వోలేటి దివాకర్
వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ సీటుపై సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి గట్టి ఆశలే పెట్టుకున్నారు. జన సేన-టిడిపి పొత్తుల్లో భాగంగా ఈ సీటును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జన సేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆశిస్తున్నారనీ, రూరల్ సీటు ఆయనకే దక్కుతుందనీ, ఈవిషయంలో జనసేనానికి పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారనీ జనసైనికులు భావిస్తున్నారు. అయితే, గోరంట్ల మాత్రం రూరల్ తనదేనని స్పష్టం చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా సిట్టింగ్‌లకే సీట్లు కేటాయిస్తామని చెప్పారని గుర్తుచేస్తున్నారు.
శుక్రవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన గోరంట్ల రూరల్ సీటుపై స్పందిస్తూ రూరల్ సీటు తనదేనని, కాదంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎంపిగా పోటీ చేస్తారన్న వార్తలపై స్పందిస్తూ ఎంపిగా వెళ్లి పకోడీలు తినటానికా అని వ్యాఖ్యానించారు. అయితే దుర్గేష్ సీటును ఆశించడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రూరల్ సీటుపై ఆశలు పెట్టుకున్న దుర్గేష్ పరిస్థితి ఏమటిన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పార్లమెంటుకు పోటీ చేసేలా ఒప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్లపై పేచీలు తప్పేట్టు లేవు.
నాకు చీటీల వ్యాపారం లేదన్న వ్యాఖ్యల వెనుక మతలబేమిటి?
తనపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటానికి తనకు చీటీల వ్యాపారం, పెట్రోలు బంకులు లేవని గోరంట్ల వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మార్గదర్శి చిట్ ఫండ్ పైన కేసుల నమోదు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీలపై సిఐడి కేసులు నమోదు చేసింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె మామగారు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం నిర్వహిస్తున్న చిట్ ఫండ్ కంపెనీపై కేసు నమోదు చేసి, అప్పారావును, భవానీ భర్త వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం టిడిపి సీటు ఆశిస్తున్న శ్రీనివాస్ లను అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఆదిరెడ్డి కుటుంబం రిలయన్స్ పెట్రోలు బంకును కూడా నిర్వహించిన సంగతి గమనార్హం. ఈ క్రమంలో గోరంట్ల పరోక్షంగా ఆదిరెడ్డి కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖలు చేసినట్లు విశ్లేషిస్తున్నారు. సిటీ సీటును తనకు కాకుండా చేసిన ఆదిరెడ్డి కుటుంబంపై గోరంట్లకు ఇప్పటికీ ఆగ్రహం
తగ్గలేదన్న విషయం అర్థమవుతోంది. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానన్న ఉద్దేశంతో తమ పార్టీ అధిష్టానం ఉందని గోరంట్ల చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో సిటీ, రూరల్ బి ఫారాలు తెచ్చుకున్నా… బిజెపితో పొత్తులో భాగంగా రూరల్ నుంచి పోటీ చేశానని వెల్లడించారు. రానున్న ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కూడా సర్వేలు జరిపిస్తోందని, ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి-జన సేన కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు.