వోలేటి దివాకర్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో గత నెల రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రతపై నెలకొన్న ఆందోళనలు, దుష్ప్రచారాన్ని జైళ్ల శాఖ డీఐజీ ఎం రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ కొట్టి పారేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ట్వీట్ చేయడం… రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీతో కలిసి డీఐజీ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించారు.
అన్ని జాగ్రతలూ తీసుకుంటున్నాం
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు మాకు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమే. జైలులో 2039 ఖైదీలల్లో చంద్రబాబు ఒకరని, రిమాండ్ ప్రిజనర్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రతలు తీసుకుంటూ ఉన్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, భద్రత విషయంలో జైల్లో చంద్రబాబుకి ఎటువంటి ముప్పు లేదనీ స్పష్టం చేశారు. చంద్రబాబు జైల్లో పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందుతోంది. వాతావరణ పరిస్థితుల వల్ల చంద్రబాబు ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జైల్లో వైద్యం చేయించామనీ, వాటికి రేషస్ తగ్గించే క్రీమ్స్ ఇచ్చారన్నారు. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం జిజిహెచ్ డాక్టర్లను సంప్రదించామని చెప్పారు. మధ్యలో ఒకసారి డీ హైడ్రేషన్ కు గురి అయినప్పుడు ఓఅర్ఎస్ లాంటి డ్రింక్స్ ఇచ్చామన్నారు. చంద్రబాబు రెగ్యులర్ గా వాడే మందులే వాడుతున్నారని తెలిపారు. ఒంటిపై దద్దుర్లకు కలుషిత నీరు అనేది వాస్తవం కాదన్నారు. చంద్రబాబు జైలుకు వచ్చేసరికి ఆయన బరువు 66 …అనంతరం 68 కి పెరిగింది..
ప్రస్తుతం ఆయన బరువు 67 కిలోలని వెల్లడించారు. అయితే చంద్రబాబు గారికి రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు జైలుకు వచ్చిన నాటి నుంచి రోజూ వైద్య పరీక్షలు..ఆయన వాడుతున్న మందులు కూడా సరిగ్గా వేసుకుంటూన్నారా లేదా అని డాక్టర్స్ పరిశీలిస్తున్నారన్నారు.
ఒత్తిళ్ళు లేవు
ఆయన హోదాను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు బేరక్ బెరెక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న ప్రతి నిమిషము సిసిటీవీలో రికార్డు అవుతుందని కనుచూపు మేరలో ఆయన సాధారణ ఖైదీలకు కనిపించే అవకాశాలు లేవన్నారు. ఆయన దగ్గరకు చేరుకోవాలంటే ఏడుగురు జైలు సిబ్బందిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. జైల్ లో చంద్రబాబుకు అందించే ఆహారం నుంచి ములాఖత్ వరకు ప్రతి కదలికపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందని రవికిరణ్ చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణల్లో మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదని..తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని డీఐజీ స్పష్టం చేశారు.