Thursday, November 21, 2024

పత్రిక రచనలే నాన్నకు ఆరోప్రాణం

జనధర్మ ఆచార్య శతాబ్ది వందనం

మాడభూషి శ్రీధర్‌

నేను ఏడోతరగతో ఎనిమిదో చదువుతున్నరోజులు. నాన్నను మధ్యాహ్నం పూట ఇంట్లో చూడడం చాలా అరుదు. మధ్యమధ్య సైకిల్‌ మీద ఇంటికి వచ్చినప్పుడు వెంట రెండుమూడు పొడుగాటి తడిసిన కాగితాలు తెచ్చేవాడు. అవి ప్రూఫులు ప్రెస్సులో వార్తలు కంపోజ్‌ అయిన తర్వాత తడిసిన కాగితం మీద అచ్చుతీసి దిద్దడానికి ఇచ్చిన కాగితాలు. పొద్దున్నపదింటికి వెళ్తే రాత్రి మేం నిద్రపోయిన తర్వాతే నాన్న వచ్చేవారు, వార్తలు రాయడం పత్రిక తీయడం నాన్న పని అని మాత్రం మాకు తెలుసు. అయితే చేత్తో రాసిన అక్షరాలు గుండ్రటి అచ్చులోకి ఎట్లా మారతాయో తెలియదు. ఆ ప్రూఫులు నాలో సవాలక్ష అనుమానాలు కలిగించి ఆసక్తి రగిలించేవి. ఆ స్ప్రూఫుల వల్లనే జర్నలిజం మీద కూడా ఆసక్తి కలిగిందేమో చెప్పలేను. ప్రెస్సు ఇల్లు ప్రక్కప్రక్కనే ఉండే ఇంటికి వచ్చిన తర్వాత అచ్చుమిస్టరీ తెలిసింది. అప్పుడు కేసుల్లో చిన్నచిన్న గడీల్లో ఉండే అక్షరాల మీద అవన్నీ కలిసి రాసే ‘‘మ్యాటర్‌ మీద, అచ్చుమీద, ఆ తర్వాత వాటన్నిటికీ మూలమైన ‘వార్త’ మీద ఆసక్తి అంచెలంచెలుగా పెరిగింది. ఆ ఆసక్తేనన్నునాన్నకుశిష్యుణ్ణి చేసింది. జర్నలిజం నాన్నకు ఆరోప్రాణం.

జర్నలిస్టు సైనికులకర్మాగారంజనధర్మ

నాన్ననాకు కూర్చోబెట్టి జర్నలిజం నేర్పలేదు. బహుశా ఎవరికీ ఆట్లా నేర్పకపోయి ఉండొచ్చు. గంటలకొద్ది లెక్చర్లు కొట్టలేదు. ఇది రాయొచ్చు అది రాయకూడదు అని చెప్పలేదు. కాని జర్నలిజం నేర్పింది ఆయనే. ఎట్లా? అంటే జర్నలిజం మీద ఆసక్తి ఉన్నవాడు నేర్చుకోతగ్గట్టుగా నాన్నఉండేవాడు. దానికి అంతకు మించి సమాధానం ఉండదు. ఎందరినో జర్నలిస్టులను తయారు చేసిన కర్మాగారం ‘జనధర్మ’ అవునో,కాదో గాని జర్నలిస్టులను సృష్టించిన పాఠశాల మాత్రం నాన్న. అవును.

నాన్న దగ్గర పని చేసి, నాన్నను చూసి, నాన్నతో మాట్లాడి తయారైన జర్నలిస్టులు సమర్ధులైన, నీతివంతులైన జర్నలిస్టులుగా ఇప్పడికీ బతుకుతున్నారు.

జర్నలిజం వచ్చినంత మాత్రాన సరిపోదు. పెగ్గువిస్కీకో, పచ్చనోటుకో, బెదిరింపుకో మరోప్రలోభానికో లొంగిపోతే ఇంక అక్షరాలకు విలువేమిటి? స్వాతంత్య్రానికి అర్ధమేమిటి? ఈ అవగాహన, ఆలోచనా విధానం` ఒకానొక కాలప్రవాహంలో అప్రయత్నంగా అలవడే ఆలవర్చగలగే వరవడి నాన్న జర్నలిజం పాఠశాలలో లభించింది. ‘ఎల్లప్పుడు సత్యమునే పలుకవలెను’ వంటి సూక్తిముక్తావళి వినిపించకుండా ఆ ఆవసరాన్ని గుర్తింపచేసే పద్దతి ఆయన బోధన. దానికి ఆ శిష్యుడు నానా అవస్థలు పడవల్సిందే. ఈ విషయం చెప్తే పోయేది కదా! అని తర్వాత శిష్యుడు విసుక్కుంటాడు. కాని పోనుపోను ఈ విషయం నేర్పిన దానికన్న గుర్తింపజేసేట్టు బాగా నెత్తినెక్కి అమలులోఉంటుందనే అర్ధమవుతుంది. ఆ రకం బోధనకు టెక్నిక్‌ ఏమిటి? ఎట్లా అమలు చేయాలి? అని రీసర్చి చేస్తానంటే కుదరదు. అదో టెక్నిక్‌ అంతే.

‘‘వ్యక్తికన్నవ్యవస్థగొప్ప’’ అని అంటుంటారు. నిజమేకావొచ్చు. కాని ‘జనధర్మ’ విషయంలో మాత్రం నాకు అది నిజమనిపించదు. జనధర్మ వంటి పత్రికలు రాష్ట్రంలో బోలెడున్నాయి. కాని జనధర్మ వేరు. దానికి కారణం జనథర్మ ఆచారిగారు.

మరి`జనధర్మ గానీ, వరంగల్‌ వాణి గానీ ఎందుకు స్వయంపోషకమైన, స్వయంప్రకాశమైన వ్యవస్థలుగా ఎదగలేదు? లోపమెక్కడ? అనే ప్రశ్న నాతోసహా చాలామందిని వేధిస్తుంటుంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం ఈ  రచన ఉద్దేశ్యం కాదు. లోపం ఎవరిదైనా, కోపం ఎవరిదైనా లోపం జనధర్మది కాదు. కాని నాన్నది కాదు.

పొడి పెదాలకు బయటే ఉండే సానుభూతి కొందరు దగ్గరి వారనుకున్న పెద్ద పదవీధరులు సంపన్నులు మేడలు మిద్దెలు కట్టి నిక్షేపంగా ఉన్నవారు. జనధర్మ, వరంగల్‌ వాణి అక్షరాల వల్ల పేరు పెట్టుబడితో వ్యాపారాలు చేసుకుని రాజకీయాల్లో స్థిరంగా ఉన్నవారు  ఆ పత్రికను ఆయననూ పట్టించుకోక పోవడం చెప్పాలనిపిస్తుంది. కాని ఎందుకూ పనికి రాదని అని కూడా అనిపిస్తుంది. వీరి కన్న నెలనెలా డబ్బు కట్టిన ఏజెంట్లు చందాదారులే గొప్పవారనిపిస్తుంది. కనీసం ఏజెంట్లు పేపర్లు పంచడమైనాచేస్తారు. చందాదార్లు చదవనైనా చదివారు.

ఎనిమిదేళ్ళ క్రితం ఆరంభించి నవరంగల్‌ వాణి నష్టాల్లో ఉన్నదా లాభాల్లోనా? అనే ప్రశ్న కూడా అందరూ ఆడుగుతారు. నాన్న నష్టాల్లో లేదనే అంటారు. ఖర్చులకు పోను వెయ్యో – రెండువేలో మిగుల్తుందని చెప్తారు. అందులో నాన్న తన జీతం లెక్కకట్టుకోరు. 16 నుండి 18 గంటల దాకా పనిచేసే నాన్న జీతం వేసుకుంటే అ దిఖర్చులు వెళ్ళని పత్రిక అంటాన్నేను.

పత్రికా ప్రపంచంలో కుత్తుకలుత్తరించుకునే పోటీ మిన్నంటే ముడి సరుకుల ధరలు చిన్న పత్రికలు ఉంటేనేమి పోతేనేమి అనుకునే ప్రభుత్వాల నిరాసక్త దుర్విధానం మిగతా పత్రికల్లో రంగుల్లో కన్పించే మాల్‌బిమసాలా ఇవన్నీ కలిసి చిన్న పత్రికలను అడిగే రోజులను ఖతం చేసినట్టు అనిపిస్తుంది.

దారుణాఖండలశస్త్రతుల్యం

జర్నలిస్టుగానాన్న ప్రతిభావిశేషాలను ప్రత్యేకంగా నేను పొగడనవసరంలేదు. ఆ పని ఆయన సంపాదకీయాలే చేస్తాయి. దారుణా ఖండల శస్త్రతుల్యం వంటి నిశిత వ్యాఖ్యానాలు పలువురి దృష్టి ప్రసరించని కోణాల్లో ఆలోచింపచేసే ధోరణి కలిసి ఆయన వాక్యాలు తప్పు చేసిన వాడికి గుచ్చుకుని నొచ్చుకునేట్టు చేసే వాక్యాలవి. కనుక చాలా మందికి నాన్న నచ్చరు.  పత్రికలకు సహాయం (న్యాయంగా) చేయవలసి వచ్చినపుడు, ఆ మాట ఈటె గుర్తుకొస్తుందో ఏమో చేయరు. ఇంకొకరిని చేయనివ్వరు.

ఆయన డిల్లీలో ఉంటే జాతీయ స్థాయి జర్నలిస్టు. హైద్రాబాద్‌లో ఉంటే రాష్ట్రస్థాయి జర్నలిస్టు. అందరూ అప్రయత్నంగా ఒప్పుకునేవారు.

వరంగల్లు జన జీవనంతో పెనవేసుకున్న కలం నాన్నది. తెలంగాణా గుండెను ఆప్యాయంగా హత్తుకున్న కలంనాన్నది. ఆ విషయం సగర్వంగా చెప్పుకోగలగడమే ఒక గొప్ప విషయం.

(మాడభూషి శ్రీధర్ రచనఇవ్వాళది కాదు. షష్టిపూర్తి సందర్భంగా 1988న)

నాన్న, అమ్మ

(నాకు స్ఫూర్తి నాన్న: హైదరాబాద్, కేశవ గిరి, చంద్రాయణగుట్ట పై మేడలో మెట్ల మీద కూర్చుని అమ్మా నాన్నా మాట్లాడుకుంటున్నపుడు నేను తీసిన ఫోటో. మామూలు పోజ్ కాకుండా మాట్లాడుకుంటున్నట్టు ఉండాలని నేను సూచిస్తే నాన్న ఒప్పుకున్నారు. 1992లోనో 1993లోనో తీసిన ఫోటో.అమ్మను మమ్మల్ని ఇక్కడ ఈ భూమ్మీద వదిలేసి నాన్న వెళ్లిపోయి 29ఏళ్లయింది.)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles