వ్యంగ్య రచన
పట్టు వదలని విక్ర మార్కుడు ఎప్పటి లాగే భుజం మీద శవం వేసుకుని వెడుతుండగా, శవం లోని బేతాళుడు ఇలా అన్నాడు.
“రాజా నువ్వు ఎందుకు శ్రమిస్తున్నవో తెలియదు గాని, ఒకో సారి వేరే వాళ్ళ శాపాలు మన పాలిట వరం కింద మారతాయి. నీకు జనార్ధన వర్మ కధ చెబుతాను. శ్రమ తెలియకుండా విను.” బేతాళుడు కధ చెప్ఫడం ప్రారంభించాడు.
‘‘పూర్వం అంధగిరి ని జనార్ధన వర్మ పాలించే వాడు. అతనికి అధికార దాహం ఎక్కువ. తరచూ దండ యాత్రలు చేసీ, రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఒక్క చంద్ర వర్మ తప్ప మిగిలిన రాజులందరూ అతనికి సామంతులయ్యారు. చంద్ర వర్మ తన రాజ్యం పాలన, అభివృద్ది తప్ఫ మిగిలిన విషయాలు పట్టించుకునే వాడు కాదు. జనార్ధన వర్మ ప్రజలు అసంతృప్తి గా ఉన్నపుడు తాత్కాలికం గా తాయిలాలు ఇచ్చి, మిగిలిన సమయాల్లో మంత్రుల తో విలాసాలు అనుభవించే వాడు. చంద్ర వర్మ పేరు ప్రతిష్ట లు సహించలేని జనార్ధన వర్మ, చంద్ర వర్మ పై దాడి చేసి జైలు లో పెట్టాడు. అడ్డు వచ్చిన పౌరులను కూడా హతమార్చాడు.
జనార్ధన వర్మ కి పిల్లలు లేరు. యద్దం మంచిది కాదు అని మంత్రులు చెప్పినా వినలేదు. చంద్ర వర్మ జైలు లో ఉన్నాడు. శత్రుశేషం లేదని జనార్ధన వర్మ సంబర పడ్డాడు. జనార్ధన వర్మకి వారసులు లేక పోవడంతో ప్రజలే రాజుని ఎన్నుకోవలిసిన పరిస్ధితి వచ్చింది. ప్రజలందరూ కలిసి చంద్ర వర్మ ను రాజు గా ఎన్నుకున్నారు.’’
బేతాళుడు ఇంత వరకే కధ చెప్పి, ” రాజా ప్రజలు జనార్ధన వర్మను కాదని, చంద్ర వర్మని ఎందుకు ఎన్నుకున్నారు? జనార్ధన వర్మ ప్రజలకి సాయ పడ్డ వాడే కదా. తెలిసి జవాబు చెప్పక పోయావో…”
విక్రమార్కుడు ఇలా జవాబిచ్చాడు
“జనార్ధన వర్మ అభివృద్దికి పనికొచ్చే పనులు చెయ్యక పోవడం, తరచూ దండయాత్రలు చేసి ఖజానా ఖాళీ చెయ్యడం, అన్నిటి కన్నా ముఖ్య మైనది చంద్ర వర్మపై ప్రజలకు సానుభూతీ పెల్లుబికి రావడం వల్ల, అదీ కూడా సరైన సమయం లో జరగడం వల్ల చంద్ర వర్మ రాజయ్యాడు”
రాజు జవాబుతో బేతాళుడు తృప్తి చెంది శవం నుండి మాయమై తిరిగి చెట్టెక్కాడు.
–వీరేశ్వర రావు మూల ©