తిరుప్పావై 5
20.12.2023
(గోదాదేవి అయిదో పాశురంలో చెప్పిన భగవదనుగ్రహ ప్రాధాన్యత, అన్నమయ్య కీర్తన అంతర్యామిలో అక్షరక్షరంలో కనిపిస్తుంది.)
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
తెలుగుభావార్థ గీతిక
మాయల అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై పుట్టినట్టి
దేవకీ వసుదేవ పూర్వపున్నములు నిండిన పసిడి పంట,
మలయానిలముల తిరిగి సోలెడు యమునా విహారి వేణుధరుడు
యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి
రాగరంజితమనోసుమాల నర్చించ పునీతమై వచ్చినాము
చీకట్లు తొలగించు కృష్ణలీల, కట్లు తెంచు కృష్ణ ధ్యానము
పాపాల దూదిరాశిని బూదిచేయుకృష్ణనామమే మాకు శరణు
నేపథ్యం
మనం తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేశాము. పోయిన జన్మలలో చేసిన పాపాలెన్నో తెలియదు. ఈ పాపాలన్నీ పోయిన తరువాతనే గదా మనకు శ్రీకృష్ణసంశ్లేషం లభిస్తుంది. పాపాలన్నీ ప్రక్షాళన అయ్యేదెప్పుడు? రుషులు మునులకే తపస్సులు ఫలించలేదు ఎందుకంటే పాపాలు ప్రక్షాళన కాలేదు కనుక. అయినా మంచి పనులు చేయడానికి ఆటంకాలెన్నో. ఓ సరస్సులో తామరపూవుపై తుమ్మెద వాలింది. సాయంకాలం గడిచిపోతున్న విషయం గమనించలేదు. పద్మము మూసుకుపోయి లోపలే బందీ అయింది. సరే రాత్రి గడిచి తెల్లవారగానేసూర్యుడుదయిస్తాడు, పద్మము వికసిస్తుంది. తాను విడుదలైస్వేచ్ఛగా వెళ్లిపోతాను కదా అని నిశ్చింతగా నిద్రపోయిందట. కాని అంతలోనే ఒక ఏనుగు సరస్సులో జొరబడి తామరతూండ్లను తొండంతో తెంపి విసిరికొట్టింది. పద్మం తెరుచుకోనేలేదు. దైవం అనుకూలంగా లేకపోతే మన ప్రయత్నం ఫలించదు కదా అని గోపికలు ఆందోళన పడుతున్నారు.
అర్థం:
మాయనై = ఆశ్చర్యకరమైన, మన్ను = ఎల్లప్పుడు భగవత్సంబంధము గలవాడైన, పెరునీర్ = మహాజలప్రవాహముగల, యమునైత్తుఱైవనై= యమునానదీ వడమదురై మైందనై =ఉత్తరమధురానగర నాయకుడైన, తూయ =పరిశుధ్ధ తీరమున ఉండే వాడు, ఆయర్ కులత్తినిల్ = గోపవంశంలో, తోన్ఱుం =ప్రకాశించిన, మణి విళక్కై= మణిదీపమైన వాడిని, తాయై క్కుడల్ = తల్లి యశోద కడుపున, విళక్కం శెయ్ద =ప్రకాశంపచేసిన, దామోదరనై= దామోదరుని, తూయోమాయ్ =పరిశుద్ధులమై, వందు = వచ్చి, నాం తూ =పవిత్రమైన, మలర్ =పూలను, తూవి = అక్రమముగా విసిరి, త్తొళుదు =సేవించి, వాయినాల్ పాడి = నోటితో పాడి, మనత్తినాల్ = మనస్సుతో, శిందిక్క=చింతించి, ధ్యానము చేసి, పోయ పిళైయుం = ముందటి పాపములున్నూ, పుగుదురువాన్ నిన్ఱనవుం =మునుముందు రాబోయే పాపములను, తీయనిల్ = నిప్పులో, తూశాగుం = దూదిగా కాలిపోతుంది శేప్పే= పరమాత్ముడిని నామాములను కీర్తించే, లోర్ ఎమ్బావాయ్= మావ్రతము.
అంతరార్థం
ఉత్తర మథుర,మధురా నగరాధీశుడు
భగవదవతారాలతో విరాజిల్లిన ఉత్తర ప్రాంతం. అందులో మధురా నగరం. ఆనగరాధీశుడు, లీలా మానుష విగ్రహుడు, యమునాతీర విహారి, గోపకులాలంకార దీపకుడు, తల్లియశోద మాటకు కట్టుబడి ఆమె కట్టిన తాడుకు బందీ అయిన దామోదరుడు. పవిత్రులమై వచ్చి, మంచి పూలతో పూజించి, చేతులారా సేవలుచేసి, కీర్తనలు పాడి, మనసారా ధ్యానిస్తే చాలు మన పూర్వసంచిత పాపరాశి, రాబోయే ఆగామి పాపరాశి అంతా అగ్నిలో పడిన దూది వలె బూడిదై పోతుంది, ఆ భగవన్నామమే పాడదాం అంటున్నారు గోపికలు.
మాయ అంటే ఆశ్చర్యకరమైన లీల. భగవంతుడి లీల. మాయావి అంటే శ్రీ కృష్ణుడు. ఆయన గురించి చెప్పినా చూసినా విన్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. పరమపదంలో ఉండే వాడు మధురలో పుట్టాడు. వైకుంఠం వదిలి వ్రేపల్లెలో పెరిగాడు. మధురలోనే సిద్ధాశ్రమం ఉంది. అక్కడే వామనుడై హరి వెలిసాడు. లవణాసురుడిని చంపిన శతృఘ్నుడు మధుర రాజధానిగా పాలించాడు. మధురలోనే కంసుని చెరసాలలో కృష్ణుడు పుట్టాడు. నమ్మాళ్వార్లు, ఇతర మహర్షులు ఇక్కడ భగవన్నామాలను కీర్తించారు.
వడమదురైన్దనై = మధురానామ నగరీ పుణ్యాపాప హరీ శుభా యస్యాం జాతో జగన్నాథః సాక్షాద్విష్ణుః సనాతనః అని మధురను మునులంతా కీర్తించారు. అనేక అవతారాలతో అనుబంధం ఉన్న మధుర పుణ్యప్రదేశం. పాపాలను హరించే చోటు. ఉత్తర మథుర వైకుంఠముతో సమానమైనది. భగవంతుడు తనను తాను పుట్టించుకున్నచోటు మధుర. వైకుంఠము భగవంతుడుండు చోటు. మధుర కు రాజధాని గా కన్న, శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా గొప్పది. మైన్దనైఅంటే బిడ్డ అనీ, రాజు అనీ, బలశాలి అయిన వాడు అని కూడా అని అర్థం. పుట్టగానే తండ్రి సంకెళ్లు తామే వీడినట్టు చేసినవాడు, యౌవనం రాకముందే కంసుని చంపిన వీరుడు, మథురకు రాజు కాకపోయినా రాజువలె అధికారాలు కలిగిన వాడు. మాయావి మథురానాథుడైనాడు.
తూయ పెరునీర్ యమునైత్తురైవనై = యమునాతీర విహార రసికుడైన శ్రీకృష్ణుని రాజధానీ నగరం మధుర. సంసారమనే సాగరాన్ని దాటించడానికా అన్నట్టు యమునా తీరాన్ని దాటేందుకు సహాయం చేయడానికి గాను ఎప్పుడు తనను పిలుస్తారో అన్నట్టు, శ్రీకృష్ణుడు ఆ తీరంలో ఎదురుచూస్తుంటాడట.
ఆయనెవరంటే గోపకుల దీపకుడు. మణిదీపం వలె వెలిగే వాడు యశోదాగర్భంలో వెలుగులు నింపిన వాడు. మధురలో జన్మించినా నందవ్రజంలో ప్రకాశించిన వాడు. తూర్పు దిక్కుతో సూర్యుడికి సంబంధం ఉన్నా తూర్పులోనే ఉద్భవించాడని కాదు. మధురలో పుట్టినా వ్రేపల్లెలోనే పుట్టిన మణివలె ప్రకాశిస్తున్నాడు. అది నిత్యప్రకాశము కలిగిన మణి. పరమపదంలో ఉన్నప్పుడు పగటి దీపం వలె ఉంటాడట.
ఆయన దామోదరుడు
యశోద ప్రేమబంధాలకు భక్తి బంధాలకు కట్టుబడి తాటి రాపిడికి కలిగిన మచ్చను ఇష్టంగా ధరించే వాడు. ఆయన దామోదరుడు. తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ ద దామోదరనై = జగన్నాథుడయిన శ్రీ కృష్ణుడు యశోద కట్టిన తాడుకు కట్టుబడి ఉంటాడు. కట్టిన మచ్చలను ఆమె ప్రేమకు గుర్తుగా మిగిల్చుకుంటాడు. దామోదరత్వముచేత తల్లికి కీర్తి తెచ్చిన వాడు. మాయనై తో మొదలు పెట్టి శ్రీకృష్ణ కీర్తనను ఆండాళ్ దామోదరనై తో ముగిస్తుందీ పాశురంలో.
తూయోమాయ్ వందునామ్ పరిశుద్ధులమై వచ్చినాము అంటారు గోపికలు. భగవత్సంబంధమే నిజమైన శుధ్ధి. విభీషణుడు రామశరణాగతికి ముందు సముద్ర స్నానం చేయాలన్న నియమం చెప్పలేదు. అర్జునుడికి చరమ శ్లోకం చెప్పినప్పుడు, రజస్వల అయిన ద్రౌపది శ్రీకృష్ణ శరణాగతి చేసినప్పుడు వేరొక శుద్ధిగురించి చెప్పలేదు. బాహ్యశుధ్ధిని కావాలని వదులుకోవాలని కాదు. కాని బాహ్యశుద్ధి లేదని అనర్హత రాదు. పరమాత్మను ఆత్మలో తలచుకున్నవాడు పవిత్రుడు.
తూమలర్ త్తూవి త్తోళుదు= ఆ దామోదరునికి పవిత్రములైన పూలను సమర్పించండి. పూలంటే ఇక్కడ మనసులు. పవిత్రభావాలు. ఆ పూలు విసిరితే చాలు. జాగ్రత్తగా పాదాలమీద పెట్టాల్సిన పనిలేదట. ఓ లెక్క పద్థతి ప్రకారం క్రమం తెలిసి నమస్కరించాల్సిన పని లేదు. ఏదో ఒక నమస్కారం చేస్తే చాలు. ఆ నమస్కారమే పాపాలను పోగొట్టి శుభములను ఇస్తుందని యామునాచార్యుల వారు చెప్పారు. పూలకోసం దేశమంతా శ్రమపడి తిరగనవసరం లేదు. మనసునే పూవుగా సమర్పించండి అని శంకర భగవత్పాదులు చెప్పినారు. అహింస, ఇంద్రియనిగ్రహం, సర్వభూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, ధ్యానము సత్యము అనే ఎనిమిది పూవులంటే విష్ణువుకు ఇష్టమట.
వాయనాల్ పాడి= నోటితో కీర్తించి మనసుతో ధ్యానిద్దాం అని గోపికలు పిలుస్తున్నారు. మనత్తినాల్ శిన్దిక్క= మనఃపూర్వో వాగుత్తర, ముందు మనసులో ధ్యానించి తరువాత మాటతో కీర్తించాలి. ఆ విధంగా భగవంతుని చూచి, పాడి, ధ్యానిస్తే పాపాలన్నీ దగ్ధమైపోతాయి.
పోయపిళ్లైయమ్ పుగుదరువానినర్ఱనవుమ్ నీయనిల్ తూశాగుమ్ = ముందుచేసిన పాపాలు రాబోయే పాపాలు కూడా దగ్ధమైపోతాయి. పాపాలు మూడు రకాలు సంచితములు, ప్రారబ్దములు, ఆగామి. ఇంతకుముందున్న జన్మలో మనం చేసిన కర్మలకవల్ల కలిగే పాపాలు సంచితములు. ఈ జన్మలో ఈ శరీరంతో తెలిసి తెలియక, కలలో చేసిన పాపాలు ప్రారబ్దము. ఈ జన్మలో చేసినది, అంతకు ముందు నిలువ ఉన్నది, రాబోయే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అదే ఆగామి. ఈ మూడూ భగవంతుని చేరగనే దూదిరాశి నిప్పుతో తగలబడిపోయినట్టు కాలికూలిపోతాయి. దూదిరాశిలో నిప్పు కణిక వేస్తే మొత్తం ఏ విధంగా ఎంత వేగంగా చూస్తుండగానే దగ్ధమైపోతుందో భగవంతుని ధ్యానంతో పాపాలు కూడా ఆ విధంగానై కాలిపోతాయని గోదాదేవి అద్భుతమైన పోలిక చూపుతారు ఈ పాశురంలో.
శ్రీ భాష్యం గోపాలాచార్య స్వామి దీనికి మరొక హృద్యమైన భాష్యం చెప్పారు. ఒక విలుకాడు బాణాలను పట్టుకుని యుద్ధానికి పోతాడు. బాణంతీసి విల్లులో సంధించి విడుస్తాడు. మరొకటి విడవడానికి సిద్ధంగా పట్టుకుంటాడు. మరికొన్ని అమ్ముల పొదిలో ఉంటాయి. బాణము వదిలిన తరువాత శత్రువు శరణంటే రెండో బాణం వేయడు. అమ్ములపొదిలో బాణం తీయడు. విడిచిన బాణం ముందుకు పోవలసిందే. వెనకకు మరలదు. ఆగామి కర్మ చేతిలో ఉన్నబాణం వంటిది. సంచిత కర్మ అమ్ములపొదిలోబాణం. ప్రారబ్దం వేసిన బాణం. ప్రారబ్ద కర్మ పూర్తికాగానే సాయుజ్యం లభిస్తుంది. పాపాలకు భయపడే పనిలేదు, భగవంతుడికీర్తి పాడదాం రండి అని గోదమ్మపిలుస్తున్నదీ పాశురంలో. ఎంతగొప్ప ఆలోచన? ఔననిపించే పోలిక.
మనం ఇంత మంచి వ్రతం చేయడానికి బయలుదేరాం కదా ఏదైనా విఘ్నం వస్తే అని ఒక గోపిక సంశయం వ్యక్తం చేసింది. రాముడి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయిస్తే వనవాసానికి వెళ్లవలసి వచ్చింది కదా అని వాదించినదట. పద్మంమీద వాలి మధుపానం చేసి మత్తిలి నిద్రిస్తే చీకటిపడగానే ముకుళించిన పద్మంలో బందీ అయింది. మధ్యరాత్రి లేచి బయటకు వెళ్లే దారి లేక సూర్యకిరణాలతో పద్మం వికసించగానే వెళ్లొచ్చులే అని నిద్రలోకి వెళ్లిపోయిందట. కాని తెల్లారకముందే స్నానానికి వచ్చిన మదపుటేనుగు పద్మాన్ని పీకి విసిరేందంట. తుమ్మెద ప్రాణాలు కోల్పోయింది. ఈ సంశయానికి గోదాదేవి ఈ పాశురంలోసమాధానాలిచ్చారు. ఇటువంటి వన్నీ కర్మఫలితాలు.
కర్మల ఫలితాన్ని అనుభవించకతప్పదని పెద్దలు అంటారు. కర్మను అనుభవించకుండానే నశిస్తాయని ఉపనిషత్తులంటున్నాయనివివరిస్తున్నారు. ఏది నిజం? అని ఒక గోపిక అడిగితే వేదాంతం తెలిసిన మరొక గోపిక వివరణ ఇది:
‘కర్మకు చేతనం లేదు. అదే ఫలితం ఇవ్వదు.కర్మ చేసిన తరువాత కొంతకాలానికి ఫలితం వస్తుంది. ఫలం ఇచ్చేది కర్మ కాదు. భగవంతుడు కర్మ ఫలాన్ని స్తాడు. శృతి స్మృతి మనకు ప్రవర్తనా నియమావళి చెప్పే శాసనాలు. ఆ విధంగా ప్రవర్తిస్తే భగవదనుగ్రహం కలుగుతుంది. అది సుఖం. అది తప్పి ప్రవర్తిస్తే ఆగ్రహం కలుగుతుంది. అది దుఃఖం. మన పట్ల ప్రీతి కలిగిన తరువాత బుద్ధిపూర్వకంగా కాకుండా ప్రమాదవశాత్తూ చేసిన కర్మలను ఎరుగజాలని వాడు గనుకనే విష్ణువును అవిజ్ఞాతా అనే పేరుతో సహస్రనామాల్లో కీర్తిస్తాం’.
అన్నమయ్య అన్నది
‘‘భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుకొనబోవు నీవు నీవు వద్దనక’’ అంటాడు అన్నమయ్య. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధ్యం అని ప్రకటించే కీర్తన ‘‘అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీశరణిదెజొచ్చితిని’’. కట్లు కోయనివి, కొరికలు తీరనివి. అంతర్యామి తెంచితేనే తెగుతాయి. ‘‘జనుల సంగములు జక్క రోగములు విను విడువవు నీవు విడిపించక, వినయపు దైన్యము విడువని కర్మము, చనదది నీవిటు శాంతపరచక’’ అట్లాగే మదిలో చింతలు మైలలు మణుగులు… అవికూడా ‘వదలవున నీవవి వద్దనక. ఎదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె అదన గాచితివి అట్టిట్టనక..’ అని అన్నమయ్య శరణాగతి చేస్తాడు వేంకటేశునికి. ఆయన అదన గాచకపోయినా, అట్టిట్టు అన్నా మనకు దారి లేదు. కర్మము కూడా ఆయన దయ ఉంటేనే విడుస్తుంది. మనసుకు శరీరానికి పట్టిన రోగాలు మైలలు ఎన్నో అవన్నీ నీవే వదిలించాలని అని కోరుకుంటున్నాడు అన్నమయ్య. సరిగ్గా గోదమ్మఇదే చెప్పింది తన అయిదవ తిరుప్పావై తమిళ పాశురంలో.
వెనుకటి పాపాలు, ముందు రాబోయే పాపాలు భగవద్దర్శనంతో పోతాయి. అంటే ప్రారబ్దం పోనట్టే కదా. శ్రీకృష్ణ సంయోగం కోసం అందాకా ఎదురుచూడాల్సిందేనా అని ఒక గోపిక అడిగింది. నారాయణుడే ఉపాయమని నమ్మితే ప్రారబ్దమును కూడా నాశనము చేసి తనతో సంశ్లేషము ఇస్తాడు. అగ్ని దహిస్తుంది. అది నిజమే. దానికి తిరుగులేదు. కాని నీరున్న చోట అగ్ని దహించే ప్రసక్తేలేదు. కర్మలు ఫలములిస్తాయి నిజమే. కాని భగవంతుని కాక ఇతరములను ఆశ్రయిస్తే కర్మలు ఫలాలనిచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. కాని భగవంతుడే ఉపాయమనుకున్నప్పుడు ఆ అవసరం లేదు. శ్రీ కృష్ణుడిని చేరడానికి కర్మలు ప్రతిబంధకాలు కావు అని గోపికలు వివరిస్తారు. మాయావీ, మథురానాయకా, యమునా తీర విహారీ, నందవ్రజమంగళదీపా యశోదాగర్భ ప్రకాశకా, దామోదరా అని కీర్తిస్తే చాలు. మన పూర్వపాపాలు ఆగామి పాపాలు పోతాయి. నామ సంకీర్తనముచేత పాపాలు పోతాయి అని సందేశం.
అయిదో పాశురంలో భగవంతుని స్థానం అర్చారూపంగా మనముందుంచారు. జీయర్ స్వామి వారు పూజకు నిబంధనలేమీ లేవని, ప్రేమతో అచంచలమైన విశ్వాసంతో పలికి మాటలే మంత్రాలని, ప్రేమతో చేసిన సేవలే ఆరాధన అనీ, మీరు ఎంచుకున్నవిగ్రహంలోనే విశ్వాన్ని నడిపే శక్తి ఉందని ఆండాళ్ ఈ పాశురంలో వివరించారు.
21.12.2023మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 6
కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
తెలుగు మాడభూషిశ్రీధర్ భావార్థ గీతిక
కీచకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు
గోపురశిఖరాల శంఖారావములు జనుల పిలుచు
మాయమాత పూతన స్తనవిషప్రాణముల పీల్చినాడు
కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు
క్షీరసాగరశయను యోగనిద్రలో లోకాల కల్పించినాడు
యోగిహృధ్యానగమ్యు మునుల మనములమనెడువాడు
ఎక్కడకదులునోనయని ఎడదపట్టి రుషులు లేచినారు
భక్తితాపసుల హరిహరి ధ్వనులు వినుడు మేలుకొనుడు
అర్థం
పుళ్ళుం =పక్షులు కూడా, శిలమ్బిన కాణ్ = కూయుచున్నవి కదా, పుళ్ళరైయన్ =గరుడవాహనుని, కోయిలిల్ =కోవెలలో, వెళ్ళై =తెల్లని, విళి శంగిన్ =ఆహ్వానిస్తూమోగే శంఖపు, పేరరవం= పెద్ద శబ్దమును కూడా, కేట్టిలైయో=వినబడడం లేదా, పిళ్ళాయ్! =ఓ చిన్నారీ, ఎళుందిరాయ్ = లేవమ్మా, పేయ్ =పూతన యొక్క, ములై =స్తనములోని, నంజుండు= విషము తీసుకుని, కళ్ళచ్చగడం =కృత్రిమ శకటపు, కలక్కళియ =కీళ్లు విరిగేట్టు, క్కాలోచ్చి=కాలుచాచి ధ్వంసం చేసి, వెళ్ళత్తరవిల్ = పాల సముద్రంలో శేష శయనంపై, తుయిల్ అమరంద =యోగనిద్రలో అమరియున్న, విత్తినై = జగత్కారణ భూతుడైన, ఉళ్ళత్తు క్కొండు= తమ మనసులో ధ్యానించి, మునివర్గళుం =మునివరులు, యోగిగళుమ్ = యోగి వరులు, మెళ్ల = మెల్లగా, ఎళుందు =లేచి అరి ఎన్ఱ = హరి హరి హరి అనే, పేరరవం= పెద్దధ్వని, ఉళ్ళం పుగుందు =మాలో ప్రవేశించి, కుళిరుందు =చల్లబరిచింది.
ఆరునుంచి 15 దాకా పదిమంది గోపికలను, ఆళ్వారుల ప్రతీకలుగా భావించి మేలుకొలుపుతున్నారు.పెద్దలు తపస్వులు ఆలోచించిన కొద్దీ కొత్త కోణాలు ఆవిష్కారమయ్యే అద్భుత కవితలు గోదా పాశురాలు.
నేపథ్యం
గోదమ్మ ఒక గోపిక, తన పల్లెలో ఉన్న మిగిలిన యువకులు కూడా గోపికలే. తిరుప్పావై వ్రతం ఎందుకంటే భగవంతుని సాన్నిధ్యం సాధించడానికి. వర్షం దానంతట అది కురవవలసిందే, భగవంతుడి దయఉంటేనే సాధ్యం. కనుక భగవన్ సాన్నిధ్యం కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. ముందా కోరిక ఉండాలి. అప్పుడు అర్హత వస్తుంది. ఉపాయం సర్వేశ్వరుడే అని మొదటి పాశురంలో చెప్పారు. ప్రేమతో చేస్తే సాధ్యమే అని రెండో పాశురం వివరించింది. ఉపకార స్మృతి ఉండి ఒకరినొకరు సహకరించుకుంటూ కృతజ్ఞతతో వ్రతం చేయాలని మూడో పాశురం చెప్పింది. భగవానుడినే ఆశ్రయించాలని నాలుగో పాశురం, ప్రతిబంధకాలు రాకుండా ఆపేశక్తి కూడా భగవానుడే అని అయిదో పాశురం చెప్పింది. ఆరునుంచి 15 దాకా పదిమంది గోపికలను, ఆళ్వారుల ప్రతీకలుగా భావించి మేలుకొలుపుతున్నారు. అందరూ తెల్లవారుఝామున లేచి రావాలని ముందే అనుకున్న తరువాత ఒకరు లేవడం, మరొకరు నిద్రించడం ఏమిటి అనే మనకు వచ్చేఒక సాధారణ సందేహానికి జీయర్ స్వామి మంచి సమాధాన చెప్పారు. లోపలున్న గోపికకు, బయట నుంచి నిద్రలేపుతున్న గోపిక (గోద)కు శ్రీకృష్ణప్రేమలో ఎక్కువ తక్కువలేమీ లేవు. లోపలి గోపికది సాత్విక నిద్ర. స్థితప్రజ్ఞులు అందరూ నిద్రించినపుడు మేల్కొని, అందరూ మేల్కొన్నపుడు నిద్రిస్తారు, ప్రాపచిక విషయాల్లో జ్ఞానం వారికి లేకపోయినా భగవంతుడి విషయంలో జాగరూకులై ఆవైపు నడిపించేవారు. అటువంటి భక్తురాలిని వెంట తీసుకువెళితే భగవంతుడి ధయ తొందరగా కలుగుతుందని ఆమెను సాత్విక నిద్రలేపుతున్నారు గోదమ్మ. పెద్దలు తపస్వులు ఆలోచించిన కొద్దీ కొత్త కోణాలు ఆవిష్కారమయ్యే అద్భుత కవితలు గోదా పాశురాలు.
అంతరార్థం
ఆకాశం అంటే విస్తరించిన భగవత్తత్త్వం. ఆ ఆకాశంలో రెండురెక్కల పక్షులు విహరిస్తున్నాయి, పొద్దున్నే కిలకిలారావాలతో తెల్లవారిందని సూచిస్తూజీవరాశిని లేపుతున్నాయి. “పుళ్ళుం శిలమ్బిన కాణ్” (పక్షులు అరుస్తున్నాయ్). జ్ఞానము, దానికి ఉచితమైన ఆచరణ అనేవే రెండు రెక్కలు అంటున్నారు చినజీయర్ స్వామి, భగవత్తత్త్వంలో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే.
“పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్!” ఓ చిన్నారి అమ్మాయీ పక్షులన్నిటికీ రాజు గరుడుడు, ఆయనకు స్వామి విష్ణువు. ఆయన ఆలయంలో తెల్లని శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా అని గోపికపిలుస్తున్నది. తెల్లవారిందనడానికి మరో ప్రమాణం చూపుతున్నది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి మెరుస్తుందని గోదమ్మ ఆలయ సన్నివేశాన్ని మన ముందుంచుతున్నారు. శంఖం ఓంకార రవం చేస్తుంది. ప్రతిజాముకీ వినిపించే ధ్వనే ఇది. ఇంకా తెల్లవారలేదేమోఅన్నట్టు ఇంకా కళ్లు మూసుకునే ఉంది. అందుకే “ఎళుందిరాయ్”- మేలుకో అంటున్నది బయటి గోపిక. “మునివర్గళుం యోగిగళుం మెళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్” మునులూ, యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటున్నారు అదీ వినిపించడం లేదా? ఇక్కడ మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది.
అహంకారమే విషం
1. “పేయ్ములై నంజుండు” పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు-ప్రకృతి మనకు ఇచ్చే “అహం-మన” అనే విషాలను హరించే హరీ.. అని జ్ఞానులు తలుస్తున్నారు.
మనశరీరమే బండి
2. “కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి” శ్రీకృష్ణుడుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, కంసుడుపంపితే శ్రీ కృష్ణుని సంహరించాలని ఒక అసురుడు బండిపై ఆవహించాడు. ఆ పిల్లవాడు కాలు చాచినంత మాత్రంచేత బండి ఎగిరిపోయింది. అసురుడి కాలం తీరింది. పాపపుణ్యాల చక్రాల మీద నడిచే బండి మన శరీరం. మనల్ని నడిపించే పరమాత్మపాదాల కింద మన శరీరం అనే బండిపెట్టి చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించే హరీ.
అయిదు జ్ఞానాలు
3. “వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు” – ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు – అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. 1. నేను వాడికి చెందిన వాడిని. 2. వాడు నన్ను తరింపచేయువాడు, 3. వాడిని చేరే సాధనం వాడి శరణాగతే, 4. వాడిని చేరితే కలిగే ఫలితం వాడి సేవ, 5. వాడిని చేరకుండా ఉంచే ఆటంకం వానియందు రుచిలేకుండమే అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి.
తొలి ఆళ్వారుకు మేలుకొలుపు
ఆరోరోజునుంచి గోదమ్మ వరసగా రోజుకొకరుచొప్పున పదిమంది గోపికలను నిద్రలేపుతున్నారు. విష్ణువు ఆలయంలో మూలమూర్తి భగవానుని విగ్రహంతోపాటు భక్తులైన ఆళ్వార్ల విగ్రహాలను కూడా ప్రతిష్టిస్తారు. ఆళ్వార్లు ప్రధానంగా పదిమంది. మరో ఇద్దరిని కూడా చేర్చి పన్నిద్దరాళ్వార్లు అన్నారు. అయినా మొదటి పదిమంది ప్రముఖులు. ప్రదక్షిణ చేస్తూ ఈపదిమంది భక్తగురువులను చూచి అమ్మవారిని దర్శించిన తరువాత మూల పెరుమాళ్ ను దర్శించాలన్నది పద్ధతి. భగవంతుడుగురువు ద్వారా లభించాలి. భగవంతుడి దయవల్లనే అపార జ్ఞానం కలిగిన ఆళ్వార్ల కరుణ మన మీద పడితుంది అప్పుడే యోగ్యత సిద్ధిస్తుంది. ఆళ్వార్ల చూపు మనమీద పడాలి.
జ్ఞానం ఆచరణ అనే రెక్కలు
పరబ్రహ్మమనే ఆకాశములో విహరించడానికి జ్ఞానము ఆచరణ అనే రెండు రెక్కలు అవసరం. ఆ రెక్కలుగల మహాత్ములే పక్షులు. వారి కలకలరావములు వారి అధ్యయన ఉపదేశాలనే ప్రక్రియలు. జ్ఞానముతోపాటు ఆచరించిన వారే తత్వ ఉపదేశము చేయగలుగుతారు. తెల్లవారుతున్నదని ముందే తెలుసుకుని నిద్రలేచి ఇతరులను మేలుకొలిపేవి పక్షులు. తాము భగవదనుభవముచేసి తమ వాక్కులద్వారా ఇతరులకు కూడా భగవదనుభవము కలిగించడానికి మేలుకొలిపేవారు జ్ఞానులు. పక్షులు జ్ఞానానికి మార్గదర్శకులు ప్రేరకులు అని చెప్పే అద్భుత వ్యాఖ్యానాన్ని శ్రీ భాష్యం వారు వివరించారు.
జానశృతి కథ
జానశ్రుతి అనే ఒక రాజు, ధార్మికుడు, దాన శీలి. ఇద్దరు బ్రహ్మజ్ఞానులుహంసల రూపంలో ఆకాశంలో విహరిస్తూ ఆయన రాజ భవనం మీదుగా వెళ్తున్నపుడు, ఆయన బ్రహ్మజ్ఞానం లో శ్రద్ధ లేని వాడు అని ఇద్దరు అనుకున్నారట.అతని గొప్పదనం గురించి వారు ఇలా మాట్లాడుకుంటూ… ‘‘జానశృతి పడుకున్నాడు కదా మన నీడ పడేట్టు ఆయన భవనం మీదుగా పోవడం ఉచితం కాదు పక్కనుండి పోదాం’’ అని ఒక హంస అంటే, ‘‘ఆయనేమయినా రైక్వుడా భయపడడానికి’’, అని మరో హంస జవాబిచ్చింది. ఈ సంభాషణ విన్నాడు జానశృతి. ఆ భాష తెలిసిన జానశృతి ఈ రైక్వుడెవరో తెలుసుకోవాలని రాజు దూతలను పంపాడు. అన్వేషించాడు. అడవిలో సంసార వాసనలకు పూర్తిగా దూరంగా ఓ బండి కింద పిచ్చివాడిలా గోక్కుంటూ కనిపించాడట రైక్వుడు. రాజు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోయాడు. అతన్ని దర్శించి జ్ఞానోపదేశం చేయమని కోరుకున్నాడు. సర్వస్వం దక్షిణగా సమర్పించుకున్నాడు. బ్రహ్మజ్ఞానం సంపాదించాడు. ధార్మికుడైన భక్తుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రేరణను కల్పించే మహాత్ములు పరమహంసలు. ఇది ఉపనిషత్తులోని ఒకకథ. తెల్లవారుతున్నదని చెప్పిభగవదనుగ్రహం పొందే సమయం అయిందని హెచ్చరిస్తున్నాయి పక్షులు. ఆ విషయాన్ని సంకేతమాత్రంగా ప్రతిపాదించారు గోదా దేవి.
కౌసల్యకు గోరువంక సాయం
కౌసల్య అంతఃపురంలో చిలుక గోరువంక ఉన్నాయట. రెండూ మాట్లాడుతూ ఉంటాయి. ఒక సారి భగవంతుడికి నివేదించడానికి సిద్ధంగా ఉంచిన ఆహారాన్ని ఒక పిల్లి తినబోతూ ఉంటే గోరువంక ‘‘శుక, పాద మరేః దశ’’ ఓ చిలుకా ఆ శత్రువుపాదాన్ని కొరుకు అని పిల్లితినకుండా ప్రసాదాన్ని రక్షించి కౌసల్యకు సహాయం చేసింది. అరణ్యంలో రాముడు ఈ విషయం గుర్తుచేసుకుంటూ లక్ష్మణుడితో… గోరువంక చేసిన సాయమైనా నేను నా తల్లికి చేయలేకపోయానే అని బాధపడతాడట. చిలుక భగవత్తత్వము. గోరువంక శారిక ఆచార్యతత్వము, శారిక స్త్రీ అంటే భగవత్పరతంత్ర అయినది. భగవంతుడికినివేదించిన పదార్థము ఆత్మతత్త్వము. పిల్లి వలె పొంచి ఉండి హరించేది మాయ. గోరువంక వలె ఆచార్యుడు భగవంతుడితో ఈ మాయ నుంచి రక్షించాలని వేడుకుంటాడు. అదే ఆచార్యుడుచేసే ఉపకారం అని శ్రీ భాష్యం వారు వివరించారు. భగవంతుడిని ఆచార్యుని విశిష్ట లక్షణాలను ఈ పాశురంలోకూడా వివరిస్తున్నారు గోదమ్మ.
పక్షిరాజైన గరుడికి ప్రభువు నారాయణుడు. నారాయణుని ఆలయసేవకు వేళ అయిందని తెలిపేది తెల్లని శంఖం, శంఖ ధ్వని వినబడడం లేదా అంటున్నారు గోపికలు.
పూతన కథ
పూతన స్తనాల్లో విషాన్ని ఆరగించి (పేయ్ ములై నంజుండు), శకటాన్ని ఆవహించిన అసురిడిని కీళ్లూడే విధంగా తన్ని (కళ్లచ్చగడం కలక్కళియక్కలాలోచ్చి), క్షీరసాగరంలో శేషశయ్యమీద నిద్రిస్తున్న కారణభూతుని (వెళ్లత్తరవిల్ తుయిలమర్ న్ద విత్తినై) మనసునిండా నింపుకుని (ఉళ్లత్తుక్కొన్డు) మునులుయోగులు నెమ్మదిగా లేస్తూ (మునివర్ గళుమ్ యోగి గళుమ్ మెళ్ల వెళున్దు) హరి హరీ హరీ అని చేసే పెద్ద ధ్వని లోనికి ప్రవేశించి చల్లబడ్డారట (అరియెన్ఱ పేరరవమ్ ఉళ్లమ్ పుగున్దు కుళిర్ న్దు).
లోపలున్న అమ్మాయి (గోపిక)కు భగవత్ప్రేమ పరిపూర్ణంగా ఉంది. ఆ ప్రేమను తానే అనుభవిస్తున్నది. ఆమె తమలో కలిస్తే గాని బయటి గోపికలకు తృప్తి లేదు. ఇటువంటి వారిని పదిమందిని కలుపుకునిపోవాలని ప్రయత్నం. కృష్ణుడికి వచ్చిన కష్టాలు చెబితే తనంత తానే ఆమె బయటకు వస్తుందని, ఆమెతోపాటు మంగళా శాసనం చేయవచ్చునని అనుకుంటూ ఆ విషయాలు చెబుతున్నారు. ఒంటరిగా భగవత్సంధానం చేయడం కన్న గోష్టిలో సమిష్ఠిగా ప్రయత్నించడం మిన్న.
Also read: వెన్నెలలు కురిసే చాలా మంచి రోజులివి
పూతన తల్లి రూపంలోపాలిచ్చే నెపంతో వచ్చింది. శ్రీ కృష్ణునికి ప్రేమతో పాలివ్వాలని కాదు, చంపడానికి పాలు ఇస్తున్నట్టు నటిస్తున్నది. ఆమెకు అంతఃశుద్ధి లేదు. బాహ్యవేషం ఉంది. తనకు ప్రేమతో అర్పించే వారి నివేదనను ఏ విధంగా స్వీకరిస్తాడు? అంతఃశ్శుద్ధి లేకపోయినా నటనకోసం నివేదించినా శ్రీ కృష్ణుడు స్వీకరిస్తాడట. భగవంతుడి యందు ప్రీతి ఉన్నట్టు నటించినా ఆయనకు సంతోషమే. అందుకే పూతన స్తన్యంలో విషపూరిత పాలను స్వీకరిస్తాడు. అమృతత్వాన్ని ఇస్తాడు, కాని ఆయనకు అది విషం కాదు. విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చినపుడు, అతను నిజంగానే రాముడిని ఆశ్రయిస్తున్నాడా, లేక మిత్రభావం నటించి మోసం చేస్తాడా అని అనుమానించారు కొందరు. రాముడు మాత్రం ‘‘సకృదేవ ప్రపన్నాయ తవాస్మిచ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతం మమ’’ శరణన్నవారిని నేను వదలను అది నావ్రతం. అతను మిత్రభావం ఉన్నట్టు కనబడుతున్నాడు ఒకవేళ అది నటనే అయినా సరే నేను వదలను ‘‘మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన’’ అని ఆశ్రయమిచ్చాడని శ్రీభాష్యం ఈ పాశుర వివరణలో చెప్పారు. పరమాత్ముడికి పాలు విషము అనే తేడా లేదు.
పూతన ప్రకృతి
పూతన ప్రకృతికి ప్రతీక. ప్రకృతి తల్లి వలెఉంటుంది కాని నిజమైన తల్లి కాదు. అహంకార మమకారాలనే స్తనముల ద్వారావిషయభోగములనే విషమిచ్చి చంపదలుచుకునే ప్రకృతి. విషము విషయమునకుతేడా ఒక్క య అనే అక్షరమే. విషం తాగితేనే చంపుతుంది. విషయం మాత్రం స్మరించినందుకుచంపుతుంది. విషయమనే పాలు నేను సంపాదించి నేను నా ధారకం కోసం తాగుతున్నాను అనుకుంటే అది విషమవుతుంది. ఆవులు ఇచ్చిన పాలు, నా హృదయంలో ఉన్న శ్రీ కృష్ణుడికివ్వడానికే తాగుతున్నాను. అనే భావంతో అర్పిస్తే మనకు ప్రకృతి అంటకుండా, మాయను నశింప చేసి రక్షిస్తాడు. అందుకే కృష్ణార్పణం అని పదేపదే అనుకోవడం. ఆ కృష్ణుడిని ధ్యానిస్తూ యోగులు హరీ అని నిద్రలేస్తున్నారు.
శకటాసుర సంహారి
ఏదో చిన్న పని చేసుకుని వచ్చే లోపల కొడుకు కు రక్షగా ఉంటుందనుకుని క్రిష్ణయ్యను బండి కింద పడుకోబెట్టిందట యశోదమ్మ. ఆ బంఢిమీదే అసురుడు ఆవేశించాడు. క్రిష్ణయ్యనే చంపబోయాడు. సహజంగా పాలకోసం కాళ్లుచేతులు విసురుతున్నాడు క్రిష్ణయ్య. ఆ విసురుకు చాచిన కాలు తాకి బండి కీలూడి ముక్కలైంది. దుఃఖాలుంటాయి. శ అంటే సుఖము, కటముఅంటే పోడగొట్టేది. సుఖం అంటే పరమాత్మానుభవం. దానికి ఆటంకం కలిగించేది శరీరం. కృష్ణుడి కాలుతగిలేతే ఈ శకటం విరిగిపోతుంది. లేకుంటే సుఖదుఃఖాల కలిగించే సుకృత దుష్కృతాలనేరెండు చక్రాల బండి తిరుగుతూనే ఉంటుంది. మనంచేసే కర్మలను శ్రీ మన్నారాయణుడి చరణాలకేఅర్పిస్తే కర్మలు శ్రేయోదాయకమవుతాయని, కర్మలను హరించి శరీరబంధాన్నీ హరించే హరీ అని మునులు యోగులు కీర్తిస్తూ ఉన్నారు.
ఆండాళ్ – అన్నమయ్య
అన్నమయ్య ఒక కీర్తనలో ‘‘పాపపుణ్యముల రూపము దేహమిది దీని దీపనం బణగింపఁ దెరు వెందు లేదు’’ అని పల్లవిలో దేహాన్ని వివరిస్తాడు.
చరణములు:
అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోని దేహాభిమానంబు విడుచుటకు
రతిపరాఙ్ముఖుడు గాక రవణంబు లేదు
సరిలేని మమకారజలధి దాఁటినఁగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగు బ్రహ్మానంద పరుఁడుఁ దాఁగాఁడు
అని పరబ్రహ్మచరణాలే గతి అనే భావాన్ని ప్రకటిస్తాడు.
‘‘వైష్ణవులుగానివార లెవ్వరు లేరు, విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన’’ అనే పల్లవితో సాగే మరొక కీర్తనలోని ఒక చరణంలో అన్నమయ్య- ‘‘యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి యెవ్వరిఁ దలచిన నేమి అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా- రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు’’ శ్రీ హరిని తలచుకుంటేనే యెరుక దోచుతుందని వివరిస్తారు. అన్నమయ్య పదాలలో ఆండాళ్ పాశురాల అద్వైతం గోచరిస్తుంది.
లక్ష్మణుడూ భరతుడూ
లోకంలో అవతరించడానికి గాను సిద్ధంగా భగవంతుడు పాల సముద్రంలో ఎదురుచూస్తూ ఉంటాడట. అదే జగత్కారణ తత్వం. ఈ జగత్తును జనులను ఏ విధంగా రక్షించడమా అని విష్ణువు చింతించడమే యోగనిద్ర. జీవులను ప్రకృతితో సంధించడమే సృష్టి. అందుకుచేసే సంకల్పమే యోగనిద్ర. సర్వజగత్కారణభూతుడు జగద్రక్షకుడే ఆపదలను హరించాలని హరీ అని స్మరిస్తూ యోగులు మునులు లేస్తుంటారు. ముని అంటే భగవద్గుణానుభవం చేస్తూ మరే వ్యాపారమూ చేయడు. యోగి అంటే భగవంతుడికి నిరంతర సేవ చేసేవాడు. లక్ష్మణుడు కర్మయోగి రాముని సన్నిధిలో ఉండికైంకర్యములుచేస్తూ ఉంటాడు. భరతుడు ముని. మనసులోనే రాముని గుణవైభవాన్ని మననంచేసుకుంటూ ఉంటాడు. నందవ్రజంలో యోగులు మునులు ఉన్నారా అని సందేహిస్తే, శ్రీ కృష్ణుడే అవతరించి పొద్దున్నే పశువులను తీసుకువెళ్లి మేత మేపి, సాయంత్రం తీసుకువచ్చి కట్టేసే పని చేస్తూ ఉంటే ఆ కొట్టాలలో మునులు యోగులు కాచుకుని ఉండేవారట. గర్భస్థ శిశువుకు ఏమీ జరగకుండా ఉండాలని నెమ్మదిగా లేచే గర్భిణి వలె పరమాత్మను హృదయంలో నింపుకున్న మునులు యోగులు భారంగా మెల్లగా లేస్తారట.
ప్రహ్లాదుని హృదయవాసి
ప్రహ్లాదుడిని పర్వతం నుంచి కిందికి తోసినప్పుడు తన హృదయంలో ఉన్న హరికి ఏమవుతుందోనని హృదయాన్ని గట్టిగా పట్టుకుని దెబ్బతగలకుండా కాపాడుకుంటూ ఆయన జాగ్రత్తగా కింద పడిపోయాడట. తమను రక్షించే పరమాత్ముడిని తాము రక్షించాలనుకునే వెఱ్ఱి ప్రేమ వారిది. అంతమంది యోగులు మునులు పొద్దున్నే హరి హరి హరీ అంటూ ఉంటే అది నందవ్రజంలో పెద్ద ధ్వనిగా మారిందట. అది చెవుల ద్వారా మనసులో ప్రవేశించడం వల్ల అక్కడ కృష్ణుడు లేక బీటలువారిన క్షేత్రం చల్లబడిందట. అప్పుడు మేల్కొన్నారట, నీవుకూడా మేలుకో అంటున్నారు గోపికలు.
పదిమంది ఆళ్వారులను మేలుకొలపడం ఈ పాశురంతో ప్రారంభమైంది. ఆళ్వారుల పేర్లు.
1. పోయిగై (పోయ్గై )ఆళ్వారు, (సరోయోగి)
2. పూదత్త ఆళ్వారు, (భూతయోగి)
3 పేయాళ్వారు, (మహాయోగి)
4. తిరుమశిశై ఆళ్వారు (భక్తిసారులు)
5. నమ్మాళ్వారు, శఠగోపులు
6. కులశేఖర ఆళ్వారు
7. పెరియాళ్వారు (భట్టనాథులు, విష్ణు చిత్తులు)
8. తొండర్అడిప్పొడి (భక్తాంఘ్రిరేణువు, శ్రీపాదరేణువు, విప్రనారాయణ)
9. తిరుప్పాణి యాళ్వార్ (యోగి వాహనులు)
10. తిరుమంగైఆళ్వారు (పరకాల)
ఆ తరువాత గోదాదేవిని మధురకవిని చేర్చి 12 మంది ఆళ్వారులు అంటారు. శ్రియఃపతి అయిన నారాయణునికే మంగళాశాసనము చేసిన వారు కనుక విష్ణు చిత్తులు అందరినీ మించి పెరియ (పెద్ద) ఆళ్వారు అయినారు. ఆళ్వారులనే ఆచార్యుల అనుగ్రహం లేకుండా భగవంతుడి దయకలుగదని, ఆండాళమ్మ ఈ పది మంది ఆళ్వారుల దయ సాధించడానికి వ్రతంలో ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు గోద తన తండ్రి పెరియాళ్వార్ ను మేలుకొలిపారు. ఈ పాశురం మంత్రం‘అస్మద్గురుభ్యోన్నమః’.
బాపు రేఖ, మాడభూషి శ్రీధర్ వ్యాఖ్య: శకటాసుర సంహారీ, శౌరీ
పసి బాలుడు క్షేమంగా ఉండాలని రక్ష కట్టి తల్లి యశోద నిశ్చింతగా ఉంది.
కాని శకటాసురుడి వంటి రాక్షసుడు వస్తాడని ఆమెకేం తెలుసు.
ఒక ఊపులో తాకిన తన్ను తనను నుజ్జు నుజ్జు చేస్తుందని వాడు ఊహించలేకపోయాడు.
బాలుడే అయినా చిన్నవాడు కాడని, యశోద ఊహకు మించిన పెద్దవాడని,
శకటాసురుడు ఎంత పెద్ద రాక్షసుడైనా బాలకృష్ణుని ముందు ఆట బొమ్మే అని ఈ బాపు బొమ్మ చెప్పకనే చెబుతున్నది.
నిద్రించిన యశోద ముఖంలో నిశ్చింత,
బాలుని లేత కళ్లలో చిరుకోపం
బాపు కుంచెకు ఎలా తెలిసాయోకదా?
స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్
Also read: ఆండాళమ్మ పాదాలకు బాపు పారాణి