Thursday, November 21, 2024

ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని ధర్మాసనం అంగీకరించాల్సిందే- సుప్రీంకోర్టు

మాడభూషి శ్రీధర్‌, ప్రొఫెసర్‌, స్కూల్‌ ఆఫ్‌ లా,

మహేంద్ర యూనివర్సిటీ, హైదరాబాద్

మన భారత ప్రధాన న్యాయమూర్తి  చంద్రచూడ్‌ గారి అధ్యక్షతన న్యాయమూర్తులు ఎస్‌ కె కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బిఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లతో కూడిన భారత అత్యున్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం డిసెంబ‌ర్ 11వ తేదీన 370వ అధిక‌ర‌ణం ర‌ద్దును ఏక్ర‌గీవంగా స‌మ‌ర్ధించింది. అయితే, జమ్ము- కశ్మీర్ కు రాష్ట్ర హోదాను ‘సాధ్యమైనంత త్వరగా’, ‘అతి త్వరగా’ పునరుద్ధరించాలని ఆదేశించిందని అందరికీ అర్థమైపోయింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది.

కనుక ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్ష‌న్ 14 కింద 30 సెప్టెంబ‌ర్ 2024క‌ల్లా జ‌మ్ము-కశ్మీర్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మేం ఆదేశిస్తున్నాం’ అని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చంద్ర‌చూడ్ వారి తీర్పులోవివరించారు.

రాజ్యాంగంలోని 370వ అధిక‌ర‌ణం కింద జమ్ముకాశ్మీర్ ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ 2019 నిర్ణ‌యాన్ని, చెల్లుబాటును కూడా ధర్మాసనం స‌మ‌ర్థించింది.

జమ్ము-కశ్మీర్ కి అంత‌ర్గ‌త సార్వ‌భౌమాధికారం లేద‌ని, భార‌త రాజ్యాంగాన్ని జమ్ము-కశ్మీర్ అన్వ‌యించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ్మ‌తి అవ‌స‌రం లేద‌ని కూడా ధర్మాసనం కీలకమైన  అభిప్రాయాన్ని తెలిపారు. ఆర్టిక‌ల్ 370 అన్న‌ది తాత్కాలిక నిబంధ‌న అనే కేంద్రప్రభుత్వం వాద‌న‌ను కూడా పూర్తిగా స‌మ‌ర్థించింది.

ముఖ్య‌మైన అంశం ఏమిటంటే,  ‘‘కేంద్రం జమ్ము-కశ్మీర్ రాష్ట్ర హోదాను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పున‌రుద్ధ‌రిస్తుంద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ నివేదించ‌డం’’.  అయితే, జమ్ము-కశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించిన ఈ కీలకమైన అంశంపై న్యాయ‌స్థానం తీర్పులో నిర్ణ‌యాన్ని తెల‌ప‌లేదు. కాగా, జమ్ము-కాశ్మీర్ నుంచి ల‌డాఖ్ ప్రాంతాన్ని విడ‌దీసి, కేంద్ర‌పాలిత ప్రాంతాన్ని చేయ‌డాన్నిమాత్రం అంగీకరించింది. సుప్రీంకోర్టు పరిశీలించిన ముఖ్యమైన అంశాలు ఇవి.

తాత్కాలిక‌మా లేక అవి శాశ్వ‌తమా: ఆర్టిక‌ల్ 370లో ఉన్న నిబంధ‌న‌లు తాత్కాలిక‌మా లేక అవి శాశ్వ‌త హోదాను సంత‌రించుకున్నాయా? రాజ్యాంగ స‌భ అన్న ప‌దం స్థానంలో శాస‌న స‌భ అనే ప‌దాన్ని ప్ర‌స్తావించ‌డం. ఆర్టిక‌ల్ 370(1) (డి) కింద అధికారాల‌ను ఉప‌యోగించుకొని ‘రాజ్యాంగ స‌భ’ అన్న ప‌దానికి బ‌దులుగా ‘శాస‌న‌స‌భ’ అనే ప‌దాన్ని ఉప‌యోగించి ఆర్టిక‌ల్ 367కు స‌వ‌ర‌ణ చేయ‌డం రాజ్యాంగ‌బ‌ద్ధ‌మేనా?  రాజ్యాంగ‌బ‌ద్ధంగా చెల్లుబాటు అవుతుందా?

ఆర్టిక‌ల్ 370(1) (డి) కింద జమ్మూ-కశ్మీర్ భార‌త రాజ్యాంగం మొత్తాన్నీ అన్వ‌యింప‌చేయ‌వ‌చ్చా?

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చెల్లుతుందా?:  క్లాజ్ (3)లోని నిబంధ‌న త‌ప్ప‌నిస‌రి చేసే జమ్మూ -కశ్మీర్ రాజ్యాంగ స‌భ సూచ‌న లేక‌పోతే రాష్ట్రప‌తి చేసిన ఆర్టిక‌ల్ 370  ర‌ద్దు చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర శాస‌న‌స‌భ‌ను గ‌వ‌ర్న‌ర్ ర‌ద్దు చేయ‌డం రాజ్యాంగ‌బ‌ద్ధంగా చెల్లుతుందా?

రాష్ట్రప‌తి పాల‌న‌, పొడిగింపుల చెల్లుబాటు: డిసెంబ‌ర్ 2018లో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధిస్తున్న‌ట్టు చేసిన ప్ర‌క‌ట‌న‌, త‌ర్వాతి పొడిగింపులు చెల్లుబాటు అవుతాయా?

రాష్ట్ర విభ‌జ‌న చెల్లుతుందా? జమ్ము- కశ్మీర్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2019 ద్వారా రా్ష్ట్రాన్ని రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించ‌డం చెల్లుబాటు అవుతుందా?

కేంద్ర‌పాలిత ప్రాంతంగా హోదాను మార్చ‌డం:  ఆర్టిక‌ల్ 356 కింద రాష్ట్రప‌తి పాల‌న ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో, రాష్ట్ర శాస‌న‌స‌భ ర‌ద్దు చేసిన‌ప్పుడు జె&కె హోదా, దానిని కేంద్ర‌పాలిత ప్రాంతంగా మార్చ‌డం అన్న‌ది అధికారాన్ని స‌క్ర‌మంగా వినియోగించ‌డ‌మేనా?

ఈ అంశాలపైన ఆధారంపై వచ్చిన తీర్పు

అత్యున్న‌త న్యాయ‌స్థాన ధ‌ర్మాస‌నం న్యాయ‌వాదుల వాద‌న‌లు, న్యాయ‌మూర్తుల అనేక అంశాలపై పరిశీలన తరువాత ప్ర‌తి ప్ర‌శ్నను ప‌రిగ‌ణించిన త‌ర్వాత అదే తుది ఈ తీర్పు రూపొందింది.

ఇవి ప్రధానమైన అంశాలు, వాటిపై ముఖ్య‌మైన‌, వాస్త‌విక‌మైన జ‌వాబులు ఈ విధంగా ఉన్నాయి.

రాష్ట్రప‌తి పాల‌న చెల్లుబాటుపై తీర్పునివ్వాల్సిన అవ‌స‌రం లేదు

  • రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న‌ను విధిస్తున్న‌ట్టు రాష్ట్రప‌తి ప్ర‌క‌టించ‌డం చెల్లుబాటు అవునా కాదా అన్న విష‌యంపై తీర్పును వెలువ‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం పిటిష‌న‌ర్లు దానిని స‌వాలు చేయ‌క‌పోవ‌డ‌మ‌ని కోర్టు పేర్కొంది. ఏమైనప్ప‌టికీ, రాష్ట్రప‌తి పాల‌న‌ను అక్టోబ‌ర్ 2019లో ఉప‌సంహ‌రించిన కార‌ణంగా ఎటువంటి భౌతిక ప‌రిహారం ఇవ్వ‌డానికి లేద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. రాష్ట్రప‌తి పాల‌నా కాలంలో రాష్ట్రంలో తిరుగులేని ప‌రిణామాలు ఏర్ప‌డే చ‌ర్య‌ల‌ను కేంద్రం తీసుకోలేద‌న్న పిటిష‌న‌ర్ల వాద‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాక‌, రాష్ట్రప‌తి పాల‌న అమ‌లులో ఉన్న స‌మ‌యంలో మాత్ర‌మే పార్ల‌మెంటు చ‌ట్టాలు చేయ‌గ‌లిగే అధికారాన్ని క‌లిగి ఉంటుంద‌న్న వాద‌న‌ను కూడా తోసిపుచ్చింది.
    • కాగా, రాష్ట్రప‌తి పాల‌న విధించిన అనంత‌రం రాష్ట్రప‌తి అధికారాల‌ను వినియోగించ‌డం అన్న‌ది న్యాయ‌స‌మీక్ష‌కు లోబ‌డి ఉంటుంద‌ని కోర్టు పేర్కొంది. ఆర్టిక‌ల్ 356 (1) కింద రాష్ట్ర శాస‌నస‌భ త‌రుఫున అధికారాల‌ను వినియోగించేందుకు పార్ల‌మెంటుకు ఉన్నఅధికారం  అన్న‌ది కేవ‌లం చ‌ట్టాన్ని రూపొందించు అధికారానికే ప‌రిమితం కాద‌ని అభిప్రాయ‌ప‌డింది.

సార్వ‌భౌమాధికారంపై జమ్ము-కశ్మీర్ రద్దు

భార‌త యూనియ‌న్‌లో చేరిన త‌ర్వాత జ‌మ్ము, కశ్మీర్ విడిగా అస్తిత్వం నిలుపుకోలేదు.

  • జ‌మ్ము, కశ్మీర్ అస్తిత్వాన్ని భార‌త రాజ్యాంగం స్వాధీనం చేసుకుంటుంద‌ని మ‌హారాజా చేసిన ప్ర‌క‌ట‌న పేర్కొంద‌ని కోర్టు తెలిపింది. దీనితో, విలీన ప‌త్రంలోని పారాగ్రాఫ్ ఉనికిలో లేకుండా పోయింద‌ని కోర్టు పేర్కొంది.
    • రాజ్యాంగం ఏర్పాటు ఎక్క‌డా జ‌మ్ము కాశ్మీర్ త‌న సార్వ‌భౌమాధికారాన్ని నిలుపుకున్న‌ద‌ని సూచించ‌లేద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.
    • జ‌మ్ము-కశ్మీర్ రాజ్యాంగంలో ఎక్క‌డా సార్వ‌భౌమాధికార ప్ర‌స్తావ‌న లేదనీ. భార‌త రాజ్యాంగంలోని అధిక‌ర‌ణాలు 1లో అప్పటి 370 ద్వారా జ‌మ్ము- కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉన్న రాజ్యాంగంలో, భార‌తదేశంలో అంత‌ర్భాగంగా మారింద‌ని త‌న తీర్పులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. (అయితే జమ్ము-కశ్మీర్ ప్రత్యేక  రాష్ట్ర రాజ్యాంగంలో మొట్టమొదటి ఆర్టికిల్ లో ఇది భారతదేశంలో ముఖ్యం అని స్పష్టంగా ఉందని గమనించాలనీ, సుప్రీంకోర్టు ఇది సమర్థించింది అనుకోవాలి)
    • దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ వివిధ స్థాయిల్లో అయిన‌ప్ప‌టికీ శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క అధికారాలు ఉన్నాయ‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అన్నారు.
    • వివిధ రాష్ట్రాల‌కు ఉన్న ప్ర‌త్యేక ఏర్పాట్ల‌కు ఆర్టిక‌ల్ 371 ఎ నుంచి 371 జె వ‌ర‌కు ఉదాహ‌ర‌ణ‌లు. ఇది ‘అస‌మాన ఫెడ‌ర‌లిజం’’కు మరో ఉదాహ‌ర‌ణ‌.ఆర్టిక‌ల్ 370 అన్న‌ది అస‌మాన ఫెడ‌రలిజం ల‌క్ష‌ణ‌మే త‌ప్ప సార్వ‌భౌమాధికార ల‌క్ష‌ణం కాద‌ని కూడా పేర్కొంది.

తాత్కాలిక  స్వ‌భావం: ఆర్టిక‌ల్ 370 అన్న‌ది తాత్కాలిక నిబంధ‌న‌

  • చారిత్ర‌క అధ్య‌య‌నంలో ఆర్టిక‌ల్ 370 అన్న‌ది తాత్కాలిక నిబంధ‌న‌గా ప‌రిగ‌ణించార‌ని తేలుతుంద‌ని, దీని ప్ర‌కారం అది అశాశ్వ‌త‌మైన‌, తాత్కాలిక నిబంధ‌న అని త‌న తీర్పులో సిజెఐ పేర్కొన్నారు. క‌నుక‌, జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ స‌భ ర‌ద్దు త‌ర్వాత కూడా రాష్ట్రప‌తికి 370(3) కింద ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు నోటిఫికేష‌న్ జారీ చేసే అధికారం ఉంద‌ని సుప్రీంకోర్టు వివ‌రించింది.
    • ఈ తీర్పు ప్ర‌కారం రాజ్యాంగ స‌భ సిఫార్సుకు రాష్ట్రప‌తి క‌ట్టుబ‌డి ఉండ‌న‌వ‌స‌రం లేదు. జమ్ము-కశ్మీర్ రాజ్యాంగ స‌భను కూడా ఒక తాత్కాలిక సంస్థ‌గానే ఉద్దేశించారు. రాజ్యాంగ స‌భ ఉనికిలో లేన‌ప్పుడు, ఆర్టిక‌ల్ 370 ను ప్ర‌వేశ‌పెట్ట‌డం కోసం ఉన్న ప్ర‌త్యేక నిబంధ‌న కూడా ర‌ద్ద‌వుతుంది కానీ, రాష్ట్రంలో ప‌రిస్థితి కొన‌సాగ‌డంతో, ఆర్టిక‌ల్ కూడా కొన‌సాగింది.
    • జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ స‌భ‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత ఒక‌వేళ ఆర్టిక‌ల్ 370(3) కింద అధికారం ఉనికిలో లేకుండా పోవ‌డ‌మ‌న్న‌ది విలీనీక‌ర‌ణ ప్ర‌క్రియ స్తంభ‌న‌కు దారి తీస్తుంద‌ని ధర్మాసనం తెలిపింది.
    • ధర్మాసనం రాజ్యాంగ స‌భ  ఉనికిని కోల్పోయిన త‌ర్వాత కూడా ఆర్టిక‌ల్ 370(3) కింద అదికారం నిలిచిపోలేద‌ని కోర్టు పేర్కొంది.

భార‌త రాజ్యాంగం, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మ్మ‌తి: ఆర్టిక‌ల్ 370(1)(డి) ద్వారా భార‌త రాజ్యాంగంలోని అన్ని నిబంధ‌న‌ల‌ను జమ్ము కాశ్మీర్ వ‌ర్తింప‌చేయాల్సిన అవ‌స‌రం లేదు.

  • ఆర్టిక‌ల్ 370 కింద ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్నాయా లేదా అనే విష‌యంపై భార‌త రాష్ట్రప‌తి నిర్ణ‌యంపై ధర్మాసనం పరిశీలించబోదు.  క్ర‌మ‌బ‌ద్ధ‌మైన విలీన‌క‌ర‌ణ / ఏకీక‌ర‌ణ ప్ర‌క్రియ జ‌ర‌గ‌డం లేద‌ని చ‌రిత్ర వివరిస్తున్నదని అంటున్నారు. ఇది భార‌త రాజ్యాంగాన్ని 70 ఏళ్ళ త‌ర్వాత ఒక్క‌సారిగా అనువ‌ర్తింప‌చేయ‌డం కాదు. ఇది ఏకీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు ప‌రిస‌మాప్తి ఇది ప‌రాకాష్ఠ‌ అవుతుంది.
    • ఇందుకు అనుగుణంగానే, ఆర్టిక‌ల్ 370 (1) (డి)ని ఉప‌యోగించి భార‌త రాజ్యాంగంలోని అన్ని నిబంధ‌న‌ల‌ను  ఒక్క‌సారిగా అనువ‌ర్తింప‌చేయ‌డాన్ని స‌మ‌ర్ధించింది.
    • దీనికి కొన‌సాగింపుగా, రాష్ట్రప‌తి అధికారాన్ని ఉప‌యోగించ‌డం చెల్లుబాటు అవుతుంద‌ని నిర్ధారించింది.
    • రాష్ట్రప‌తి అధికారాన్ని వినియోగించుకోవ‌డానికి సంప్ర‌దింపులు, స‌హ‌కార సూత్రాన్ని అనుస‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆర్టిక‌ల్ 370(1)(డి)ని ఉప‌యోగించి రాజ్యాంగంలోని అన్ని నిబంధ‌న‌ల‌ను వ‌ర్తింప‌చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ్మ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొంది. క‌నుక‌, రాష్ట్రప‌తి కేంద్ర ప్ర‌భుత్వ స‌మ్మ‌తిని తీసుకోవ‌డం దుర్భావ‌న కాదు అంటే దురుద్దేశంతో  అనుకోగూడదు.
    • ఆర్టిక‌ల్ 3 నిబంధ‌న కింద రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల అభిప్రాయాలనేవి కేవలం సిఫార్సులు మాత్ర‌మే అనీ ధర్మాసనం పేర్కొంది.
    • ఆర్టిక‌ల్ 370 ఉద్దేశం నెమ్మ‌దిగా జ‌మ్ము కాశ్మీర్‌ను భార‌త్‌లోని ఇత‌ర రాష్ట్రాల‌తో స‌మాన స్థాయికి తీసుకురావ‌డ‌మేన‌ని జ‌స్టిస్ ఎస్ కె కౌల్ అన్నారు. క‌నుక‌, జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ స‌భ సిఫార్సు అవ‌స‌రాన్ని విస్త్ర‌త‌మైన భావ‌న‌ను నిర‌ర్ధ‌కం చేసే విధంగా వ‌ర్తింప‌చేయ‌డం సాధ్యం కాదు.

ఆ తప్పిదం తరువాత ముగింపులు బతుకుతాయా?

చెల్ల‌ని సిఒ 272: ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు కోసం ఆర్టిక‌ల్ 367ను స‌వ‌రించ‌డం చ‌ట్ట‌విరుద్ధం. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పులో సిఒ 272 ఉద్దేశ్యం ఆర్టిక‌ల్ 367లో మార్పులు చేయ‌డానికి అన్న‌ట్టు మొద‌ట క‌నిపించినా, అది స‌మ‌ర్ధ‌వంతంగా ఆర్టిక‌ల్ 370ని పూర్తిగా మార్చివేసింద‌ని పేర్కొన్నారు. ఆ మార్పులు గ‌ణ‌నీయ‌మైన‌వి, స్థిర‌మైన‌వ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ నియ‌మ‌భంగం చేస్తూ ఇంట‌ర్‌ప్రెటేష‌న్ క్లాజ్ (వ్యాఖ్యాన నిబంధ‌న‌)ను స‌వ‌రించ‌లేర‌ని కోర్టు పేర్కొంది. ఆర్టిక‌ల్ 367ను ఆశ్ర‌యించ‌డం ద్వారా ఆర్టిక‌ల్ 370లో స‌వ‌ర‌ణ‌ల‌ను చేయ‌డ‌మ‌న్న‌ది రాజ్యాంగ‌విరుద్ధ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని పేర్కొంటూ, ఒక రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోసం నిర్దేశిత మార్గాన్ని త‌ప్పించేందుకు ఇంట‌ర్‌ప్రెటేటివ్ క్లాజ్‌ను ఉప‌యోగించ కూడ‌ద‌ని తెలిపింది. ఇదే దుర్వినియోగం అని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఇటువంటి అక్ర‌మ‌మైన ప‌ద్ధ‌తుల ద్వారా స‌వ‌ర‌ణ‌ల‌ను అనుమ‌తించ‌డం దుర‌దృష్ట‌క‌రం అని కోర్టు పేర్కొంది. ఆర్టిక‌ల్ 370 (1)(డి) కింద అధికారాన్ని ఉప‌యోగించి ఆర్టిక‌ల్ 370ని స‌వ‌రించ‌లేర‌ని ధర్మాసనం తెలిపింది. ఈ విష‌యంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అభిప్రాయంతో ఏకీభ‌విస్తూ, ఆర్టిక‌ల్ 367ను ఉప‌యోగించి ఆర్టిక‌ల్ 370కి స‌వ‌ర‌ణ‌లు చేసే విష‌యంలో, అందుకు ఒక ప‌ద్ధ‌తిని నిర్దేశించారు, దానిని అనుస‌రించాల‌న్న‌ది నా అభిప్రాయ‌మ‌ని జ‌స్టిస్ ఎస్ కె కౌల్ త‌న తీర్పులో పేర్కొన్నారు.  దొడ్డి మార్గాల ద్వారా స‌వ‌ర‌ణ అనుమ‌తించ‌ద‌గిన‌ది కాదు. కాగా, ఈ అంశాన్ని క‌నుగొన‌డం అన్న‌ది ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేయ‌లేదు, ఎందుకంటే, ఆర్టిక‌ల్ 370ని నిర్వీర్యం చేస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌డానికి జమ్ము-కశ్మీర్ రాజ్యాంగ సిఫార్సు రాష్ట్రప‌తికి అవ‌స‌రం లేక‌పోవ‌డ‌మే.

జమ్ము-కశ్మీర్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2019 చెల్లుబాటు

ధర్మాసనం ల‌డాఖ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై తీర్పు చెప్పాల్సిన అవ‌స‌రం లేదన్నారు. జమ్ము-కశ్మీర్ రాష్ట్ర హోదాను పున‌రుద్ధ‌రిస్తామ‌ని, దాని కేంద్ర‌పాలిత ప్రాంత హోదా తాత్కాలిక‌మ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ నివేదించిన‌ విషయాన్ని ధర్మాసనం ప్రకటించింది.  ఎస్‌జి చేసిన నివేదన నేప‌థ్యంలో, జమ్ము-కశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించ‌డం చెల్లుబాటు అవుతుందా అన్న‌ది నిర్ధారించ‌డం అవ‌స‌ర‌మ‌ని కూడా అభి్ప్రాయ‌ప‌డింది. ల‌ఢాక్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతంగా పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించ‌డాన్ని స‌మ‌ర్ధించింది, ఎందుకంటే ఆర్టిక‌ల్ 3 రాష్ట్రంలో ఒక భాగాన్ని యుటిగా చేసేందుకు అనుమ‌తిస్తుంది. ఒక రాష్ట్రాన్ని పార్ల‌మెంటు కేంద్ర‌పాలిత ప్రాంతంగా మార్చ‌గ‌ల‌దా అన్న ప్ర‌శ్నగురించి చ‌ర్చ‌కు ఇంకా ఆస్కారం ఉందన్నారు.

జమ్ము-కశ్మీర్ రాష్ట్రహోదా

ధర్మాసనం జమ్ము-కశ్మీర్ రాష్ట్ర హోదాసాధ్య‌మైనంత త్వ‌ర‌గా దానిని పున‌రుద్ధ‌రించండి. సెప్టెంబ‌ర్ 30, 2024నాటికి జమ్ము-కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా దాని రాష్ట్ర హోదాను పున‌రుద్ధ‌రించాల‌ని పేర్కొంది. మొత్తానికి కీలకమైన అంశంపైన సుప్రీంకోర్టు ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. అయితే ఇంత తీవ్రమైన తప్పిదం చేసిన తరువాత, ఆ తప్పిదం ఆధారంగానే ఉండే మిగిలిన అంశాలు ఉనికి రక్షించుకోగలదా అన్నది ప్రశ్న. ఎవరడుగుతారు. వారు జవాబిస్తారు? తాంబూలాలు ఇచ్చిన తరువాత తన్నుకు చావడమే మిగిలేది కదా?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles