Saturday, November 23, 2024

రేవంత రెడ్డికి పట్టం

  • తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం
  • విజయానికి ప్రధాన కారకుడికి పగ్గాలు
  • యువకుడు, సాహసి – ఆచితూచి అడుగులేయాలి

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గద్దెనెక్కడం ఇక లాంఛనమే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు కూడా. 7వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగనుందని స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా కొత్త ముఖ్యమంత్రికి, కొత్త మంత్రిమండలికి అభినందనలు. రేవంతుడు అంటే అశ్వికుడు. గుర్రాన్ని నడిపే విద్యలో ప్రావీణ్యుడు అని అర్థం. సింహాసనం ఎక్కడమంటే? సింహంపై ఆసనం వేసుకొని కూర్చోడం. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో, తెలంగాణలో పాలన, రాజకీయాలు సింహంపై స్వారీతో సమానం. అడవికి సింహమే రాజైనా, క్రూర మృగాలు, కంటికి కనిపించని ప్రమాదకరమైన జీవులు చాలా ఉంటాయి. ఘోరంగా మోసం చేసే నక్కలు, గుంట నక్కలు కూడా ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుంటూ ముందుకు సాగితేనే సింహం మృగరాజవుతుంది. లేకపోతే, ఒట్టి జంతువుగానే మిగిలిపోతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా  అటువంటిదే. 119 స్థానాలు కలిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, 64స్థానాలు గెలుచుకొని, కేవలం పాస్ మార్కులతోనే గట్టెక్కిన వైనం కాంగ్రెస్ ది. ప్రధాన ప్రతిపక్షంగా నిలవనున్న  బిఆర్ఎస్ కు 39 సీట్ల బలముంది. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు  బిజెపి, ఎం.ఐ.ఎం దక్కించుకున్న స్థానాలు 15. వెరసి ప్రతిపక్షాల బలం 54 సీట్లు. అధికార పీఠంపై కూర్చోవాలంటే 60 సీట్లు చాలు.  అధికార పక్షానికి – ప్రతిపక్షాలకు మధ్య సీట్ల తేడా కేవలం 10. కాంగ్రెస్ తో నడుస్తున్న సీపీఐని కూడా కలుపుకుంటే 11 స్థానాల వ్యత్యాసం మాత్రమే.

ఓట్ల శాతంలో పెద్ద వ్యత్యాసం లేదు

దీనికితోడు కాంగ్రెస్ – బిఆర్ ఎస్ కు పోలైన ఓట్ల మధ్య కూడా పెద్ద దూరం లేదు.

అధికార కాంగ్రెస్ పార్టీకి 39శాతం వస్తే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ 37శాతం దక్కాయి. అధికార పార్టీ కంటే కేవలం రెండు శాతమే తక్కువ. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొనే గేమ్ మొదలవ్వదని గ్యారంటీ ఇవ్వలేం. ఈ ఆట ఎవరు ముందు మొదలు పెడతారో, ఏమి సాధిస్తారో సమీప కాలంలోనే తేలిపోతుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుచూపు కూడా లేకుండా, లెక్కలు కూడా వేసుకోకుండా నోటికి వచ్చినట్లు హామీలు ప్రకటించారు. ఈ హామీలన్నీ అమలవ్వడం ఆచరణలో జరిగేపని కాదు. అంత అప్పులూ పుట్టవు, కేంద్రలోని బిజెపి ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందదు.  కొత్తగా ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలు కూడా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ హామీలన్నీ అమలుచెయ్యాలంటే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితులు వస్తాయి. పన్నులు పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అభివృద్ధి గురించి బెంగలేదు కానీ, సంక్షేమమే పెద్ద సవాల్. మరికొన్ని నెలల్లోనే లోక్ సభ ఎన్నికలు వున్నాయి. వాటిని ఎదుర్కోవడం కూడా కీలకం. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ కు దూరంగానే ఉన్నారని నిన్నటి ఫలితాలే చెబుతున్నాయి. ఇక్కడ బిఆర్ఎస్ చాలా బలంగా వుంది.రెండో స్థానంలో బిజెపి వుంది.కాంగ్రెస్ బలం నామ మాత్రమే. ఈ పరిస్థితుల్లో, నగర ప్రజల హృదయాలను గెలుచుకోవడం అధికార పార్టీకి పెనుసవాల్ గా మిగులుతుంది.

హ్యాట్రిక్ కోసం బీజేపీ ప్రయత్నం

రేపు జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బిజెపి చూస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో విజయం సాధించిన బిజెపి మంచి ఊపులో వుంది. మూడోసారి అధికారంలోకి రాగలమనే ధీమాను ఈ ఫలితాలు ఇచ్చాయి. తెలంగాణలో 8సీట్లు, 13 శాతం ఓటింగ్ ను  పొంది, బిజెపి నైతికంగా బలాన్ని పుంజుకుంది. నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు చోట్ల ఓడిపోవడమే కాక, నిన్నటి దాకా అధికారంలో వున్న రెండు రాష్ట్రాలను కూడా కోల్పోయింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో వుంది. ప్రస్తుతం, చాలా రాష్ట్రాలు బిజెపి పాలనలోనే వున్నాయి. తమపాలన, లోకల్ రాజకీయాలు చూసుకుంటూ, రేపు జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలను పెంచాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై వుంది. భట్టి విక్రమార్క, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మొదలైన నాయకులంతా సీఎం సీటుపై కన్నేసి వున్నవారే. కాకపోతే, గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే కావడం ధైర్యాన్నిచ్చే అంశం.

పాలన బాగా లేక కాదు, తీరు బాగా లేక!

నిన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ పాలన మరీ అధ్వాన్నంగా ఏమీ లేదు.

అభివృద్ధి జరిగింది. పాలనాపరంగా కూడా పర్వాలేదు. ఏలికల వ్యవహారశైలి ప్రధానంగా జనానికి చిరాకు తెప్పించింది. ముఖ్యంగా అహంకార ధోరణి, అవినీతిపై ప్రజ ఆగ్రహం పెంచుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి కంటే  కెసీఆర్ కే ఎక్కువ మార్కులు ఇచ్చారు. ఎమ్మెల్యేల తీరుపై కోపం, కుటుంబపాలన అనే అభిప్రాయం, పథకాలు అందలేదనే ఆక్రోశం, ఉద్యోగాలు,ఉపాధి దొరకలేదని  యువతలో పెరిగిన అసహనం, తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైందా? అనే అనుమానం మొదలైనవి కెసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. నిన్న మొన్నటి వరకూ జర్నలిస్టులకు, మేధావులకు ముఖ్యమంత్రులు సైతం అందుబాటులో ఉండేవారు. ఈ తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రిని కూడా కలవలేని పరిస్థితి చాలామంది జర్నలిస్టులు, మేధావులకు ఎదురైంది. ఇక సామాన్య ప్రజలు ఎమ్మెల్యేలను కలవడం గగనకుసుమంగా మారింది. ఈ పోకడలు నిన్నటి అధికార పార్టీకి నష్టం తెచ్చాయి. ఉద్యమాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. చాలామంది ఉద్యమనేతలకు అసంతృప్తే

మిగిలింది. ఇక ప్రజాసంఘాల చేదు అనుభవాలు ఎట్లాగూ వున్నాయి. భారతంలో తిక్కనగారు ఒక మాట అన్నారు. “నీ విషయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో.. ఎదుటివారి విషయంలో నువ్వు అలా ప్రవర్తించకుండా వుండడమే ధర్మం “. అదే నీతి,అదే రాజనీతి కూడా.

సమన్వయం, సమతుల్యం

ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారపీఠంపై కూర్చోబోతున్న  రేవంత్ రెడ్డి, మిగిలిన మంత్రిమండలి, గెలిచిన ఎమ్మెల్యేలు గుర్తెరిగి ప్రవర్తిస్తే పది కాలాల పాటు అధికారంలో వుంటారు. లేకపోతే, ప్రజలే ఓటు అనే పోటుతో కుర్చీ నుంచి దించేస్తారు. రేవంత్ రెడ్డి యువకులు, కష్టపడి పైకొచ్చినవారు, ఢక్కామొక్కీలు తిన్నవారు. తన రాజకీయ జీవితంలో అంచెలంచాలుగా ఎదుగుతూ వచ్చినవారు. కెసీఆర్, చంద్రబాబు వంటి కాకలుతీరిన రాజకీయ నాయకులతో దగ్గరగా తిరిగిన అనుభవం ఉండనే వుంది . తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి, చరిత్రను సొంతం చేసుకున్న నైతికబలం అండగా వుంది. తన బలాలు, బలహీనతలు కూడా తనకు బాగా తెలుసు. అన్ని విషయల్లో అప్రమత్తంగా ఉండడం అంతే కీలకం. పొరుగు తెలుగు రాష్ట ప్రభుత్వంతో, ప్రజలతో సఖ్యతగా ఉండడం అంతే ముఖ్యం. విభజన అంశాల పరిష్కారంలో స్నేహహస్తం అందించడం ధర్మం. ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్ లో వుంది. రేపు ఏమవుతుందో చెప్పలేం. అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ, సంయమనంతో మెలుగుతూ ప్రజారంజక పాలన అందిస్తారని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles