- చదవడంలో విప్లవాత్మక మార్పులు
- పుస్తక ప్రచురణకర్తలకు అన్యాయం
చదవడం అనే ప్రక్రియ తరతరాలుగా రకరకాలుగా పరిణామం చెందుతూ వస్తోంది. జ్ఞాన సముపార్జన ఒకప్పుడు కేవలం వినికిడి ద్వారానే జరిగేది. ఆ తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పుస్తకాలు చేతికి వచ్చాయి. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతూ వస్తున్న దశలో పుస్తకాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. నేటి డిజిటల్ యుగంలో చదువుకొనే విధానమే మారిపోయింది. చేతిలో పుస్తకం పెట్టుకొని చదవడంలో ఉండే మజాయే వేరనే తరాలు ఇంకా మన మధ్యనే వున్నాయి. ముద్రణ జరిగిన పుస్తకం పదిమందికి చేరవేయడంలోనూ అనేక సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకొని, ఇంటి అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తే బైకుపై వచ్చి, వెంటనే ఆ పుస్తకాన్ని అందించే సేవలు వచ్చేశాయి.ఈ సేవలు ఇంకా పెద్ద పెద్ద నగరాలకే పరిమితమై ఉన్నాయి. నగరాలకు, పట్టణాలకు విస్తరణ జరగాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఏ దేశ ప్రజలు ఆ దేశంలోనే ఉండడం లేదు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర దేశాలకు తరలి పోతున్నారు. మాతృభాష పుస్తకాలతో పాటు ఇతర భాషల పఠనం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ -బుక్ రీడింగ్. పిడిఎఫ్ రూపంలో చాలా పుస్తకాలు ఉచితంగానే పాఠకులకు చేరుతున్నాయి.
Also read: ఆయుర్వేదం వైపు ప్రపంచం చూపు
ప్రింటయిన వెంటనే పీడీఎఫ్ లోకి…
సినిమా రిలీజైన కొన్ని గంటల్లోనే పైరసీ వీడియోలు అందుబాటులోకి వచ్చినట్లు, పుస్తకం ప్రింట్ అయిన కొంతసేపట్లోనే పిడిఎఫ్ రూపంలో అందరి చేతుల్లోకి వస్తుంది. దీని వల్ల ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పుస్తకాలు ముద్రిస్తున్నవారికి పెద్ద అన్యాయం జరుగుతోంది. దీని కోసం అందరూ కోర్టుల మెట్లు ఎక్కలేరు కదా. ఇది ఇలా ఉండగా, డబ్బులు ఇచ్చి, దర్జాగా అధికారికంగా పుస్తకాన్ని డిజిటల్ రూపంలో కొనుక్కొని చదువుకోవచ్చు. ఈ విధానం ఇంకా మనవంటి దేశాలలో పెరగాల్సివుంది. పిడిఎఫ్ తో పాటు పిడిబీ, డాక్స్, ఈపీయూబీ వంటి అనేక మార్గాలు నేడు మన మధ్య ఉన్నాయి. సాధారణంగా ఈ -బుక్ రీడర్లు ఎక్కువ మంది ఫోన్స్ కంటే ట్యాబులనే ఉపయోగిస్తున్నారు. ఇలా చదవడం వల్ల కళ్ళపై పెద్దగా ఒత్తిడి పెరగదని వారి అభిప్రాయం. ఇటువంటి పాఠకులను ఆకర్షించే విధంగా మార్కెట్ లోకి కొత్తగా ఈ-బుక్ రీడర్ కళ్ళజోడు అందుబాటులోకి రానుంది. సోల్ రీడర్ అనే కంపెనీ దీనిని రూపొందిస్తోంది. దీని ధర 350డాలర్ల వరకూ ఉంటుందని సమాచారం. ఈ కళ్ళజోడు అందుబాటులోకి వస్తే సుఖంగా చదువుకోవచ్చన్నమాట! కూలింగ్ కళ్ళజోడులాగానే ఉంటుందని చెబుతున్నారు. కిండిల్ వంటి ఈ -రీడర్లతో ఎక్కువసేపు చదువుతున్న వారిని మనం చూస్తున్నాం. మామూలు పుస్తకాలు లాగానే ఆ పేజీలను కూడా తిరగెస్తూ చదువుతుంటారు. సరికొత్తగా మార్కెట్ లోకి రాబోయే ఈ -బుక్ రీడర్ కళ్ళజోడు వల్ల మరింత ఏకాగ్రతగా చదువుకోవచ్చు. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే అక్షరాలు తప్ప ఇంకేమీ కనిపించవు. మాములుగా ఈ -బుక్ చదవాలంటే మొబైల్, ట్యాబ్ చేతితో పట్టుకోవాలి. ఈ కళ్ళజోడు ఉంటే అవసరం లేదు. తలకు తగిలించుకుంటే చాలు. కంటి చూపుకు తగ్గట్టుగా డయాఫ్టర్ సర్దుబాటు కూడా ఉంటుంది.
Also read: సంపన్న భారతం
చదవడం ఒక కళ
ఈ -కళ్ళజోడు ఉంటే వేరే కళ్ళజోడు,కాంటాక్ట్ లెన్స్ అవసరంలేదని అంటున్నారు. కూర్చొని, పడుకోని ఎలాగైనా చదువుకోవచ్చు. రిమోట్ కూడా ఉంటుంది. దాని ద్వారా కావాల్సిన పేజీల దగ్గర ఆపేయవచ్చు. ఇది సోలార్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే సుమారు 30గంటల పాటు వాడుకోవచ్చు. సుఖాలకు మరిగిన మనిషికి ఇలాంటివి ముందు ముందు ఇంకేమేమి వస్తాయో చూద్దాం. ఏదిఏమైనా చదవడం ఒక కళ. జ్ఞానం పొందడం ఒక అవసరం. అంతకు మించి ఆనందం. అందుకే “జ్ఞానానందమయం దేవం” అన్నారు. మొత్తంగా చూస్తే, సాంకేతికతకు సాహో అనాల్సిందే!
Also read: యువముఖ్యమంత్రి రేవంత్ కేబినెట్ లో సీనియర్లు