(దేశంలోనే అరుదైన వైజ్ఞానికసంస్థ పరిచయం)
ఉత్తరాంధ్ర పార్వతీపురం టౌన్లోని చర్చివీధిలో శ్రమశక్తి నగర్లో ఉంటుంది ఆ ఆశ్రమం. ఎందరో ఆలోచనాపరులకీ, ప్రజాపక్ష బుద్ధిజీవులకీ ఒకనాడు నెలవైన ఆ చోటు ప్రస్తుతానికో పాడుబడిన ప్రదేశం. ఎవరికీ కాకుండా అయిపోతున్న అన్యాక్రాంతం. వంటి మీద వేసుకున్న జత, ఇంట్లో ఇంకొక జత, గుడ్డ సంచీ, చిరుగుల చీరలు రెండు, రెండు గ్లాసులు, ఓ రెండు కంచాలు, రెండే దుప్పట్లు, ఇవన్నీ పెట్టు కోడానికో పెద్ద పెట్టె. అర్ధరాత్రి, అపరాత్రి నేనొచ్చినప్పుడు ఆదరించే ఇరువురు మనుషులు. ఇప్పుడెవరూ లేరు, ఇక రారు!
కీ.శే.యాళ్ళసూర్యనారాయణ,పార్వతమ్మ
ఈ దేశంలో చార్లెస్ డార్విన్, సోక్రటీసు, కార్ల మార్క్స్, మేడమ్ క్యూరీ, ఐన్ స్టీన్, బ్రూనో, గెలీలియో వంటి ప్రపంచ చరిత్రనే మలుపు తిప్పిన అనేక దేశాలకి చెందిన మహామహుల ఆశయాల కోసం నిర్మించిన ఒక ఆశ్రమం ఉందనే విషయం మీకు తెలుసా ?మాతా సావిత్రీ బాయి, మహాత్మా జోతిరావ్ ఫూలే, పెరియార్ రామ స్వామి, బుద్దుడు, డా. బి. ఆర్. అంబేద్కర్, ప్రజాకవి వేమన, డా. ఎ.టి. కోవూర్, సర్ధార్ భగత్సింగ్, గోరా, త్రిపురనేని రామస్వామి వంటి అద్వితీయ వ్యక్తులకోసం కట్టబడిన నిర్మాణం!
ఒక ఎకరం స్థలంలో ఇంత మంది మహామహుల నిలు వెత్తు విగ్రహాలు పెట్టి వైజ్ఞానిక మానవీయ స్పూర్తికోసం అహ ర్నిశలూ కష్టపడి హఠాత్తుగా చనిపోయిన ఒక బహుజన ప్రగతిశీల మేధావి, తిరుగులేని భావోద్యమ కార్యకర్త, నీతీ, నిజా లయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి గురించి చదివారా ? ఇప్పుడీ ఇద్దరూ ఈ భూమ్మీద లేరు. కానీ, వారు స్వప్నించిన ఆశయాల సాధన కోసం కష్టించిన భూమి మాత్రం అక్రమార్కుల చేతుల్లో ఉంది. ‘శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించు దాతృత్వ సంస్థ’ వ్యవస్థాపకులైన ఆ మహనీయుల కృషి అన్యాయంగా మరుగున పడింది!
అక్కడున్న విగ్రహాల్లో సగానికి పైగా తెలుగు రాష్ట్రాల మాట అటుంచి అసలీ దేశంలోని ఏ ప్రాంతంలోనూ లేవు. విద్యార్థు లు,యువతకి మార్గదర్శకంగా ఆ స్థలాన్ని ఒక బహుజన సాంస్కృతికోద్యమ కేంద్రం గానూ, సైన్స్ సెంటర్ గా, మంచి గ్రంథాలయంగా మలచాలనే మహత్తరమైన ఆశయం వారిది. అలాంటిది ఈ రోజు తుప్పలాక్రమించిన గేటు చూసి ఏడుపొచ్చేసింది. ఈ దేశపు పీడిత వర్గాలకి దిశా నిర్దేశం చేసే అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలును కూడా విరిచేసారు. ఆశ్రమం అంతా పిచ్చి మొక్కలు. బోర్డే నాడో పీకి అవతల పారేశారు. ఆశయాల్ని హత్య చేసారు!
సుమారు పదిహేనెకరాల ఆసామి. ప్రభుత్వ నౌకరీలోంచి రిటైరయ్యాడు. సామాజిక సేవకు అడ్డంకని ఆ దంపతులు పిల్లల్ని కూడా కనకుండా కలలు నిర్మించుకున్నారు. ఇప్పుడా కలలన్నీ ధ్వంసం కాబడ్డాయి. ఆశలన్నీ నాశనం చేబడ్డాయ్. స్వార్ధమొక్కటే మిగిలింది. వాళ్ళ తదనంతరం దానిని ప్రభుత్వపరం చేయాలని తపించిన యాళ్ళ దంపతుల కోరికకు వారిరువురూ చెప్పిన మాటలే సాక్ష్యం. నేను చేసిన ఇంటర్వ్యూ, ప్రచురించిన ఆయన పుస్తకమే సాక్ష్యం. జీవితాంతం వారిరువురూ చేసిన అవిశ్రాంత యుద్ధాలే సాక్ష్యం!
వారి కలల రూపమైన ఆ ఆశ్రమం కూడా ఇక ఎంతో కాలం ఉండకపోవచ్చు. ఇప్పటికే యాళ్ళ ఇంటిని కార్లు పెట్టుకునే షెడ్డుగా చేసేశారు. ఎన్నో జ్ఞాపకాల్ని అమానుషంగా చెరిపేసారు. ఆయన సేకరించిన పుస్తకాలు, ఫైళ్ళ ఊసే లేదు. ఇప్పుడు అక్కడ స్మశాన నిశబ్ధం, మన స్తబ్ధత. ప్రగతిశీల సంఘాలు, దళిత బహుజనోద్యమ సంస్థలు దయచేసి దృష్టి సారించి కాపాడుకుని తీరాల్సిన ఆశ్రమం అది. అంతటి అరుదైన ప్రదేశాన్ని కనుక నిలుపుకోడంలో విఫలమైతే ఆశయ సాధనలో సఫలత్వానికి ఇక చోటులేదు!
(ఇంతకంటే రాయలేను. ఈ దేశంలో అసమానతల అంతం కోసం బహుజనుల హితం కోసం, సమసమాజం కోసం, సామాజిక న్యాయం కోసం అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మించిన యాళ్ళ దంపతులకు నా జోహారులు. అభ్యుదయ ముసుగులు ధరించిన వారి నుండి అమ్ముడుపోయిన అధికారులు, అగ్రశ్రేణి నాయకులుగా ఈరోజు చెలామణీ అవుతున్న వారి వరకూ, ఆయన నుండి పొందిన లబ్ధి, ఆయన పట్ల చూపుతున్న వివక్ష కాలం గుర్తిస్తూనే ఉంది. యాళ్ళ దంపతుల త్యాగానికి మనతరం చేసిన ద్రోహాన్ని భావి తరాలకు ప్రసరింపజేస్తూనే ఉంటుంది. నిస్సహాయ కన్నీటి నివాళులు!)
– గౌరవ్