నవంబర్ 18 వ తేదీన ఒక అజ్ఞాత మావోయిస్ట్ తో సహా ఐదుగురిపై సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట పోలీసు స్టేషన్ లో నమోదైన ఉపా కేసు పూర్తిగా కట్టుకథ లాగా ఉంది. గాడిచర్ల శ్రీనివాస్ అనే తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకర్త ఎన్నికల సందర్భంగా పోలీసులు చేసే తనిఖీల్లో ఆపకుండా వెళ్లిన కారును వెంబడించి పట్టుకున్నట్టు పోలీసులు ఒక కథ అల్లారు.
ఆ కారు లో ప్రయాణిస్తున్న గంభీర్ రావు పేట మండలం ముచ్చేర్ల గ్రామానికి చెందిన చెంజర్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు వెంబడించి ప ట్టుకున్నారని, ఎక్కడికి వెళ్తున్నావని విచారిస్తే, తాను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడనీ, కారులో ఉన్న మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పంపిన, మూడున్నర లక్షల రూపాయల డబ్బును తాను భారత్ బచావో నాయకులైన గాదె ఇన్నయ్య, డాక్టర్ గోపీనాథ్, జంజర్ల రమేష్ లకు ఇస్తున్నానని చెప్పాడనీ పోలీసులు అల్లిన కథనం సారాంశం.
ఆ కారులో విప్లవ సాహిత్యం, పేలుడు పదార్థాలు కూడా దొరికాయని పోలీసులు ప్రకటించారు.
శ్రీనివాస్ ఒప్పుకోలు ఆధారంగా, అందరికీ సుపరిచితులైన సామాజిక కార్యకర్త, ప్రముఖ గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎమ్మెఫ్ గోపీనాథ్ గారి మీద, కేసిఆర్ కు ఒకప్పటి సహచరుడు, తెలంగాణ ఉద్యమకారుడైన గాదె ఇన్నయ్య మీదా, ఇంకా ముగ్గురిమీదా తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టంగా అమలులో ఉన్న ‘ ఉపా’ కేసు నమోదు చేశారని తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం లో, సామాజిక కార్యకర్తలు గాని, ప్రజా సంఘాల బాధ్యులు గానీ, ఎంత చట్టబద్దంగా పనిచేసినా, ప్రభుత్వ పాలనా విధానాలపై అభిప్రాయం వ్యక్తం చేసినా, పోలీసులు ఇష్టారాజ్యంగా ‘ఉపా’ కేసులు పెట్టటం జరుగుతూ వస్తోoది.
ప్రధానంగా బీజేపీ, ఆర్.ఎస్. ఎస్ ల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పని చేసే భారత్ బచావో కు మొదటి నుండీ బీ. ఆర్.ఎస్ సహకరించడం లేదు. ఇక బీజేపీ, ఆరెస్సెస్ లతో స్నేహంగా ఉండటమే కాకుండా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న భారత్ బచావో సంస్థ మీద కక్షతో, బీఆరెస్ పార్టీ ఆదేశాలతో, పొలీసులు పెట్టిన బూటకపు కేసు గానే మానవ హక్కుల వేదిక భావిస్తున్నది.
కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే కల్పించుకొని, చట్టబద్ధంగా పనిచేసే మేథావులపై నమోదైన ఈ బూటకపు ‘ఉపా’ కేసును ఎత్తివేయాలని, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుoది.
డా.ఎస్ తిరుపతయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆత్రం భుజంగరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
ఎస్. జీవన్ కుమార్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు