Monday, November 25, 2024

అమరావతి భూముల దర్యాప్తు నిలిపివేయడం సమంజసమా?

కె. రామచంద్రమూర్తి

కడచిన ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే హక్కు ప్రస్తుత ప్రభుత్వానికి లేదంటూ జస్టిస్ డీవీఎస్ ఎస్ సోమయాజులు బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ చేసిన వ్యాఖ్య అంత సమంజసంగా కనిపించడం లేదు. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వాలూ, రాష్ట్రప్రభుత్వాలూ గత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షిస్తూనే ఉన్నాయి. 1994లో ఎన్ టి రామారావు విధించిన మద్యనిషేధాన్నీ, రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్నీ 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు సమీక్షించారు. మద్యనిషేధాన్ని సంపూర్ణంగా ఎత్తివేశారు. కిలోబియ్యం ధర పెంచారు. చంద్రబాబునాయుడు చేసిన నిర్ణయాలను 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలను చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014-19లో సమీక్షించారు.  ఇది రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం చేశారో చెప్పమంటే ఎవ్వరూ చెప్పలేదు. గత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించరాదని రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నదో చెప్పమని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు.

ఆర్. సీ. పాండ్యాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ వెంకటాచలయ్య చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సోమయాజులు గుర్తు చేశారు. ‘మనకు రాజ్యాంగం ఉండగానే సరిపోదు. దానివల్లే రాజ్యంగ సంస్కృతి పరిఢవిల్లదు. రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిపక్వత, సత్సంప్రదాయాల్ని పాటించే ప్రజలున్న చోట మాత్రమే రాజ్యాంగ సంస్కృతి వర్థిల్లుతుంది. అది లేని చోట రాజ్యాంగ విలువలు పుస్తకాలకే పరిమితమైన ఆదర్శాలుగా మిగిలిపోతాయి’ అంటూ జస్టిస్ వెంకటాచలయ్య చేసిన వ్యాఖ్యకూ జస్టిస్ సోమయాజులు వెల్లడించిన నిర్ణయానికి సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘ఇన్ సైడర్’ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వ నేతలే కాదు సాధారణ ప్రజానీకం కూడా భావిస్తున్నది. రాజధాని నిజంగా ఎక్కడ ఉంటుందో తెలిసిన కొందరు పెద్దమనుషులు ఆ సమాచారాన్ని సొమ్ముచేసుకున్నారనీ, ఆ విషయం తెలియని అమాయకులు నూజివీడు దగ్గరా, గన్నవరం దగ్గరా స్థలాలూ, పొలాలూ కొనుక్కున్నారనీ జనం చెప్పుకుంటున్న విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. ఆ వ్యవహారంపైన దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సంకల్పించడంలో కానీ, అందుకోసం మంత్రుల  ఉపసంఘాన్ని నియమించడంలో కానీ పోలీసు అధికారులతో ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించడంలో కానీ తప్పేమిటి?

గత ప్రభుత్వ విధాలను విధిగా కొనసాగించాలా?

గత ప్రభుత్వ విధానాలని వచ్చే ప్రభుత్వం విధిగా అనుసరించాలని కూడా న్యాయమూర్తి చెబుతున్నారు. అదే ప్రజాస్వామ్యబద్ధమూ, రాజ్యాంబద్ధమూ అయితే గత ప్రభుత్వమే కొనసాగవచ్చును కదా. ఎన్నికలు ఎందుకు? కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవడం ఎందుకు? పాత ప్రభత్వ విధానాలు నచ్చకనే ప్రజలు ఎన్నికలలో మరో పార్టీని గెలిపిస్తారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుందాం. నరేంద్రమోదీ రెండో విడత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కశ్మీర్ లో  యూపీఏ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను తిరగదోడారు. 370 వ అధికరణను రద్దు చేశారు. జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్రప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. బీజేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి, కొన్ని మాసాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మెహబూబా ముఫ్తీని ఇప్పటికీ గృహనిర్బంధంలోనే ఉంచారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండిన అబ్దుల్లాలను విడుదల చేశారు కానీ ఆమెను మాత్రం నిర్బంధంలోనే కొనసాగిస్తున్నారు.  ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలనూ పార్లమెంటు సమర్థించింది. యూపీ ఏ ప్రభుత్వాల విధానాలకు విరుద్ధంగా  కశ్మీర్ లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధం కావని చెప్పగలమా? రూల్ ఆఫ్ లా (న్యాయశాస్త్ర నియమం)కు భిన్నంగా ఉన్నాయని అనగలమా?

వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్ పిటిషన్లు

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం 26 జూన్ 2019న ఉత్తర్వులు జారీ చేసింది. ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు నిఘావిభాగం డీఐజీ కె. రఘురామ్ రెడ్డి నాయకత్వంలో పదిమంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్) ఏర్పాటు చేస్తూ 21 ఫిబ్రవరి 2020న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అక్రమం ఏమీ లేదు. ఉపసంఘం నివేదికలోని అంశాలలోని నిజానిజాలను నిర్ధారించడానికి పోలీసులతో కూడా బృందాన్ని నియమించడం తప్పు ఎలా అవుతుంది? సిట్ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గం ఉపసంఘాన్నీ, సిట్ నూ నియమించడానికి అవసరమైన ఆధారాలు ఏమీ కనిపించడం లేదని న్యాయమూర్తి అన్నారు. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వాన్నీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ నూ ప్రతివాదులుగా చేర్చాలన్న అటార్నీజనరల్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. దర్యాప్తులో పురోగతి లేకపోతే న్యాయస్థానం దర్యాప్తు సంస్థకు కాలపరమితి విధించి ఫలాలా తేదీ కల్లా దర్యిప్తు ముగించాలని ఆదేశించవచ్చు. దర్యాప్తు నివేదికలో పనలేకపోతే కేసులు కొట్టివేయవచ్చు. నిందితులను నిర్దోషులుగా ప్రకటించవచ్చు. కానీ నేరం జరిగిందని నేరనిరోధకశాఖ ప్రాథమిక దర్యాప్తు తర్వాత భావించినప్పుడు దానిమీద సమగ్రమైన దర్యాప్తు జరపనక్కరలేదని న్యాయమూర్తి నిర్ణయించడం సమంజసంగా కనిపించడం లేదు. ప్రభుత్వ న్యాయవిభాగంలోకానీ, దర్యాప్తు విభాగంలోకానీ లోపాలు జరగవచ్చు. మరింత వేగంగా దర్యాప్తు జరిపించడానికి కానీ మరింత పకడ్బందీగా కేసులలో వాదించడానికి కానీ అవసరమైన సామర్థ్యం కొరవడి ఉండవచ్చు. అంతమాత్రాన దర్యాప్తు అక్కరలేదని తీర్మానించడం తొందరపాటు అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles