My Confession
————————–
By Leo Tolstoy
————————
నా సంజాయిషీ
———————
లియో టాల్స్టాయ్
————————–
తెలుగు అనువాదం:
డా. సి. బి. చంద్ర మోహన్
డా. బి. సత్యవతీ దేవి
చాప్టర్ 13
————–
నా సర్కిల్లోని జీవితం నుండి నేను పక్కకు జరిగాను. మాది నిజమైన జీవితం కాదు — కేవలం అనుకరణ మాత్రమేనని గుర్తించాను. అతిశయం ఎక్కువగా ఉన్న మాలాంటివారు జీవితాన్ని అర్థం చేసుకునే సాధ్యాన్ని కోల్పోతారు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే — మేము గడిపే అసాధారణ జీవితాలను గాక (మేము పరాన్న జీవులుగా బ్రతికే వాళ్ళం), సాధారణ, శ్రామిక జనుల జీవితాలను అర్థం చేసుకోవాలి. వారే జీవితాలను నిజంగా గడిపేవారు. వారు గడిపే జీవితాలకు అర్థం కూడా అదే! నా చుట్టూ ఉన్న అతి సాధారణ శ్రామిక జనులు రష్యా ప్రజలే! జీవితం యొక్క అర్థం తెలుసుకొనడానికి వారి వైపు దృష్టి సారించాను. వారు జీవితానికి చెప్పే అర్థం ఎవరైనా మాటలలో చెప్పగలిగితే ఇలా ఉంటుంది: భగవంతుడి సంకల్పంతో ప్రతి మనిషి ఈ లోకంలోకి వస్తాడు. ‘ప్రతి మనిషి తన ఆత్మను వినాశనం చేసుకోవచ్చు లేదా సంరక్షించుకోవచ్చు’ నన్నట్లుగా దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషి లక్ష్యం తన ఆత్మను రక్షించుకోవడం. ఆత్మను కాపాడుకోవాలంటే ఆ మనిషి ‘దైవం’ లా బ్రతకాలి. దైవంలా బ్రతకాలి అంటే — అన్ని సుఖాలను వదులుకోవాలి. శ్రమ చేయాలి, వినయంగా ఉండాలి, బాధలను అనుభవించాలి, కరుణతో ఉండాలి. పై జీవితార్థం పాస్టర్ల ద్వారా వీరికి సంక్రమించిన విశ్వాసం గురించిన బోధనలు, ఇంకా ప్రజలలో పాతుకుపోయి ఉన్న సంప్రదాయాలు! ఈ జీవిత అర్థం నాకు స్పష్టంగా ఉంది. ఇంకా నా హృదయానికి దగ్గరగా ఉంది. జనాదరణ పొందిన విశ్వాసంతో నా చుట్టూ జీవిస్తున్న జనపదులలో పైన చెప్పిన జీవిత అర్థంతోపాటు, నాకు మింగుడు పడని విషయాలు కొన్ని వారి విశ్వాసాల్లో కలగలిసి ఉన్నాయి. అవి నాకు ఏమీ నచ్చలేదు. అవేమిటంటే: మత కర్మలు, చర్చి సేవలు, ఉపవాసాలు, అవశేషాల, చిహ్నాల ఆరాధన మొదలైనవి. జనం పైన చెప్పిన రెండింటిని విడిగా చూడలేకపోయారు, నేను కూడా. వారి విశ్వాసాల్లో కలిసిన మత కర్మలు లాంటివి నాకు ఎంత వింతగా ఉన్నా నేను వాటిని అన్నింటిని అంగీకరించాను. చర్చి సేవలకు హాజరయ్యాను. ఉదయం, సాయంత్రం మోకరిల్లి ప్రార్థనలు చేశాను. ఉపవాసాలు చేశాను. ప్రసాదం తీసుకోవడానికి సిద్ధమయ్యాను: మొదట్లో నా తర్కం దేనినీ అడ్డుకోలేదు. ఇంతకుముందు అసాధ్యం అనుకున్న విషయాలు ఇప్పుడు నాలో ఎటువంటి వ్యతిరేకత పుట్టించలేదు.
Also read: దైవంకోసం వెతుకులాట
విశ్వాసంతో నా సంబంధాలలో ఇంతకు పూర్వము, తర్వాత చాలా తేడా కనిపించింది. ఇంతకు పూర్వం జీవితం పూర్తి అర్థవంతంగా ఉండేది. విశ్వాసం అనవసరమైన, నిర్హేతుకమైన, జీవితానికి సంబంధం లేని, ఏకపక్షంగా ధ్రువీకరింపబడిన ప్రతిపాదనగా కనిపించింది. ఆ ప్రతిపాదనలకు ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించాను. ఏమీ లేదని నమ్మి వాటిని తిరస్కరించాను. ఇప్పుడు దానికి విరుద్ధంగా విశ్వాసం ఇచ్చిన ఈ ప్రతిపాదనలే జీవితానికి అర్థం ఇస్తాయని నిస్సందేహమైన అనుభవంతో తెలుసుకున్నాను. ఇంతకు పూర్వం అవన్నీ వికారమైన, అనవసరమైన కర్మలుగా చూసేవాడిని. కానీ ఇప్పుడు నాకు అవి అర్థం కాకపోయినా వాటికేదో అర్థం ఉందని అనుకున్నాను. ఆ అర్థమేదో నేర్చుకోవాలని కూడా అనుకున్నాను.
‘తన హేతు జ్ఞానంతో పాటు సమస్త మానవ కోటి ఒక రహస్య మూలాధారం నుండి ప్రవహించినట్లు — విశ్వాసం యొక్క జ్ఞానం కూడా అలానే ప్రవహిస్తుంది.’ — అని నాలో నేను వాదించుకున్నాను. ఆ మూలాధారం — దైవం. అదే మానవ శరీరానికి, మనిషి హేతువుకు జన్మస్థలం. నా శరీరం ఎలాగైతే దైవం నుంచి క్రిందకు వచ్చిందో — అలాగే నా హేతు జ్ఞానం, జీవితం గురించిన నా అవగాహన వచ్చాయి. తత్ ఫలితంగా ఆ, అవగాహనలోని, అభివృద్ధి క్రమంలోని అనేక దశలు వాటిననుసరించాయి. కనుక ఆ జీవిత అవగాహన అసత్యం కాదు. ప్రజలు చిత్తశుద్ధితో నమ్మిన దంతా సత్యమే; అది మరో విధంగా వ్యక్తీకరింపబడి ఉండవచ్చు గాని అబద్ధం కాదు. నాకు అబద్ధం లా అనిపిస్తే, దాని అర్థం — దాన్ని నేను సరిగా అవగాహన చేసుకోలేదని మాత్రమే. ఇంకా — నాకు నేను ఇలా అనుకున్నాను: ‘ మరణం నశింపజేయని జీవితానికి అర్థం ఇవ్వటమే ప్రతీ విశ్వాసం యొక్క సారాంశం.’ సహజంగా, విశ్వాసం ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే ఒకటే ప్రశ్నకు సమాధానం అవుతుంది. ఆ ప్రశ్నలు:
— ఒక రాజు విలాసవంతంగా మరణించడం
— ఒక ముసలి బానిస పనిచేయలేక వ్యధ పడటం
— ఒక హేతు జ్ఞానం లేని పిల్లవాడు
— ఒక మేధావి అయిన ముసలాయన
— తెలివి లేని ముసలావిడ
— తృష్ణతో తపించే కుర్రవాడు
— విభిన్న పరిస్థితులలో జీవితం గడిపే అందరూ
— ఒకటే ప్రశ్న
— నేనెందుకు జీవించాలి? నా జీవితం నుండి ఏ ఫలితం వస్తుంది? — ఈ ప్రశ్నకు సమాధానం కూడా సారాంశంలో ఒకటైనా విభిన్న రీతుల్లో వ్యక్తీకరించబడి ఉండవచ్చు. ఆ సమాధానం ఒకటైనకొద్ది అది ఎక్కువ సత్యాన్ని, గాఢతను సంతరించుకుంటుంది. ప్రతి మనిషి స్థాయి, విద్యలను బట్టి విచిత్రంగా కూడా వ్యక్తీకరింపబడటానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ వాదన మతకర్మలలోని వింతల విషయంలో నా దృష్టిలో న్యాయమనిపించవచ్చు. మతంలో నాకు ప్రశ్నార్ధకమైన విషయాలు చేయడానికి — ఈ వాదన సమంజసంగా ఉండదు. నా ఆత్మ సాక్షిగా — మతంలోని కర్మలను కూడా చేస్తూ నేను ప్రజలతో మమేకం అవ్వాలని కోరుకున్నాను. కానీ అలా చేయలేకపోయాను. నేను అలా చేస్తే అది ఆత్మ ద్రోహం చేసుకున్నట్లు, నాకు పవిత్రమైన దాన్ని వేళాకోళం చేసినట్లు అవుతుంది. ఇక్కడ, మన కొత్త రష్యన్ తత్వవేత్తలు నన్ను కాపాడారు.
Also read: అనర్థం, అరిష్టం మనిషి జీవితం!
ఈ రష్యా వేదాంతులు ఇచ్చిన వివరణ ప్రకారం — ప్రాథమిక సిద్ధాంతం (పిడివాదం) ఏమిటంటే — చర్చి దోషరహితం అనే భావన. ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే చర్చి చెప్పిన సత్యాలన్నీ ఒప్పుకున్నట్లే! నిజమైన, ప్రేమతో నిబద్ధమైన విశ్వాసుల కూటమి చర్చి. కనుక వారి జ్ఞానం నిజమైనది అని నా నమ్మకం. దివ్య సత్యం (దైవానికి సంబంధించిన సత్యం) విడిగా ఒక మనిషికి అందుబాటులో ఉండదు. ప్రేమతో బంధింపబడిన కూటమి మొత్తానికి అది బహిర్గతపరచబడుతుంది. సత్యాన్ని పొందాలంటే విడిగా ఉండిపోకూడదు. ప్రేమతో అందరూ ఏకమవ్వాలి. మనం అంగీకరించలేని విషయాలు కూడా సహించాలి.
‘ప్రేమతోనే సత్యం ఆవిష్కరించబడుతుంది. నీవు చర్చి మతకర్మలకు ఒప్పుకోకపోతే, ప్రేమను అతిక్రమించిన వాడవవుతావు. ప్రేమను అతిక్రమిస్తే, సత్యాన్ని గుర్తించే అవకాశం కోల్పోతావు.’ ఈ వాదనలో ఉన్న కుతంత్రం అప్పుడు నేను చూడలేకపోయాను. ప్రేమతో ఏకమైతే గొప్ప ప్రేమ అవ్వచ్చును గానీ, నైసీన్ క్రీడ్ లో ఖచ్చితమైన మాటలతో వ్యక్తపరచబడిన దివ్యసత్య వాక్కు మాత్రం కాదు. ప్రేమతో ఏకమైన కూటమికి దివ్య సత్యాన్ని వ్యక్తపరచడం ఒక బాధ్యత కాదు. అప్పుడు నేనది గ్రహించలేకపోయాను. వాదనలోని ఈ పొరపాట్లు అన్నీ నేను చూడలేదు. తెలియకుండానే చర్చిలోని సాంప్రదాయక మత కర్మలన్నీ అంగీకరించాను. నా ఆత్మ శక్తినంతా వినియోగించి, వాదనలు వైరుధ్యాలు లేకుండా ఉండడానికి ప్రయత్నించాను. వీలైనంత సహేతుకంగా చర్చి సంబంధిత విషయాలు వివరించడానికి కృషి చేశాను.
Also read: శ్రమజీవుల జీవితాలే సార్థకం
చర్చి కర్మలను నెరవేర్చేటప్పుడు, నా హేతువును వినయంగా పక్కకు పెట్టి, మానవ కోటి పాటించే సంప్రదాయానికి బద్ధుడిని అయ్యాను. నా పూర్వీకులతో కలిసిపోయాను: తల్లి, తండ్రి, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు (ఎవరినైతే నేను ప్రేమించానో ) వాళ్లు, నా ముందు తరం వాళ్లు — నమ్మారు. జీవించారు. నాకు జన్మనిచ్చారు. నేను గౌరవించిన సామాన్య ప్రజానీకం యొక్క ప్రత్యేకమైన పనులతో మమేకమయ్యాను. పైగా ఆ పనులు వాటి అంతటికవి చెడ్డవి కావు (చెడు అంటే భోగలాలసత్వం). చర్చి కార్యకలాపాల కోసం పెందలకడనే లేస్తుంటే, నాకు మంచిగా ఉంటుంది. నా పూర్వీకులైన పెద్దలతో, ప్రస్తుతం ఉన్న సమకాలీకులతో కలవడానికి నా శారీరక సౌఖ్యాన్ని వదులుకుంటున్నాననే ఒక వినయపూర్వక మానసిక సంతృప్తి నేను అనుభవిస్తాను. కమ్యూనియన్ పొందడానికి తయారైనప్పుడు కూడా నాకు అదే భావన ఉంటుంది. అలాగే రోజూ మోకరిల్లుతూ ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు పాటించడం — కూడా పై చెప్పిన కోవకే చెందుతాయి. అవి ఎంత అల్పమైన త్యాగాలైనా గాని ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేసేవాడిని. నేను ఉపవాసం చేశాను. కమ్యూనియన్ కు తయారయ్యాను. ఇంటి వద్ద, చర్చిలోనూ ప్రార్థనకు ప్రత్యేక సమయం కేటాయించుకున్నాను. చర్చి సర్వీసులో ప్రతీ మాట తు. చ. తప్పకుండా పాటించేవాడిని. అవసరమైన చోట వాటికి అర్థం చెప్పుకునేవాడిని. సామూహిక ప్రార్ధనలలో నాకు ముఖ్యమనిపించిన పలుకులు: “మనం ఒకరినొకరు కట్టుబాటుగా ప్రేమించుకుందాం!” ఆ తర్వాత మాటలు, ” మనందరం కలిసి ఏకత్వంలో తండ్రి, కొడుకు మరియు పవిత్రాత్మను నమ్ముదాం.” అవి వదిలేశాను. ఎందుకంటే అవి నాకు అర్థం కాలేదు.
Also read: అందరం జ్ఞానం కలిగిన అవివేకులం
———- ————-