వోలేటి దివాకర్
తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం కోరుకున్నదే జరిగింది. ఎన్టీ రామారావు తన జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో విజయం సాధించడంతో కాంగ్రెస్ కార్యకర్తల కన్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కువ ఆనందం వ్యక్తం చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ విజయం తరువాత సామాజిక మాధ్యమాల్లో కమ్మ సామాజిక వర్గీయులు, టిడిపి శ్రేణులు ఆనందాన్ని దాచుకోలేక చేసిన హడావుడి చూసి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడే సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. తెలంగాణా ఫలితాలు ఆంధ్రా ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని, తద్వారా ఎపిలో అధికార వైఎస్సార్ సిపికి వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని వారు ధీమాతో ఉన్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలు సహజంగానే ఎపిలో అధికార వైఎస్సార్ సిపికి నిరాశ కలిగించాయి. అందుకే ఆపార్టీ నేతలెవరూ నోరుమెదపడం లేదు. తెలంగాణా ఫలితాలు ఇక్కడ ఎక్కడ పునరావృత్తం అవుతాయోనని వైసిపి శ్రేణులు లోలోన మదనపడుతున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టును సరైన రీతిలో ఖండించలేదని, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లోని ఓఆర్ఆర్, హైటెక్సిటీ, మెట్రో రైళ్లలో నిరసనలకు తెలంగాణాలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఆంధ్రాలో చూసుకోవాలని ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు కెటిఆర్ వ్యాఖ్యానించడంతో ఈఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కమ్మ సామాజిక వర్గం కంకణం కట్టుకుంది. దీనిలో భాగంగా తెలంగాణాలో తమ ఆర్థిక సత్తాను, పలుకుబడిని ప్రయోగించారు. తెలంగాణా తరహాలో ఆంధ్రా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, రాష్ట్ర విభజన తరువాత చావుబతుకుల మధ్య ఉన్న ఆపార్టీకి ఊపిరిపోస్తారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
గ్రేటర్ ఓటర్లు సామాజికంగా చీలిపోయారా?!
గ్రేటర్ హైదరాబాద్ టిడిపి ప్రయోగం ఫలించలేదన్న విషయం ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. మొత్తం 24 నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో బిఆర్ఎస్
అభ్యర్థులే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. మిగిలిన స్థానాల్లో బిజెపి, ఎంఐఎం విజయం సాధించాయి. ఈఫలితాలను బట్టి చూస్తే కమ్మ సామాజిక వర్గీయుల వైఖరితో మిగిలిన సెటిలర్లు బిఆర్ఎస్నే సమర్థించినట్లు స్పష్టమవుతోంది.
జనసేన బేజారు…ఎపిలో టిడిపి బేరాలు…
కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్న టిడిపి కాడి వదిలేయగా, బిజెపి బలవంతంపై పోటీ చేసిన ఎపిలోని టిడిపి మిత్రపక్షం జన సేన పార్టీ పోటీ చేసిన 8 చోట్ల కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సెటిలర్లు ఓట్లు వేయడంతో కూకట్ పల్లిలో సుమారు 34వేల ఓట్లు సాధించడం ఆపార్టీకి కాస్త ఉపసమనం కలిగించే అంశం కావచ్చు. అయితే తెలంగాణాలో జన సేన సాధించిన ఫలితాలు ఇప్పటికే ఆపార్టీతో పొత్తు కుదర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలో సీట్ల బేరానికి అక్కరకు వచ్చే అవ కాశాలు ఉన్నాయి. తెలంగాణాలో 30 చోట్ల పోటీ చేయాలని భావించిన జన సేన 8తో సరిపెట్టుకుంది. ఎపిలో కనీసం 50 స్థానాల్లో జన సేన అశావహులు ఉన్నారు. ఆ పార్టీని అభిమానించే సామాజిక వర్గీయులు కూడా అంతే స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎపి ఎన్నికల్లో 50 సీట్లు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణా ఫలితాలను సాకుగా చూపించి, టిడిపి జనసేనను సగం సీట్లకు ఒప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవ సరం లేదని భావిస్తున్నారు. అయితే తెలంగాణాలో టిడిపి మద్దతివ్వని జన సేనకు ఎపి ప్రజలు ఎందుకు మద్దతివ్వాలన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.