Sunday, November 24, 2024

ఏపీ హైకోర్టు నిర్ణయంపై విస్మయం

కె. రామచంద్రమూర్తి

అమరావతి భూకుంభకోణం దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ పరిశోధననూ, ప్రత్యేక పరిశోధన బృందం కార్యక్రమాలనూ తక్షణమే నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారంనాడు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైనది. సంచలనాత్మకమైనది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఇతర నిందితులపైన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ దాఖలు చేసిన ప్రాథమిక నివేదిక(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)లోని అంశాలను ప్రచురించకూడదనీ, ప్రసారం చేయకూడదనీ మీడియాసంస్థలపైనా, సోషల్ మీడియాపైనా న్యాయస్థానం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉన్నది. అవినీతి గురించి చర్చించాలని కోరవలసిన న్యాయస్థానం చర్చించకూడదంటూ ఆదేశాలు ఇవ్వడం వింతగా ఉంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్, ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్. దివైర్ చీఫ్ ఎడిటర్ సిద్దార్థవరదరాజన్ లు  హైకోర్టు తీర్పును తప్పుపట్టడం విశేషం. ఇది భావప్రకటనా స్వేచ్ఛకూ, రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రసాదించిన హక్కులకూ విరుద్ధమైనది. హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంపైన రైతులు దాఖలు చేసిన 75 పైపబడిన పిటిషన్లపైన విచారణను హైకోర్టు సెప్టెంబర్ 21న తిరిగి ప్రారంభించనున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈ నెల 22న తీర్పు ఇవ్వనున్నది. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కోర్టులలో విచారణాంశం కావడం, దాదాపు అన్ని విషయాలలోనూ రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇవ్వడం రివాజుగా మారింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వంటి అంశాలలో హైకోర్టూ, సుప్రీంకోర్టూ ఒకే విధమైన అభిప్రాయం వెలిబుచ్చగా మరికొన్ని విషయాలపైన హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది. డాక్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోవిద్ చికిత్సా వ్యవస్థను నిర్వహించిన స్వర్ణాప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదంపైన దర్యాప్తు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ తిరగదోడారు. అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు విషయంలో, ఎఫ్ ఐ ఆర్  లోని అంశాలను ప్రచురించరాదంటూ, ప్రసారం చేయరాదంటూ మీడియాకూ, సోషల్ మీడియాకూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయంలలో సుప్రీంకోర్టు వైఖరి ఎట్లా ఉంటుందోనని ఆంధ్రరాష్ట్ర ప్రజలు మాత్రమే కాకుండా దేశప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles