వోలేటి దివాకర్
తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకు సొంత టీవీ చానళ్లు ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు సొంత ఛానళ్లు లేకపోయినా… ఆయా పార్టీలకు జాతీయ స్థాయిలో అనుకూల చానళ్లు ఉన్నాయి. అందుకే ఆయా టీవీ చానళ్లలో జరిగే చర్చా గోష్టులు ఏకపక్షంగా సాగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యర్థి టీవీ చానళ్లలో జరిగే చర్చా గోష్టులకు ఇతర పార్టీల నేతలు హాజరు కారు. కొన్ని టీవీ చానళ్లను ప్రత్యర్థి పార్టీలు బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా టిడిపి అనుకూల ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ను బిజెపి బహిష్కరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సిపికి చెందిన సాక్షి టీవీ డిబేట్లకు టిడిపి నేతలు ఎవరూ హాజరు కారు. అలాగే టిడిపి అనుకూల ఈటీ వీ, టివి-5, ఎబిఎన్ చానళ్లకు వైఎస్సార్సిపి నేతలు హాజరు కారు. ఈవిధానం అనధికార బహిష్కరణ కిందే లెక్క.
Also read: త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!
తాజాగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి 14 మంది జాతీయ టీవీల న్యూస్ టీవీ చానళ్ల యాంకర్లను బహిష్కరించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బిజెపి అనుకూల విధానంలో చర్చలను నిర్వహించడం, ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా చర్చా గోష్టులను నిర్వహించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆ 14 మంది నిర్వహించే చర్చా కార్యక్రమాలకు హాజరు కారాదని ఇండియా కూటమి కో ఆర్డినేషన్ కమిటీ తీర్మానించింది. ప్రముఖ పాత్రికేయులు అర్ణబ్ గోస్వామి, నావికా కుమార్ సహా అదితి త్యాగి, అమన్ చోప్రా, అమిష్ దేవగన్, ఆనంద్ నరసింహన్, అశోక్ శ్రీవాస్తవ్, చిత్రా త్రిపాఠి, గౌరవ్ సావంత్, ప్రాచీ పరాశర్, రూబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా బహిష్కరణ జాబితాలో ఉన్నారు. రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, ఎబిపి న్యూస్ వంటి బహిష్కరణ జాబితాలో ఉన్న టీవీ చానళ్లన్నీ గత కొంతకాలంగా బిజెపి అనుకూల గళాన్ని వినిపిస్తుండటం గమనార్హం.
Also read: చంద్రబాబు అరెస్టు తరువాత….!