Thursday, November 21, 2024

మొదలయిన చోటే తప్పటడుగుల గుర్తులు చెరిగిపోతాయి… 

దువుతున్న పుస్తకంలో విరామం కోసం ఆగినప్పుడు, పేజీల మధ్య ‘బుక్ మార్క్’ పెట్టినట్టుగా- 2004లో అధికారం కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ అయితే మానసికంగా ఆగిపోయాడో, పదేళ్ల తర్వాత 2014లో మరోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన అదే పుస్తకం అదే పేజీ నుంచి మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు. ఈ మధ్య పదేళ్ల అధికార విరామ కాలంలో జరిగిన మార్పులు, ఆయన పుస్తకంలో- ‘మిస్సింగ్’ పేజీలు అనేది ఆయనకు ఇప్పటికీ గమనం లేదు.

ఆయన ‘మేనేజర్లు’ది ఇటువంటిదే మరొక రకం సమస్య. మరి వారు ఆయన వద్ద నటిస్తారో లేక వాళ్ళు కూడా ఆగిపోయిన ‘బ్యాచో’ తెలియదు కానీ, వాళ్ళు ఆయన్ని రాష్ట్రంలో వేగంగా మారుతున్న- ‘సోషియో-పొలిటికల్’ వాతావరణానికి తగినట్టుగా ‘అప్డేట్’ కానివ్వడం లేదు. ఎక్కువ కాలం ఆయనతో ‘పొలిటికల్ పార్ట్నర్స్’గా ఉన్న ‘లెఫ్ట్ పార్టీలు’ కూడా ఆయన ‘సోషల్-సైక్’ని ప్రభావశీలం చేయలేకపోయాయి. వాళ్ళు ఆయన వైఖరిని ప్రభావితం చేయలేకపోగా, తిరిగి వారే కొంత మేర ఆయన్నుంచి ప్రయోజనం వెతుక్కున్నారు. ‘మార్కెట్ ఎకానమీ’ కాలం అందర్నీ అలా ఏ’మార్చింది’. 

Also read: మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్!     

‘సియిఓ’

ఆర్ధిక సంస్కరణలు మొదలైన ఐదేళ్లకే (1995) బాబు ముఖ్యమంత్రి అయ్యాక, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో- ‘ప్రైవేటీకరణ’ను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాడు. ఆయన తనను తాను ‘సియిఓ’ అని చెప్పుకునేవారు. అప్పట్లో కమ్యూనిస్టులు ఆయన్ని ‘ప్రపంచ బ్యాంకు’ ప్రతినిధి అని నిరసిస్తుంటే, అయాచితంగా వస్తున్న గౌరవాన్ని వద్దనడం ఎందుకు? అన్నట్టుగా మౌనం అంగీకారంగా ఉండేది ఆయన పరిస్థితి. దీర్ఘ కాలంలో ఉండే వీటి పర్యవసానాలు గురించి అప్పట్లో తెలిసినవారు తక్కువ. 

 ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రికి- ‘లార్జర్ ద్యాన్ లైఫ్’ (ఉన్నదాని కంటే ఎక్కువ చూపుకోవడం) ప్రచార యావ ‘ప్రొజెక్షన్’ క్షేమం కాదని, అప్పట్లో చంద్రబాబుకు ఎవ్వరు చెప్పలేకపోయారు. అప్పట్లో అవలేదు కానీ- 2004 ఎన్నికల ముందు ప్రచారం కోసం ఆయన ఒక దశలో ‘హిందూస్థాన్ లివర్స్’ కంపెనీ ‘యాడ్’ విభాగం హెడ్ గా పనిచేస్తున్న అలీఖ్ పదంసీ సేవలు వినియోగించుకోవాలని అనుకున్నారు!

Also read: నవతరం రాజకీయాల్లోకి – వై.ఎస్. షర్మిల

‘ఎలీట్’ మౌనం

మన ‘ఒరిజినల్’ ఏదీ ఉండనక్కరలేదు, డబ్బుతో ‘మార్కెట్’లో ఎప్పటికి ఏది అవసరం అయితే, దాన్ని ఎంతకైనా కొని; అది మన స్వంత ‘టేలెంట్’ గా చూపించుకోవచ్చు, అనే ‘ట్రెండ్’ అప్పుడే కొత్తగా మొదలయింది. బాబు గరిష్ట స్థాయిలో తాను ‘ఫోకస్’ కావడం కోసం దాన్ని వినియోగించుకున్నారు. అయినా నీకు లేని అభ్యంతరం మాకు ఎందుకు అనేట్టుగా, అప్పట్లో ఇటువంటి ధోరణిని సమీక్షించి విమర్శించాల్సిన కులీన జ్ఞాన సమాజాలు మౌనంగా ఉండడంతో, ఆయన ధోరణి అప్రతిహతంగా సాగింది.

ఇలా ఇప్పుడు అన్నీ ‘నేను’ అని చెప్పుకుంటున్న నాయకులున్న కాలంలో, ఈ సంగతి ఇప్పటి తరానికి తెలియడం అవసరం. టెలి కమ్యూనికేషన్స్ కేంద్ర ప్రభుత్వం అధీనంలోని మంత్రిత్వశాఖ అనేది తెలిసిందే. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1984లో విదేశాల్లో పనిచేస్తున్న శామ్ పిట్రోడాను (ఈయనది ఒడిస్సాలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబం) ఇండియాకు వచ్చి మన టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని ఆధునీకరించమని కోరింది. అది మొదలు, ఆయన- ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, డా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కమ్యూనికేషన్స్ రంగం సలహాదారుగా పనిచేశారు. ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్’ (‘సి.డాట్’) ప్రారంభించి డిజిటల్ టెలికమ్యూనికేషన్ సౌకర్యం దేశం నలుమూలలకు చేరేట్టుగా చేశారు.

Also read: తన పుస్తకంతో మనకు తూర్పు దారులు తెరిచిన సంజయ్ బారు  

వర్తమానానికి వస్తే…

ఆర్ధిక సంస్కరణల కాలంలో ముఖ్యమంత్రులుగా పదేళ్ల చంద్రబాబు, మరో పదేళ్ల- వై. ఎస్. రాజశేఖర రెడ్డి పరిపాలన నమూనాల తర్వాత, విభజన జరిగి 2014లో ఏర్పడ్డ- రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో మొదటి ఐదేళ్ళలో చంద్రబాబు సీనియర్ అయినప్పటికీ కె.సి.ఆర్. స్థాయిని అందుకోలేక పోయారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది- గడచిన పదేళ్లలో ‘బాబు మోడల్’ పాతది అయిపోయింది (అదెలా పాతది అయిందో తర్వాత చూద్దాం) రెండవది- తెలంగాణ ఉద్యమం కోసం, కె.సి.ఆర్. తన ‘టీమ్’తో రాష్ట్రంలో సూక్ష్మస్థాయి అధ్యయనం చేయించి, తన రాష్ట్రం ‘సోషియో-పొలిటికల్’ వాతావరణానికి తగినట్టుగా తనదైన ఒక ‘రోడ్ మ్యాప్’ సిద్ధం చేసుకున్నాడు.

అయితే, ఆంధ్రప్రదేశ్ విషయంలో బాబు అది చేయలేదు. పరిపాలనలో బాబుకు ఒక బలహీనత ఉన్నది. అది- ఆయన ఉన్నచోటు నుండి ‘విజన్’ అంటూ మరో పాతికేళ్ళు ముందుకు చూస్తాను అంటాడు గాని, పదేళ్లు వెనక్కి కూడా చూసి మనతోపాటు రాలేక వెనుక ఉండిపోయిన వారి కోసం ఏమైనా చేయాలి అనే దృష్టి ఉండదు. సంపద సృష్టించే ‘రేసు’లో తన పక్కన ఉండే కొద్దిమంది కోసమే ఆయన ‘ప్లానింగ్’ అంతా ఉండేది.

ఇక జనం అటువైపు చూడకుండా తన ‘ప్రాపగాండా’ కోసం నిత్యం వార్తల్లో ఉండేట్టుగా ‘జన్మభూమి’ వంటి ‘ఈవెంట్స్’తో ప్రజల దృష్టిని మళ్లించేవాడు. ‘జన్మభూమి’ ఫిలాసఫీని ఆయన నిజంగా ఇప్పటికీ నమ్ముతున్నట్టు అయితే, దాని గురించి మాట్లాడాలి, తమ పార్టీ సమావేశాల్లో దానిమీద విస్తృతంగా లోతైన చర్చ జరగాలి. అటువంటిది ఎక్కడా మనకు కనిపించదు. ఇక ‘రేసు’లో వెనకబడ్డ వాళ్ళను ఎన్నికలప్పుడు ‘మేనేజ్’ చేసే పద్దతి ఎటూ ఉందికదా అనేది ఆయన నిబ్బరం.

Also read: ‘ఫుడ్ ప్రాసెసింగ్’ తో తొలి ‘హైబ్రిడ్’ రాష్ట్రంగా ఏ. పి.  

మూడింటిలో…

ఆర్ధిక సంస్కరణలు తనతో తెచ్చిన- ‘ప్రపంచీకరణ’, సరళీకరణ’, ‘ప్రైవేటీకరణ’ ఈ మూడింటిలో మనకు కంటికి కనిపించనిది- ‘సరళీకరణ’. ఇక బాబు ‘ప్రైవేటీకరణ’ను  ఒంట పట్టించుకోవడం గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే, ‘ప్రపంచీకరణ’ను చూడాల్సింది- మన కాలనీలోని ‘స్టోర్’లో దొరికే ‘ఇంపోర్టెడ్’ యాపిల్స్ లోనో, లేదా ‘గ్రీన్ కార్డు’తో అమెరికాలో సెటిల్ అవుతున్న మన పిల్లల్లో మాత్రమే కాదు. ప్రపంచ ఆర్ధిక సంస్థలు అవి- మనకు ఇస్తున్న రుణాలు, గ్రాంట్స్ వాటిని ఎందుకు ఇస్తున్నాయి, ఎవరికోసం ఖర్చు చేయమని ఇస్తున్నాయి, వాటిని ఎలా ఖర్చు చేయాలని అవి  చెబుతున్నాయి అనేది కూడా ‘ప్రపంచీకరణ’ తెచ్చిన ఆర్థికరంగ సంస్కరణ అని ఈ సందర్భంగా మనం అర్ధం చేసుకోవాలి.

‘యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ 2015 నుంచి ‘ఎజెండా-2030’ పేరుతో- 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సభ్యదేశాలకు ప్రకటించింది. మన దేశంలో ఇప్పుడు అమలవుతున్న గ్రామీణ-పట్టణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వీటి కేంద్రంగానే జరుగుతున్నాయి. వీటి అమలుకు చేసే వ్యయంలో పాటించాల్సిన ఆర్ధిక క్రమశిక్షణకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం’ అవి సూచిస్తున్నాయి. అందుకు అవసరమైన ‘ఫైనాన్స్ కంట్రోల్’ కోసం, అత్యంత ఆధునికమైన ‘ఆడిటింగ్’ వ్యవస్థల్ని,  పలుదశల్లో- ‘లాకింగ్ సాఫ్ట్ వేర్’ విధానాలను కూడా ఆ సంస్థలు ప్రతిపాదిస్తున్నవి.

ఎన్నికయ్యే ప్రభుత్వాలకు ఆయా పార్టీలకు అది ఇష్టమా కాదా? అనే చర్చతో సంబంధం లేకుండా పలురంగాల్లో ఆర్ధిక క్రమశిక్షణ కోసం సంస్కరణలు జరుగుతున్నాయి. ‘జి.ఎస్.టి’ వంటివి అమల్లోకి రావడానికి యు.పి. ఏ. ప్రభుత్వం 22 మార్చి 2011లో 115వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదిస్తే, ప్రతిపక్షంగా దాన్ని ఆక్షేపించిన బి.జె.పి. తాను అధికారంలోకి వచ్చాక, దాన్ని ఆమోదించి అమలులోకి తెచ్చింది. అంటే, వ్యయ నిర్వహణ వంటి కొన్ని కీలకమైన అంశాల విషయంలో-  ‘ప్రపంచీకరణ’ తర్వాత నిర్ణయాలు వేరెక్కడో జరుగుతున్నవి అని చెప్పడానికి దీన్ని ఇక్కడ ప్రస్తావించడం.

Also read: ఉద్రిక్తతల్లో ‘ఆమె’ లక్ష్యం కావడం అనాగరికం!

‘హోలిస్టిక్ అప్రోచ్’

ఇటువంటి నేపథ్యంలో విభజిత రాష్ట్రం పదేళ్లు పూర్తి అవుతున్నప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం ఎలా చూడాలి? ఇందుకు ఎవరికి తోచిన పద్దతిని వారు ఎంచుకుంటున్నారు. అందుకు కూడా ఒక కారణం ఉంది. గడచిన 30 ఏళ్లలో మన వద్ద సామాజిక శాస్త్రాల అధ్యయనం ఎవరికీ అక్కరలేని అంశం అయింది. అందువల్ల దేన్ని అయినా సమగ్ర దృష్టి (హోలిస్టిక్ అప్రోచ్) తో చూడడం అనేది క్రమంగా మనకే తెలియకుండా మనలో తగ్గుతూ వస్తున్నది. సమాచార మాధ్యమాలు ఇస్తున్న వ్యక్తి కేంద్రిత ‘ఫోకస్’ వల్ల శక్తివంతమైన వ్యవస్థల విస్తృతి వాటికున్న అధికారాలు పాతతరాలకు తప్ప, యువతకు చేరడం లేదు. చివరికి మంత్రిత్వ శాఖల్లో కేంద్ర – రాష్ట్రాల జాబితా కూడా మనకిప్పుడు గుర్తు లేదు!

దాంతో ఇప్పుడు దేన్ని అయినా అస్సలు ‘ప్రొసీజర్’ ఏమిటి? ఏమి చేయాలి… ఏమి చేశారు? అనే తార్కిక దృష్టితో కాకుండా- ‘ఎవరు చేశారు?’ అనే వ్యక్తి కేంద్రిత దృష్టితో చూడడం పరిపాటి అయింది. ఇక ‘ఎవరు’ అన్నప్పుడు వారి పట్ల మన ఇష్టాయిష్టాలు అనేవి ఎటూ ఉండనే ఉంటాయి. అందువల్ల ‘క్రిటికల్’గా చూడడం అనేది, వాస్తవ దృష్టి నుంచి కాకుండా, ఏదో ఒక వైపు ‘సైడ్స్’ తీసుకోవడం, చివరికది శృతిమించే స్థాయికి చేరడం చూస్తున్నాము. 

సోయి లేకపోయింది

కె.సి.ఆర్. 2014లో సి.ఎం. ఆఫీస్ లో కూర్చోవడం మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ళు ఆలస్యంగా 2019లో సి.ఎం. ఆఫీస్ కు వచ్చారు. తొలుత ఇద్దరికీ ఆ ‘పోస్టు’లో పాత అనుభవం లేదు. ఇద్దరూ ‘ప్రెష్’ మైండ్ తో ఉన్నారు. అయితే వీరిద్దరికీ భిన్నంగా చంద్రబాబు 1995-2004 మధ్య సి.ఎం. ఆఫీస్ లో ఉన్నారు. కానీ ఆయన 2014లోకూడా పదేళ్లనాటి పాత ‘మైండ్ సెట్’తోనే ఉన్నారు, అలాగే వచ్చి ‘సీటు’లో కూర్చున్నారు. దాంతో ఆయనకు ఈ మధ్యకాలంలో- ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనే కొత్త దృష్టిలోకి ఆర్ధిక సంస్కరణల అమలు దిశ మారిందనే సోయి లేకపోయింది. 

విస్తృతమైన అధ్యయనంతో 2004-2014 మధ్య యు. పి. ఏ. ప్రభుత్వం వంద రోజుల పనిదినాల హామీతో తెచ్చిన- ‘మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాథి హామీ పథకం’ నుంచి ఆ ప్రభుత్వం చివరలో తెచ్చిన ‘ఆహార హక్కు’ చట్టం వరకు చేసిన మార్పులు గురించిన స్పృహ బాబుకు ఉన్నట్టుగా మనకు అనిపించదు. అదే కనుక ఉంటే, పదేళ్లు అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చిన వాడు సి.ఎం. అయ్యాక, ఎంతో జాగ్రత్తగా తన అడుగులు వేసేవాడు. తన పార్టీ ప్రాధాన్యతలను మార్చుకుంటూ మునుపటికి భిన్నంగా సరికొత్త- ‘పొలిటికల్ ఫిలాసఫీ’కి మారేవాడు.

‘కోర్స్ కరెక్షన్’

ఈ శూన్యాన్ని పసిగట్టటం వల్ల ప్రతిపక్షం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి గెలుపు సులువయింది. నిజానికి 2004 లో జరిగింది మరోసారి 2019లో ‘రిపీట్’ అయింది. విషాదం- ఇప్పుడు ఆ విషయం ఆ పార్టీలో ఎవ్వరికీ తెలియదు. అయితే, రేపటి చరిత్ర రచనలో జాతీయ స్థాయిలో బాబు ఒక- ‘మోడల్’గా మిగిలిపోతాడు. సామాజిక శాస్త్రాలను విస్మరించి, ఆర్ధిక సంస్కరణలను అత్యుత్సాహంతో అమలు చేయబోయి భంగపడిన నాయకుడుగా ఆయన ‘బయోగ్రఫీ’ ఉంటుంది. యూనివర్సిటీల్లో- చరిత్ర, రాజనీతి శాస్త్రం, సోషియాలజీ, లా, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ స్టడీస్, వంటి శాఖల్లో ఈ ప్రస్తావన ఉంటుంది.

తప్పటడుగులు మొదలయిన చోటే మళ్ళించబడిన మార్గాన్ని సరిచేయడం (‘కోర్స్ కరెక్షన్’) కూడా ఉంటుంది. ఎటొచ్చి దీన్ని నిష్పూచీగా ఆకళింపు చేసుకునేది ఎందరు అనేదే సమాధానం దొరకని సందేహం. చివరికి ఆంధ్రప్రదేశ్ పరిణామాల పట్ల ఢిల్లీ మౌనం, జగన్మోహన్ రెడ్డి తల మీద బంగారు ముళ్ల కిరీటంగా మారింది. ఇప్పుడది ఆయన ఉంచుకోవాలా దించుకోవాలా అనేది సందిగ్ధం. ఎందుకంటే- ‘నేనే’ అనే ధోరణి ఇప్పుడు అందరికీ పట్టింది. కనుక నాయకులు ఎదుర్కొంటున్న ఇటువంటి సంక్లిష్టతల మధ్య రాజ్యాంగ వ్యవస్థల ‘ప్లేస్మెంట్’ ను అందరూ మౌనంగా అంగీకరించడమే అందుకు శాశ్వత పరిష్కారం.  

Also read: విభజనతో సరళమైన కమ్మతెమ్మెరలు!  

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles