Monday, November 25, 2024

మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరాటం

యోగేంద్రయాదవ్, శ్రేయస్ సర్దేశాయ్

మధ్యప్రదేశ్ మార్పునకు సిద్ధంగా  ఉంది. ఆ మార్పునకు ఈ అసెంబ్లీ ఎన్నికలే కారకమౌతాయా? రాజకీయ పరివర్తనతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే చాలా ఆలస్యమైన సాంఘిక పరివర్తన కూడా సంభవిస్తుందా? లేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్న సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కొనసాగింపునకు పావులు కదులుతున్నాయా? మధ్యప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పోటీలో అడగవలసిన అసలు ప్రశ్న ఇది. పోటీలో అవసరానికి మించిన తీవ్రత కనిపిస్తున్నది.

పరివర్తనను చాలాకాలంగా అడ్డుకున్నారు. అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మాత్రం కనిపించాయి. ఈ  రాష్ట్రానికి ఉత్తర సరిహద్దులో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో 1990లలో దళితపవనాలు వీచినాయి. బీఎస్ పీ ఆధిక్యం చెలాయించింది. కానీ బీఎస్ పీ ఆధిపత్యం ఎంతో కాలం సాగలేదు. అంతలోనే తగ్గిపోయింది. మధ్యప్రదేశ్ కు తూర్పున ఉన్న పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్,జార్ఖండ్ లలో ఆదివాసీల ఆధిక్యం కొనసాగుతున్నది. మధ్యప్రదేశ్ జనాభాలో 21 శాతం ఆదివాసీలు. అక్కడ కూడా ఆదివాసీల ప్రాబల్యం ఉండాలి. గోండ్వానా గణతంత్ర పరిషత్ ఎదిగి వచ్చింది కానీ శక్తిమంతమైన ప్రధాన స్రవంతి పార్టీలు దాన్ని విఫలం చేశాయి. మధ్యప్రదేశ్ జనాభాలో సగానికి పైగా ఓబీసీలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో మండల్ రాజకీయాలు రాజ్యం చేయలేదు. కడచిన రెండు దశాబ్దాలలో మధ్యప్రదేశ్ లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటాం. కానీ వ్యవసాయదారుల సంస్థలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయలేకపోయాయి. మండసార్ లో 2017లో రైతులపైన  కాల్పులు జరిగిన తర్వాత రైతు ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే 

సామాజిక పరివర్తన కోరుతూ జరిగే మథనంపైన రెండు దశాబ్దాల బీజేపీ ఎన్నికల విజయాలూ, ఆధిక్యం బిరడా బిగించాయి.  రాష్ట్ర విభజన ఫలితంగా 2003లో ఛత్తీస్ గఢ్ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.  అప్పటి నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ  ఎన్నికలలో దాని బలం తగ్గుతూ వచ్చినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతోంది. 2018లో బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. (బీజేపీకి 109 స్థానాలూ, కాంగ్రెస్ కి 114 స్థానాలూ లభించాయి). కానీ కమల్ నాథ్ ప్రభుత్వం 15 మాసాలు నడిచిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కొందరు ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది.

సామాజిక, ఆర్థిక సూచీలలో వెనకంజ

నిజానికి మధ్యప్రదేశ్ లో సుదీర్ఘంగా పాలించిన బీజేపీకి  చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ లేవు. అనేక సామాజిక, ఆర్థిక అభివృద్ధి సూచికలలో మధ్యప్రదేశ్ వెనకబడి ఉంది. రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఈ యేడాది ప్రారంభంలో 39 లక్షలు. ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలు జాప్యం, కుంభకోణాలతో కూడుకొని ముందుకు సాగలేదు. వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పటికీ రైతుల ఆత్మహత్యలలో రాష్ట్రం దేశంలో నాలుగో  స్థానంలో ఉంది. భూస్వాముల కుల దురహంకారం, ఇతర కులాల అణచివేత నిర్నిరోధంగా సాగిపోతున్నది. దళితులపై నేరాలు దేశ సగటు కంటే ఈ రాష్ట్రంలో రెండున్నర రెట్లు అధికం. ఆరోగ్యరంగంలో చూస్తే నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో మొత్తం 19 రాష్ట్రాలలో 17వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. శిశు మరణాల విషయంలో ఈ రాష్ట్రం విషాదకర పరిస్థితులలో ఉంది. డాక్టర్ల కొరత వేధిస్తూనే ఉంది. జనసంఘ్ రోజుల నుంచి సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉన్నది కనుకా, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నది కనుకా అభివృద్ధి గుంటపూలు పూసినా బీజేపీ అధికారంలో కొనసాగింది.

Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది

ఈ ఎన్నికలు లోగడ జరిగినవాటికన్నా భిన్నంగా కనిపిస్తున్నాయి. పద్దెనిమిదేళ్ళు అధికారంలో కొనసాగడం వల్ల, అభివృద్ధి లేకపోవడం వల్ల బీజేపీ ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వాటి ప్రభావం చూపడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి ‘మామాజీ శివరాజ్ సింగ్’ ప్రభుత్వం పట్ల ప్రజలలో విసుగుదల కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ కి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. పార్టీ ముఠా తగాదాలతో కొట్టుమిట్టాడే రాష్ట్రంలో గత అయిదు సంవత్సరాలలో తిరుగులేని కమల్ నాథ్ నాయకత్వం ఫలితంగా ఇదివరకు ఎన్నడూ లేనంత సమైక్యంగా ఉంది. 2018లో గెలిచి అధికారంలో కొనసాగవలసిన పార్టీ చేతులలో నుంచి  బీజేపీ పెద్దలు దొడ్డిదారిలో అధికారాన్ని లాగుకున్నారనే సానుభూతి కాంగ్రెస్ పట్ల ఉంది.

సామాజికశక్తుల చైతన్యం

దిగువ స్థాయిలో సామాజిక పరివర్తన కోరుకునే శక్తులు చైతన్యవంతమైనాయి. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీస్ చట్టాన్ని నీరు గార్చడానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో అతిబలమైన ఉద్యమం సాగింది. దానివల్ల మరోసారి దళిత చైతన్యం వెల్లివిరిసింది. జై యువ ఆదివాసీ శక్తి (జేవైఏఎస్) అనే జెండాకింద కొత్త ఆదివాసీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. జేవైఏఎస్ లో చీలికలు ఏర్పడినప్పటికీ వివిధ వర్గాలు పాతతరం నాయకత్వాన్ని కూలదోయాలని గట్టిగా పని చేస్తున్న యువ ఆదివాసీ నాయకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దీనికి తోడు మధ్యప్రదేశ్ లో ఓబీసీ వర్గాలు నిశ్శబ్దంగా చైతన్యవంతమైనాయి. ఈ చైతన్యం ఓబీసీ మహాసభ రూపంలో ఓబీసీలలో ఉన్నతవర్గాలకే పరిమితం కాకుండా తక్కినవర్గాలను కూడా కలుపుకొని పోతున్నది. దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమం తాలూకు ప్రతిధ్వని మధ్యప్రదేశ్ లోనూ వినిపించింది. ఈ ఉద్యమాలన్నీ స్వతహాగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు. సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్-బీజేపీకి వ్యతిరేకం. ఈ కొత్త చైతన్యాన్నీ, శక్తినీ క్రమబద్ధీకరించి సామాజిక పరివర్తనకు ఉపయోగించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కనుక మధ్యప్రదేశ్ లో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఓడిపోవాలంటే కాంగ్రెస్ కష్టబడాలి.

Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు

కానీ అభిప్రాయ సేకరణ చేసే సంస్థలు ఇచ్చే నివేదికలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. జులై నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నిర్వహించిన 16 సర్వేల ఫలితాలను పరిశీలించాం. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 116 స్థానాలు సాధిస్తే మెజారిటీ వచ్చినట్టే. ఈ పరిధికి పైబడి కాంగ్రెస్ స్థానాలు సాధిస్తుందని ఎనిమిది సర్వే సంస్థలు చెప్పాయి. ఏడు సర్వే సంస్థల ఫలితాల ప్రకారం బీజేపీ ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో వచ్చిన విధంగానే  మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ‘సీఫోర్’ అనే సంస్థ అంచనా వేసింది. ఎప్పుడు సర్వే నిర్వహించారనేది పట్టించుకోకుండా అన్ని సర్వేలనూ పరిశీలనలోకి తీసుకుంటే బీజేపీకి 44 శాతం, కాంగ్రెస్ కి 43 శాతం ఓట్లు పడతాయని అంచనా. కానీ కాంగ్రెస్ కి వచ్చే సీట్లను 116గానూ, బీజేపీకి 111 గానూ అంచనా వేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఇటువంటి భిన్నమైన సర్వేల ప్రాతిపదికగా ఆత్మవిశ్వాసంతో అంచనా వేయడం బుద్ధితక్కువ పని. ఈ సర్వేలని దైవవాక్కులాగా స్వీకరించజాలము. కిందటిసారి కూడా ఈ సర్వేలు పప్పులో కాలేశాయి. ఏ సర్వేలో అయినా పొరపాటు శాతం (మార్జిన్ ఆఫ్ ఎరర్) అంటూ ఉంటుంది. ఆ శాతానికంటే తక్కువే బీజేపీ, కాంగ్రెస్ ల బలాల మధ్య వ్యత్యాసం ఉన్నది. కొన్ని మాసాల కంటే ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తున్న పోటీలో కాంగ్రెస్ వైపు కొద్దిగా మొగ్గు ఉన్నదని చెప్పగలం. రెండు నెలల కిందట ప్రభుత్వాన్ని పడగొట్టడం సుసాధ్యమని అనిపించింది. ఇప్పుడు అట్లా అనిపించడం లేదు.

కాంగ్రెస్ బలమైన ప్రచారం

ఎన్నికల ప్రచారంలోనే ఫలితం ఖరారయ్యే కొద్ది ఎన్నికలలో ఇది ఒకటి. ఆగస్టు నుంచి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లో బలమైన ప్రచారం సాగించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా పెరుగుతున్న రుణాలూ, నిరుద్యోగ యువత, పరీక్ష పత్రాలు లీకు కావడం, ఉద్యోగాలకు అభ్యర్థులను నియమించే క్రమంలో కుంభకోణాల (వ్యాపం, ఈఎస్ బీ)వంటి అనేక అక్రమాలను కాంగ్రెస్ నాయకులు ఏకరవు పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం నుంచి కొన్ని అంశాలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు అనుకరించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని 40 శాతం కమిషన్ అని ఆరోపించినట్టే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని 50 శాతం కమిషన్ సర్కార్ అని ఆరోపించారు. పట్వారీ ఉద్యోగాల కుంభకోణం, మహాకాల్ లోక్ కారిడార్ నిర్మాణంలో కుంభకోణం వంటి అనేక అవినీతి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రచారంలో ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన  అవినీతి చార్జిషీట్ ను (ఘొటాలా షీట్)ను ఆగస్టులోనే విడుదల చేసింది. రాష్ట్రంలో బీజేపీ పాలించిన 18 సంవత్సరాలలో జరిగిన 254 కుంభకోణాలను ఆ చార్జిషీట్ లో పేర్కొన్నది.

Also read: మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?

లోతుగా జరుగుతున్న సామాజిక మథనాన్ని కాంగ్రెస్ జాగ్రత్తగా, పూర్తిగా వినియోగించుకుంటే బీజేపీ చావుదెబ్బ తినేది. ఈ సారి కాంగ్రెస్ టిక్కెట్లు 65 మంది ఓబీసీ అభ్యర్థులకు (పోయినసారి కంటే  ఎక్కువ, ఈ సారి బీజేపీతో సమానంగా) ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నాయకత్వం కులజనగణన చేపడతామని వాగ్దానం చేసింది. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించింది. కానీ ఈ ఎన్నికలలో అది ప్రధాన చర్చనీయాంశం కాలేదు. సీఎస్ డీఎస్ జరిపిన సర్వే ప్రకారం కులజనగణన వాగ్దానాన్ని 44 శాతం మంది స్వాగతించారు. 24 శాతం మంది మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ అంశంపైన ఒక అభిప్రాయం వెలిబుచ్చనివారు 32 శాతం ఉండటం విశేషం. కాంగ్రెస్ దళితుల మద్దతును నిలుపుకుంటూ, ఆదివాసీలలో, ముస్లింలలో తన ప్రాబల్యం పెంచుకుంటున్నప్పటికీ ఓబీసీలలో బీజేపీ కాంగ్రెస్ కంటే బాగా ముందున్నది.

ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించని ప్రధాని

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్టు గుర్తించిన బీజేపీ నాయకత్వం తన వ్యూహాన్నిసకాలంలో మార్చుకొని పోటీలోకి తిరిగి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపైన స్పష్టంగా చెప్పకుండా దాటవేస్తున్నది. ఎన్నికల సభలలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు సైతం ప్రస్తావించరు. తన పరిస్థితిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి మహిళల ఓట్లపైన ఆశలు పెట్టుకున్నారు. అక్టోబర్ లో ప్రారంభించిన లాడ్లీ బెహ్నా కార్యక్రమం కింద 21 నుంచి 60 ఏళ్ళ వరకూ వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ. 1,250లు వారి బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. ఈ యేడాది మార్చిలో ఒక్కొక్క మహిళకు వెయ్యి రూపాయల వంతును ఇస్తామని వాగ్దానం చేశారు. నిజానికి కొత్త కిస్తీ కింద నవంబర్ 7 వ తేదీన, పోలింగ్ జరగడానికి పది రోజుల ముందు, మహిళల ఖాతాలలో డబ్బులు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నారీ సమ్మాన్ యోజనను ప్రకటించింది. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ. 1,500ల వంతున బ్యాంకు ఖాతాలో జమచేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. దీనితో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. సర్వేల ఫలితాల ప్రకారం మహిళా ఓటర్లలో బీజేపీకి స్వల్ప ఆధిక్యం ఉన్నది. బీజేపీ నేతలు ఆశించినంత ఎక్కువ మద్దతు మహిళల్లో లేదు. బీజేపీకి సంస్థాగత నిర్మాణ శక్తి బలంగా ఉన్నమాట నిజం. ఆ బలంపైన బీజేపీ ఏ నాడైనా ఆధారపడవచ్చు.

కాంగ్రెస్ కాస్త ముందున్నట్టు కనిపించినప్పటికీ రెండు పార్టీలూ సమానంగా ఓట్ల శాతం సాధించినా ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితిలో ఓట్లు సీట్లుగా ఎట్లా మారుతాయన్నదానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ కు కొంత సానుకూలత ఉంది. 2018లో కాంగ్రెస్  బీజేపీ కన్నా ఓట్ల శాతంలో 0.1శాతం తక్కువలో ఉంది. కానీ బీజేపీ కంటే అయిదు సీట్లు అదనంగా సంపాదించింది. ఈ సారి అభిప్రాయ సేకరణ సర్వేలలో పట్టణ ప్రాంతాలకీ, గ్రామీణ ప్రాంతాలకీ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. సీఎస్ డీఎస్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బీజేపీ కన్నా అయిదు శాతం ఆధిక్యంలో ఉంది. పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ కన్నా బీజేపీ 20 శాతం కన్నా అధికంగా ఆధిక్యంలో ఉన్నది. ఈ గణాంకాలు పూర్తిగా నిజం కాకపోవచ్చు కానీ ఎవరి అవకాశాలు ఎట్లా ఉన్నాయో సూచన ప్రాయంగా తెలియజేస్తుంది. మధ్యప్రదేశ్ లో పట్టణ ప్రాంతంలో సీట్లు (30-55 వరకూ) ఉంటే గ్రామీణ ప్రాంతాలలో 175 నుంచి 200 సీట్ల వరకూ (ఏది పట్టణ ప్రాంతమో, ఏది గ్రామీణ ప్రాంతమో నిర్ణయించే కొలబద్దమీద ఆధారపడి ఉంటుంది) ఉన్నాయి.  బీజేపీ పట్టణ ప్రాంతాలలో పెద్ద మెజారిటీతో అత్యధిక సీట్లను గెలుచుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో తక్కువ వ్యత్యాసంతో బీజేపీ కంటే  ఎక్కువ సీట్లు కాంగ్రెస్  గెలుచుకోగలుగుతుందని అంచనా. ఇదే 2018లో జరిగింది. కాంగ్రెస్ కు అప్పుడు బీజేపీ కంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకే ఒక శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ గ్రామీణ మధ్యప్రదేశ్ లోబీజేపీ కంటే కాంగ్రెస్ కు 16 స్థానాలు ఎక్కువగా లభించాయి.

ఈ సారి ప్రజల తీర్పులో రెండు పార్టీల మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం చెప్పలేము కానీ ఒక విషయం మాత్రం నమ్మకంగా చెప్పగలం. ఓట్ల శాతంలో తేడా కంటే సీట్ల వ్యత్యాసం అధికంగా  ఉంటుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఓటర్ల మనోభావాలని ప్రభావితం చేయడమే కాకుండా మధ్యప్రదేశ్ లో జరగబోయే సామాజిక పరివర్తన విస్తృతిని నిర్ణయించబోతున్నాయి.

Also read: మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని

యోగేంద్రయాదవ్ భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్

శ్రేయస్ సర్దేశాయ్ భారత్ జోడో అభియాన్ లో పని చేస్తున్న సర్వే పరిశోధకుడు

Yogendra Yadav Shreyas Sardesai
Yogendra Yadav Shreyas Sardesai
Yogendra Yadav is the National convener of Bharat Jodo Abhiyan. Shreyas Sardesai is a survey researcher associated with the Bharat Jodo Abhiyan.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles