విజయవాడ, అక్టోబర్ 29: విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చరిత్రను సరికొత్తగా, సమగ్రంగా సంకలనం చేయడానికి చరిత్రకారులు, చారిత్రక పరిశోధకులు శ్రీకారం చుట్టాలని పలువురు వక్తలు ‘ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – సంస్కృతి –వైభవం’ సదస్సును ఉద్దేశించి పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం జరిగిన చరిత్ర సదస్సు ఫలవంతమయిన చర్చకు మార్గ నిర్దేశం చేసిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. విభజనకు గురైన ఆంధ్ర ప్రాంత చరిత్రపై సంపూర్ణ అధ్యయనం జరగాలని అతిథులు అభిలషించారు. చరిత్ర అవసరాన్ని నేటి తరానికి తెలియజేయడంతోపాటు, చరిత్ర ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆం.ప్ర. హైకోర్ట్ జడ్జి జస్టిస్ యు. దుర్గాప్రసాద రావు ముఖ్య అతిథి ప్రసంగంలో పేర్కొన్నారు. గ్రామాలు – నగరాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపన, విదేశీ వ్యాపారం తదితర రంగాల్లో ప్రాచీన ఆంధ్రులు ఎంతో ప్రగతి సాధించారని డా.ఆర్.డి.ఒ. మాజీ అధ్యక్షుడు డా. జి.సతీష్ రెడ్డి చెప్పారు. ఆంధ్రుల సాంస్కృతిక – సాహిత్య వైభవాన్ని, ప్రఖ్యాత నటుడు తనికెళ్ళ భరణి తన సహజశైలిలో వివరించారు. బౌద్ధం గురించి డా. రాణి శర్మ మాట్లాడారు.
‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి -వైభవం’ గురించి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజినీరింగ్ కోర్స్ లలో కూడా) పాఠ్యాంశంగా బోధించాలని చరిత్రకారుడు మైనాస్వామి విజ్ఞప్తి చేశారు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఆయన చక్కగా వివరించారు. శాసనాల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షతన సదస్సు ఉదయం నుంచి రాత్రి వరకు పలు అంశాలపై చర్చించింది. హైకోర్ట్ అడ్వొకేట్ శ్రీనివాస మూర్తి, ఓలేటి సత్యనారాయణ, ఆదిత్య, జగదీష్, ప్రొ. కోటయ్య, ప్రొ. ప్రకాష్, ప్రొ. యామిని తదితరులు సదస్సులో మాట్లాడారు.