Sunday, November 24, 2024

రిస్ట్ వాచీల కథాకమామీషూ

ఉత్తర భారత దేశంలోని సినిమా టాకీసులలో నేను  చూసిన సినిమాలు మూడు. అందులో మొదటి మరియూ మూడవ దాని ప్రసక్తి అనవసరం. రెండవ సినిమా గురించి కూడా పరమ అనవసరమే, కానీ ఏదయినా ఒక  విషయం చెప్పడానికి ఎలా మొదలు పెట్టాలో నాకు ఎప్పుడూ తెలీదు అందుకే మూడు సినిమాలని    ఇలా మొదలు పెడుతున్నాను. ఏడవ తరగతి పరీక్షల అనంతరం నేను కొంతకాలం ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్నాను. అక్కడ చూసిన రెండవ సినిమాయే మిస్టర్ ఇండియా. ఆ వయసులో అటువంటి అబ్బురం కలిగించే సినిమా చూడటాన్ని, దాని గురించి పదేపదే తలుచుకోవడానికి  మించిన అపురూపమైన సంగతులు ఏముంటాయి?  అప్పట్లో ఆ సినిమా చూసినవాళ్ళల్లో  మిమ్మల్నే కాదూ నన్నూ అకర్షించిన వస్తువు ఆ అద్భుతమైన వాచీ. ఆ సినిమాలో చూసిన తరువాతే అని కాదు, అంతకు ముందునుండీ, ఇప్పటికీ కూడా చేతి గడియారం అంటే నాకు ఎంతో ఇష్టం.  చేతికి కట్టుకునే గడియారం లో ఒక హూందా తనం అనిపిస్తుంది నాకు. మణికట్టుని మనవైపు తిప్పుకుని సమయమెంత అని చూడ్డం లో ఒక సొగసు కనిపిస్తుంది నాకు.

Also read: దీసావళి వెలుగు జాడలు

నాకు గుర్తు ఉండి ఆరవతరగతిలో చేరడానికి హైస్కూల్ కు వెళ్ళే తొలి రోజున నేనంటే ప్రాణం పెట్టే మా మహబూబి అత్త నా చేతికి తన నీలి రంగు డయల్ గడియారం తొడిగింది. అదే   నేను కట్టుకున్న మొదటి గడియారం. మా నాన్న మిలట్రీలో ఉండేవారు. ఆర్మీ క్యాంటిన్ లో వస్తువులు అగ్గువకు దొరుకుతాయి,  ఆ రోజుల్లో ఆయన సెలవులకు వచ్చినప్పుడల్లా గడియారాలు తెచ్చేవారు. జనం అడిగి మరీ తెప్పించుకునేవారు కూడా. మా అత్త గడియారం మా నాయన తెచ్చిపెట్టిందే అని గుర్తు నాకు. ఆ నీలి గడియారం బుల్లిది, స్టీల్ ది, గుండ్రనిది, నాజూకయిన చైన్ కలది. అప్పట్లో బడికి చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే  గడియారాలు  పెట్టుకుని వచ్చేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళని మిగతా పిల్లలు ఎగాదిగా చూసేవారు. ‘చదువు సరిగా రాదు కానీ, ఏం స్టయిల్ కొడుతున్నావురా నాయనా నువ్వు’  అని నొసలుతో, నోటితో కూడా నిరసన ప్రకటించేవారు.  బ్యాడ్ సమరిటన్స్ తో ఎందుకొచ్చిన గొడవని అలా మా మేనత్త గడియారాన్ని నేను ఎక్కువకాలం పెట్టుకు ఊరేగింది లేదు. ఆ తరువాత రోజుల్లోనె  ఎలక్ట్రానిక్ గడియారాల ట్రెండ్ మొదలయ్యింది. వెలుగుతూ ఆరుతూ పుల్లలాంటి నెంబర్లు. కింది బటన్ నొక్కి పట్టుకుంటే మిణుక్కుమనే  సన్నపాటి డయల్ లైటు, అలారం మోత, భలే? వాటి తరువాత ఇంకాస్త అడ్వాన్స్ గా క్యాలికులేటర్ వాచీలు కూడా వచ్చాయి. ఆ వాచీలని  బడిలో పెట్టుకు తిరిగే వాళ్ళు కొంత మంది తయారయ్యారు . కానీ లెక్కల పరీక్షా సమయాల్లో మాత్రం చేతికి ఉన్న వాచీని వొలిపించిన తరువాతే పరీక్షకు కూర్చోపెట్టేవారు. ఆ రోజుల్లో నా చేతికి ఒక మామూలు ఎలక్ట్రానిక్ గడియారం వచ్చింది కానీ ఎవరు కొనిచ్చారో ఇపుడు చెప్పలేను. గుర్తు లేదు. అంతకు ముందు తిక్క స్వామి ఉర్సులో పొడుగాటి కర్రకు తగిలించిన అట్టకు వేలాడదీసిన  బొమ్మ గడియారాలు, రంగుటద్దాలు   బోలెడు రంగుల్లో దొరికేవి. మహా అయితే పావాల డబ్బులు అది. ఒక వాచీ కొనుక్కుని చేతికి ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని అవి జారిపోకుండా ముక్కును ఎత్తిపట్టుకుని నడిచేవాళ్లం మేమప్పుడు.  మధ్య దారిలో గడియారం కట్టుకున్న పెద్దలెవరైనా కనపడితే వారి వాచిలో టైమ్ ఎంతయ్యిందో కనుక్కుని మాటిమాటికి మా   బొమ్మ వాచీల్లో  ముల్లులు అంకెలవద్దకు తిప్పుకునే వాళ్ళం. అన్నట్టూ చెప్పడం మరిచి పోతాను. గడియారంలో ముల్లలని బట్టి సమయం చెప్పడం మాకు మా హైస్కూలు లో లెక్కల మాష్టారు రామిరెడ్డి గారు నేర్పారు.

Also read: జగమెరిగిన ఆర్ కె లక్మణ్

కీ ఇచ్చే గడియారం

మా ఇంట్లో ఇత్తడి రంగులో ఒక గడియారం ఉండేది. నలుచదరపు గడియారమది. నల్లని నైలాన్ స్ట్రాప్ దానిది. అది మా అమ్మ వాచి అని మా ఇంట్లో వాళ్ళు  చెప్పారు. కీ ఇచ్చే గడియారం అది. మా అమ్మ నాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడే నూరెళ్ళు నిండిపోయి, వెళ్ళిపోవడం వలన  అమ్మ వాచిని చూసినా, ముట్టుకున్నా మా అమ్మ నా దగ్గర ఉన్నట్టుగా ఉండేది. రాత్రిళ్ళు కూడా దానిని పెట్టుకునే నిద్ర పోయేవాడిని. మా అన్న ఒకసారి అమ్మ వాచీ ఇవ్వు మళ్ళీ ఇస్తా అన్నాడు. ఇక ఆ మళ్ళీ వాచీ వెనక్కి రాలేదు. అమ్మ లాగే వాచీ కూడా దూరం వెళ్ళిపోయింది. అమ్మపోయి వాచి వచ్చే డ్డామ్ డ్డామ్ డ్డామ్. అన్న వచ్చి అమ్మ వాచి కూడా పోయే డ్డామ్, ఆ పై ఏడుపు వచ్చె డ్డామ్ డ్డామ్ డ్డామ్.

నేను ఇంటర్ మీడియట్ చదివేప్పుడు మా నాయన మిలట్రీ క్యాంటిన్ లో ఒక నల్ల డయల్ హెచ్ ఎమ్ టి  వాచి తెచ్చి నాకిచ్చాడు. అది నాకేం నచ్చలా, పైగా అది కాస్త  పెద్దగా ఉంది కూడా . కాలేజిలో నా క్లాస్మేట్స్ “ఏమిరా నాయాలా? చేతికి రెండు శేర్ల రాయి కట్టుకుని వచ్చినావే” అని వెక్కిరించేవారు.  నా పలుచని చేతికి వదులుగా ఉండి జారి పోతోంది కూడా ఆ రాయి.  ఇలా కాదులే అని వాచీల షాపుకు వెళ్ళి దానికి ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ చైన్ తీయింసేసి లెదర్ పట్టా వేసుకున్నా . పైగా అవి నాగార్జున శివ సినిమా రోజులవి. గడియారాలని మణికట్టుకు ముందు వైపు కాక వెనుక పెట్టుకోవడం ట్రెండ్.   డిగ్రీ రోజుల్లో అనుకుంటా ఆల్విన్ ట్రెండి అనే వాచ్ ఒకటి వచ్చింది. భలే షోగ్గా ఉండేది. నా స్వంత డబ్బులతో ఆ వాచి కొనుక్కున్నా. సాప్ గ్రీన్ కలర్ వాచ్ అది. ఇప్పటికీ నాకు ఆ రంగు అంటే చాలా ఇష్టం. ఈ మధ్యే  ఆ రంగు సంచి ఒకటి కొనుక్కున్నా,  ఆమధ్యే  మా డాక్టర్ అమ్మ ఒకరికి అదే రంగు చీర కొన్నా.  ఒక సంవత్సరం నా పుట్టిన రోజు రాగానే మా భార్గవి అమ్మ, మా సత్యవతి అమ్మ ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అదే రంగులో చొక్కాలు నాకు కొని పెట్టారు. రంగులో ఏముంది అనేవాళ్ళు ఉండవచ్చు కానీ రంగులో చాలా ఉంది. వీడికి ఆ ఫలానా రంగు ఇష్టమనే గ్రహింపులో  మనుషుల పట్ల  ఆసక్తి, ప్రేమా, శ్రద్దా ఉంటాయి.

లావణ్య అనే అమ్మాయికి ఒకసారి పుట్టిన రోజు రాబోతుంది. నేను అప్పుడు ఇంట్లో గొడవ పడి బయటికి వచ్చి స్వంతంత్రంగా ఉన్నా. అపుడు నా వయసు 20. ఏదో ఒక పని చేసుకోవాలి, తినాలి, బ్రతకాలి, కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి. అయినా ఆ పరిస్థితుల్లో కూడా  అమ్మాయికి ఒక బహుమతి ఇవ్వాలి. అప్పుడప్పుడే నంద్యాల బాలాజి కాంప్లెక్స్ లో బజాజ్ స్కూటర్స్ వాళ్ళ షోరూం ఒకటి పెడుతున్నారు. ఆ షోరూం ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పెయింటింగ్ వర్క్స్, సైన్ బోర్డ్ లెటరింగ్ అంతా ప్రభాకర్ అని ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారు. నాకు ఆ పని రాక పోయినా సరే, రెక్కలు ముక్కలు చేసుకుని ఒకటీ రెండు రోజుల్లో ఆయనతో పాటూ  పని ముగించి ఆయన ఇచ్చిన డబ్బులు పుచ్చుకుని రెక్కలేసుకుని మరీ ఎగిరి వెళ్ళి లావణ్యకో వాచీ కొన్నాను. ఇరవై ఎనిమిది ఏళ్ళు అయి ఉంటుంది. దానిని ఆ అమ్మాయి ఇప్పటికే భద్రంగా చూసుకుంటుంది. ఆ రోజుల్లో ఊళ్లల్లో వాచీల షాపులు విపరీతంగా ఉండేవి. సేల్స్ఽఅండ్ సర్వీస్ కూడా. ఇప్పుడు వాచీల అంగళ్ళు తగ్గిపోయాయేమో అని అనిపిస్తుంది. అప్పట్లో  సాధారణంగా వాచీ షాపులు  చాలా మటుకు షట్టర్ దుకాణాలవి అయి ఉంటాయి. పబ్లిసిటీ కొసం ఆ షట్టర్ల మీద అర్టిస్ట్ లతో రక రకాల గడియారాల బొమ్మల్ని పెయింటింగ్ చేయించే వారు. నునుపుగా ఉన్న ఉపరితలం మీద బొమ్మ వేయడం సులువు కానీ వంపు వంపులుగా ఉండే షట్టర్ రేకు మీద ఆ గుండ్రని గడియారాలు, వాటి మీద అంకెలు, ఆ లోగోలు… అవన్నీ వ్రాయడం చాలా చాలా హింస. ఆ మధ్య విజయనగర వాస్తవ్యులు శ్రీ వెంకట్రావు గారు కుట్టు కథలు అని టైలర్ కథలు వ్రాసినట్లు, కుంచె గాధలు అని సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ ల బ్రతుకులు గురించి కథలు వెల్లడి కావాలి.  వ్రాసే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరూ కనపడ్డం లేదు.

Also read: రామభక్త బైబుల్

వాచి ఇవ్వడం పుచ్చుకోవడం అనేది భలే బ్యూటిఫుల్ విషయం.  సుస్మిత అనే ప్రెండ్ నాకు ఉండేవారు. ఆవిడ ఒకసారి నాకు అమెరికా నుండి భలే సన్నని, నైసైన వాచి బహుమతి చేసారు. గడియారం బహుమతి  అంటే ఏమిటని? కుడి చేతి మణికట్టు వెనుక పాకిన నరం ఒకటి గుండె దాకా టిక్ టిక్ అని కొట్టుకుంటూ ఉండటం. మా భార్గవి అమ్మ కూడా ఒకసారి అమెరికా నుండి వస్తొస్తూ నా కోసం నాలుగు వాచీలు తెచ్చింది. నాకు ఒకటీ నచ్చలేదు, నాకు నచ్చలేదని అమ్మేం నొచ్చుకోలేదు. ఈ సారి ఇంకా మంచివి తెచ్చిపెడతాలే అని హామి ఇచ్చింది. ప్రేమ అంటే హామీలు ఇవ్వడమే కాదు, దబాయించి తీసుకోవడం కూడా.  ఒకసారి ఆవిడ “అన్వర్ నాకు ఒక మంచి వాచి ఇప్పించు, బాగా దర్జాగా ఉండాలి” అని ధాటీగా కూడా అడిగింది. ఎదురు చూస్తున్న మహూర్తం అని ఒకటి రాగానే అమ్మకు వాచి కొని ఇవ్వాలి. ప్రముఖ రచయిత్రి సత్యవతి గారు స్మాల్ బిల్ట్ మనిషిలా అనిపిస్తారు, కాని ఆవిడ మణికట్టు చాలా బలంగా ఉంటుది. ఆవిడ చేతికి ఫాసిల్ వాచి ఒకటి భలే అందంగా అమిరి ఉంటుంది. ఆవిడనెప్పుడయినా ఆ వాచీ కథ అడగండి చేతిని నోటికి అడ్డం పెట్టుకుని గలగల నవ్వుతూ ఆ గడియారం కథ చెబుతుంది. అంతే కాదు వాళ్ళ ఆయన ప్రసాద్ గారి గడియారాల కథ కూడా చెబుతుంది.

బాపుగారి వాచీ

నాకెప్పుడూ మా “బాపు” గారి వాచీ మీద చూపు ఉండేది. భలే బావుండేది  అది.  నాకు కావాలి. అడిగితే ఇచ్చే వారే! కాని అడగడమెలా? ఆయన తనువు చాలించాకా నేను పడ్డ  బెంగల్లో ఒకటి ఆయన వాచీ ఏమయిందబ్బా అనే!  ఒకసారి ఆర్టిస్ట్ చంద్ర గారు నన్ను ఇంటికి పిలిచి తన దగ్గరి లండన్ వాచీ ఒకటి నాకు బహుమతిగా ఇచ్చారు. ఎర్రనిడయల్ ది అది. లండన్ ఎర్ర వాచీలకు భారతీయుల నల్ల మణికట్టులకు కుదరదనుకుంటా . అది ఎక్కువ కాలం నడవలేదు. మా పిల్లవాడు మోహన్ చిన్న పిల్లవాడుగా  ఒకరోజు నిద్రలో ఉండగా వాడిని నిద్ర లేపి వాడి చేతిలో టైటాన్ ఎక్క్స్పెడిషన్ వాచీ పెట్టి “హేప్పి బర్త్ డే నాన్న” అన్నాను. ఆ నిద్దుర మబ్బు పట్టిన వాడి మొహంలో ఆ రోజు కలిగిన ఉద్విగ్నం, ఆనందం నా కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతుంది. 

నేను నా జీవితంలో బొలెడని వాచీలు కొనుక్కున్నా, బొలెడన్ని వాచీలు నా అనుకునే వాళ్ళకు ఇచ్చుకున్నా. ఇచ్చుకున్నా – పుచుకున్నా ఆనందమే . ఇప్పుడు ఈ వాచీల కథంతా ఎందుకు అంటే  జీవితంలో కలిగే ఇష్టాలకు, ఆ ఇష్టం కొద్ది  సంపాదించుకున్న ప్రతీదికి ఒక కథ ఉంటుంది. మా ఇంట్లో గోడ మీద వెలుగుతున్న ట్యూబ్ లైట్ కు కూడా ఒక కథ ఉంది. ఈ  వస్తువులు నాతో  ఏం చెబుతాయంటే, నోరు విప్పి  ఏమీ చెప్పవు కానీ  నన్ను అమాంతం  వెనక్కి లాక్కెల్తాయి. లాక్కెళుతూ వెలుతూ  అవి ఇలా అంటున్నట్లుగా అనిపిస్తుంది. “చూసావా  రోజులు అప్పటికీ, ఇప్పటికీ  ఎంత రుచిగా ఉంటాయో, కల్ భీ, ఆజ్ భీ – ఆజ్ భీ కల్ భీ , ఇన్ యాదోంకా సఫర్ తో రుకేనా కభీ”.

చిన్నతనాన ఇంటి ముందుకు  కర్రకు మిఠాయి ముద్దని చుట్టుకున్న ఆయన వచ్చి , మన చేతిలోని పదిపైసలో, పావలో తీసుకుని , అదే చేతికి రంగు రంగుల మిఠాయి గడియారం  చుట్టేవాడు. ఆ గడియారాన్ని చేతికి అలాగే అంటించుకుని కొంచెం కొంచెం కొరుక్కు తినేవాళ్ళం. ఇప్పుడు వ్యక్తిత్వ వికాస నిపుణులు విజయమనే అయిదో మెట్టుపై నిలబడి చెబుతారే, సమయన్ని వృధా చేయవద్దు, లేవండి, పళ్ళు తోముకోండి, పరిగెత్తండి, పరిగెత్తండి, అందరి కన్నా ముందుగా, అందరికన్నా వేగంగా… మిఠాయి కర్ర ఆయన ఏమి మాట్లాడలేదు,  అయన  పిల్లల చేతికి గడియారం చుట్టపెట్టి  కాలాన్ని,ఇష్టంగా కోరుక్కు తినమన్నాడని. సమయాన్ని మెల్లగా నాకుతూ తీపిగా ముగించేయమన్నాడని నాకై నేనిప్పుడు అర్థం చేసుకున్నాను.

 మీకు సమయం ఉంటే ఇదంతా చదివి, ఒక నిట్టూర్చి  మీ టిక్ టిక్ గడియారాన్ని చెవి దగ్గర ఉంచుకుని వినండి. అది మీకు ఏం కథలు చెబుతుందో వ్రాయండి. నేను వింటాను.

Also read: మనిషి-పని

Anwar
Anwar
బొమ్మలేయడమన్నా, చదువుకోడమన్నా కాస్త ఆసక్తి గల అన్వర్ పుట్టింది కశ్మీర్‌లో పెరిగింది రాయలసీమ లోని నూనేపల్లె అనే చిన్న ఊళ్ళో. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles