Sunday, November 24, 2024

‘నంది’తో… కళారంగంలో విభజన ప్రతిఫలనాలు మొదలు

జాన్ సన్ చోరగుడి

రాష్ట్ర పునర్విభజన జరిగాక, గత ప్రభుత్వాల దృష్టి పడని రంగాల్లోకి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశిస్తూ- ‘Leave no stone unturned’ అనే ఆంగ్ల పద ప్రయోగాన్ని నిజం చేస్తున్నదా? అంటే, అవునని చెప్పాల్సి ఉంటుంది. ఈ మాట అన్నప్పుడు, ఏది పదేళ్ల తర్వాతా? అనే విమర్శకులు ఉంటే ఉండవచ్చు. ఐతే దాన్లో మొదటి ఐదేళ్లు ఆయన ఖాతాలోకి రాదు. ఆ తర్వాత 2000 నుంచి ‘కోవిడ్-19’ రెండున్నర ఏళ్ళను మనం మినహాయించాలి. ఆ రెండూ పోను తర్వాత మిగిలిన కాలవ్యవధిలోనే ఎవరైనా ఏదైనా చేయాలి.

అలా ఒక పక్క ప్రాధాన్యతా రంగాలపై శ్రద్ద పెడుతూనే, మానవ సంబంధాల మధ్య ఉండే మార్ధవత్వాన్ని ప్రోదిచేసే రెండు కార్యక్రమాలను ప్రభుత్వం 2023 కేలండర్ చివరి నెలలో పూర్తిచేస్తున్నది. అంటే, దానర్ధం ఇకముందు కూడా అది కొనసాగిస్తుంది. అందులో మొదటిది గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే- ‘ఆడుదాం ఆంధ్ర’ ఒకటైతే, రెండవది నాటక రంగానికి ప్రోత్సాహమిచ్చే ‘నంది నాటకోత్సవాలు’ – క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరులో జరగనున్నాయి.

ఎందుకు ఈ రెండు కార్యక్రమాలను ఇప్పుడు కొత్తగా అలా వర్గీకరించవలసి వచ్చింది అన్నప్పుడు, ఇక్కడ ఒక మాట చెప్పాలి. మన దైనందిన జీవితంలో ఆర్ధిక అంశాలు, సామాజిక అంశాలకు ఉండే ప్రాధాన్యత ఎటువంటిదో మనకు తెలిసిందే. అయితే- సమూహాల- ‘లీజర్ మేనేజ్మెంట్’ విషయంలో ప్రభుత్వాల జోక్యం అనేది అరుదైన అంశం.

టి విజయకుమార్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, తదితరులు.

సున్నితాలు తెలియాలి

కేవలం సున్నితాలు తెలిసిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వాటిని ప్రభుత్వాలు గుర్తిస్తాయి తగిన కార్యాచరణకు పూనుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలు గురించి ముఖ్యమంత్రి వద్ద చర్చ వచ్చినప్పుడు, ఆయన- “నాటక రంగం మీద ముందు దృష్టి పెట్టండి. ఆ రంగంలో ఉండే నటీనటులు మధ్యతరగతి వారు, వారికి మన ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇవ్వాలి” అన్నారు అని ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ టి. విజయ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

నేరమయ వార్తలుగా…  

అదైతే నిజమే. మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సమాజాల్లో అటువంటి ‘వెంటిలేషన్’ లేనప్పుడు అంతిమంగా సామాజిక రుగ్మతలు కఠిన రూపం తీసుకుని నేరమయ వార్తలుగా అవి ఏదో ఒకరోజు బయటపడతాయి. అందుకే ఆరోగ్యకరమైన పౌర సమాజం కోసం ‘లీజర్ మేనేజ్మెంట్’ పేరుతో ఇటువంటి కార్యక్రమాలు. అయితే గ్రామీణ క్రీడల్లో ఉండే ఆహ్లాదమయినా, నాటకాల్లో ఉండే వినోదమయినా మనుష్యుల్లో కలిగించే- ‘ఫీల్ గుడ్’ మనస్థితిని కొలిచే సాధనాలను చూపమంటే, వాటిని చూపించడం మాత్రం కష్టం. రాజకీయ ప్రయోజనాల లెక్కలతో పనిలేకుండా ప్రజా సమూహాల మేలుకోసం వాటిని ‘అడ్రెస్’ చేయడం ఒక్కటే, ‘రాజ్యం’ చేయవలసింది.

క్రియాశీల పాత్ర కోసం

అందుకే ‘నంది నాటకోత్సవాల’లో కూడా కొంత కాలంగా కాలేజీ – యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు పోటీల విభాగం ఉంటున్నది. యువతరంలో నాటకరంగం పట్ల ఆసక్తి కలిగించడానికి పెద్దఎత్తున కాలేజి, యూనివర్సిటీ విద్యార్థులను ఈ నాటకోత్సవాలలో భాగస్వామ్యులను చేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. నాగార్జున యూనివర్సిటీ, మరికొన్ని ప్రయివేట్ యూనివర్సిటీల విద్యార్థుల క్రియాశీల పాత్ర కోసం చర్యలు చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం, థియేటర్ ఆర్ట్స్ శాఖల విదార్థులను నాటక సమాజాలు, ప్రేక్షకుల నుంచి ‘ఫీడ్ బ్యాక్’ సేకరించనున్నారు.

నువ్వే చెయ్యాలి…

ఈ సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఈ నాటకోత్సవాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే- “గతంలో ఇచ్చిన సినీ నంది అవార్డులపై పలు అభ్యంతరాలు చెప్పావు కనుక ఇప్పుడు నువ్వే బాగా చెయ్యి నీకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాను అన్నారు సి.ఎం. గారు” అంటారాయన. దాంతో మొదటి నుంచి కార్పొరేషన్ అధికారులుగాని, బయట నుంచి వచ్చే ఒత్తిళ్లకు గాని తావులేని రీతిలో కేవలం నటులు, నాటక సంస్థల ‘ఛాయిస్’ ప్రాతిపదికగా ప్రతిదీ జరిగేట్టుగా పోసాని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మెస్ ఏర్పాట్లు చూస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి

ఎందుకు గతం గురించి ప్రస్తావించడం అంటే, ఈ ఏడాది నుంచి కొత్తగా నాటక రంగంపై ఆసక్తిగల కళా ప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన నాటక సమాజాలు, పరిషత్తులకు రూ. 5,00,000 నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ మొమెంటోతో సత్కరిస్తూ అరుదైన గౌరవం నాటక సమాజాలకు ప్రభుత్వం కొత్తగా కల్పించబోతున్నది.

ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తూ అదే వేదికపై వ్యక్తిగత స్థాయిలో నాటక రంగంలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు- ‘ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం’ పేరుతో అవార్డు ప్రదానం చేస్తున్నది. ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తూ అదే వేదికపై వ్యక్తిగత స్థాయిలో నాటక రంగంలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నది.

ఈ రెండు అవార్డులకు విజేతలను ఎంపిక చేయడానికి ఈ ఏడాది నుంచి 2022 నంది నాటక పోటీల ప్రాథమిక, తుది పోటీల న్యాయ నిర్ణేతలు మొత్తం 27 మంది కలిసి ఎంపిక చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాటకోత్సవాలకు ఒకరోజు ముందుగా డిసెంబర్ 22 వీరు సమావేశమై తుది ఫలితాలు ప్రకటిస్తారు. నాటక ప్రదర్శనల అనంతరం 29న జరిగే నంది బహుమతుల ప్రధానోత్సవం నాడు అదే వేదికపై ఈ రెండు పురస్కారాల విజేతలకు అవార్డు అందచేస్తారు. 

గుంటూరు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం

కళాకారులకు ఆతిధ్యం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సెక్రటరీ సమాచార పౌరసంబంధాల శాఖ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “మా ఆహ్వాన కమిటీ సభ్యులు రైల్వే స్టేషన్ కు వెళ్లి వారిని పూలమాల శాలువాతో ‘రిసీవ్’ చేసుకుని మా వాహనాల్లో వారికి ఏర్పాటుచేసిన హోటల్ గదికి తీసుకువస్తారు. వారు ఆడిటోరియంకు వచ్చే సమయానికి మా వాహనాల్లో రవాణా కమిటీ సభ్యులు వారి వద్దకు వెళ్లి వారిని ప్రదర్శన కోసం తీసుకువస్తారు.

‘రిసెప్షన్’

వారి ప్రదర్శనల సమయం మేరకు వారికి తిరిగి హోటల్ కు రవాణా అందుబాటులో ఉంటుంది. ప్రదర్శన అనంతరం వారి తిరుగు ప్రయాణం సమయానికి వారికి రైల్వే స్టేషన్ కు మా వాహనాలలో ‘డ్రాపింగ్’ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. ఇలా వారికి ‘రిసెప్షన్’ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము” అన్నారు.

ఆదరణ తగ్గుతున్న ఈ రంగానికి ప్రభుత్వం నుంచి కొత్తగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహం వల్ల, మళ్ళీ దీనికి పూర్వ వైభవం లభించాలనే కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుంది. ఇటువంటి ప్రభుత్వం చొరవ వల్ల నాటక రంగంలోకి కొత్తగా యువతరం ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉంది.

 ‘రిఫ్లెక్ట్’ కావాలి

రాష్ట్ర పునర్విభజన తర్వాత 13 జిల్లాలు 26 అయ్యాయి. ఇకముందు కొత్త సమూహాలకు ‘రాజ్యం’ చేరువయ్యే పరిస్థితులు మొదలయినప్పుడు, కళా సాంస్కృతిక రంగంలో కూడా పునర్విభజన ప్రతిఫలనాలు ‘రిఫ్లెక్ట్’ కావాలి. ఇటువంటి ప్రభుత్వం చొరవ ఉన్నప్పుడు, సాంస్కృతిక రంగం మీద ఉండే పీఠాధిపత్యం కూడా క్రమంగా తగ్గి వ్యవస్థ ‘డెమొక్రటైజ్’ అవుతుంది. గుంటూరు నంది నాటకోత్సవాలు అందుకు నాంది కానున్నాయి.

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

  1. నంది నాటకోత్సవాలు కొత్తకాదు. రిసెప్షన్ ఎలా వుండాలో ముందుగానే నిర్ణయించడం బాగుంది. అది ఎలా అమలౌతుందో చూడాలి. రాజ్యంలో అంతరించి పోయిన “డెమోక్రటైజ్” పదాన్ని మరచిపోవడమే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles