వోలేటి దివాకర్
‘వై నాట్ 175’ నినాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్న వైఎస్సార్ సిపిలో ఏదైనా జరగవచ్చని నేరుగా ముఖ్యమంత్రి జగన్ చాంబర్లోకి వెళ్లగలిగే ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఇది నిజమేమోననిపిస్తోంది. ప్రస్తుతం వైసిపి సమన్వయకర్తలుగా గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్న వారికి సీట్లు దక్కకపోవచ్చు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారిపోవచ్చు. ఎంపిలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపిలుగా బరిలో నిలవచ్చు. అనూహ్యంగా కొత్త ముఖాలు ఎన్నికల బరిలో నిలవచ్చు.
తెలంగాణా ఎన్నికల ఫలితాలు, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో బిజెపి ముఖ్యమంత్రుల ప్రయోగాలను చూసిన తరువాత వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలో పడిపోయింది. వచ్చే ఎన్నికల్లో జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏదో ప్రయోగానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. జగన్ సర్వేలను, బిసి కార్డును నమ్ముకున్నట్లు తోస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గీయులు వైసిపికి ఓటువేయరన్న అనుమానంతో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే కాపు నియోజకవర్గాల్లో కూడా బిసి మంత్రాన్ని జపిస్తున్నారు. తన అధికారం కోసం జగన్ సొంత వారిని కూడా దూరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించిన తిప్పారెడ్డి, రాజధానికి వ్యతిరేకంగా కేసులు వేసి, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ ను ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇన్చార్జ్ లుగా తప్పించడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
వైసిపి ఆటలో అరటిపళ్లు!
రాబోయే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న నాయకులు ఆటలో అరటి పళ్లుగా మిగిలిపోతారన్న ప్రచారం జరుగుతోంది. రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ ను సిటీ అసెంబ్లీకి, రామచంద్రపురం ఎమ్మెల్యే, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ రాజమహేంద్రవరం రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు అధిష్ఠానం సంకేతాలు ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజమహేంద్రవరం, రూరల్లో ఇంటింటికీ తిరుగుతున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్ ఆటలో అరటిపళ్లుగా మిగిలిపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. అలాగే రాజమహేంద్రవరం ఎంపిగా చెల్లుబోయిన వేణుగోపాల్, గూడూరి శ్రీనివాస్ లలో ఎవరో ఒకరు బరిలో నిలిచే అవ కాశాలు కూడా కొట్టి పారేయలేమని ఆ నాయకుడు చెప్పారు. ప్రతీ నిత్యం రూరల్లో ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజికమాధ్యమాల్లో చురుగ్గా ఉండే చందన నాగేశ్వర్ పోటీకి వెనుకంజవేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే జగ్గంపేట, పిఠాపురం, కాకినాడల్లో అభ్యర్థుల్లో కూడా మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
టిడిపి – జనసేన ఎంపి అభ్యర్థిగా దుర్గేష్?
ఈ సారి ఏలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతున్న తెలుగుదేశం, జనసేన కూటమిలో కూడా ఎన్నికల నాటికి అనూహ్య పరిణామాలు చోటుచే సుకోనున్నాయి. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విస్పష్టంగా ప్రకటించారు. దీని ప్రకారం రాజమహేంద్రవరం, రూరల్ నియోజకవర్గాల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూరల్ సీటును ఆశిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే జనసేన అభ్యర్థుల ఎంపికలో టిడిపి జోక్యం ఎక్కువగా ఉంటుందన్న వాదనలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల నాటికి అన్ని పార్టీల్లోనూ ఏదైనా జరగవచ్చు. అలాగే వైసిపి ఆశించినట్లు ‘వై నాట్ 175’ కూడా కష్ట సాధ్యం కావచ్చు.