ఫొటో రైటప్: కాఫీడే వ్యవస్థాపకుడు విజి సిద్దార్థ, సతీమణి మాళవికాహెగ్డే
సంపద సృష్టిద్దాం 21
సుధాకర్ తన సమస్య చెప్పుకుంటున్నాడు. నేను ప్రశాంతంగా వింటున్నాను. ఇంతలో అతని ఫోన్ మోగింది. రింగ్‌టోన్ వినగానే సుధాకర్ ముఖం జేవురించింది. చిరాకుతో కనుబొమలు ముడివేశాడు. ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో చూసుకుని అసహనంగా కూర్చున్న చోట కదిలాడు. తనకు ఆ శబ్దం వినపడకుండా పక్కన బటన్ నొక్కాడు. ఒక అర నిమిషంలోపు దీనినుంచి తేరుకుని మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడు. రెండు నిమిషాలు కూడా గడవక ముందే మరోసారి ఫోన్ మోగింది. ఈసారి కూడా అదే రిపీట్. మనం మాట్లాడుకుందాం, ముందు ఫోన్ ఆన్సర్ చేయండని చెప్పాను. అతను వినలేదు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఇలానే పదిసార్లు ఫోన్లు చేస్తాడని విసుక్కున్నాడు. డబ్బులు అవసరమైనప్పుడు తాను పదిసార్లు ఫోన్ చేసిన విషయం మర్చిపోయాడు. ఇది కచ్చితంగా సుధాకర్ మెదడు ఆడుతున్న ఒక మైండ్ గేమ్. సుధాకర్‌ను జీవితంలో ఓడించడానికి తన మనసు పన్నుతున్న ఒక పెద్ద కుట్ర. ఎందుకిలా జరుగుతుంది?
Also read: సమస్తమూ అంతశ్చేతనతోనే..
మనసు చేసే మాయ
మన మెదడులో ఉత్పత్తయ్యే స్రావాలలో పీయూష (పిట్యుటరీ) స్రావం వల్లే ఇదంతా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు. అకస్మాత్తుగా మనకు ఒక పులి ఎదురైతే ఏమి చేస్తామని అడిగితే దాని మీసాలు మెలేస్తానని, దాని జూలుతో జడ వేసేస్తానని మనం చెప్పేవన్నీ ప్రగల్భాలే. నిజానికి పులి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామన్నది పీయూష స్రావం నిర్ణయిస్తుంది. దానితో పోరాడడమా, ప్యాంటు తడుపుకొని పలాయనం చిత్తగించడమా అని తేల్చేది ఆ క్షణంలో విడుదలైన స్రావం నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే ఆ హార్మోనుకు పోరాట లేదా పలాయన హార్మోను అని పేరు పెట్టారు. కాని, ఆపద సమయాలలో తీసుకునే ఆకస్మిక నిర్ణయాల వెనుక కూడా మన అంతశ్చేతన దాగివుంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మన అంతశ్చేతనను ఎలా పెంచుతున్నామన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనిషి మెదడు కష్టాల కన్నా సుఖాలనే కోరుకుంటుంది. కష్టం నుంచి తప్పించుకోవాలను కుంటుంది. అందుకే ఇబ్బందులు, ఆపదలు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినుండి దూరంగా పారిపోవడం ఒక పరిష్కారంగా మన మనసు మనకు సూచిస్తుంది. ఇదొక ఎస్కేప్ రూట్. కాబట్టి ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు వాటినుండి పారిపోవాలని తీసుకునే నిర్ణయం సుధాకర్ తీసుకుంటే, మనసు చేసే మాయ గురించి తెలిసినవారికి, అదేమంత ఆశ్చర్యం కలిగించదు. కాని, ఈ విషయం సుధాకరునికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
Also read: కాపీక్యాట్ మార్కెటింగ్
సమస్య ఎదురవబోతుందని మన మనసు ముందే పసిగడుతుంది. ఇక అక్కడి నుంచి అది అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ఆ మార్గాలు పరిష్కారం కోసం కాదు. సమస్య నుంచి పారిపోవడానికి. సమస్యను అలానే ఉంచేసి, దానినుంచి పలాయనం చిత్తగించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ ప్రతిస్పందన అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఏకాంతం కోరుకుంటారు. అందరికీ దూరంగా పోతారు. గదిలో తమను తాము బందీగా చేసుకుంటారు. మరికొంతమంది విడ్డూరంగా కళ్లు మూసుకుని నిద్ర పోతారు. ఇంకొందరు ధ్యానంలోకి వెళ్తారు. దైవభక్తిలోకి మరికొందరు మరలుతారు. బాబాల వెంట కొందరు పడతారు. కొందరు అప్పటిదాకా వారు మరిచిపోయిన అంతగా అవసరం లేని పని నెత్తిమీద పెట్టుకుంటారు. కొందరు వీటికి భిన్నంగా మొండికేసి దేవుడిపై భక్తిని విడిచిపెడతారు. ఇవన్నీ పెడసరపు పనులే. మన మనసుకు కఠినమైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులే. సమస్య తప్ప మరే ఇతర అంశమైనా వారికి ఓకే. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా వేరే పనులపై దృష్టి పెట్టడం కచ్చితంగా పలాయనవాదమే. వాస్తవాన్ని అంగీకరించలేనివారు, వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యం లేనివారు ఈ విధంగానే ప్రవర్తిస్తారు.
Also read: పరోక్ష ఆదాయం
అడుగు – నమ్ము – పొందు
మరి దీనికి పరిష్కారం ఏమిటి? తక్షణ ప్రతిస్పందనగా ఇబ్బందులు లేని మార్గాలు వెతుక్కునే మనస్తత్వం నుంచి బయట పడడమే దీనికి పరిష్కారం. అయితే ఇది చెప్పినంత సులువు కాదు. ఆచరణలో కష్టసాధ్యమైన విషయమే అయినప్పటికీ ప్రయత్న పూర్వకంగా సాధన చేస్తే తప్పక పోరాట మార్గం మనకు అలవడుతుంది. పలాయన మార్గాన్ని విడనాడడం సాధ్యమవుతుంది. ముందుగా సుధాకర్‌ను ఫోన్ వచ్చినంతవరకూ నిరీక్షించవద్దని హితవు పలికాను. తానే ముందుగా ఫోన్ చేసి మానసిక ఇబ్బంది వలన ఫోన్ ఆన్సర్ చెయ్యలేకపోయానని అంగీకరించమన్నాను. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉందని, మరికాస్త గడువు కావాలని కోరమన్నాను. అయితే ఇద్దరమూ ఊహించని మాదిరిగా, అవతలి వ్యక్తి కరోనా తర్వాత అందరి ఆర్థిక పరిస్థితి అదే విధంగా ఉందని సానుభూతి చూపించాడు. వడ్డీ రాయితీ ఇస్తామని మాటిచ్చాడు. అయితే ఒక గడువు పెట్టాడు. ప్రతి వారమూ ఎంతో కొంత మొత్తాన్ని తనకు జమ చేయమన్నాడు. సుధాకర్ కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. అయితే ఇదంతా జరగడానికి ఒక రోజో, ఒక వారమో పట్టలేదు. దాదాపు నలభై ఐదు రోజుల వ్యవధి తీసుకుంది. మనసుకు అంత కఠినమైన శిక్షణ అవసరం. ప్రతిరోజూ సానుకూల వ్యాఖ్యలు (పాజిటివ్ అఫర్మేషన్లు) ఒక పావుగంట సేపు వింటుండడం వల్ల అంతశ్చేతనలో మార్పు వచ్చింది.
మన ఆర్థిక సమస్యలను మనం నియంత్రించలేం. వాటిని డబ్బుతో అధిగమించాల్సిందే. అలాకాక పూర్తిగా వాటిని పక్కకు నెట్టేయాలనే పలాయన పద్ధతులను విడిచిపెట్టాలి. ఉదాహరణకు మీకు ఒక సమస్య ఎదురవగానే ఎవరితోనూ మాట్లాడకుండా, మీలో మీరు కుంగిపోవడం, మధనపడడం వల్ల పరిష్కారం దొరకకపోగా, కొన్నిసార్లు విపత్కర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది.
Also read: అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం
మనందరికీ తెలిసిన కథే ఇది: మన దేశంలో అతిపెద్ద కాఫీ హోటళ్ల చెయిన్ ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ వెయ్యికోట్ల అప్పులో కూరుకుపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. కాని అతని ఆస్తుల విలువ ఏడువేల కోట్లు! దుఃఖం నుంచి వెంటనే తేరుకున్న అతని భార్య టాటా కంపెనీ సహకారం తీసుకుని రెండేళ్లలో ఆ అప్పులు తీర్చి, మళ్లీ కాఫీ షాపులను తెరిపించింది. దీనికంతటికీ కారణం సిద్ధార్థ తన కష్టాలను ఎవరితోనూ పంచుకోకపోవడమే. ఒంటరితనాన్ని ఆశ్రయించిన సిద్ధార్థ మనసు చేసిన మాయ వలలో పడ్డాడు. జీవితాన్ని కడతేర్చుకున్నాడు.
Also read: బిజినెస్‌మేన్
– దుప్పల రవికుమార్