నారు. అనేకమార్లు ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ, చైనా విషయంలో ఇంకా అగ్గి ఆగలేదు. జమ్మూ,కశ్మీర్, లడాఖ్ విషయంలో మనకు చైనా,పాకిస్తాన్ ఇద్దరూ శత్రువులే. ఇద్దరి ఉమ్మడి ఎజెండా ఒకటే. భారత భూభాగాన్ని ఆక్రమించాలి, మన సంపదను దోచెయ్యాలి. సరిహద్దుల్లో ఒకరు కాస్త తగ్గినప్పుడు ఒకరు విజృంభించడం, ఒకరు రెచ్చిపోతున్నప్పుడు ఇంకొకరు శాంతి మంత్రం జపించడం మనం గమనిస్తున్న తంతు.

Also read: వైభవంగా సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి జయంతి

ఒక పక్క పాకిస్తాన్, మరో పక్క చైనా

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న ఆనందాన్ని, పార్లమెంట్ లో జరిగిన తాజా భద్రతా వైఫల్యం ఘటన మింగేసింది. దేశ రాజధానిలో, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్ భవనంలో భద్రత కాపాడుకోలేని బిజెపి ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్  ప్రజలకు రక్షణ ఏ మేరకు కల్పిస్తారు? అనే ప్రశ్నాయుధాలను సంధించే అవకాశం విపక్షాలకు అధికార పక్షం అందించింది. అయోధ్యలో రామమందిరం సిద్ధమవుతున్న వేళ భద్రతపై చాలా అప్రమత్తంగా ఉండడం చారిత్రక అవసరం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి… అన్న చందాన ఉగ్రవాదంలో సంభవిస్తున్న ఏ చిన్న పరిణామాన్ని తేలికగా తీసుకోరాదు. జమ్మూ కశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతాలలో చిన్న అలజడి కూడా జరుగరాదు. ఒక్క రక్తపు బిందువు కూడా రాలరాదు. దేశ అభివృద్ధితో పాటు, శాంతి స్థాపన,ప్రజల్లో ధైర్యాన్ని నింపడం ఏలికల ప్రధాన బాధ్యతలు. ఆ దిశగా నరేంద్రమోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అభిలషిద్దాం.

Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న సవాళ్లు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles