మా ఆవిడకు ఫోన్ చేసి “దేవిప్రియ’ గారు పోయార్టబ్బా”! అన్నా.
‘‘అయ్యో ఎలా?’’
“అనారోగ్యమట”
“చూడ్డానికి వెల్తున్నావా”?
“ఆయన ఉండగా “ఒకసారి వచ్చి పో అన్వర్” అని చాలా సార్లు ఫోన్ చేసినా, వెళ్లని వాడిని ఇప్పుడు ఆయన లేని చోటికి, ఊపిరి లేని మనిషి వద్దకు వెళ్ళి ఏం చేయ్యమంటావు? గిల్టీ గా ఉంటుంది. పోనబ్బా!
ఆయన అన్నిసార్లు పిలిచినా పోకుండా నే కాపాడి పెట్టుకున్న సమయాన్ని ఏం ఘనకార్యాలకు ఉపయోగించానో బొత్తిగా గుర్తుకు రావట్లా! ఏ రోజు సాయంకాలానికంతా ఆ రోజు జీవితం మిగలట్లా. బొమ్మలు మిగలట్లా, అనుభవం మిగలట్లా, మనుషులూ మిగలట్లా. అసలు నాకు నేనే మిగలట్లా . నాకు ఈ క్షణం చిత్రకారులు చంద్ర గారు గుర్తుకు వస్తున్నారు. కాళోజీ గారు పోయిన రోజు ఆయన నా దగ్గరికి వచ్చారు. చిన్నపిల్లాడిలా కళ్లవెంట నీళ్ళు పెట్టుకుంటూ. మనిషి పోయిన వార్త విని అంత దుఖం ఎలా వస్తుందో నాకు అప్పుడు అర్ధం కాలేదు. ఇప్పుడు ఈ మరణ వార్త విని చేతులు ఆడట్లా. బరువుగా ఉంది, ఏదోలా ఉంది, ఏడుపుగా ఉంది, చంద్రగా ఉంది. చేతులారా మనుషుల్ని దూరం చేసుకుంటున్నట్లు ఉంది. ఉన్నపళంగా అందరు మనుషుల్ని అమాంతం ప్రేమించాలని ఉంది. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. మనుషులు దేనికయినా పర్లేదు కానీ ప్రేమకు మాత్రం అర్హులు కారు అంటూ కూడా.
Also read: రిస్ట్ వాచీల కథాకమామీషూ
దేవిప్రియ గారిని చివరిసారిగా చూసింది 2018 రంజాన్ మాసంలో ఒక సాయంత్రం, ఆయన ఇంట్లో ఇచ్చిన ఇప్తార్ విందులో . దేవిప్రియ గారి పేరు విన్నది, పతంజలి గారిని చదువుకున్నది, తెలిదేవర భానుమూర్తి గారిని నవ్వుకున్నది, మోహన్ గారిని కనుగున్నది అంతా ’ఉదయం’ దినపత్రికలో. మా పాఠక తరానికి గొప్పకిక్కు ఉదయం పత్రిక . ఆ బ్యాచ్ జర్నలిస్ట్ ల రాతలే రాతలు, గీతలే గీతలు. ఆ రోజుల్లో హైస్కూలు చదివే చిన్నపిల్లాడిని నేను . తరవాత రోజుల్లో దేవిప్రియ గారిని నా నోవా స్కూటర్ మీద ఎక్కించుకుని హైద్రాబాద్ దారులు తిప్పాను అంటే అదో కలలానో , గత జన్మలానో ఉంటుంది. ఆయన నాకు ఇక్కడ ఎలా పరిచయం అయ్యారో నాకు గుర్తు అసలే లేదు. ఆయన్ని సాహితీ సమావేశాల్లో కలిసేవాణ్ణి ఎప్పుడూ. గీటురాయి పత్రికలో కలిసేవాణ్ణి అప్పుడప్ప్పుడు.
గీటురాయి ఎడిటర్ మాలిక్ గారి రూములో కూచుని ఉన్న ఆయన హాయి నవ్వులు వినపడేవి. నాకు ఉన్న బిడియస్వభావం వల్ల పెద్ద వారు నన్ను ఎంత దగ్గరగా లాక్కుందామని చూసినా నేను గౌరవంగా నాలుగున్నర కిలో మీటర్లు దూరం జరిగే నిలబడే వాడ్ని. రెండు లేదా న్నర సంవత్సరాల వెనుక కూడా ప్రెస్ క్లబ్ లోఆయన చేతికర్ర పట్టుకు ఉన్నారు. ఆయనకు టీ తాగాలని ఉంది. టీ అక్కడ ఎక్కడో దూరాన ఇస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్లలేకపోతున్నారు. నే కూచున్న దగ్గరనుండి లేచి గబాగబా ఆయనకోసం ఒక టీ తెచ్చి ఇస్తే “నువ్వెందుకు తెచ్చావు అన్వర్” అంటూ నాకు పని పెట్టినట్టుగా ఆయన ఇబ్బంది పడ్డారు. ఈ రోజు నేను ఏదో నాలుగు కుదురు బొమ్మలు అబ్బిన మనిషిగా, ఆర్టిస్ట్ గా ఆయనకు ఒక తెలియడం వెనుక నేను ఇంకా ముప్ఫై, ముప్ఫై రెండు సంవత్సరాల వెనుక రోజుల్లో ఈ గొప్ప మనుషుల రాతలని అబ్బురంగా చదువుకున్న చిన్నకుర్రాడి నీడ నలుపు లో కలిసే ఉన్నా. పెద్దలంటే తెలిసిన స్పృహ లోనే ఉన్నా.
దేవిప్రియ గారికి నన్ను పొలిటికల్ కార్టూనిస్ట్ గా చూద్దామని చాలా కోరిగ్గా ఉండేది. ఎంతయినా ముందు తరం వారి ముందు చూపు గొప్పది. నాకు అప్పట్లో అసలు కార్టూనింగ్ అన్నా ఆ బొమ్మలు సరిగా వేయనక్కరలేని ఆ పని అన్నా చాలా తేలిక చూపు ఉండేది. ఆయన ఎంత పోరు పెట్టినా కార్టూనిస్ట్ అయ్యే సాధనలో చేయి పెట్టలేదు. “ఏమీ లేదు అన్వర్, రోజూ బొమ్మలు ప్రాక్టీస్ చేసినట్లే, పత్రికల్లో వార్తలు చదివి రోజుకు ఒక కార్టూన్ని వేయడం ప్రాక్టీస్ చేయి’’ అని ఆయన ఎంతగా చెప్పినా ఆయన మాట వినిపించుకోలా. జీవితం బాగా దూరం నడిచాకా, పొలిటికల్ కార్టూన్ వేయాల్సిన అవసరం కలిగినపుడు, అవి వేయడానికి చచ్చే చావయినపుడు ‘అరే! నిజమే కదా, కాసింత సమయం కార్టూనింగ్ కు పెట్టి ఉంటే బావుండేది’ అనిపించేది, ఆ అనిపించినప్పుడల్లా దేవిప్రియగారే గుర్తుకు వచ్చేవారు. దేవిప్రియ గారు కవే కాక పాత్రికేయులు, సంపాదకులు కూడా. తెలుగు జర్నలిస్ట్ లకు ఎవరికీ లేని గొప్ప డిజైన్ సెన్స్, విజువల్ బ్యూటి ఇమాజినేషన్ ఆయనకు ఉండేది. ఆయన పుస్తకాల డిజైన్ లల్లో ఆయన పాత్ర ఎక్కువ. రాజీ పడేవారు కాదు. కవర్ పేజీ బొమ్మ మీదే కాదు, ఆ పైన కంపోజ్ చేసిన అక్షరాల మీద, లోపలి ఫాంట్స్ కూడా గొప్ప శ్రద్ద పెట్టే మనిషి. దేవిప్రియ తరువాత అంత అందమైన పుస్తక కల్పన కలిగిన సాహితీ మనిషిని నేను చూడలేదు.
Also read: దీసావళి వెలుగు జాడలు
సాహిత్యం, చిత్రకళ అని యవ్వనోద్రేకపు మత్తు వదిలి, మూడు పూట్ల కడుపుకు నాలుగు రాళ్ళు కావాలి అని సత్యం తెలిసాకా జీవితం అంటేనే రాళ్ళు కొట్టే పని జ్ఞానమై ఆ కార్ఖానాలో కుదురుకునీ సాహిత్యానికి, కళా మందిరాలకు, ప్రెస్ క్లబ్ సమావేశాలకు బహు దూరమైన చాలా సంవత్సరాల తరువాత ఒక సారి దేవిప్రియ గారిని చూశా. ఆయన వాస్తవానికి చాలా బలంగా. గట్టిగా ఉండే మనిషి. అలాంటి వారు ఒక్కసారిగా చేతి కర్రతో కనపడేసరికి తట్టుకోడం కష్టంగా అనిపించింది. మొహంలో వర్చస్సు, కళ్ళల్లో కళ, చిరునవ్వు మిగతా అంతా అలానే ఉంది. బహుశా అంతకు మునుపే ఆయన ఎంతగానో ప్రేమించిన భార్య రాజ్యలక్ష్మి గారు మరణించారని, అది ఆయనకు కోలుకోలేనంత దెబ్బ అయిందని ఎవరో చెప్పారు. దేవిప్రియ గారు అనగానే మోహన్ గారి దగ్గరి నుండి నామిని గారి వరకు ఒక మాట భలే గొప్పగా చెప్పేవారు. హైద్రాబాద్ లో గొప్ప భోజనం తినాలి అంటే ’దేవిప్రియ ఇల్లే నబ్బా, బ్రహ్మాండమైన రుచి, కొసరి కొసరి వడ్డిస్తూనే ఉంటారు” అని. నేనయితే వారి ఇంట్లో ఎప్పుడూ తినలేదు. ఇప్పుడు అనిపిస్తుంది, మనం ఇష్టపడేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు సంవత్సరాల తరబడి ఆరాధించిన మనుష్యులు, ఇన్ని సంవత్సరాల సాంగత్యంలో ఏనాడు కలిసి ఒక్కపూట బోజనాన్ని పంచుకోలేకపోయామే అనిపిస్తుంది. చేతులారా జీవితాన్నంతా తీసుకు పోయి ఎక్కడ పారబోస్తున్నాం? కనీసం ఒక్కసారి కలిసి నీ ముద్ద నా ముద్ద అని రెందు ముద్దల బోజనానికి కలిసి కూచోలేని సమయం లేని బ్రతుకు అయిపోయింది.
రెండు సంవత్సరాల క్రితం దేవిప్రియ గారి ఇంట్లో ఇఫ్తార్ విందుకు చాలా మందినే పిలిచినట్లు ఉన్నారు. బల్ల మీద పరిచిన భోజనం కనీసం పాతిక మందిది. హాజరయ్యింది నేనూ, వాహేద్ భాయ్, ఖదీర్, డేనీ గారు, వారి ఆవిడ. దేవిప్రియగారి మనసులో ఎట్లా ఉందో కానీ నాకు భలే నొప్పిగా అనిపించింది. లెజెండ్ దేవిప్రియ ఒక సాయంకాలం పండగ భోజనానికి పిలిస్తే కాసిన్ని గంటలు ఖర్చు పెట్టడానికి కూడా మనసు రానంతగా అయిపోయారే మనుషులు. అయినా ఒకరిని అని ఏముందిలే, “అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకాసేపు ఉండు అన్వర్” అని ఆయన నోరు తెరిచి అడిగినా నేను మాత్రం ఉన్నానా, ఉండి ఉంటే ఆ సాయంకాలం నాకు మిగిలి ఉండేది, ఇప్పుడు బిక్క మోహంతో ఇక్కడ ఇది రాస్తూ ‘ఏదీ? ఏం చేశా ఆ సాయంకాలాన్ని’ అని నన్ను అడిగినంత మాత్రానా ఏమీ తేలుతుంది ఏ పద్దు కింద నిదరోయిన ఆ సాయంత్రం?
బొమ్మలేసే పాపానికి సత్యానికయినా, సరదాకయినా ప్రతి ఒక్కరు అడిగే మాట ఒకటి ఉంటుంది “నా బొమ్మ ఎప్పుడు వేస్తావు అన్వర్” అని. దేవిప్రియ గారు అలానే అడిగారు అలా చాలాసార్లు అడిగి, అడిగి మరలి ఆయనే అన్నారు, “నేను పోయాక వేద్దువులే అన్వర్, అప్పుడు పేపర్ లో పెట్టుకోడానికి పనికి వస్తుంద”ని. అయ్యో! నేను భలే నొచ్చుకుని నేను ఆయనకు వెంటనే ఫోన్ చేసి క్షమాపణగా మాట్లాడా.
ఆయన పోయిన తరువాత ఒక పత్రికలో ఉద్యోగ ధర్మం కొద్దీ ఆయన బొమ్మ వేయవలసి వచ్చింది. “ప్రియమైన దేవిప్రియ గారు, అయినా ఎప్పుడు కూడా మీ బొమ్మ నేను వేయలేదు , మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని కాసింత మురిపించలేని ఈ రంగు పూత మీరు లేనప్పుడు మాత్రం ఎందుకు? బహుశా ఇంకెప్పుడూ మీ బొమ్మ వేయనే వేయను. వేసిన ఆ బొమ్మను ప్రపంచం చూస్తుందేమో కానీ, మీరు తప్ప.
మీ బొమ్మ వేయకపోవడమే నా నివాళి సర్. అల్లా హాఫిజ్.
Also read: జగమెరిగిన ఆర్ కె లక్మణ్